జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. టీటీడీ పాలకమండలి జీవో సస్పెండ్
posted on Sep 22, 2021 @ 12:12PM
ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగలింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి బోర్డు నియామకంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టిటిడికి ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవో 569 ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇటీవలే కొత్త పాలకమండలిని నియమించింది వైసీపీ ప్రభుత్వం. గతానికి భిన్నంగా 81 మందితో జంబో బోర్డును ఏర్పాటు చేసింది.ఇందులో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చింది. గతంలో టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులు లేరు.
టీటీడీ జంబో బోర్డుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. టీడీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ పిల్ వేశారు. పాలకమండలిలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం చట్ట విరుద్ధమని, దీని వల్ల సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బందని చెప్పారు. హిందూ ధర్మాదాయ, దేవాదాయ చట్టానికి ఈ నియామకాలు విరుద్ధమని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పాలకమండలిపై ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను కొట్టివేయాలన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. టిటిడికి ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవో 569 ను ధర్మాసనం సస్పెండ్ చేసింది.
గతంలో టీటీడీ బోర్డు కేవలం 18 మంది సభ్యులకే పరిమితం చేశారు. వైసీపీ వచ్చీ రాగానే దీనిని విస్తరించే కార్యక్రమం చేపట్టింది. 2019లో ఏర్పాటైన పాలకమండలిలో సభ్యుల సంఖ్యను 18 నుంచీ 37కు పెంచేశారు. ఇప్పుడు ఏకంగా 81కి చేశారు. ఇందులో సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులను పక్కనపెడితే... 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల కథ మరీ ‘ప్రత్యేకం’. వీరికి ఎలాంటి నిర్ణయాధికారం ఉండదు. ఓటింగ్ హక్కు లేదు. కనీసం పాలకమండలి సమావేశంలో కూడా వీళ్లు పాల్గొనలేరు. మరి వీరేం చేస్తారంటే... ఏమీ చేయరు. కొండపై ప్రత్యేక మర్యాదలను మాత్రం అనుభవిస్తారు. పాలక మండలి సభ్యులకు వర్తించే ‘ప్రొటోకాల్’ మొత్తం ప్రత్యేక ఆహ్వానితులకూ వర్తిస్తుంది. అంటే... వారితో సమానంగా తగిన మర్యాదలతో శ్రీవారిని దర్శించుకోవచ్చు. దర్శనాలకు సిఫారసులూ చేయవచ్చు.