పన్ను ఎగవేతపై సోనూసూద్ క్లారిటీ.. ఆయన ఏమన్నారంటే...
posted on Sep 22, 2021 @ 11:54AM
20 కోట్ల పన్ను ఎగవేత. 18 కోట్ల విరాళాలు సేకరణ. ఖర్చు చేసింది మాత్రం కేవలం 1.9 కోట్లు మాత్రమే. మిగతా సొమ్మంతా అకౌంట్‌లో అలానే ఉంది. ఇదీ సోనూసూద్‌పై 4 రోజుల తనిఖీల తర్వాత ఐటీ శాఖ వెల్లడించిన వివరాలు. ఈ ప్రకటనతో రెండేళ్లుగా సోనూసూద్ సంపాదించుకున్న క్రెడిట్ అంతా పోయింది. ఆయన ఇమేజ్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. కరోనా కాలపు దేవుడిగా భావించిన వాళ్లే.. ఇప్పుడు గుచ్చిగుచ్చి అనుమానించాల్సి వస్తోంది. సోనూసూద్ ఫ్రాడ్ అట. పన్ను ఎగవేశాడట. డొనేషన్స్ ఖర్చు చేయలేదట. ఇలా దేశవ్యాప్తంగా గుసగుసలు. ఢిల్లీ సర్కారుతో చేతులు కలిపినందుకు బీజేపీ చేపట్టిన ప్రతీకార చర్యలనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా తనపై వెల్లువెత్తుతున్న విమర్శలపై సోనూసూద్ తొలిసారి స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.
ఇరవై కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డానన్న ఆరోపణలతో తన ఇంట్లో ఐటీశాఖ సోదాలు నిర్వహించడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తన ఫౌండేషన్‌కు విరాళాల రూపంలో వచ్చిన డబ్బులోంచి పైసా కూడా వృధా చేయలేదని స్పష్టం చేశారు. తాను వెచ్చించిన మొత్తంలో విరాళాల కన్నా, తన రెమ్యూనరేషనే ఎక్కువని చెప్పారు.
రూ.18.94 కోట్ల విరాళాలల్లో రూ.1.9 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయనే దానికీ సోనూసూద్ బదులిచ్చారు. ఆ డబ్బు ఖర్చు పెట్టేందుకు 18 నిమిషాలు చాలన్నారు. అయితే ప్రతి సమస్య వాస్తవమైనదేనా? అన్న కోణంలో తమ బృందం పరిశీలిస్తుందని, క్షేత్రస్థాయి వర్గాలను ఆరా తీస్తుందని, సాయానికి ఖర్చు చేసిన ప్రతి పైసా వృధా కాలేదన్నారు.
ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై స్పందిస్తూ తన ఫోండేషన్ ఎఫ్‌సీఆర్‌ఏ కిందకు రాదని చెప్పారు. అయినా తాను విదేశాల నుంచి పైసా కూడా విరాళంగా తీసుకోలేదన్నారు. విరాళాలన్నీ క్రౌడ్ ఫండిగ్ ప్లాట్‌ఫాంలోనే ఉన్నాయని, ఆ నిధులు భారత్‌కు వచ్చినప్పుడే కాదా ఉల్లంఘన జరిగిందా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేది అని సోనూసూద్ ప్రశ్నించారు. సమస్యలను బట్టి ఆ సొమ్ము నేరుగా ఆస్పత్రులకు, విద్యా సంస్థలకే వెళుతుందని, అలాంటప్పుడు ఉల్లంఘన అనే ప్రశ్న ఎలా తలెత్తుతుందని ప్రశ్నించారు. మున్ముందు సోనూ సోద్ లేకపోయినా సహాయ కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
‘దేశ్ కీ మెంటార్’ అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆహ్వానించిందని చెప్పారు. ప్రజల ముఖాల్లో ఆనందాలను నింపేందుకు తనను ఎవరైనా పిలిస్తే అది ఏ రాజకీయ పార్టీ, ఢిల్లీ ప్రభుత్వమా, గుజరాత్ ప్రభుత్వమా, బిహార్ ప్రభుత్వమా అని చూడకుండా వెళ్తానని సోనూసూద్ స్పష్టంచేశారు.