సీఎం కుర్చీకి ఎసరు పెట్టింది ఎవరు? అసలేం జరిగింది?
హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో, చివరకు ఏమౌతుందో, ఏమో కానీ, ఎన్నికల ప్రచారం మాత్రం ప్రవాహంలా, వేడిగా వాడిగా సాగుతూనే ఉంది. ఓ వంక అధికార తెరాస పార్టీ అభ్యర్ధి బాధ్యతలు మోస్తున్న మంత్రి హరీష్ రావు, మరో వంక బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ఉదృతంగా, ఆ ఇద్దరి మధ్యనే పోటీ అన్నట్లుగా ప్రచారం సాగిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు విసురుకుంటున్నారు. గతాన్ని తవ్విపోసుకుంటున్నారు. అదేలా ఉన్నప్పటికీ, సుదీర్ఘంగా సాగుతున్న ప్రచారపర్వంలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకో విషయం చర్చకు వస్తోంది. రచ్చ చేస్తోంది. ముఖ్యంగా పాత మిత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, తెరాస పార్టీ లోగుట్టును, కల్వకుట్ల ఇంటి కుట్రలను విప్పి చెపుతున్నాయి. ఇప్పటికే, కలిసి కన్నీళ్లు పెట్టుకున్న ఉదంతం మొదలు ప్రగతి భవన్’ సాక్షిగా ఇద్దరికీ జరిగిన జంట అవమానాల వరకు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అదే క్రమంలో ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ మీద కన్నేసింది, ఎవరు? ఎవరు కేసీఆర్ కుర్చీ దించేందుకు కుట్రలు ఎవరు చేశారు? అనే విషయంలో ఆసక్తి కర చర్చ జరుగుతోంది. తీగలాగితే డొంకంతా కదిలించి అన్నట్లుగా, పూటకో కుల సంఘం సమావేశంలో హామీలు కురిపిస్తున్న హరీష్ రావు, తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే, దూడ మేతకు అన్నట్లుగా, ఈటల రాజేందర్’ను మంత్రి వర్గం ఎందుకు బర్తరాఫ్ చేశారంటే, ముఖ్యమంత్రి కుర్చీ మీద ఈటల కన్నేశారని, అందుకే ముఖ్యమంత్రి ఆయన్ని మంత్రి వర్గం నుంచి తోలిగించారని చెప్పు కొచ్చారు. నిజానికి, పేదల భూములు కాజేశారనే కాణంగా ఈటలను బర్తరాఫ్ చేశారన్నది నిజం కాదని తెలిపోవండతో, హరీష్ రావు కొత్తగా కుట్ర కోణాన్ని పైకి తెచ్చారు.
అయితే, ఈటల ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెట్టింది నిజమే కానీ, ఆ కుట్ర చేసింది నేను కాదు, ఆర్థిక మంత్రి హరీష్ రావేనని, ఎదురుబాణం వేశారు.అంతే, కాదు,” ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెడితే, కేసీఆర్ కుమార్తె కవిత, కాదంటే కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు పెట్టాలి, అంతే కాని బడుగు బిడ్డను నేనెందుకు పెడతాను” అంటూ, కల్వకుట్ల ఫామిలీలో కుట్రలు జరుగుతున్నాయని, ఈటల చెప్పకనే చెప్పారు. నిజానికి, కేటీఆర్ అమెరికా ఫ్లైట్ దిగినప్పటి నుంచి కూడా కేటీఆర్, హరీష్ రావు మధ్య ఏవో పొరపొచ్చాలు ఉన్నాయని, ఇద్దరి మధ్య సెకండ్ పొజిషన్ కోసం యుద్ధం లాంటిది జరుగుతోందని అప్పుడప్పుడు కథలు, కథనాలు వస్తూనే ఉన్నాయి. అలాగే, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా పార్టీ 2018లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, కల్వకుట్ల ఫామిలీలో ఇంటర్నల్ వార్’ గురించి అనేక రూపాల్లో చర్చ జరుగుతూనే ఉంది. కథలు, కధనాలు వస్తూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే దెబ్బకు రెండు పెట్టలు అన్న విధంగా, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా, ముఖ్యమంత్రి కుర్చీకి పోటీపడే సత్తా, సామర్ధ్యం ఉన్న హరీష్ రావు, ఈటల రాజేందర్ ఇద్దరిపైన ఒకేసారి వేటు వేసేందుకు, ఇద్దరి అడ్డు ఒకేసారి తొలిగించుకునే వ్యూహంలో భాగంగానే, కేసీఆర్ హుజూరాబాద్’ స్కెచ్ సిద్దం చేశారని పార్టీ వర్గాల కథనంగా ఉంది. ఈ నేపధ్యంలో హుజూరాబాద్’లో తెరాస గెలిచినా ఓడినా హరీష్ రావు రాజకీయ భవిస్త్యత్’ ప్రశ్నార్ధకమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, గెలిస్తే, హరీష్ రావుకు కొంత ఊరట చిక్కుతుంది .అందుకే కావచ్చు హరీష్ రావు, హుజూరాబాద్’కు మకాం మార్చేశారు. సర్వ శక్తులు ఒడ్డి తెరాస అభ్యర్ధి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఎంత చేసినా దుబ్బాక దెబ్బ రిపీట్ అవుతుందనే అంటున్నారు.