టీటీడీ జంబో బోర్డుపై జగన్ సర్కారుకు బిగ్ షాక్.. హైకోర్టు స్టే...
posted on Sep 22, 2021 @ 12:12PM
విచిత్రం. ఆశ్చర్యం. మునుపెన్నడూ లేనట్టు ఏకంగా 80 మందికి పైగా టీటీడీ జంబో బోర్డు నియామకం. అందులో ప్రత్యేక ఆహ్వానితులు 50 మందికి పైనే. ఇదేమి చోద్యం అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. ఏకంగా సెంచరీ కొడితే సరిపోయేదిగా అంటూ సెటైర్లు. కొవిడ్ కాలంలో సర్వ దర్శనమే గగనమవుతుంటే.. ఏకంగా ఇంత మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించి ఏం చేస్తారని ప్రశ్నల వర్షం. పారిశ్రామికవేత్తలను, రాజకీయ నేతలను అడ్డదారిలో బోర్డులో జొప్పించారనే ఆరోపణలు వినిపించాయి. ఏకంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరును వాడేసుకొని, ఆయన రికమెండ్ చేశారంటూ ఓ సభ్యుడిని టీటీడీ బోర్డులో చేర్చడం.. ఆ విషయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే నేరుగా సీఎం జగన్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఇలా తీవ్ర వివాదాస్పదమైన టీటీడీ జంబో బోర్డు నియామకంపై తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీటీడీలో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యులతో పాటు భారీగా ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జీవో జారీ చేసింది. పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా బోర్డు సభ్యులను నియమించారని.. దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్లు అందులో పేర్కొన్నారు. టీటీడీ స్వతంత్రతను దెబ్బతీసేలా జీవోలు ఉన్నాయని పిటిషనర్ తరఫున న్యాయవాదులు వాదించారు. నిబంధనలనకు అనుగుణంగానే నియమకాలను చేపట్టినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం, టీటీడీకి నోటీసులు ఇచ్చింది.