ఆర్టీసీని అమ్మేందుకు ముహుర్తం ఫిక్స్? కేసీఆర్ భారీ స్కెచ్?
posted on Sep 22, 2021 @ 7:55PM
ఆర్టీసీ ఎండీగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్‌ను నియమించారు సీఎం కేసీఆర్. అబ్బా.. సూపర్ సెలెక్షన్. ఆర్టీసీ ఇక గాడిన పడినట్టే అంటూ టాక్ వచ్చింది. ఆర్టీసీ బాగు కోసమే కేసీఆర్ సజ్జనార్‌ను సెలెక్ట్ చేసుకున్నారని అనుకున్నారంతా. ఆ తర్వాత ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డిని నియమించారు. ఇక ఆర్టీసీని పూర్తి స్థాయిలో కేసీఆర్ సెట్ చేస్తున్నారని భావించారు. కట్ చేస్తే.. కొద్ది రోజులకే సీఎం కేసీఆర్ నోటి నుంచి సంచలన కామెంట్లు వచ్చాయి. బెదిరించడానికో, భయపెట్టడానికో లేక నిజమో కానీ.. ఆర్టీసీని అమ్మేస్తాం.. ప్రైవేటుపరం చేస్తామంటూ.. ముఖ్యమంత్రి మాట్లాడటం అనుమానాస్పదంగా మారుతోంది. నిజమేనా? ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేస్తారా? అంటూ చర్చ, రచ్చ జరుగుతోంది.
నాలుగు నెలల్లో ఆర్టీసీ గాడిన పడకుంటే ప్రైవేటుపరం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఆర్టీసీ సమీక్షలో.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్. ఎండీ సజ్జనార్‌లకు ఈ మేరకు కేసీఆర్ సుస్పష్టంగా చెప్పారు. ఈ విషయం మరెవరో చెప్పడం కాదు.. స్వయంగా ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డినే వెల్లడించారు. ఆర్టీసీని రక్షించడానికి ప్రభుత్వం అనేకసార్లు ఆదుకుందని, ఈ ఏడాది సైతం 3వేల కోట్లు కోటాయించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.
అదేంటి.. ఇటీవలే కదా ఆర్టీసీ కార్గో లాభాల్లో నడుస్తోందని వేడుకలు చేసుకున్నారు. అంతలోనే నష్టాలు, కష్టాలు ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ బాగా సీరియస్‌గా ఉన్నారు. వేల మంది కార్మికులు నెలల తరబడి ఉద్యమం చేసినా.. కరగకుండా, తగ్గకుండా.. బెట్టు చేసి.. కార్మికులను తన దారికి తీసుకొచ్చారు. తానేదో అద్భుతం చేసి చూపిస్తానని ప్రగల్బాలు పలికి.. ఆర్టీసీని సవాల్‌గా తీసుకున్నారు. ఆర్టీసీ తరఫున కార్గో బిజినెస్ స్టార్ట్ చేసి.. సంచలనం సృష్టించారు. నిజంగా ఆర్టీసీ కార్గో ఫుల్ సక్సెస్. ప్రస్తుతం ఆర్టీసీకి వస్తున్న రాబడి అంతా కార్గో నుంచే. అయితే, కార్గో ఒక్కటి నడిస్తే చాలా? ప్రయాణీకుల రవాణా తీవ్ర నష్టాల్లో ఉంది. కరోనా కాటు ఆర్టీసీకి గుదిబండగా మారింది. అందుకే, ఆర్టీసీని గాడిని పెట్టేందుకు చివరి ప్రయత్నంగా సజ్జనార్‌ను ఎండీగా తీసుకొచ్చారు కేసీఆర్. ఛైర్మన్ పదవినీ భర్తీ చేసి.. చిత్తశుద్ధి చాటుకున్నారు. అయితే, వారిద్దరికీ డెడ్‌లైన్ పెట్టారు ముఖ్యమంత్రి. నాలుగంటే నాలుగే నెలలు.. ఈ లోగా ఆర్టీసీ లాభాల బాట పడితే ఓకే.. లేదంటే.. అమ్ముడే... అంటున్నారు కేసీఆర్.
వచ్చిరాగానే ఎండీ సజ్జనార్ టికెట్ల రేట్లు పెంచే ఫైల్ రెడీ చేశారు. త్వరలోనే బస్ టికెట్ ధరలు పెరగడం ఖాయం. ప్రయాణికులకు ధరాఘాతం తప్పకపోవచ్చు. ఎంత పెంచినా, ఎంత చేసినా.. ఆర్టీసీ లాభాల బాట పట్టడం అంత ఈజీ కాకపోవచ్చు. ఆ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసు. అయినా, జస్ట్ నాలుగంటే నాలుగు నెలలు మాత్రమే టైమ్ ఇచ్చి.. ఆ తర్వాత ఆర్టీసీ ఇక బాగు పడదనే ముద్ర వేసేసి.. అడ్డంగా అమ్ముకోవడం ఖాయమంటూ మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. ఆర్టీసీకి జిల్లాలు, మండలాల వారీగా విలువైన ప్రదేశాల్లో, అత్యంత ఖరీదైన భూములు ఉన్నాయి. గతంలోనే ఆ స్థలాలను కొట్టేసే కుట్ర జరగ్గా.. విపక్షాలు గట్టిగా పోరాడటంతో అది కుదరలేదు. ఆర్టీసీ స్థలాలు లీజుకివ్వడం, షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టడం ఇలా.. రకరకాల పేర్లతో ఆ భూములు కాజేసే ప్రయత్నం చేశారంటారు. అప్పుడు విఫలమైనా.. ఇప్పుడు ఎలాగైనా ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ఎత్తుగడలో భాగంగానే.. ముందుగా సమర్థులైన అధికారిని రంగంలోకి దింపి.. అయినా ఉపయోగం లేదని తేల్చేసి.. ఆ తర్వాత తమకు నచ్చినట్టు చేసే మాస్టర్‌ప్లానే ఇదంతా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి, నిజమేంటో కాలమే నిర్ణయిస్తుంది.