ఏపీ ఫార్మేషన్ డే.. జగన్‌కు పాదయాత్ర సెగ.. పవన్‌కు అచ్చెన్న సపోర్ట్.. టాప్‌న్యూస్ @1pm
posted on Nov 1, 2021 @ 1:07PM
1. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం.. ఏపీ ఫార్మేషన్ డే సందర్భంగా విజయవాడలో వివిధ రంగాల ప్రముఖులకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్‌ను అందజేశారు సీఎం జగన్.
2. ఏపీలో పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీ పొట్టిశ్రీరాములు గారి ఆత్మార్పణ ఫలితంగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. అదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని’ వెంకయ్య తెలిపారు.
3. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి రైతులు మహా పాదయాత్ర చేపట్టారు. తుళ్లూరు శివాలయం నుంచి రైతుల మహా పాదయాత్రను 9 మంది ముత్తైదువలు ప్రారంభించారు. పాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.
4. అమరావతి రైతుల మహా పాదయాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కాలినడకన చేరుకోనున్నారు. శాంతి భద్రతలకు ఎలాండి భంగం కలగకుండా పాదయాత్ర ఉంటుందని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి జగన్ ప్రభుత్వం భయపడుతోందని, అందుకే పాదయాత్రకు అనుమతి నిరాకరించిందన్నారు. ఇది రైతుల ఉద్యమం కాదని, ప్రజా ఉద్యమం అని అంటున్నారు.
5. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్‌ను స్వాగతిస్తున్నామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. అసెంబ్లీలో చేసిన తీర్మానంపై తమకు నమ్మకం లేదని.. పవన్ కల్యాణ్ చెప్పినట్టు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు లోక్‌సభలో బల్ల గుద్ది మాట్లాడారన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వచ్చి అక్కడ ఒక మాట ఇక్కడ ఒకమాట మాట్లాడుతున్నారని వైసీపీపై మండిపడ్డారు.
6. వైఎస్ షర్మిల చేస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర 13వ రోజుకు చేరింది. ఉదయం 9.30 గంటలకు దేవరకొండ నియోజక వర్గం మాల్ టౌన్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. చింతపల్లి మండలంలోని 10 గ్రామాల ప్రజలను షర్మిల కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు గొల్లపల్లి గ్రామ ప్రజలతో మాట ముచ్చట నిర్వహించనున్నారు.
7. రికార్డ్ స్థాయికి ఆర్టీసీ ఆదాయం పెరిగిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఉద్యోగుల కోసం యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. సమిష్టిగా కృషి చేసి.. ఆదాయాన్ని పెంచడంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చుతామని తెలిపారు.
8. యంగ్ హీరో నాగశౌర్యకు చెందిన ఇంటిలో పెద్ద ఎత్తున పేకాట ఆడుతుండగా.. హైదరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి 20 మంది ప్రముఖులను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో హీరో నాగశౌర్య బాబాయ్ బుజ్జి పేరు బయటకు వచ్చింది. జూదం నిర్వహిస్తున్న గుత్తా సుమన్ కుమార్‌తో పాటు మరి కొందరిని పోలీసులు విచారిస్తున్నారు.
9. పెట్రోల్ రేట్స్‌తో టీమిండియా స్కోర్‌ను కంపేర్ చేస్తూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇటు పెట్రోల్ రేట్స్ పెరిగిపోతున్నాయనే మంట ఓవైపు.. అటు వరల్డ్ కప్‌లో వరుసగా, చిత్తు చిత్తుగా ఓడిపొతున్నారనే కోపం ఇంకోవైపు. ఆ రెండు కలగలిసి.. ఇదే ఛాన్స్ అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. కాసులు కుమ్మరించే ఐపీఎల్ టోర్నీల్లో రాణిస్తూ.. ఐసీసీ కప్‌లో మాత్రం హ్యాండ్సప్ అంటున్నారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
10. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక క్రస్ట్ గేట్ ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో : 58,035 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం : 589.90 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి సామర్థ్యం : 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీరు నిండుగా ఉంది.