జగన్‌కు పాలనపై పట్టు లేదా? వరుస స్కాంలతో పరువంతా పోతోందా?
posted on Sep 22, 2021 @ 7:55PM
పిల్లి గుడ్డిదైతే ఎలుక తోక చూపించిందంటారు. పాలకుడు అసమర్థుడైతే అధికారులు దోచుకుతింటారు. అలానే, ముఖ్యమంత్రికి పాలనలో పట్టు లేకపోతే.. కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఏపీలో అలానే జరుగుతోందని అంటున్నారు. సీఎం జగన్‌కు పరిపాలనపై కమాండ్ లేకపోవడం వల్ల.. రాష్ట్రంలో వరుస కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని చెబుతున్నారు. నిన్నగాక మొన్న రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ ఛలాన్ల పేరిట కోట్ల రూపాయల దందా ఏపీకి షేక్ చేసింది. తాజాగా ఏపీ సచివాలయం కేంద్రంగా మరో భారీ కుంభకోణం బయటపడటం సంచలనంగా మారింది. సీఎం చేతగాని తనమే వరుస స్కాంలకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచే నిధులు కొట్టేశారంటే ఇంకేమనాలి? పథకం పేరులోనే ముఖ్యమంత్రి ఉన్నా.. ఏమాత్రం భయం, బెదురు లేకుండా నిధులు దారి మళ్లించారంటే సీఎం జగన్ అంటే ఏమాత్రం లెక్కలేదని తేలిపోలా. సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతల నుంచి పెద్ద సంఖ్యలో సిఫారసులు వస్తుంటాయి. వాటిని కూడా పరిశీలించిన తర్వాత సీఎంఓ నిధులను మంజూరు చేస్తుంటుంది. ఈ మొత్తం వ్యవహారం అంతా సీఎంఓ పరిధిలోని అధికారులే పర్యవేక్షిస్తుంటారు. ఇందులో ఆర్థిక శాఖ ప్రమేయం కూడా పెద్దగా ఉండదు. ఇలా నేరుగా సీఎంఓ పర్యవేక్షణలో కొనసాగే ఆసరాలోనే అవకతవకలు జరగడం.. ఎవరి వైఫల్యం అనుకోవాలి? సీఎం జగన్‌కు పాలనలో పట్టులేకపోవడం కాక ఇంకేం అనుకోవాలి? అంటున్నారు.
నేరుగా సీఎంఓ పర్యవేక్షణలోనే కొనసాగే సీఎంఆర్ఎఫ్ నిధులను భారీ ఎత్తున పక్కదారి పట్టించారు. ఈ స్కాంలో సచివాలయంలోని అధికారులు, ప్రజా ప్రతినిధుల పీఏలు, నేతల అనుచరుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే, అధికారులు, వైసీపీ బ్యాచ్.. కుమ్మక్కై ఆసదలో ఉన్నవాళ్లకు ఆసరా ఇవ్వాల్సిన కోట్లకు కోట్లు సొమ్మును కొల్లగొట్టేశారు కేటుగాళ్లు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
అయితే సీఎం కార్యాలయం ఆధ్వర్యంలోని సీఎంఆర్ఎఫ్ నిధుల్లో గోల్ మాల్ జరిగిన విషయాన్ని బయటకు చెప్పకుండా ఏసీబీ అధికారులు సీక్రెట్‌గా విచారణ సాగిస్తున్నారని సమాచారం. మరి ఇన్నేళ్లుగా ఇంత భారీ కుంభకోణం జరుగుతుంటే? అన్ని కోట్లు దారి మళ్లాయంటే? ఇది ఎవరి వైఫల్యం? ఇంకెవరి చేతగాని తనం? మొన్న రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ ఛాలన్లు.. తాజాగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు.. ఇలా పందికొక్కులు కోట్లకు కోట్లు మెక్కుతుంటే.. నెలల తరబడి గుర్తించలేని ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని, పాలకులను ఏమనాలి? ఏం చేయాలి?