జగన్‌కు ఝలక్ ఇచ్చేందుకు ఇదే మంచి ఛాన్స్.. చంద్రబాబు అలర్ట్..
posted on Nov 1, 2021 @ 4:52PM
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. సీఎం జగన్ అరాచక పాలనకు తగిన గుణపాఠం చెప్పేందుకు ఇదే మంచి అవకాశమని టీడీపీ భావిస్తోంది. అందుకే, స్థానిక సంగ్రామంలో శాయశక్తులా పోరాడాలని పార్టీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు. ఓటర్లంతా ఏకమై వైసీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పడుతుందని అన్నారు. వైసీపీని ఓడిస్తేనే.. ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ ఉంటుందన్నారు చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్ని, రైతుల్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రూ.4 వేల కోట్ల బియ్యం కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
అప్పుల కోసం గవర్నర్ సార్వభౌమాధికారాలనూ తాకట్టుపెట్టారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, సెస్ తగ్గించే వరకు పోరాటం చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. యథావిధిగా ఎయిడెడ్ స్కూళ్ల వ్యవస్థ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వ డొల్లతనం బయటపడిందన్నారు. గంజాయిపై ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా టీడీపీ పోరాడుతుందని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.