మళ్ళీ కేసీఆర్ ఆకర్ష్ అస్త్రం? ఈసారి కారెక్కేది ఎవరంటే..?
posted on Sep 23, 2021 @ 12:03PM
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మరో మారు ఆకర్షణ అస్త్రాన్ని సంధించేందుకు సిద్దమయ్యారా? ఈ సారి ఆయన పెద్ద చేపకే గాలం వేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక క్రతువు మొదలైన తర్వాత ముఖ్యమంత్రి ఇప్పటికే ఇతర పార్టీలలో ఉన్న మోత్కుపల్లి నరసింహులు వంటి మోతుబరి దళిత నాయకులను తమ వైపుకు తిప్పుకున్నారు. అదే క్రమమలో ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్కను కారేక్కించేందుకు అస్త్రాలను సిద్దం చేసుకున్నారని అంటున్నారు. భట్టిని పార్టీలోకి రప్పించుకోవడం ద్వారా కాంగ్రెస్ ను దెబ్బతీయడంతో పాటుగా పార్టీలోని దళిత దొరలకు చెక్ పెట్టినల్టు అవుతుందని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం.
నిజానికి, భట్టి ఎంట్రీకి లైన్ క్లియర్ అయిందని, ఇక ముహూర్తమే మిగిలిందనే వార్తలు కూడా వినవస్తున్నాయి. అలాగే, భట్టిని బుట్టలో వేసుకునే ప్రయత్నం కూడా హుజూరాబాద్ రాజకీయం కంటే ముందే మొదలైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో, సరదాగానే కావచ్చును కానీ, భట్టికి స్వాగతం పలికిన విషయాన్ని పరిశీలకులు ఈసందర్భంగా గుర్తు చేస్తున్నారు. భట్టి వైపునుంచి కూడా సానుకూల సంకేతాలే వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యమంతి కేసీఆర్ నిర్వహించిన దళిత బందు సమీక్షా సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హాజరు జారాదని ముందుగా నిర్ణయించినా, ఆ తర్వాత భట్టి వత్తిడి కారణంగానే నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం.
అయితే, దళిత బంధు అమలుకు ఎంపిక చేసిన నియోజక వర్గాల్లో, భట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం కూడా ఉన్నందున ఆయన సమావేశానికి హాజరు కావాలని పట్టుపట్టారని అంటున్నారు. అలాగే, అదే సమయంలో దలిత బందును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే కాంగ్రెస్ డిమాండ్’ను ప్రభుత్వం ముందు ఉంచే ఉద్దేశంతోనూ కాంగ్రెస్ నిర్ణయం మార్చుకుందని కాంగ్రెస్ నాయకులు సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది, నిజం కాదని,అనంతర పరిణామలు స్పష్తం చేస్తున్నాయి. అప్పటి నుంచే భట్టి విషయంలో అనుమానాలు వినిపిస్తున్నా ఇటీవల అయన స్వరంలో కూడా మార్పు స్పష్టమవుతోందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం భట్టి విక్రమార్క తమ నియోజక పరిధిలో దలిత బంధు సన్నాహక , ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈసందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నారా అన్నసందేహం వచ్చే విధంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్గాల నుంచే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకు తగ్గట్టుగానే కొద్ది రోజుల క్రితం, ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండవ, సీతంపేట, నాగులవంచ తదితర గ్రామాల్లోని దళిత కాలనీలను సందర్శించిన సమయంలో, భట్టి అర్హులైన ప్రతిఒక్కరికీ దళితబంధు పథకం వర్తిస్తుందని అన్నారు. అంతే కాదు, దళిత బంధుతో ఎస్సీల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయన్నారు. అలాగే, చింతకాని మండలంలోని దళిత కాలనీల్లో నెలకొ న్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించానని, త్వరలో పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు తాము కోరుకున్న యూనిట్లు అందుతాయని తెలిపారు. ప్రభుత్వం త్వరలో పలు విభాగాల్లో గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తుందని, ప్రభుత్వం తరపున అధికార పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రుల తరహాలో హమీ ఇచ్చారు. ఓ వంక కాంగ్రెస్ పార్టీ , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దళిత బంధు ఓ బూటకమని, ముఖ్యమంత్రి దళితులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తుంటే, సీఎల్పీ నాయకుడు,అందుకు విరుద్ధంగా, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం దేనికి సంకేతమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే కేసీఆర్ ఏదో కీలక పదవిని ఆఫర్ చేయడం వల్లనే భట్టి అటు మొగ్గు చుపుతున్నట్లుగా ఉందని అంటున్నారు. అయితే అది ఉప ముఖ్యమంత్రి పదవా మరొకటా అన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. నిజంగా భట్టి విక్రమార్క కూడా చేయి వదిలి కారేక్కితే తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరుతుంది. గత ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. అందులో, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికై రాజీనామా చేశారు. మిగిలిన 18లో ఇప్పటికే 12 మంది పార్టీఫిరాయించారు. భట్టి కూడా అదే బాట పడితే... గెలిచినా 19కి గాను పంచ పాండవుల్లా ఐదుగురు మాత్రమే కాంగ్రస్ పార్టీలో మిగులుతారు.