ఒకే కి'లేడి'.. ఐదుగురిని హనీట్రాప్.. రక్షణశాఖ సీక్రెట్స్ లీక్..
posted on Sep 23, 2021 @ 11:33AM
ఆమె మహా ఖతర్నాక్ కిలేడి. హస్కీగా మాట్లాడుతుంది. మాటలతో టెంప్ట్ చేస్తుంది. చూపులతో కవ్విస్తుంది. ఎదురుగా లేకున్నా.. నేరుగా కలవకున్నా.. వీడియో కాల్స్, వాట్సాప్ చాట్స్‌తో సర్వం దోచేస్తుంది. శత్రు దేశపు ముష్కరులు పన్నిన హనీట్రాప్ ఆయుధం ఆమె. ఇలా ఓ లేడీ.. ఏకంగా ఐదురుగు డీఆర్‌డీవో సిబ్బందిని ఏక కాలంలో ట్రాప్ చేసింది. వారి నుంచి డీఆర్‌డీవో రహస్య సమాచారాన్ని చాకచక్యంగా కాజేసింది. ఆమె ట్రాప్‌లో పడి సొల్లు కార్చిన సిబ్బంది.. దేశ రహస్యాలను ఆ వగలాడికి చేరవేశారు. ఇలా ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా చాందీపూర్‌లో డీఆర్‌డీవో రహస్యాల లీకు ఘటనలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఓ మహిళ ఫోన్, చాటింగ్ ద్వారా ఐదుగురు డీఆర్‌డీవో సిబ్బందికి దగ్గరైంది. ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో పరిచయం చేసుకొని వీడియోకాల్, ఫేస్‌బుక్, వాట్సప్‌లో మాట్లాడింది. వీరిలో కొంతమందిని పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించింది. బ్రిటన్‌లో ఉంటున్నానని ఒకరితో, రాజస్థాన్‌లో అని మరొకరితో చెప్పింది. తాను కూడా రక్షణశాఖలో పని చేస్తున్నానని ఒకరితో, నర్సుగా చేస్తున్నానని ఇంకొకరితో.. ఇలా రకరకాల డ్రామాలు ఆడి.. ఆ ఐదుగురిని హనీట్రాప్ చేసినట్టు విచారణలో తేలింది.
ఆ ఐదుగురిలో ఒకరికి దుబాయ్ నుంచి రూ.35 వేలు పంపినట్లు దర్యాప్తులో తెలిసింది. యూకేకు చెందిన ఫోన్ నెంబర్‌తో ఆ మహిళ మాట్లాడింది. ఆ ఫోన్ నెంబర్ ఆధారంతో ఆమె వివరాలు తెలుసుకునేందుకు ఎన్‌ఐఏ సాయం కోరారు. యూకేకు చెందిన అధికారులతో మాట్లాడి మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అరెస్టు చేసిన ఐదుగురిని వేర్వేరుగా విచారిస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలు సీజ్ చేశారు. 18 నెలలుగా ఆమె డీఆర్‌డీవో నుంచి సమాచారం సేకరించినట్టు దర్యాప్తులో తేలింది.
పోలీస్ కస్టడీలో ఉన్న ఆ ఐదుగురు డీఆర్‌డీవో సిబ్బందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, కటక్ క్రైం బ్రాంచ్ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఐదుగురికి ఏడు రోజుల కస్టడీ ముగిశాక.. వీరిని కోర్టులో హాజరుపరిచి మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని ఏడీజీ తెలిపారు.