అమరావతి రైతుల పాదయాత్రకు టీడీపీ మద్దతు
posted on Nov 1, 2021 @ 11:00AM
రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. మహా పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని అండగా నిలవాలని ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రైతుల పాదయాత్ర విజయవంతం కావాలని మనన్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. రైతుల మహా పాదయాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. 685 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు అ. రాజధాని నిర్వీర్యంతో రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లిందని అన్నారు. అమరావతి సంపదను ఉపయోగించుకుంటే ఎలాంటి అప్పులు తేవాల్సిన అవసరం లేదన్నారు. రూ.2 లక్షల కోట్ల సంపదను బూడిదపాలు చేశారని మండిపడ్డారు. పరాయి రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని హేళనగా మాట్లాడుతుంటే బాధేస్తోందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని ఉంటే వారి విమర్శలకు తావుండేది కాదని అచ్చెన్న పేర్కొన్నారు.
రాష్ట్ర రాజధాని కోసం త్యాగం, భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తూ... అణిచివేత, అవమానాలు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా 685 రోజులుగా జై అమరావతి అంటూ నినదిస్తున్న రైతులకు, మహిళలకు, యువతకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో ప్రజారాజధాని అమరావతి పరిరక్షణకు తమరు తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఆ శ్రీవారి ఆశీస్సులతో పాలకుల ఆలోచనధోరణిలో మార్పు వచ్చి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని లోకేష్ ఆకాంక్షించారు.
అమరావతి మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు మాజీకేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో రేణుకా చౌదరికి స్వాగతం పలికేందుకు, హారతి పట్టేందుకు మూలపాడులో కాంగ్రేస్ మహిళా నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. కాగా... రోడ్డుపై ఉండొద్దంటూ, హారతి, స్వాగతం చేయడానికి వీల్లేదంటు పోలీసులు ఆంక్షలు విధించారు. ఇబ్రహీంపట్నం రింగ్‌లో కూడా కాంగ్రెస్ జెండాలను పోలీసులు తొలగించారు. రోడ్డుపైకి వస్తే అరెస్ట్ చేస్తామంటూ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారు.