టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్నారా? పొరపాటా? పొలిటికల్ స్టంటా?
posted on Sep 23, 2021 @ 12:03PM
టీటీడీ బోర్డు మునుపెన్నడూ లేనంత విమర్శల పాలవుతోంది. వ్యాపారులు, ప్రముఖులతో బోర్డును ఓవర్‌లోడ్ చేసేసి.. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు జగన్ సర్కారు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా 50 మందికిపైగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారంటే మాటలా? అందుకే, హైకోర్టు సైతం ఆ జీవోను సస్పెండ్ చేసింది. జంబో బోర్డుతో వైసీపీ ప్రభుత్వ పరువంతా పోతోంది. అయితే, ఇలా వరుస వివాదాలు అనుకోకుండా వస్తున్నాయా? కావాలనే వివాదాలు వచ్చేలా చేస్తున్నారా? అనే అనుమానమూ లేకపోలేదు. టీటీడీ ప్రతిష్టను మసకబార్చడానికే ఇలా చేస్తున్నారనే అనుమానాలూ ఉన్నాయి. ఇక, ఎంపీ రఘురామలాంటి వారు రకరకాల విమర్శలు చేస్తున్నారు.
‘‘టీటీడీ పాలక మండలిలో నేరచరిత్ర ఉన్నవారిని, వ్యాపారులను.. థార్మిక సంస్థలు, ప్రచారంపై ఎలాంటి అవగాహన లేని వారిని మీ స్వార్ధ ప్రయోజనాల కోసం నియమించుకుంటారా? గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ నియమ, నిబంధనలకు తూట్లు పొడుస్తారా? సభ్యులను ఎంపిక చేసే ముందు వారి చరిత్ర ఏంటో తెలుసుకోవలసిన బాధ్యత లేదా?’’ అంటూ ఏపీ ప్రభుత్వాన్ని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కుమ్మేశారు.
‘‘కాషాయ వస్త్రాలు ధరించేవారు, బొట్టు పెట్టుకునే వారు అనర్హులా? మీకు వ్యాపారులు, నేరస్థులే కనిపిస్తారా? టీటీడీ చట్టంలో లేని పోస్టులను సృష్టిస్తున్నారు. అధికారపార్టీ నేతలకు పునరావాస కేంద్రంగా టీటీడీని మార్చేందుకు ప్రయత్నించవద్దు. ఈ బోర్డుకైనా పీఠాధిపతులు, మఠాధిపతులను నియమించి హిందూ థార్మిక ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది’’ అని రఘురామ అన్నారు.
ఎంపీ రఘురామ వ్యాఖ్యలు మరింత కాక రేపుతున్నాయి. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తున్నారనే చర్చ నడుస్తోంది. పైగా.. భక్తుల ఎంట్రీని కట్టడి చేయడం.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, కొవిడ్ టెస్టులు కంపల్సరీ అంటూ.. సెకండ్ వేవ్ ముగిశాక నిబంధనలు పెట్టడం తీవ్ర విమర్శలతో పాటు అనుమానాలనూ రేకెత్తిస్తోంది. టీటీడీ ముసుగులో కొందరు కావాలనే అప్రదిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారా? కుట్రతోనే టీటీడీ బోర్డు ప్రతిష్టను దిగజారుస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.