గుర్ర‌పు బండెక్కి వ‌స్త‌న‌ప్పా.. అసెంబ్లీకి చ‌ల్ చ‌లోరే చ‌ల్‌..

డుగ్గు డుగ్గు మంటూ బుల్లెట్ బండెక్కి వ‌ద్దామ‌నుకున్నారు. కానీ, పెట్రోల్‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు భారీగా ప‌న్నులు బాదేసి ధ‌ర‌లు పెంచేయ‌డంతో స్ట్రాట‌జీ మార్చేశారు. బుల్లెట్ బండికి బ‌దులు గుర్ర‌పు బండెక్కి అసెంబ్లీకి వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్ర‌పు బండ్ల‌పై అసెంబ్లీకి వ‌చ్చి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల విధానాల‌పై విరుచుకుప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌లువురు కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌తినిధులు వినూత్నంగా తెలిపిన నిర‌స‌న సంచ‌ల‌నంగా నిలిచింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కార్లు వ‌దిలేసి.. తెలంగాణ అసెంబ్లీకి గుర్రపుబండ్లపై వచ్చారు. భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గుర్రపుబండ్లపై రావడంతో వారిని గేటు ద‌గ్గ‌రే పోలీసులు అడ్డుకున్నారు. గుర్రపుబండ్లను అనుమతించాలని కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు అనుమతికి నిరాకరించడంతో వారు అసెంబ్లీ గేటు ద‌గ్గ‌రే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అక్క‌డి నుంచి తరలించారు.  ‘‘దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోల్‌ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై భారం పడుతోంది’’ అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిప‌డ్డారు.  కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాని మోదీతో లోపాయకారి ఒప్పందాలు చేసుకుందని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నాయని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే కుట్ర కేంద్రం చేస్తుంటే.. దాన్ని సీఎం కేసీఆర్ సమర్ధిస్తున్నారని సీత‌క్క‌ విమర్శించారు.   

TOP NEWS @ 1pm

1. తుపాను కార‌ణంగా మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రూ.5 ల‌క్ష‌ల తక్ష‌ణ ప‌రిహారం ప్ర‌క‌టించారు సీఎం జ‌గ‌న్‌. గులాబ్ తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఇళ్ల‌లోకి నీరు చేరిన కుటుంబాల‌కు రూ.వెయ్యి చొప్పున‌, స‌హాయ‌క శిబిరాల నుంచి బాధితులు వెళ్లేట‌ప్పుడు కుటుంబానికి రూ.వెయ్యి ఆర్థిక సాయం చేయాల‌ని ఆదేశించారు. పంట న‌ష్టం అంచ‌నా వేసి రైతుల‌ను ఆదుకోవాల‌ని అధికారుల‌కు సీఎం జ‌గ‌న్ సూచించారు. 2. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాలకు వ్య‌తిరేకంగా గాంధీభవన్ నుంచి అసెంబ్లీకి గుర్రపు బండ్ల‌ మీద వ‌చ్చి ప‌లువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర‌స‌న తెలిపారు. 3. సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ అంటూ ట్విటర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జ‌గ‌న్ స‌ర్కారుపై పోరుబాట ప‌ట్టారు. ప్రజల మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదన్నారు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలకు ‘నవ కష్టాలు’ అని పవన్ ట్వీట్ చేశారు.  4. రాజధాని దళిత రైతు పులి చిన్నా హైకోర్టును ఆశ్రయించారు. బాధితుడైన తనపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దళిత రైతు పులి చిన్నాపై ఎంపీ నదిగం సురేష్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా.. బాధితుడి ఫిర్యాదు పరిగణలోకి తీసుకోకుండా తనపైనే అక్రమ కేసులు బనాయించారని పిటిషన్‌లో పులి చిన్నా ఆరోపించారు.  5. ఏపీ, తెలంగాణ‌లో భార‌త్‌బంద్ విజ‌య‌వంత‌మైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపుతో దేశవ్యాప్తంగా భారత్‌ బంద్ కొన‌సాగింది. వివిధ పార్టీల నాయ‌కులు బంద్‌ను ప‌ర్య‌వేక్షించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతికేరంగా నినాదాల చేస్తూ ర్యాలీలు నిర్వహించాయి.  6. దిశ కమిషన్ విచారణకు ఐపీఎస్ అధికారి సజ్జనార్ హాజరు కానున్నారు. ఈ మేరకు త్రిసభ్య కమిటీ సమన్లు జారీ చేసింది. కమిటీ మంగళవారం లేదా బుధవారం సజ్జనార్‌ను విచారించే అవకాశం ఉంది. సజ్జనార్‌ను విచారించిన తర్వాత త్రిసభ్య కమిటీ మరోసారి సిట్‌ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌‌ను విచారించనుంది. 7. డ్రైనేజీలో ప‌డి గ‌ల్లంతైన‌ మణికొండ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నాలా వెంబ‌డి డ్రోన్ల‌తో గాలిస్తున్నారు. 60 మందితో డీఆర్ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేస్తున్నారు. 40 గంట‌లు దాటినా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆచూకీ లభించపోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  8. కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. స్మ‌గ్ల‌ర్ల నుంచి 10 ఎర్రచందనం దుంగలు, 6 వేట కొడవళ్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పలు ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల నమోదు అయ్యాయి.  9. గోవాలో అరెస్టైన డ్రగ్స్ వ్యాపారి హైదరాబాద్‌కు చెందిన సిద్ధిఖ్‌గా గుర్తించారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఎల్ఎస్‌డీ డ్రగ్స్‌ను సిద్దిఖ్ సప్లై చేస్తున్నాడు. హైదరాబాద్, గోవాలలో పలు ఈవెంట్లకు సిద్దిఖ్ డ్రగ్స్ సరఫరా చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఆ డ్ర‌గ్స్‌ను హైద‌రాబాద్‌లోనే త‌యారు చేయడం పోలీసుల‌ను షాక్‌కు గురి చేసింది. 10. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేప‌ట్టిన‌ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రధాని మోదీ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ‘ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్ర‌స్తుతానికి ప్ర‌యోగాత్మ‌కంగా ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్ర‌మే ఈ ప్రోగ్రామ్‌ను అమలు చేయనున్నారు.  

తెలుగు రాష్ట్రాల్లో భారత్‌ బంద్.. స‌క‌లం క్లోజ్‌..

ఏపీ, తెలంగాణ‌లో భార‌త్‌బంద్ విజ‌య‌వంత‌మైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపుతో దేశవ్యాప్తంగా భారత్‌ బంద్ కొన‌సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు బంద్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో బంద్ ప్ర‌శాంతంగా జ‌రిగింది. వివిధ పార్టీల నాయ‌కులు బంద్‌ను ప‌ర్య‌వేక్షించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతికేరంగా నినాదాల చేస్తూ ర్యాలీలు నిర్వహించాయి. స్వచ్ఛందంగా షాపులు, స్కూళ్లు మూసేశారు. ఏపీలో మధ్యాహ్నం వరకు బస్సు సర్వీసులను ప్ర‌భుత్వ‌మే నిలిపివేయ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డ్డారు.  భార‌త్‌బంద్ సంద‌ర్భంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బస్టాండ్స్‌ ద‌గ్గ‌ర‌ నిరసన తెలిపారు. ఆందోళకారులు వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తిరుపతిలో బంద్‌ కొద్దిపాటి ఉద్రిక్తతకు దారి తీసింది. వామపక్షాలు, కార్మిక సంఘాల నాయకులు రైల్వేస్టేషన్‌లోకి వెళ్లేందుకు  ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అమరావతిలో వర్షం పడుతున్నా సీపీఐ, సీపీఎం నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.   తెలంగాణలోని పలు బస్సు డిపోల ముందు వామపక్షాలు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్‌లో బంద్‌ పాక్షికంగా కొనసాగింది. ఉప్పల్‌, కూకట్‌పల్లి డిపోల ముందు పలువురు నాయకులు ఆందోళన చేపట్టారు. నల్గొండలో వామపక్షాలు ధర్నా చేపట్టాయి. ఏపీ, తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో ఉద‌యం నుంచి వ‌ర్షం ప‌డ‌టంతో.. ఇటు వ‌ర్షం, అటు బంద్ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది. ప్ర‌జ‌లు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. 

జ‌గ‌న్ జాబితాలో కొత్త మంత్రులు వీళ్లే..! జిల్లాల వారీగా పేర్లు ఇవే..!

ఏపీ కేబినెట్ మొత్తం మారి పోతోంది. మంత్రివ‌ర్గాన్ని పూర్తిస్థాయిలో ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారు సీఎం జ‌గ‌న్‌. సీనియ‌ర్లు, జూనియ‌ర్లు అనే తేడా లేకుండా అంద‌రినీ కేబినెట్ నుంచి తొల‌గించ‌నున్నారు. ప‌లువురు మంత్రుల ప‌నితీరు ఏమాత్రం బాగా లేక‌పోవ‌డం, మిగ‌తా వారికీ అవ‌కాశం ఇవ్వాల‌నే  ఉద్దేశ్యం, రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రిమండ‌లిని మారుస్తాన‌నే ప్ర‌క‌ట‌న‌.. ఇలా అన్నీ క‌లిసి కేబినెట్ మార్పుకు జ‌గ‌న్ క‌స‌ర‌త్తు పూర్తి చేశార‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ ఆదేశాల మేర‌కే మంత్రి బాలినేని ఇప్ప‌టికే ఆ మేర‌కు లీకులు ఇచ్చార‌ట‌. మ‌రోవైపు జిల్లాల వారీగా జాబితా సిద్ధ‌మై పోయింద‌ని చెబుతున్నారు. కేబినెట్ కూర్పుతో 2024 ఎల‌క్ష‌న్ టీమ్‌ను రెడీ చేస్తున్నారు. ఇంటలిజెన్స్ వ‌ర్గాల నుంచి స‌మాచారం సేక‌రించిన సీఎం.. కేబినెట్ కూర్పుపై క్లారిటీకి వ‌చ్చేశార‌ని అంటున్నారు. అన్నీ కుదిరితే.. ఈ ద‌స‌రాకే కొత్త‌ మంత్రిమండ‌లి కొలువుదీర‌డం ఖాయ‌మంటున్నారు.  ఎప్ప‌టిలానే ప్రాంతీయ, సామాజిక సమీకరణాలే కీలకం కానున్నాయి. జిల్లాల వారీగా ఆశావ‌హుల పేర్లపై లీకులు వ‌స్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక్క లాస్ట్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఈసారి మంత్రి పదవి ఖాయ‌మంటున్నారు. ధర్మాన క్రిష్ణదాస్ స్థానంలో ఆయ‌న సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని భావిస్తున్నారు.  విజయనగరం జిల్లాలో కొత్తగా కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర రేసులో ఉన్నారు. ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తే రాజన్న దొరకు ఛాన్స్ కష్టమే అంటున్నారు.             విశాఖ జిల్లాలో కాంపిటీష‌న్ ట‌ఫ్‌గా ఉంది. గుడివాడ అమర్‌నాథ్‌, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమా శంకరగణేష్‌ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ముత్యాల నాయుడు పేరు కూడా వినిపిస్తోంది. వీరిలో అమ‌ర్‌నాథ్‌కు ఛాన్సెస్ ఎక్కువ‌గా ఉన్నాయంటున్నారు. ఇక‌, గిరిజన కోటాలో ఫాల్గుణ, కె.భాగ్యలక్ష్మి కూడా మంత్రి పదవిని కోరుకుంటున్నారు.  తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడున్న ముగ్గురు స్థానంలో కొత్తగా మ‌రో ముగ్గురిని తీసుకుంటార‌ని తెలుస్తోంది. యనమల సోదరుడిని రెండు సార్లు ఓడించటంతో పాటుగా తొలి నుంచి జగన్ విధేయుడిగా ఉన్న‌ దాడిశెట్టి రాజా రేసులో ముందున్నారు. కన్నబాబు స్థానం ఆయనతో భర్తీ చేసే అవకాశం ఉంది. ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్‌తో పాటు గిరిజన కోటాలో నాగులాపల్లి ధనలక్ష్మి పోటీలో ఉన్నారు.         రాజకీయంగా ప‌శ్చిమ‌ గోదావరి జిల్లా కీలకం కావటంతో ఈ జిల్లా నుంచి ఎస్సీ-క్షత్రియ-కాపు వర్గానికి అవకాశం దక్కనుంది. క్షత్రియ కోటాలో ముదునూరి ప్రసాద రాజు, కాపు వర్గం నుంచి కొట్టు సత్యానారాయణ లేదా గ్రంధి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గం నుంచి తలారి లేదా ఓ ఎమ్మెల్సీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి క‌మ్మ కోటాలో అబ్బయ్య చౌదరి పేరు కూడా వినిపిస్తున్నా అవ‌కాశం త‌క్కువే అంటున్నారు. ఇక‌, సీనియర్ల కోటాలో కృష్ణాజిల్లాలో కొలుసు పార్థసారధికి మంత్రి ప‌ద‌వి ఖాయమ‌ని తెలుస్తోంది. క్రిష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్‌, మేకా వెంకట ప్రతాప అప్పారావులు మంత్రి పదవి రేసులో ఉన్నారు. వీరిలో ఇటీవ‌ల బాగా యాక్ష‌న్ చేసిన జ‌గ‌న్ అభిమానం చూర‌గొన్న జోగి ర‌మేశ్‌కు మినిస్ట‌ర్ పోస్ట్ ప‌క్కా అని అంచ‌నా వేస్తున్నారు. కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ మంత్రి పదవి ద‌క్క‌వ‌చ్చు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈసారి మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజని, ముస్లిం మైనార్టీ నుండి మహ్మద్‌ ముస్తఫా.. ఇలా ఈ జిల్లా నుంచి చాలామందే రేసులో ఉన్నారు. ఇక‌, కాపు కోటాలో అంబటి రాంబాబుకు మంత్రిప‌ద‌వి ఖాయమే అంటున్నారు.  ప్రకాశం జిల్లా నుంచి మహీధర్‌రెడ్డి, అన్నా రాంబాబుల పేర్లు వినిపిస్తున్నాయి.  నెల్లూరు జిల్లా నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డికి కేబినెట్ బెర్త్ ద‌క్కే ఛాన్సెస్ ఎక్కువే. ఆనం రామ నారాయణరెడ్డి, ఎస్‌సి కోటాలో కిలివేటి సంజీవయ్య రేసులో ఉన్నారు.  చిత్తూరు జిల్లా నుంచి చిర‌కాలంగా మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్న‌ రోజా పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నా.. పెద్దిరెడ్డిని కాద‌ని రోజాను కేబినెట్‌లో చేర్చుకునే సాహ‌సం జ‌గ‌న్ చేస్తారా?  లేదా? అనేది ఆస‌క్తిక‌రం. అయితే, గ‌త కేబినెట్‌లోనే రోజాకు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగినా అది కుద‌ర‌క‌పోవ‌డంతో కొన్ని రోజులు అల‌క‌మూని అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది రోజ‌మ్మ‌. అప్పుడు నెక్ట్స్ టైమ్ త‌ప్ప‌కుండా మంత్రిని చేస్తానంటూ రోజాకు జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని అన్నారు. ఆ హామీని ఇప్పుడు నెర‌వేర్చుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. రోజాతో పాటు చెవిరెడ్డి భాస్కరరెడ్డి సైతం కేబినెట్ రేసులో ఉన్నారు.  కడప నుండి కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, సి.రామచంద్రయ్యలు మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నారు.  అనంతపురం జిల్లాలో అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఉండగా... మహిళా కోటాలో ఉషశ్రీచరణ్‌, జనులగడ్డ పద్మావతి, ఎస్‌సి కోటాలో తిప్పేస్వామి పోటీ పడుతున్నారు. కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణిరెడ్డికి కేబినెట్ పోస్ట్‌ ఖాయమని ప్రచారం జ‌రుగుతోంది. ఆర్థిక మంత్రి బుగ్గనను సైతం తప్పిస్తుండటంతో రెడ్డి వర్గంతో పాటుగా బీసీ వర్గానికి ఈ జిల్లా నుంచి అవకాశం దక్కనుంది.  ఇలా, జిల్లాల వారీగా సామాజిక స‌మీక‌ర‌ణాల స‌మ‌తూకంతో ఏర్చికూర్చి మంత్రిమండ‌లి కూర్పు కోసం తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు సీఎం జ‌గ‌న్‌. జిల్లాల వారీగా బ‌లాబ‌లాలు, వచ్చే ఎన్నికలు, ప్రతిపక్షాలను ఎదుర్కొనే సామ‌ర్థ్యం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సీఎం జగన్ తన ఎన్నికల కేబినెట్‌ను రెడీ చేస్తున్నారు. మ‌రి, ఈ కొత్త కేబినెట్ పార్టీలో అల‌క‌లు, అవ‌మానాల‌కు దారి తీస్తుందా? ఎన్నిక‌లకు ముందు అసంతృప్తులు త‌లెత్తితే ఏంటి ప‌రిస్థితి? ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర ప్ర‌జావ్య‌తిరేక‌త ఉండ‌గా.. ఇక మంత్రి ప‌ద‌వి ద‌క్క‌ని బ‌ల‌మైన నేత‌లు జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఎర్ర‌జెండా ఎగ‌రేసే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని అంటున్నారు. అందుకే, ఈ కేబినెట్ ప్ర‌క్షాళ‌ణ సీఎం జ‌గ‌న్‌కు క‌త్తి మీద సామే...   

#SaveAPfromYSRCP ..జ‌గ‌న్‌పై జ‌న‌సేనాని ట్విట‌ర్ వార్‌

జ‌న‌సేనాని ప‌ట్టుకుంటే వ‌దిలే ర‌కం కాదు. బీజేపీ విష‌యంలో మాట‌త‌ప్పి, మ‌డ‌మ తిప్పినా.. వైసీపీ మేట‌ర్‌లో మాత్రం అస‌లే మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌ట్లేదు. అటు, వైసీపీ ప్ర‌భుత్వమూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను టార్గెట్ చేయ‌డంతో వారి మ‌ధ్య వైరం బాగా ముదిరింది. రిప‌బ్లిక్ ప్రీరిలీజ్ వేడుక‌లో పీకే చేసిన హాట్ హాట్ కామెంట్స్ మ‌రింత కాక రేపాయి. సినిమా ఇండ‌స్ట్రీ జోలికొస్తే కాలిపోతారంటూ ఖ‌త‌ర్నాక్ వార్నింగ్ ఇచ్చారు. స‌న్నాసులు, ద‌ద్ద‌మ్మ‌లంటూ దుమ్ము రేపారు. త‌న‌పై కోపం ఉంటే త‌న సినిమాల‌ను ఆపేయండి కానీ, మిగ‌తా వారిని ఇబ్బంది పెట్టొద్దంటూ చాలా చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. అయితే, ప‌వ‌న్ కామెంట్స్‌కు అదే రేంజ్‌లో కౌంట‌ర్లు ఇచ్చారు ఏపీ మంత్రులు. త‌మ‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ అయినా, సంపూర్ణేష్‌బాబు అయినా ఒక్క‌టేనంటూ పీకేను త‌క్కువ చేసి చూపించే ప్ర‌య‌త్నం చేశారు. సినిమా టికెట్ల‌ను ఆన్‌లైన్ చేయాల‌నే ప్ర‌పోజ‌ల్ ఇండ‌స్ట్రీ నుంచే వ‌చ్చింద‌ని.. ప‌వ‌న్ నోరు జారితే బాగుండ‌దంటూ హెచ్చ‌రించారు. ఇలా, ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ ప్ర‌భుత్వం ఎపిసోడ్‌పై ఏపీలో ర‌చ్చ ర‌చ్చ జ‌రుగుతోంది.  ఆ వార్‌ను కంటిన్యూ చేస్తూ.. ట్విట‌ర్‌లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ అంటూ.. హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రజల మీద పన్నులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదన్నారు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలకు ‘నవ కష్టాలు’ అంటూ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల పేరుతో చేస్తున్న మోసాన్ని ట్విట‌ర్ వేదిక‌గా చీల్చి చెండాడారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ప‌నిలో ప‌నిగా.. ఇప్ప‌టి వ‌ర‌కూ వైసీపీ చేసిన వాగ్దానాలు.. ప్ర‌స్తుతం వాటి అమ‌లు ప‌రిస్థితిని చార్ట్ రూపంలో తేట‌తెల్లం చేశారు. అధికార పార్టీ హామీలైతే ఘ‌నంగా ఉన్నాయి కానీ, వాటి అమ‌లును మాత్రం అట‌కెక్కించేశారు అనే చేదు నిజం ప్ర‌జ‌లంద‌రికీ తెలిసేలా ఆస‌క్తిక‌ర చార్ట్‌తో ట్వీట్ చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆ పోస్ట్‌కు కూడా సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ.. అంటూ హాష్‌ట్యాగ్ యాడ్ చేసి ట్రెండింగ్ చేస్తున్నారు జ‌న‌సైనికులు. 

కేబినెట్ మొత్తం క్లీన్‌స్వీప్‌.. మంత్రులు ఉన్నా ఒక‌టే, ఊడినా ఒక‌టేనా?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మంత్రివర్గ ప్రక్షాళన కసరత్తుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుత మంత్రులలో కొద్ది మంది మినహా మిగిలిన అందరికీ ఉద్వాసన తధ్యమని చాలాకాలంగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అలాగే, తొలి మంత్రివర్గ ప్రమాణ స్వీకార సమయంలోనే మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తరువాత మారుస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ గడువు కూడా సమీపిస్తోంది. జ‌గ‌న్‌రెడ్డి 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లెక్కన నవంబర్ 30, 2021తో రెండున్నరేళ్ళ గడువు ముగుస్తుంది. ఈ  నేపధ్యంలో ఫస్ట్ బ్యాచ్‌లో బెర్త్ మిస్సయిన సీనియర్లతో పాటుగా ఇతరత్రా ఈక్వేషన్స్’లో బెర్త్ ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఈసారి తమకు తప్పక అవకాశం దక్కుతుందని ఆశగా ఉన్నారు. మరోవంక ప్రస్తుత మంత్రుల్లో ఎవరు ఉంటారో, ఎవరు బయటకు వెళతారో అనే ఆందోళన నెలకొంది. తొలగించిన మంత్రులను పార్టీ నిర్మాణం కోసం వినియోగించుకుంటామని జగన్ గతంలోనే చెప్పారు.  అదలా ఉంటే, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా, ‘మంత్రివర్గంలో అందరినీ మార్చేస్తారు. వందశాతం మార్పు ఖాయం’ అంతా కొత్త వారినే తీసుకుంటారు అంటూ బాంబు పేల్చారు. మిగిలేది ముఖ్యమంత్రి ఒక్కరే, మిగిలిన అందరికీ ఉద్వాసన తథ్యం అంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే తనకు ఈ విషయం చెప్పారని బాలినేని ముక్తాయింపు నివ్వ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఇంత వరకూ తమ కుర్చీకి డోకా లేదని ధీమాగా ఉన్న సీనియర్లు, ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు కొట్టేశామని కొందరు జూనియర్లు కూడా, ఇప్పడు మంత్రి బాలినేని స్టేట్మెంట్’తో కంగారు పడుతున్నట్లు సమాచారం. నిజానికి, కొద్ది రోజుల క్రితం వరకు కూడా కనీసం ఒక అరడజను మంది వరకు ‘సేవ్’ అవుతారని అనుకున్నారు. కానీ, బహుశా గుజరాత్’లో బీజేపీ అధినాయకత్వం ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రివర్గానికి ఒకేసారి ఉద్వాసన పలికిన నేపథ్యంలో జగన్‌రెడ్డి కూడా మనసు మర్చుకున్నారో ఏమో, అనే మాట పార్టీలో వినవస్తోంది. మరోవంక మంత్రి బాలినేని  మొత్తానికి మొత్తం మంత్రులు  అందరికీ ఒకేసారి ఉద్వాసన పలికే నిర్ణయం నూటికి నూరు శాతం చక్కని, సముచిత నిర్ణయమని ప్రకటించారు.   అయితే, మంత్రులను మార్చి ప్రయోజనం లేదని, ముఖ్యంత్రిని మారిస్తేనే కానీ, రాష్ట్రానికి మేలు జరగదని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. సర్వ అనర్ధాలకు మూలమైన ముఖ్యమంత్రిని వదిలేసి మంత్రులను తొలిగించినా, తొలిగించక పోయినా ఒకటేనని విపక్షాలు అంటున్నాయి. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చాల్సింది మంత్రులను కాదు, ముఖ్యమంత్రిని మార్చాలి” అని కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. జగన్ పాలనలో మంత్రులు ఉత్సవ విగ్రహాలని, ఆరవ వేలుతో సమానమని విమర్శించారు. వారు మంత్రులుగా ఉన్నా ఒకటే.. ఊడినా ఒకటేనన్నారు. ప్రస్తుతం ఏపీలో సమస్య ముఖ్యమంత్రి జగనేనన్నారు. రాష్ట్రం అప్పులు, అరాచకం, అవినీతి, అసమర్ధత, ఆటవిక ఆంధ్రప్రదేశ్‌గా మారిందని, వీటన్నిటికీ మూలకారకుడు ముఖ్యమంత్రి అని తుల‌సీరెడ్డి  అన్నారు. జగన్‌ని మారుస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కారం కావని ఆయన కుండబద్దలు కొట్టారు.  ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డిని మార్చకుండా మంత్రులను మార్చడం అంటే... చేతగాని వైద్యడు పంటినొప్పికి తుంటి మీద తన్నినట్లేనని తులసిరెడ్డి తమదైన స్టైల్లో వ్యగ్య బాణాలు వేశారు. నిజానికి, ఏపీలో మంత్రులు పేరుకు మంత్రులే కానీ, వారికి ఉన్న అధికారాలు అంతంత మాత్రమే. సో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు ముఖ్యమంత్రి మార్పు ఒక్కటే పరిష్కారం అనేది సరైన ఆలోచనే అవుతుందని విశ్లేషకులు సైతం అంటున్నారు.  

బీ అల‌ర్ట్‌.. 2 రోజుల పాటు భారీ వ‌ర్షాలు..

బంగాళాఖాతంలో గులాబ్ తుఫాన్‌. ఉత్త‌రాంధ్ర‌లో హైఅల‌ర్ట్‌. ఆ సైక్లోన్ ఎఫెక్ట్ తెలంగాణ‌పైనా ఉండ‌నుంది. ఆదివారం రాత్రి నుంచి మంగ‌ళ‌వారం వ‌ర‌కూ.. రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం, అధికార యంత్రాంగం అల‌ర్ట్ అయింది. ఢిల్లీలో సీఎం కేసీఆర్‌తో పాటు ఉన్న సీఎస్ సోమేశ్‌కుమార్ అక్క‌డి నుంచి ఉన్న‌తాధికారులు, జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌తీ జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు.  ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అల్లర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాల‌ని, నాలాలు, చెరువులపై ప్రత్యేక నిఘా పెట్టాల‌ని సీఎస్ ఆదేశించారు. అవసరమైతే ఎన్.డి.ఆర్.ఎఫ్. సేవలను పొందాలని చెప్పారు. ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సిబ్బంది, అధికారులు మ‌రింత‌ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తిగా నిండిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల్లో నీటి మట్టాలను  పర్యవేక్షిస్తుండాలని సీఎస్ ఆదేశించారు.  రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్‌ పరిధిలో భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురైతే వెంటనే సమాచారం అందించేందుకు హైదరాబాద్‌ కలెక్టర్‌ ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. సాయం కోసం 040-23202813 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని తెలిపారు. 

జ‌న‌సేనానిపై మంత్రుల ఎదురుదాడి.. ప‌వ‌న్‌ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలేవి?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు ఎదురుదాడికి దిగారు. రిప‌బ్లిక్ వేదిక‌గా ప‌వ‌ర్‌స్టార్ ఏపీ పాల‌కుల‌పై విరుచుకుప‌డ‌టంతో ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. వ‌రుసబెట్టి మంత్రులు పీకేపై మాట‌ల తుపాకులు ఎక్కుబెట్టారు. పవన్ కళ్యాణ్ మమల్ని సన్యాసులు, చేత కానీ వాళ్ళు అన్నారు.. మరి ఆయన రుషి పుంగవుడా అంటూ ప్ర‌శ్నించారు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘పవన్‌కల్యాణ్ నటించినా, సంపూర్ణేష్ బాబు నటించినా కష్టం ఒకటే. ఆన్‌లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారంటూ చెప్పుకొచ్చారు. ఇక సినిమా మంత్రి పేర్ని నాని ఓ రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందిపెట్టిందో పవన్ క‌ల్యాణ్ చెప్పాలంటూ నిల‌దీశారు. పవన్‌కు కేంద్రంలో సినిమా లేదని.. అంతా సొల్లు చెబుతారని విమర్శించారు. టాక్స్‌లు, జీఎస్టీ ఎందుకు కట్టాలని కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. పవన్ కల్యాణ్‌ ఇష్టానుసారం మాట్లాడితే తాట తీస్తామని మంత్రి పేర్నినాని హెచ్చరించారు. రెండు చోట్లా ఓడిపోయినవాడు సన్నాసి కాదా? అంటూ ప్రశ్నించారు. తాను సన్నాసి అయితే.. పవన్‌ సన్నాసిన్నర అని మండిపడ్డారు. ప్రభుత్వంపై పవన్‌ అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు పేర్ని నాని.  ఇలా మంత్రుల ఎదురుదాడితో ఏపీలో సినిమా హీట్ తారాస్థాయికి చేరింది. అటు ఫిల్మ్ ఛాంబ‌ర్ మాత్రం త‌మ‌కు రెండు ప్ర‌భుత్వాల మ‌ద్ద‌తు కావాలంటూ మ‌ధ్యే మార్గంగా ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసి గోడ మీది పిల్లిలా వ్య‌వ‌హ‌రించింది. ఇక‌, రిపబ్లిక్‌ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన ఇతర వ్యాఖ్యలను పక్కన పెట్టి,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త అప్పుల కోసమే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలనుకుంటోందని చేసిన వ్యాఖ్య విమర్శ విషయంలో మాత్రం రాజకీయ వర్గాలు విభిన్నంగా స్పందిస్తున్నాయి. మద్యం విక్రయాల విషయంలో కూడా ప్రభుత్వం ఇలాగే అకౌంటబులిటీ, పారదర్శకత అంటూ ప్రభుత్వ పెద్దలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ, చివరకు, మద్యం వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని పూచికత్తుగా చూపించి ప్రభుత్వం అప్పులు చేసింది. రేపెప్పుడో వచ్చే ఆదాయాన్ని పూచికట్టుగా చూపింఛి జగన్ రెడ్డి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు అప్పుచేసింది. ఈ అప్పు తీరాలంటే కనీసం 25 ఏళ్ళు పడుతుందని విపక్షాలు అంటున్నాయి. అంతవరకు రాష్ట్ర ప్రజలు శక్తి కొలదీ మద్యం సేవించి సర్కార్ ఖజానా నింప వలసి వస్తుందని, అంటే, ప్రభుత్వం అంచెల వారీగా సంపూర్ణ మధ్యనిషేధం హామీని తుడిచేసిందనే అనుకోవలసి ఉంటుందని అంటున్నారు.  అలాగే, ఈ మధ్యనే జగన్ రెడ్డి ప్రభుత్వం మాంసం, చేపలు, రొయ్యల వ్యాపారంలోకి ఎంటర్ అయ్యింది. ఈ పరంపరలో భాగంగానే, సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయం వ్యాపారంలోకి ప్రభుత్వం ఎంటర్ అవుతోంది. ఈ నేపధ్యంలోనే ఒక హీరోగా, సినిమా పరిశ్రమ వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా  పవన్ కళ్యాణ్ కొత్త అప్పుల కోసమే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలనుకుంటోందని అన్నారు. మద్యం విషయంలో ఒక ప్రిసీడెంట్ ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్’కు అయినా ఇంకొకరికి అయినా అలాంటి అనుమానాలు, విమర్శలు, వ్యాఖ్యలు రావడం సహజం. అదిగాక, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు. సంవత్సరానికి సరిపడా అప్పులను జగన్ రెడ్డి ప్రభుత్వం నాలుగు నెలలోనే నాకేసింది. ఖజానా ఖాళీ అయిపొయింది, వంటి వార్తలు రోజూ వస్తూనే ఉన్నాయి. అభివృద్ధి అనే మాటను ఏపీ డిక్షనరీ నుంచి ఎప్పుడోనే నిష్క్రమించింది. జగన్ రెడ్డి ప్రభుత్వం తుడిచేసింది.  ఇప్పుడు సంక్షేమ పథకాలకు కూడా పైసా పైసా వెతుక్కునే పరిస్థితిలోకి ఆర్థిక పరిస్థితి జారుకుందని వార్త లొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ సర్కార్ తీరును ప్రశ్నించడం తప్పేలా అవుతుందని అంటున్నారు. అందుకే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద ఎదురుదాడి చేయడం కంటే, ఆయన ప్రస్తావించిన అంశాలకు సమధానం ఇస్తే మంచిందని వైసీపీ నేతలు సైతం అంటున్నారు.  

Top News @ 8pm

1. సినీ ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందిపెట్టిందో పవన్ క‌ల్యాణ్‌ చెప్పాల‌ని మంత్రి పేర్ని నాని నిల‌దీశారు. కోడికత్తి కేసును ఎన్ఐఏ విచారిస్తోందని, వివరాలు అమిత్‌షాను అడిగి తెలుసుకోండని సూచించారు. రెండు చోట్లా ఓడిపోయినవాడు సన్నాసి కాదా? తాను సన్నాసి అయితే.. పవన్‌ సన్నాసిన్నర అని మండిపడ్డారు. ప్రభుత్వంపై పవన్‌ అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మంత్రి పేర్నినాని.  2. చిత్తూరు జిల్లా నిండ్ర ఎంపీపీ ఎన్నిక వివాదం వైసీపీలో మ‌రింత ముదురుతోంది. మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే రోజా.. చక్రపాణిరెడ్డి వర్గంపై ఫిర్యాదు చేశారు. చక్రపాణి రెడ్డితో సహా ఆయన వర్గానికి చెందిన ఎంపీటీసీలను, ఇతర నాయకులను సస్పెండ్ చేయాలని కోరారు.  3. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళ్లు మొక్కైనా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఐదు వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు తీసుకు వస్తామని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. జమ్మికుంటలో కుమ్మరి కులస్థుల ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించుకుంటే నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు.   4. సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. దాల్మియా కేసులో హాజరుకానందున ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి ఇప్ప‌టికే నాన్‌బెయిల‌బుల్ వారెంట్ జారీ కాగా.. తాజాగా పెన్నా కేసులో సీబీఐ కోర్టుకు జి.వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. జగన్‌, విజయసాయిరెడ్డి పిటిషన్లపై కౌంటర్లకు  సీబీఐ, ఈడీ గడువు కోరింది. 5. జ‌గ‌న్‌ సర్కారుపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖలో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని స్వరూపానందేంద్ర సరస్వతి భావిస్తున్నట్లు శారదాపీఠం ఓ ప్రకటనలో తెలిపింది. అటు, వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనందసూర్య మండిపడ్డారు. జీవో 103 ద్వారా బ్రాహ్మణులకు ద్రోహం చేయమటమే కాక బీసీలకు బ్రాహ్మణులకు మధ్య గొడవలు సృష్టించేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.  6. బీసీలకు రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బీసీల రిజర్వేషన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలనే బీసీ సంఘాల డిమాండ్‌ను గౌరవించిన వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు.  7. 50 శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. మహిళలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లకు తన మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో 30 శాతం కంటే తక్కువ మహిళా జడ్జిలున్నారని చెప్పారు. 8. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గులాబ్‌ తుఫాన్‌ కొనసాగుతుంది. అర్ధరాత్రి కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో 75 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.  9. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మంచినీళ్ళపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. తుఫాన్ తీవ్రతరం కావడంతో సముద్రంలో అలజడుల తాటికి బోటుపై నుంచి మత్స్యకారులు బోల్తాపడ్డారు. స‌ముద్రంలో గ‌ల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు.  10. ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ‘గులాబ్’ తుఫాన్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీశారు. కేంద్రం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని జగన్‌కు ప్రధాని హామీ ఇచ్చారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. 

జగన్ స‌ర్కారుపై విశాఖ శారదాపీఠం ఆగ్ర‌హం.. స్వామీజీ సంచ‌ల‌నం..

తెలుసుగా. వైసీపీ ప్ర‌భుత్వం, విశాఖ శార‌దాపీఠం ఎంత క్లోజో అంద‌రికీ తెలుసుగా. విశాఖ శార‌దాపీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తికి సీఎం జ‌గ‌న్ అంటే వ‌ల్ల‌మానిన ప్రేమ‌. ఈ విష‌యం ఆయ‌నే ఓ సంద‌ర్భంలో బ‌హిరంగంగానే చెప్పారు. రాగ‌ధ్వేషాల‌కు అతీతంగా ఉండాల్సిన స్వామీజీ ఇలా ఒక రాజ‌కీయ నాయ‌కుడిపై ప్ర‌త్యేక‌మైన ప్రేమ ప్ర‌ద‌ర్శించ‌డం ఆ పీఠాధిప‌తికే తెలియాలి. ఏపీలో ఆల‌యాల‌పై దాడులు, మ‌త‌మార్పిడిలు, టీటీడీలో అన్య‌మ‌త ప్ర‌చారం త‌దిత‌ర అంశాల్లో విశాఖ శార‌దాపీఠం వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అది వేరే విష‌యం. ఇప్పుడు మేట‌ర్ ఏంటంటే.. తాజాగా జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న ఓ నిర్ణ‌యం విశాఖ శార‌దాపీఠానికి ఆగ్ర‌హం తెప్పించింది. మ‌న‌వాడే క‌దాని మురిసిపోతుంటే.. ఇలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నాడేంటి అని శార‌దాపీఠ‌మే మండిప‌డుతోంది. ఆ ఆగ్ర‌హాన్ని మ‌న‌సులో పెట్టుకోకుండా బ‌య‌ట‌కు వెల్ల‌గ‌క్కింది. అందుకే ఆ అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కారుపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి నిరసన గళం వినిపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను వెనుకబడిన సంక్షేమ శాఖలో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని స్వరూపానందేంద్ర సరస్వతి భావిస్తున్నట్లు శారదాపీఠం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు శారదాపీఠం వెల్ల‌డించింది.  అగ్ర వర్ణాలన్నింటినీ ఈబీసీ జాబితాలోకి చేర్చాలని శారదాపీఠం ప్రతిపాదిస్తోంది. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నామని, బ్రాహ్మణులను బీసీ జాబితాలోకి కలపాలని చూస్తే పోరాటం చేస్తామని విశాఖ శారదాపీఠం హెచ్చరిస్తోంది. త‌మ‌కు ఎంతో ఇష్ట‌మైన జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై స్వ‌రూపానందేంద్ర సర‌స్వ‌తి ఇలాంటి క‌ఠిన‌ ధోర‌ణి ప్ర‌ద‌ర్శించడం ఇటీవ‌ల కాలంలో ఇదే తొలిసారి. అందుకే దీనిపై అంత‌టి ఆస‌క్తి. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌ను వెన‌క‌బ‌డిన సంక్షేమ శాఖ‌లో క‌ల‌పాల‌న్న వైసీపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై.. స్వ‌త‌హాగా త‌న‌కు క‌మ్యూనిస్టు భావాలున్నాయ‌ని చెప్పుకునే విశాఖ శార‌దాపీఠాధిప‌తి స్వామి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి వారు ఇలా రెబెల్ జెండా ఎగ‌రేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇలానే మిగ‌తా మ‌త విష‌యాల్లోనూ ఎప్ప‌టిక‌ప్పుడు శార‌దాపీఠం స్పందిస్తే బాగుండేద‌ని అంటున్నారు. ఇక‌, త‌మ‌కు ఇష్ట‌మైన‌ స్వామీజీకే జ‌గ‌న్ స‌ర్కారు కోపం తెప్పించిందంటే ప్ర‌భుత్వం ఎంత అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకుంటుందో అర్థం అవుతోంద‌ని అంటున్నారు.   

వైసీపీలో ముదిరిన వ‌ర్గ‌పోరు.. మంత్రి పెద్దిరెడ్డికి రోజా ఫిర్యాదు..

మగాడివైతే రిజైన్ చెయ్.. రాజీనామా చేసి మళ్లీ గెలవాలంటూ శ‌నివారం వైసీపీ నేత‌పై చిందులు తొక్కిన ఎమ్మెల్యే రోజా ఆదివారం మ‌రింత జోరు పెంచారు. చిత్తూరు జిల్లా నిండ్ర ఎంపీపీ ఎన్నికల్లో విప్‌ను ఉల్లంఘించిన ఎంపీటీసీ సభ్యులను అనర్హులుగా ప్రకటించాల‌ని.. వారిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేర‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి విన‌తిప‌త్రం ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది.  నిండ్ర ఎంపీపీ ఎన్నికను అడ్డుకోవడంతో పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేసిన చక్రపాణిరెడ్డి, ఆయన సొదరుడిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డికి ఎమ్మెల్యే రోజా వినతిపత్రం అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులకు పదవులను కేటాయిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వారు వ్యతిరేకించారని రోజా మంత్రికి ఫిర్యాదు చేశారు.   శ‌నివారం చిత్తూరు జిల్లా వైసీపీలో వర్గ పోరు భగ్గుమంది. ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీ రెండుగా చీలిపోయింది. నిండ్ర మండలం ఎంపీపీ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. ఓ వర్గం ఎమ్మెల్యే రోజా బలపరిచిన దీపను ఎంపిపి చేయాలని ప్రయత్నించ‌గా.. రోజా ప్రత్యర్థి వర్గం తనకే ఎంపీపీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేసింది. శుక్రవారం జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదా పడగా.. శనివారం సమావేశంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.  నిండ్ర మండలంలో వైసీపీకి 8 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యే రోజా వర్గంలో ఉండగా.. మిగితా ఐదుగురు రోజాకు వ్యతిరేకంగా భాస్కర్ రెడ్డికి సపోర్టుగా నిలిచారు. దీంతో అధికారులపై, సొంత పార్టీ ప్రత్యర్థి వర్గం పైన  ఎమ్మెలేయే రోజా చిందులు వేశారు. నిబంధనల ప్రకారం తాము బలపరిచిన అభ్యర్థిని ఎంపీపీగా ప్రకటించాలంటూ అధికారులతో వాదనకు దిగారు రోజా. టిడిపి కార్యకర్తలు అంటూ సొంత పార్టీ కార్యకర్తలతో గొడవ పడ్డారు. మగాడివైతే ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలంటూ భాస్కర్ రెడ్డిని సవాల్ చేశారు ఎమ్మెల్యే రోజా. ఇద్దరి మధ్య వాగ్వాదంతో ఎంపీడీవో కార్యాలయంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.  ఆ గొడ‌వ‌కు కంటిన్యూగా ఆదివారం విష‌యాన్ని మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు రోజా. పార్టీ లైన్‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. మంత్రి పెద్దిరెడ్డికి, ఎమ్మెల్యే రోజాకు మ‌ధ్య ఏళ్లుగా కోల్డ్‌వార్ న‌డుస్తోంది. రోజా వ‌ర్గీయుల‌ను పెద్దిరెడ్డి వ‌ర్గం అణ‌గ‌దొక్కుతున్నారంటూ గ‌తంలో రోజా క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యారు. తాజాగా, చ‌క్ర‌పాణిరెడ్డి సోద‌రుల‌కు వ్య‌తిరేకంగా మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లి మ‌రీ ఎమ్మెల్యే రోజా క‌ల‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఓ ప్ర‌త్య‌ర్థికి వ్య‌తిరేకంగా మ‌రో ప్ర‌త్య‌ర్థి ఇంటికి వెళ్ల‌డం పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.   

కాంగ్రెస్ వ‌ర్కింగ్ స్టైల్ మారిందా? పంజాబ్, తెలంగాణ‌లో అదే జ‌రుగుతోందా?

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ‘ముఖ్యమంత్రి మార్పు’ నిర్ణయం, ఒక విధంగా ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. నిజమే, ఒకప్పుడు ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ, ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే, కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ అధికారంలో ఉన్న రోజులల్లో సోనియా గాంధీ కూడా అలాంటి నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. అయితే, ఇందిరా, రాజీవ్ నాటి పరిస్థితికి నేటి పరిస్థితికి పొంతన లేదు. పోలిక కుదరదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. కేంద్రంలోనే కాదు మెజారిటీ రాష్ట్రాలలోనూ అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారం కాదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. దేశం మొత్తంలో మూడంటే మూడు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందిరా, రాజీవ్’ల కాలం కాంగ్రెస్ పార్టీకి స్వర్ణ యుగం.. ఇది... ఏ యుగమో వేరే చెప్పనక్కరలేదు.  అలాగే, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయంలో ఎదురు దెబ్బలు తగిలినా, సంక్షోభాలు ఎదురైనా, నాయకత్వ సంక్షోభం అనేది ఏ నాడు లేదు. అత్యవసర పరిస్థితి అనంతరం 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో స్వయంగా ఇందిరా గాంధీ ఓడిపోయారు. సంజయ్ గాంధీ ఓడి పోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం కక్షకట్టి కేసులు పెట్టి, ఇందిరా గాంధీని జైలుకు పంపింది, ముప్పతిప్పలు పెట్టింది. సొంత పార్టీలో చీలిక వచ్చింది. బ్రహ్మానంద రెడ్డి ఇందిరా గాంధీ నాయకత్వాన్ని ఎదిరించారు. రెడ్డి కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టారు. ఇలా ఇందిరా గాంధీపై ముప్పేట దాడి జరిగింది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. కాడి వదిలేసి పారిపోలేదు. పోరాడారు. పదకొండు నెలలు తిరక్కుండానే మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇక ఇప్పుడు పరిస్థితి  ఏమిటో వేరే చెప్ప నక్కర లేదు. 2019 ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీకి అధ్యక్షడు లేరు. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ డీఫ్యాక్టో’ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, తొమ్మిదేళ్ళకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న పంజాబ్’లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్’ను గడ్డిపోచను తీసినట్లు తీసిపారేయడం నిజంగా, రాహుల్ గాంధీ, ప్రియాంక తీసుకున్న సాహసోపేత నిర్ణయం. అందులో సందేహం లేదు.  అదలా ఉంటే, పంజాబ్ నిర్ణయం వెనక వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నారో మరొకరు ఉన్నారో, కానీ, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ సాగించే నడకకు, నడతకు ఇదొక స్పష్టమైన సంకేతంగా నిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ముఖ‌ చిత్రాన్ని పంజాబ్‌ పరిణామాలు ఆవిష్కరించాయి. మరోవంక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్‌గఢ్’లలో కూడా, ‘వృద్ధులకు ఉద్వాసన’ ఫార్ములానే అనుసరించే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి విధేయులు తప్ప ముఖ్యమంత్రి కాదని పంజాబ్ పరిణామాలు స్పష్టం చేశాయి. కెప్టెన్ స్థానంలో నూతన ముఖ్యమంత్రిని ఎన్నికునేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శాసన సభ పక్ష సమావేశానికి, కెప్టెన్ సహా ఇద్దరు తప్ప, మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. రాహుల్ గాంధీ ఎంపిక చేసిన చరణ్‌జిత్‌ సింగ్ చన్నిని ఏకగ్రీవంగా శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చన్నీ మీద ‘మీ టూ’ వంటి కేసులున్నా, రాహుల్ సెలెక్ట్ చేసారు కాబట్టి మేము ఎలెక్ట్ చేసామన్న విధంగా, విధేయంగా ఎమ్మెల్యేలు ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతవరకేందుకు, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలుపై లేచిన, ఎమ్మెల్యే జగ్గారెడ్డి 24 గంటలు తిరగకుండానే బేషరుతుగా క్షమాపణ చెప్పారు. సోనియా, రాహుల్ చెప్పిందే వేదం అని చెంపలు వేసుకున్నారు. సో.. ఈ రెండు ఉదంతాలను గమించినా, రాజస్థాన్’లో మొదలైన నాయకత్వ మార్పు ప్రక్రియను గమనించినా .. కాంగ్రెస్ పార్టీలో ఇక రాహుల్ అండ్ కో దే హవా .. రాహుల్ చెప్పిందే వేదం ప్రియాంక గీసిందే గీత.  

జ‌గ‌న్ స‌ర్కారుకు బ్యాంకులు బిగ్‌షాక్‌.. ఓవ‌ర్ డ్రాఫ్టుల‌కు చెక్‌.. ఇక డ‌బ్బులెలా?

పైసా క‌నిపిస్తే చాలు ఊడ్చేస్తోంది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు. ఓ వైపు అప్పుల మీద అప్పులు.. ఇంకోవైపు పీడీ అకౌంట్ల‌తో నిధుల మ‌ళ్లింపు.. మ‌రోవైపు ఓవ‌ర్ డ్రాఫ్టుల‌తో గ‌ట్టెక్కే తిప్పలు.. ఇలా రాష్ట్రానికి ద‌మ్మిడి ఆదాయం లేక‌, కేవ‌లం కేంద్రం నిధులు, అప్పుల‌తోనే పాల‌న నెట్టుకొస్తోంది ఏపీ ప్ర‌భుత్వం. ఇక కేంద్రం వివిధ ప‌థ‌కాల కోసం కేటాయించే నిధుల‌ను దారి మ‌ళ్లించి.. తామే ఇస్తున్న‌ట్టు గొప్ప‌లు చెప్పుకుంటోంది. సొమ్ములేమో కేంద్రానివి.. సోకులేమో రాష్ట్రానివి అన్న‌ట్టు ఉంది వ్య‌వ‌హారం. ఎక్క‌డా కేంద్ర ప్ర‌భుత్వానికి పేరు రాకుండా.. అంతా జ‌గ‌న‌న్నే చేస్తున్నారంటూ బిల్డ‌ప్ కొడుతున్న ఏపీ స‌ర్కారుకు తాజాగా కేంద్రం చెక్ పెట్టింది. బ్యాంకుల త‌ర‌ఫున న‌రుక్కొచ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వం బ్యాంకుల నుంచి ఇష్టారీతిని సొమ్ములు డ్రా చేసుకోకుండా కొర్రీలు పెట్టింది. దీంతో.. కేంద్రం పీఠ‌ముడితో బ్యాంకులు వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేశాయి. దీంతో.. కుయ్యోమొర్రో అంటూ ఏపీ ప్ర‌భుత్వం ఇప్పుడు ఏం చేయాలో తెలీక త‌ల‌లు ప‌ట్టుకుంటోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... కేంద్ర ప్రాయోజిత పథకాల విషయంలో రాష్ట్రాలకు కేంద్రం కఠిన నిబంధనలు విధించడంతో, ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి ఓవర్‌ డ్రాఫ్టు రూపంలో వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన రూ.6,500 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్‌ ఇవ్వడం సాధ్యం కాదని ఆ పథకాలకు సింగిల్‌ నోడల్‌ ఏజన్సీగా ఉన్న స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా-ఎస్బీఐ తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శికి ఎస్‌బీఐ తాజాగా లేఖ రాసింది.  ‘కేంద్ర ప్రాయోజిత పథకాల సింగిల్‌ నోడల్‌ ఖాతాలు మీ బ్యాంకులో తెరుస్తాం, ఈ పథకాలకు అవసరమైన మూలధన పెట్టుబడి రూ.6,500 కోట్లు ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో కల్పించాలి. ఈ పథకాల అమలుకు ఏర్పాటుచేసిన అయిదు ఏజన్సీలకు ఆ నిధులు ఓడీగా వినియోగించుకునే అవకాశం ఇవ్వాలి. ఆ ఖాతాల్లో వినియోగించుకోగా మిగిలిన నిధులను సెక్యూరిటీగా భావిస్తూ ఈ మేరకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం కల్పించాలి’ అంటూ రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సెప్టెంబరు 2న ఎస్‌బీఐ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. వారు ఆ లేఖను పరిశీలించి, అలా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చారు. బ్యాంకు నిబంధనలు ఇందుకు అనుమతించబోవని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ఇలా ఓడీ సౌకర్యం కల్పించే అవకాశం లేదన్నారు.  కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి నిబంధనలు మార్చింది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కొన్ని రాష్ట్రాలు తమ ఇతర అవసరాలకు వినియోగించుకోవడంతో ఈ ఏడాది నుంచి అలాంటి వాటికి చెక్ పెట్టింది. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులూ పీడీ ఖాతాలకు మళ్లించకూడదని నిబంధన విధించింది.  కేంద్రప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాలకు తన వాటా నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తుంది. కేంద్రం తన వాటా విడుదల చేసిన 40 రోజుల్లోగా రాష్ట్రం తన వాటా నిధులను ఆ ఖాతాల్లో వేయాలి. ఒక పథకం నిధులన్నీ ఒకే బ్యాంకులో ఉండాలని, వాటి వినియోగం, ఖర్చుపై మ్యాపింగ్‌ చేయాలని కేంద్రం నిర్దేశించింది. నిర్దిష్ట సమయంలో కేంద్ర, రాష్ట్ర వాటాల నిధులు కలిపి ఖర్చుచేస్తేనే తదుపరి విడత నిధులు విడుదలయ్యేలా విధానాలు మార్చేసింది. రాష్ట్ర వాటా నిధులు భరించేందుకు ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూసే క్రమంలోనే రూ.6,500 కోట్ల ఓడీ సౌకర్యం కావాలని ఎస్‌బీఐకి లేఖ రాసింది. అందుకు ఎస్బీఐ తిర‌ష్క‌రించడంతో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో ఏపీ ఆర్థిక శాఖ‌ అధికారులు ఆందోళ‌న చెందుతున్నారు. కేంద్ర నిధుల‌ను వాడుకోవాలంటే.. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం త‌న వాటా సొమ్మును వేయడం త‌ప్ప‌నిస‌రి చేయ‌డంతో.. క‌నీసం ఆ డ‌బ్బులు కూడా లేక‌పోవ‌డం ఏపీ ఆర్థిక దుస్థితికి నిద‌ర్శ‌నం. త‌న వంతు వాటా కోసం ఎస్బీఐని ఓవ‌ర్ డ్రాఫ్టు అడ‌గ‌డం.. అందుకు ఆ బ్యాంక్ నో చెప్ప‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం సందిగ్థంలో ప‌డింది. ఈ క‌ష్టం నుంచి గ‌ట్టెక్కేందుకు మ‌రో మార్గం చూసుకోవాలిక‌...  

Top News @ 1pm

1. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. చంద్రబాబు ఇంటి సమీపంలో నాలుగు రోజులుగా ఒక్క స్ట్రీట్‌ లైటూ వెలగడం లేదు. భద్రత సిబ్బంది సైతం చీకట్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న నాయకుడి ఇంటి ద‌గ్గ‌ర‌ పరిస్థితి ఇలా ఉండటం చర్చనీయాంశంగా మారింది. 2. పవన్ కళ్యాణ్ నటించినా, సంపూర్ణేష్ బాబు నటించినా కష్టం ఒకటే. పారదర్శకత కోసమే ఆన్‌లైన్ పోర్టల్. అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే మా ఉద్దేశం.. అంటూ జ‌న‌సేనాని వ్యాఖ్య‌ల‌పై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంట‌ర్ ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.   3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చాల్సింది మంత్రులను కాదని.. ముఖ్యమంత్రిని మార్చాలని ఏపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. జగన్ పాలనలో మంత్రులు ఉత్సవ విగ్రహాలని, ఆరవ వేలుతో సమానమని విమర్శించారు. వారు మంత్రులుగా ఉన్నా ఒకటే.. ఊడినా ఒకటేనన్నారు. ప్రస్తుతం ఏపీలో సమస్య ముఖ్యమంత్రి జగనేనన్నారు తుల‌సీరెడ్డి 4. తెలంగాణ‌లో బీసీ బంధును అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అర్హులైన  ప్రతి  బీసీ కుంటుంబానికి రూ. 10 లక్షలు ఆర్ధిక  సహాయం  అందించాలన్నారు. క్యాబినెట్‌లో ముగ్గురు కాదు.. 8మంది బీసీలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.  5. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీజేపీ నేత లంకా దినకర్ సంచ‌ల‌న‌ కామెంట్స్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4 నెలల్లోనే ఏడాది బడ్జెట్ అంచనా అప్పులు దాదాపు 100 శాతం పూర్తి అయ్యాయన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంకు బడ్జెట్ అంచనా ప్రకారం మొత్తం అప్పులు రూ. 37,029.79 కోట్లు అయితే, జూలై నాటికి ప్రభుత్వం 36,171.61 కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.  6. మణికొండలో రాత్రి డ్రైనేజీ పైపు లైన్ల కోసం తవ్విన గుంతలో పడి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు కాగా అత‌ని కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో నాలాలో కొట్టుకొనిపోయి ఉంటాడని  అధికారులు భావిస్తున్నారు. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి గల్లంతయ్యాడని స్థానికుల ఆరోపిస్తున్నారు.  7. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కిస్తీపురంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడ్డాయి.  లారీలో రవాణా చేస్తున్న 8 టన్నుల రేషన్ బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను పోలీసులు ఆరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  8. ఖాదీ ఉత్పత్తులను కొని, స్థానిక వృత్తి పనివారికి అండగా నిలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నదులను కాపాడుకోవాలని, పరిశుభ్రంగా ఉంటూ, కొవిడ్-19 వ్యాప్తి నిరోధక చర్యలు పాటించాలని కోరారు. 81వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆదివారం మోదీ మాట్లాడారు.  9. ఉత్తరాంధ్ర తీరం వైపు గులాబ్ తుఫాన్ దూసుకొస్తుంది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శ్రీకాకుళం కళింగపట్నం సమీపంలో సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ‌ తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని.. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని హెచ్చ‌రించింది.  10. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అటు, సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.   

అరేయ్‌ సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా.. వైసీపీ తుప్పురేగ్గొట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌..

అస‌లే లెక్క‌లేనంత తిక్క‌. ఆపై కాక మీదున్నారు. ఓ వైపు అల్లుడు కోమాలో ఉన్నాడ‌నే ఆవేద‌న‌. మ‌రోవైపు ఏపీలో సినిమా ఇండ‌స్ట్రీని తొక్కేస్తున్నార‌నే ఆవేశం. అవి, ఇవి అన్నీ క‌ల‌గ‌లిసి.. వైసీపీపై చెల‌రేగిపోయారు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. రిప‌బ్లిక్ ఆడియో ఫంక్ష‌న్‌లో ఆయ‌న ప‌వ‌ర్‌స్టార్‌లా కాకుండా, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లా పొలిటిక‌ల్ స్పీచ్ ఇచ్చారు. అది స్పీచ్ అన‌డం కంటే.. వైసీపీ ప్ర‌భుత్వాన్ని, జ‌గ‌న్‌రెడ్డిని, పేర్నినానిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశారు అంటే క‌రెక్ట్‌గా ఉంటుంది. గ‌తంలో జ‌నసేన స‌భ‌ల్లో ఆవేశంగా మాట్లాడే ప‌వ‌న్‌.. ఏనాడు పెద్ద‌గా తిట్ల జోలికి వెళ్ల‌లేదు. కానీ, స‌హ‌నం న‌శించిందో లేక‌, వైసీపీకి ఆ బాష‌లోనే చెబితే అర్థం అవుతుంద‌ని అనుకున్నారో ఏమో కానీ, అరేయ్ సన్నాసుల్లారా, ఆరేయ్ దద్ద‌మ్మ‌ల్లారా.. అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. దాదాపు గంట పాటు నాన్‌స్టాప్‌గా వైసీపీని కుమ్మిప‌డేశారు.  ఏపీలో ఆన్‌లైన్ టికెటింగ్ వ్య‌వ‌హారాన్ని తీవ్ర స్థాయిలో త‌ప్పుబ‌ట్టారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. త‌నపై కోపంతో సినిమాను చంపేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇండ‌స్ట్రీ జోలికొస్తే కాలిపోతారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆన్‌లైన్‌ టికెట్ల ఆదాయం చూపి అప్పులు తెచ్చుకోడానికే అలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రైవేటు వ్యక్తులు తీసే సినిమాపై ప్రభుత్వ ఆధిపత్యం ఏమిటని ప్రశ్నించారు. ‘సన్నాసి మంత్రి’ అంటూ పేర్ని నానిపై విరుచుకుప‌డ్డారు. ‘‘చిరంజీవి అంటే సోదర భావన అని ఆ సన్నాసి అంటారు. సోదిలో సోదర భావన.. చిత్ర పరిశ్రమకు ఉపయోగపడని సోదర భావన ఎందుకు? అని నిల‌దీశారు. ప‌నిలో ప‌నిగా న‌టుడు మోహన్‌బాబుకు కూడా కౌంట‌ర్ వేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇప్పుడు సినిమాలు.. రేపు మీ స్కూళ్లు.. అంటూ హెచ్చ‌రించారు.  ఇక సాయిధ‌ర‌మ్‌తేజ్ యాక్సిడెంట్‌పై మీడియా వండి వార్చిన క‌థ‌నాల‌నూ త‌ప్పుబ‌ట్టారు. ఆ విష‌యం ప్ర‌స్తావిస్తూ.. వైసీపీని ఏకిపారేశారు. సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై చర్చించడం మానేసి.. నేర రాజకీయాలపై మాట్లాడాలని సూచించారు. ‘‘వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడండి.. విశాఖలో, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విమానాశ్రయంలో ఒక నాయకుడిపై కోడి కత్తితో దాడి జరిగింది.. దీని వెనుక భారీ కుట్ర ఉందని అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ కూడా అన్నారు. ఆ కేసు ఏమైందో అడగండి. లక్షలాది ఎకరాల  పోడు భూములు గిరిజనులకు ఎందుకు దక్కడం లేదో... దారి గురించి మాట్లాడండి’’ అని సూచించారు.  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడిన వాళ్లు.. వైసీపీ రాగానే ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలని అధికార పార్టీని నిల‌దీశారు. ‘‘రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు? బోయలకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం లభించడంలేదు? అని పవన్‌ ప్రశ్నించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో ఆస‌క్తిక‌ర అంశాన్నీ ప్ర‌స్తావించారు. ఇడుపులపాయలో నేలమాళిగల్లో టన్నుల కొద్దీ డబ్బులుంటాయని అంటారని.. దానిమీద కూడా మీడియా స్టోరీలు చేస్తే బాగుంటుంద‌న్నారు జ‌న‌సేనాని. ప్రెసిడెంట్‌ మెడల్‌ కావాలంటే సాహసం చేయాలి.. కానీ, ఏపీలో బ్రాందీ కొట్టుకు వెళితే ప్రెసిడెంట్‌ మెడల్‌ క్వార్టర్‌ బాటిల్‌ దొరుకుతుందంటూ ఏపీ లిక్క‌ర్ పాల‌సీపై మండిప‌డ్డారు. ఇలా, రిప‌బ్లిక్ వేదిక‌గా ప‌వ‌న్‌కల్యాణ్ ప్ర‌సంగం ఆసాంతం రెబెల్‌గా సాగింది. మాట మాట‌లో ఆయ‌న‌లో అస‌హ‌నం, ఆగ్ర‌హం సుస్ప‌ష్టంగా కనిపించింది. స‌న్నాసుల్లారా.. అనే ప‌దం ప‌దుల సార్లు వాడారు. జ‌గ‌న్‌రెడ్డినో, పేర్ని నానినో ఎదురుగా ఉంటే కొట్టే వాడేమో అనిపించేలా ఆవేశంతో ఊగిపోయారు. త‌న సినిమాల‌ను టార్గెట్ చేయ‌డం, ఆన్‌లైన్ టికెటింగ్‌పై ప‌వ‌ర్‌స్టార్ బాగా ర‌గిలిపోతున్నార‌నే విష‌యం ఆయ‌న మాట‌ల‌తో స్ప‌ష్టమైంది. వైసీపీ డ‌బుల్‌గేమ్‌, కాపు రిజ‌ర్వేష‌న్లు, వైఎస్ వివేక మ‌ర్డ‌ర్ కేసు, కోడి క‌త్తి కేసు, బ‌లిజ‌లు, బోయ‌ల క‌ష్టాలు, లిక్క‌ర్ పాల‌సీ.. ఇలా త‌న ప్ర‌సంగంలో అడుగ‌డుగునా ఏపీ ఇష్యూస్‌ను ప్ర‌స్తావించి.. ప్ర‌శ్నించి.. ప‌వ‌ర్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌లా బ్లాస్ట్ అయ్యారు జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.   

అప్పుల్లో దేశంలోనే ఏపీ ఫస్ట్.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు మ‌రో రికార్డ్‌..

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో రికార్డు సొంతం చేసుకున్నారు. అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోమారు అగ్రగామిగా నిలిపారు. నిజమే, జగన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచే, ఏ.. అంటే అప్పులు, పీ ..అంటే పంపకాలు అనే అర్ధంలోనే ఏపీలో పరిపాలన సాగుతోంది. అందినకాడికి అప్పులు చేయాలి... తెచ్చిన అప్పును తెచ్చినట్టుగా ఏదో ఒక పథకం పేరిట ప్రజల ఖాతాలలో వేసేయాలి .. ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవాలి ఇదే, జగన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సూత్రం.  నిజమే. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యాలలో ఒకటి, అందులో సందేహం లేదు. అయితే, గీత దాటి, అభివృద్ధిని ఆవలకు నెట్టేసి, కేవలం సంక్షేమం పైనే దృష్టిని నిలపడం సరైన విధానం కాదు, అందుకే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా అంచుకు చేరిందని, విపక్షాలే కాదు, ఆర్థిక నిపుణులు కూడా చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు.అయినా,జగన్ రెడ్డి ప్రభుత్వం హెచ్చరికలను పెడ చెవిన పెట్టింది.  అప్పులు, పంప‌కాలు పాలసీని అలాగే కొనసాగిస్తోంది. ఫలితంగా ఇప్పటికే అనేకసార్లు జగన్ రెడ్డి ప్రభుత్వం నెత్తిన అక్షింతలు వేసిన కాగ్’ ఇప్పుడు మరో మారు అదే పనిచేసింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో అగ్ర స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఉండడం ఒక్కటే కాదు, బడ్జెట్’లో ప్రతిపాదించిన వార్షిక అప్పు మొత్తాన్ని, మొదటి నాలుగు నెలల్లోనే సేకరించింది. సేకరించిన మొతాన్ని అంతే వేగంగా ఖర్చు చేసింది. ఇది ఒక విధంగా ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన డబుల్ ధమాకా అచీవ్‌మెంట్ కావచ్చు.  దేశంలో ఇన్నిరాష్ట్రలున్నా ఏ రాష్ట్రం కూడా నాలుగే నాలుగు నెలల్లో సంవత్సర ఖాతాలోంచి, 97 శాతానికి పైగా అప్పు చేయలేదు. ఒక్క జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే, నాలుగే నెలల్లో 97.68 శాతం అప్పు చేసింది. అంటే మిగిలిన ఎనిమిది నెలల కాలానికి చేయగల అప్పు, నిండా మూడు శాతం కూడా లేదు. పోనీ ఇలా అప్పు చేసిన సొమ్మును సద్వినియోగం చేసిందా అంటే, అదీ లేదు. పప్పు బెల్లాల్లా పంచేసిందని, మాజీ ఆర్థిక మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామ కృష్ణుడు, అదే విధంగా ఆర్థిక రంగ నిపుణులు చెపుతున్నారు. అందుకే ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో సంక్షేమానికి కోతలు పెడుతోంది. అదలా ఉంటే, కాగ్’ నివేదిక విడుదల చేసిన వివరాల ప్రకారం, మిజోరం (82.87 శాతం), కేరళ (73.78 శాతం) మినహా మిగిలిన ఏ రాష్ట్రం కూడా అప్పులు చేయడంలో ఏపీకి సమీపంలో కూడా లేవు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్, వార్షిక రుణ పరిమితిలో నాలుగు నెలల్లో కేవలం 21.07 శాతం మాత్రమే వినియోగించుకుంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ 32.89 శాతం మాత్రమే వినియోగించుకుంది. ఏపీ అందుకు మూడు రెట్లు ఎక్కువ అప్పు చేసింది.   అప్పులు చేయడంలోనే కాదు, అప్పులను ఖర్చు చేయడంలోనూ ఏపీ ఫస్ట్ ప్లేస్’ లో ఉంది. బడ్జెట్’లో ప్రతిపాదించిన వార్షిక వ్యయంలో నాలుగు నెలల్లో  36 శాతం ఖర్చు చేసి ఖర్చుచేసింది. అయితే, దేనిపై ఖర్చు చేసింది, అనేదే కీలక ప్రశ్న. అనుత్పాదక వ్యయం చేయడం వల్లనే అప్పుల భారం పెరిగిపోతోందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం, అప్పులు, పంపకాలు పాలసీనే ఫాలో అవుతోంది. అందుకే చివరకు ఎపీకి మిగిలేది..అప్పులు,తిప్పలు.చిప్పలు మాత్రమే అంటున్నారు ఆర్థిక నిపుణులు.  

మొన్న దాడి, ఇప్పుడు చీక‌ట్లు.. చంద్ర‌బాబు టార్గెట్‌గా ఏదో జ‌రుగుతోందా?

చంద్ర‌బాబు మామూలు స్థాయి నేత కాదు. మూడుసార్లు ముఖ్య‌మంత్రి. గ‌తంలో న‌క్స‌ల్స్ అటాక్ కూడా జ‌రిగింది. అందుకే, దేశంలోకే అత్యున్న‌తమైన బ్లాక్ క్యాట్ క‌మెండోల‌ ర‌క్ష‌ణ‌, జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త ఉంది. అలాంటి నాయ‌కుడి టార్గెట్‌గా ఏదో జ‌రుగుతోంద‌నే అనుమానం. వ‌రుస ఘ‌ట‌న‌లు అందుకు మ‌రింత బ‌లాన్ని ఇస్తున్నాయి. ఇటీవ‌ల వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేశ్ వంద‌లాది మందిని వెంటేసుకొని, క‌ర్ర‌లు, రాళ్ల‌తో వెళ్లి.. ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు ఇంటిపై అటాక్ చేశారు. ఆ ఘ‌ట‌న‌ తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. అది మ‌రువ‌క ముందే.. తాజాగా చంద్ర‌బాబు ఇంటి చుట్టూ చిమ్మ చీక‌ట్లు అలుముకున్నాయి. ఆయ‌న ఇంటికి క‌రెంట్ ఉన్నా.. ఆ నివాసానికి దారి తీసే అన్నిమార్గాల్లో చీక‌ట్లే క‌మ్ముకున్నాయి. ఇది యాదృచ్చికంగా జ‌రిగిందా? లేక‌, ఉద్దేశ్య‌పూర్వ‌కంగా ఇలా చేస్తున్నారా? అనే అనుమానం టీడీపీ శ్రేణులు వ్య‌క్తం చేస్తున్నాయి. అస‌లేం జ‌రిగిందంటే....   మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. ఆ ఇంటికి సమీపంలోని మార్గంలో చాలా వరకు వీధి దీపాలు వెలగడం లేదు. చంద్రబాబు ఇల్లు తాడేపల్లిలోని కట్ట దారికి వంద అడుగుల దూరంలో నది వైపు ఉంది. సుమారు 2 కిలోమీటర్ల పొడఉండే కట్ట దారిలో కొండవీటి వాగు దాటాక కొన్ని లైట్లు మాత్రమే వెలుగుతుండ‌టాన్ని ఎలా చూడాలి? జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ ఉన్న నాయ‌కుడి ఇంటి చుట్టు ప‌రిస‌రాలు ఇంత చీక‌టిగా ఉంటే.. ఇక ర‌క్ష‌ణ ఎలా ఉంటుంది? అని ప్రశ్నిస్తున్నారు.  చంద్రబాబు ఇంటి సమీపంలో నాలుగు రోజులుగా ఒక్క లైటూ వెలగడం లేదు. భద్రత సిబ్బంది సైతం చీకట్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న నాయకుడి ఇంటి ద‌గ్గ‌ర‌ పరిస్థితి ఇలా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కట్ట దారిలో మూడు అంచెలుగా ఉన్న చెక్‌పోస్టుల్లోని సిబ్బందిని ప్రశ్నిస్తే.. ‘పై అధికారులకు చెప్పాం.. వాళ్లు పట్టించుకోవడం లేదు’ అని సమాధానం ఇచ్చారు.  మామూలుగా అయితే ఏ ప‌ట్ట‌ణంలో స్ట్రీట్ లైట్స్ వెల‌గ‌కున్నా.. అధికారులకు ఫిర్యాదు చేస్తే దాదాపు వెంట‌నే స‌రి చేస్తారు. అలాంటిది చంద్ర‌బాబు ఇంటి ద‌గ్గ‌ర నాలుగు రోజులుగా వీధి లైట్లు వెల‌గ‌క‌పోవ‌డం..    భ‌ద్ర‌తా సిబ్బంది చెప్పినా.. ఆ విష‌యం ప‌ట్టించుకోక‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. కావాల‌నే ఇలా చేస్తున్నారా? చంద్ర‌బాబును ఇబ్బంది పెట్ట‌డం కోసం ఆయ‌న భ‌ద్ర‌త‌ను ప‌ణంగా పెడుతున్నారా?  చంద్ర‌బాబు ఇంటి చుట్టూ చీక‌ట్ల‌కు ఎవ‌రు బాధ్యులు? 

టాప్ న్యూస్ @ 8 PM

27న రైతు సంఘాల భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతుల ప్రయోజనాలే టీడీపీకి ప్రధానమని వ్యాఖ్యానించారు. బంద్‌లో టీడీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సచివాలయాలను సందర్శిస్తానన్న సీఎం జగన్‌ దమ్ముంటే రైతులతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు.  ------- ఏపీ కేబినెట్ విస్తరణ అంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్ లో 100 శాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పారని బాలినేని వెల్లడించారు. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ తన మంత్రి పదవి పోయినా బాధపడనని, సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ------ టీడీపీ, జనసేన పొత్తుతో సంచలన విజయం ఖాయమని టీడీపీ మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు స్పష్టం చేశారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని రాజోలు, మలికిపురం మండల పరిషత్ విజయమే నిదర్శనమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు సాగిస్తున్న వైసీపీకి చరమగీతం పాడాలంటే జనసేన టీడీపీలు చారిత్రక పొత్తు అవసరం తప్పనిసరన్నారు. రెండు పార్టీల అధినేతలు కూడా ఒకసారి ఆలోచన చేసే దిశగా అడుగులు పడాలని సూచించారు.  ------- కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగ రాష్ట్రానికి సంబంధించి తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, తదితర అంశాలను సీఎం కేసీఆర్‌ చర్చించారు. సమావేశంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, రాజేందర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. ------- బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు.. తెల్లారితే సిలిండర్‌ ధర మూడు వేలు పెంచి.. మనవద్ద నుంచే వసూల్‌ చేస్తారని మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి ఓటేస్తే.. పెంచిన ధరలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని, మంచి నూనె ధర 300 రూపాయలకు పెంచుతారన్నారు.  పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.  --------- ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య వివాదం ముగిసింది. ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శలు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ జగ్గారెడ్డికి సర్దిచెప్పారు. శుక్రవారం ఘటనపై జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడటంపై జగ్గారెడ్డి సారీ చెప్పారు. ‘‘నిన్నటి ఘటనను మరిచిపొండి. అంతర్గత విషయాలు బయట మాట్లాడటం నా తప్పే. నా వైపు నుంచి తప్పు జరిగింది.. మరోసారి అలా జరగదని వివరణ ఇచ్చారు. ---- దీపావళి వరకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే మిలియన్ మార్చ్ చేస్తామని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు సంజయ్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్లలో సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. కరీంనగర్‌లో హిందూవులను బొందుగాళ్ళు అంటే కేసీఆర్‌ను బొంద పెట్టామని ఆయన పేర్కొన్నారు. పాస్‌పోర్ట్‌ల దందా చేసి కేసీఆర్ చాలా మందిని మోసం చేసిండని ఆయన ఆరోపించారు.  ------- గులాబ్ తుపాను ఆదివారం  సాయంత్రం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలను తాకనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని అధికారులు తెలిపారు. రాగల 12 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని పేర్కొన్నారు. అనంతరం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా-విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం వద్ద ఆదివారం సాయంత్రం తీరం దాటుతుందని వివరించారు.  ----- శ్రీశైలంలో సామాన్య భక్తుడికి దేవస్థానంమల్లికార్జునస్వామి స్పర్శదర్శన భాగ్యం కల్పించింది. ప్రతిరోజు రాత్రి 9 నుండి 10 గంటల వరకు సామాన్య భక్తులకు అనుమతి కల్పించారు. రాత్రి 7:30 నుండి ఆర్జితసేవ కౌంటర్స్‌లో భక్తులకు 500 విరామ దర్శనం టికెట్ అందుబాటులో ఉంచుతామని ఈవో తెలిపారు. ఇప్పటి వరకు విరామ దర్శనానికి లెటర్ ప్యాడ్‌పై టికెట్స్ ఇచ్చామన్నారు. ఇకపై సామాన్యుభక్తుడికి అందుబాటులో స్పర్శదర్శనం టికెట్లు అందుబాటులు ఉంటాయన్నారు. ------ భారత దేశ ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని వివరించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను తాను ఉదాహరణగా చెప్పుకున్నారు. టీ స్టాల్‌లో తండ్రికి సాయపడిన బాలుడు ఐక్యరాజ్య సమితి సాధారణ సభ (యూఎన్‌జీఏ)లో మాట్లాడటం నాలుగోసారి అని చెప్పారు. న్యూయార్క్‌లోని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో 76వ యూఎన్‌జీఏ సెషన్‌ను ఉద్దేశించి మోదీ శనివారం మాట్లాడారు.  -------- ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల నిజస్వరూపం బట్టబయలవుతోంది. తాజాగా హెరాత్ నగరంలో ఓ మృతదేహాన్ని క్రేన్ కు వేళ్లాడదీసి ప్రదర్శించారు. హెరాత్ లోని ప్రధాన కూడలిలో తాలిబన్ల చర్యతో ఆఫ్ఘన్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. హెరాత్ నగరంలోని వజీర్ అహ్మద్ సిద్ధిఖీ అనే ఫార్మసీ యజమాని ఈ ఘటనను ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. ---  

రేవంత్ రెడ్డే సూపర్ పవర్.. దిగొచ్చిన జగ్గారెడ్డి

ఇంతకు ముందంతా  ఒక లెక్క. ఇప్పట్నుంచి ఇంకో లెక్క. సీనియర్లు అనే ట్యాగ్ లైన్ తగిలించుకొని ఏం మాట్లాడినా చెల్లుతుందనుకుంటే కుదరదు. సంగారెడ్డి ఎమ్మెల్యే, టీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో టీ-పీసీసీ హోదాలో పార్టీ మీద తన పట్టు ఎంతుందో రేవంత్ రెడ్డి రుజువు చేసుకున్నారు. గతంలో టీ-పీసీసీ ప్రెసిడెంట్ల మీద ఎవరైనా ఎన్ని కామెంట్లయినా చేసుకునే వెసులుబాటు ఉండేది. దాన్ని ఆ పార్టీ నాయకులు కూడా అంతర్గత ప్రజాస్వామ్యం అంటూ ముద్దుపేరుతో పిలుచుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్సయింది. నోరుంది కదాని మాట్లాడితే అదే నోటితే క్షమాపణ చెప్పించడానికైనా వెనుకాడని ఓ సరికొత్త సంప్రదాయాన్ని ప్రమోట్ చేస్తున్నారు.  వృద్ధ నాయకత్వం మీద ఎవరెన్ని విమర్శలు చేసినా తమకు కుర్చీ ఉంటే చాలనుకొని, మిగతావేవీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయా నాయకత్వాలు సర్దుకుపోయాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చింది యువ రక్తం.. రేవంత్ నాయకత్వం. పార్టీని ఆమూలాగ్రం ప్రక్షాళించాలనుకొన్న హైకమాండ్.. ఆయా రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ లకు తగినంత ప్రాధాన్యత కల్పిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రాలో ఓ వెలుగు వెలిగిన పార్టీగా వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోయిన ప్రభ నిలబెట్టుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తోంది. సరికొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. హైకమాండ్ కు విధేయులు అన్న పేరుతో స్థానిక నాయకత్వానికి సమాంతరంగా ముఠాలను ప్రోత్సహించే సంప్రదాయానికి క్రమంగా పాతరేస్తోంది.  ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జగ్గారెడ్డికి సమాచారం లేకుండా రేవంత్ రెడ్డి పర్యటించడంపై జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రేవంత్ ను కౌన్-కిస్కా అనే రేంజ్ లో ఆడుకున్నారు. తాను రేవంత్ కంటే సీనియర్నని, పార్టీలో ఒంటెత్తు పోకడలు పనికిరావని, తనను అవమానపరిస్తే సహించేది లేదనీ రేవంత్ మీద ఎగిరిపడ్డారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యేకంటే ముందే తాను హ్యాట్రిక్ ఎమ్మెల్యేనంటూ రేవంత్ ను కనీసం ఖాతరు కూడా చేయలేదు. తాను తల్చుకుంటే ఇప్పుడంటే ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరినా ఎవరూ అడిగేవారు ఉండరంటూ భారీ పొలిటికల్ ఫీలర్స్ వదిలారు. రేవంత్ వల్ల పార్టీ పడవ మునగక తప్పదంటూ రేవంత్ నాయకత్వంపై తీవ్రమైన శస్త్రాలు సంధించారు.  ఈ వ్యవహారం కాస్తా కాంగ్రెస్ లో పెద్ద దుమారమే రేపుతుందని అంతా అనుకున్నారు. జగ్గారెడ్డికి హైకమాండ్ నుంచి షోకాజ్ నోటీస్ వస్తుందని, భారీ మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుందని మీడియాలో స్పెక్యులేషన్స్ నడిచాయి. కొన్నాళ్లపాటైనా సస్పెన్షన్ వేటు వేస్తారనుకున్నారు. అనుకున్నట్టుగానే పార్టీ హైకమాండ్ కూడా మాణికం ఠాకూర్ ను రంగంలోకి దించింది. సీనియర్లతో సమావేశం ఏర్పాటు చేసి జగ్గారెడ్డి తప్పిదాన్ని ఒప్పుకునేలా చేసింది. తప్పంతా తనదేనని, రేవంత్ రెడ్డి పొరపాటు ఇసుమంతైనా లేదని జగ్గారెడ్డి చేత చెప్పించడంలో సక్సెస్ అయింది. బహిరంగంగా కామెంట్లు చేయడం తప్పేనని, ఇకపై ఎవరూ అలా మాట్లాడరాదంటూ మిగతా సీనియర్లకు కూడా జగ్గారెడ్డి సూచించడం విశేషం. మీడియాకు కూడా జగ్గారెడ్డి ఇవే మాటలు చెప్పడం కాంగ్రెస్ లో మారిన సంస్కృతికి అద్దం పడుతోంది.  జగ్గారెడ్డి మీద వేటు పడటం ఖాయమనుకున్న వ్యవహారం కాస్తా ఒక్క  క్షమాపణతో సర్దుకుపోయింది. దీంతో పార్టీ మీద తనకెంత పట్టు ఉందో రేవంత్ రెడ్డి నిరూపించుకున్నట్టయింది. అంతేకాదు... హైకమాండ్ రేవంత్ కు ఎంత ప్రయారిటీ ఇస్తుందో కూడా ఇండైరెక్టుగా మిగతా నాయకులందరికీ ఈ ఒక్క దెబ్బతో కళ్లకు కట్టినట్టయింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ పట్టు పెరుగుతుండగా... అసమ్మతివాదులు క్రమంగా  దారికొచ్చే అవకాశం ఉందంటున్నారు. అదీగాక తాను పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత రేవంత్ నాయకులందరినీ వ్యక్తిగతంగా కలిసి అందరినీ కలుపుకొని పోతానని చెప్పారు. అదే సంప్రదాయాన్ని బాధ్యతలు చేపట్టాక కూడా కొనసాగిస్తూ తన పెద్దరికాన్ని పెంచుకుంటున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రేవంత్ వర్సెస్ జగ్గారెడ్డి ఎపిసోడ్ తో తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి సూపర్ పవర్ అన్నది మరోసారి స్పష్టమైంది.