విశాఖ సీపీ పోస్టు కోసం సీఎంవో అధికారి లాబీయింగ్..
posted on Sep 23, 2021 @ 12:39PM
విశాఖపట్నం... ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పట్టణం. జగన్ రెడ్డి సర్కార్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన పట్టణం. ఏపీలో ప్రస్తుతం విశాఖ కార్పొరేషన్ కమిషనర్, సీపీ పోస్టులే కీలకం. పోలీస్ శాఖలో డీజీపీ తర్వాత విశాఖ కమిషనర్ పోస్టే మోస్ట్ పవర్ ఫుల్. అందుకే పోలీసు అధికారులు విశాఖ సీపీ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తుంటారు.
విశాఖ పోలీస్ కమిషనర్ గా ప్రస్తుతం మనీష్ కుమార్ సిన్హా ఉన్నారు. 2020, ఆగస్టు 11న ఆయన విశాఖ సీపీగా బాధ్యతలు చేపట్టారు. అయితే మనీష్ కుమార్ సిన్హాను తెలంగాణ కేడర్ కు అలాట్ చేసింది కేంద్రం. డీవోపీటీ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం ఆయన్ను రిలీవ్ చేసింది. దీంతో విశాఖ సీపీ పోస్టు కోసం పలువురు ఐపీఎస్ లు పోటీ పడుతున్నారు. సీఎంవోలో కీలకంగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్.. తన సతీమణి కోసం లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రవీణ్ ప్రకాశ్ భార్య ఏపీ కేడర్ కు చెందిన ఐపీఎస్ అయినప్పటికీ.. ఆమె ప్రస్తుతం కేంద్ర సర్వీసులో డిప్యూటేషన్ పై పని చేస్తున్నారు.
ఏపీలో హాట్ సీటుగా మారిన విశాఖ సీపీ పోస్టు కోసం ప్రవీణ్ ప్రకాష్ చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది. సీఎంవోలో ప్రస్తుతం ప్రవీణ్ ప్రకాష్ దే హవా సాగుతుందన్న ప్రచారం ఎప్పటినుంచో
ఉంది. సీఎం జగన్ కు ప్రవీణ్ ప్రకాష్ ఎంత చెబితే అంత అన్న చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. దీంతో తన భార్యను విశాఖ సీపీగా నియమించేందుకు సీఎం దగ్గర ప్రవీణ్ ప్రకాష్ ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. జగన్ రెడ్డి కూడా ఓకే అనడంతో కేంద్ర సర్వీసుల నుంచి ఆమె రిలీవ్ అయ్యేలా చర్యలు ప్రారంభించారని చెబుతున్నారు.
విశాఖను కేపిటల్ గా ప్రకటించిన జగన్ ప్రభుత్వం.. ఏదో ఒక సమయంలో రాజధానిని షిప్ట్ చేయాలని భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీపీగా తమకు నమ్మిన బంటుగా ఉంటే అదికారి ఉండాలనే ఆలోచనలో ఉందంటున్నారు. ఇందులో భాగంగానే సీఎంవోలో చక్రం తిప్పుతారని, సీఎం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రవీణ్ ప్రకాశ్ సతీమణి అయితే బెటరన్న యోచనలో వైసీపీ నేతలు ఉన్నారని అంటున్నారు. దీంతో విశాఖ సీపీగా ఆమె నియామకం త్వరలో ఖరారు కావడం ఖాయమని అంటున్నారు.