డెకాయిట్ల అడ్డా టీఆర్ఎస్! రేవంత్ రెడ్డికి అఖిలపక్షం సపోర్ట్..
posted on Sep 22, 2021 @ 3:49PM
తెలంగాణ ప్రదేశ్ కమిటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడంపై విపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలే ఆందోళనలు చేయడంపై విపక్ష నేతలు మండిపడ్డారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ఇంటిపై దాడిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. అసలైన డెకాయిట్లు అందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయకుల ఇళ్లపై దాడులు చేయడం నీచ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. రేవంత్ ఇంటిపై దాడిని అఖిలపక్షం ఖండిస్తోందని చెప్పారు. ఇంకోసారి ఇలాంటి దాడులకు తెగబడితే సంగతి చూస్తామని హెచ్చరించారు. దమ్ముంటే డైరెక్ట్ గా రావాలని సవాల్ విసిరారు. ఇలాంటి దాడులు చేసే వారిని రాజకీయ పార్టీలు ప్రోత్సహించకూడదని చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలను.. రేవంత్ అనుచరులు తరిమేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజీ ఉన్నప్పటికీ వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని పోలీసు అధికారులను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.