ఓటుకు నోట్లు.. దొంగ ఓటర్లు! ఉప ఎన్నికల్లో అధికార పార్టీల బరి తెగింపు..
ఉప ఎన్నికలు జరుగుతోంది ఒక్క ఏపీ, తెలంగాణలో మాత్రమే కాదు. ఒక్క బద్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాలలో మాత్రమే కూడా కాదు. దేశం మొత్తంలో మరో 27 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలకు కూడా ఇదే రోజున ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో, ఎన్నికల జరుగతున్న తీరుకు, ఇతర రాష్ట్రాలలో ఎన్నికల తీరుకు పొంతన కుదరడం లేదు.
తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి రాను రాను రాజు గుర్రం గాడిద అయ్యింది అన్నట్లుగా ప్రజాస్వామ్య ప్రమాణాలు పతనమవుతున్నాయి. హుజూరాబాద్ లో సుమారు మూడు నెలలకు పైగా సాగిన ఎన్నికల జాతరలో ఇటు పార్టీలు, అటు ప్రభుత్వం కూడా వందల, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. రెండున్నర సంవత్సరాల పదవీ కాలం కోసం ప్రధాన పార్టీలు రెండూ రెండున్నర మూడు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం చివరకు ఓటుకు ఆరు నుంచి పదివేల రూపాయల వరకు ఓటర్లకు ఇవ్వడం ... డబ్బులు ముట్టని ఓటర్లు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయడం, ఇవన్నీ,తెలుగు రాష్ట్రాలలో దిగజారుతున్న ప్రజాస్వామ్య విలువలకు సంకేతంగా నిలుస్తున్నాయి. పతనమవుతున్న ప్రజాస్వామ్య విలువలకు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక సజీవ తార్కాణంగా నిలుస్తుందంటున్నారు.
ఇంతకాలం పోలింగ్ కు ముందు ఓటర్లకు డబ్భులు పంచడం ఒక సంప్రదాయంగా మాత్రమే ఉంది. కానీ, ఇప్పుడు, ఓటర్లు రోడ్డు మీదకు వచ్చి ఓటుకు రేటు డిమాండ్ చేస్తున్నారు. అంటే అది హక్కుగా భావించే స్థితికి పరిస్థితి దిగజారింది. ముందు ముందు పండిన పంటకు గిట్టుబాటు ధర లేదా కనీస మద్దతు ధర లాగా ఓటుకు గిట్టుబాటు, కనీస మద్దతు ధరలను డిమాండ్ చేసే రోజులు వచ్చినా రావచ్చును. ఒక్క రెండు రోజుల్లో తెరాస, బీజేపీ పార్టీల అభ్యర్ధులు 250 కోట్ల రూపాయలు ఓటర్లకు పంచారని వస్తున్న వార్తలు నిజమే అయితే, ప్రజాస్వామ్యం అనే మాటకు కొత్త అర్థం వెతుక్కోవలసివస్తుంది.
ఇక్కడ ఇలా ఉంటే సోదర తెలుగు రాష్ట్రం ఏపీలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లా బద్వేల్ నియోజక వర్గానికి జరుగతున్న ఉప ఎన్నికలో, ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ పోటీలో లేకున్నా, అధికార వైసీపీ, అన్ని రకాల అక్రమాలు సాగిస్తూనే ఉంది. మరీ హుజూరాబాద్ స్థాయిలో కాకపోయినా అక్కడా వైసీపీ ఓటుకు రెండు వేలరూపాల వంతున డబ్బులు పంచుతోంది. తాగినోడికి తాగినంత మందు పోస్తోంది. అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యం, ఉప ఎన్నికను అభాసుపాలు చేశాయి దీనితో పాటుగా, అధికార వైసీపే ఇరుగు పొరుగు నియోజక వర్గాల నుంచి జనాలను బస్సుల్లో తరలింఛి దొంగ ఓట్లు వేయించే వినూత్న ప్రయోగం చేస్తోంది.
నిజానికి వైసీపీ తిరుపతి ఉప ఎన్నికలలోనే ఈ ప్రయోగం చేసినిది. ఇప్పడు బద్వేల్ లో కొనసాగిస్తోంది. భవిష్యత్ ‘లోనూ ఇదే పంధాను అనుసరించినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాలు రెండు వినూత్న వికృతులని పరిచయం చేశాయి.