రివర్స్ పాలనకు గండి.. రేవంత్ జనజాగరణ.. పవన్ గాడిదపళ్లు తోమాడా? టాప్‌న్యూస్ @7pm
posted on Nov 1, 2021 @ 6:49PM
1. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఏకమై వైసీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు. వైసీపీని ఓడిస్తేనే ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ ఉంటుందన్నారు. జగన్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్ని, రైతుల్ని సంక్షోభంలోకి నెట్టారు. రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారు. గంజాయిపై ప్రశ్నించినవారిపై కేసులు, దాడులు చేస్తున్నారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా టీడీపీ పోరాటం చేస్తుందని చంద్రబాబు చెప్పారు.
2. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 15న జరిగే ఎన్నికలకు 3వతేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 17న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏపీలో మిగిలిపోయిన పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్ల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ఎన్నికలు ఉన్నాయి.
3. ఈ నెల 14 నుంచి 21 వరకు ఏడు రోజులు గ్రామాల్లో జన జాగరణ యాత్రలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 9న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యుల రక్షణ కోసం 2 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. చిల్లర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌కు పోటీనే కాదంటూ పరోక్షంగా షర్మిల పార్టీని విమర్శించారు. ఇతర పార్టీల నాయకత్వంలో సగం బ్రోకర్లు, సగం లోఫర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు.
4. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు అమ్ముడుపోయారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్‌కు వేసినట్టేనని వైఎస్‌ఆర్‌టీసీ అధినేత్రి షర్మిల అన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని మండిపడ్డారు. రాజన్న బిడ్డగా తెలంగాణ ప్రజలకు సేవ చేయడం తన హక్కు కాదా? అని షర్మిల ప్రశ్నించారు.
5. స్టీల్‌ప్లాంట్ విషయంలో పవన్‌కల్యాణ్ ఇన్నాళ్లూ గుడ్డిగాడిద పళ్ళు తోమాడా? అని మంత్రి అప్పలరాజు విమర్శించారు. ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న బీజేపీని ఎందుకు ఒక్క మాట అనరని ఆయన ప్రశ్నించారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న బీజేపీకి బద్వేల్, తిరుపతి ఎన్నికల్లో పవన్ ఎలా మద్దతు ఇచ్చారని అన్నారు. పవన్ విమర్శలు ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు మంత్రి అప్పలరాజు.
6. రాజధాని రైతుల పాదయాత్ర మొదటిరోజు ముగిసింది. తాడికొండ సాయిబాబా గుడి దగ్గర తొలిరోజు పాదయాత్రకు విరామిచ్చారు. తొలిరోజు 14.5 కిలోమీటర్లు మహా పాదయాత్ర కొనసాగింది. అమరావతి పోరులో భాగంగా న్యాయస్థానం టు దేవస్థానం వరకు జరిగే అమరావతి రైతుల మహా పాదయాత్ర సోమవారం నుంచి ప్రారంభించారు. వైసీపీ మినహా మిగతా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు రాజధాని రైతుల మహా పాదయాత్రకు మద్దతు తెలిపాయి.
7. రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. ఇది పాదయాత్ర కాదని.. రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం భూములను త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమమని తెలిపారు. మహా పాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలని అన్నారు. ప్రతీకారాలు, కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై లేదని విమర్శించారు చంద్రబాబు.
8. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్య సమితి– అంతర్జాతీయ ఆహార సంస్థ గుర్తించినట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ, విత్తన రంగ అభివృద్ధ్యే లక్ష్యంగా నవంబర్ 4, 5 తేదీలలో ఇటలీలోని రోమ్ నగరంలో విత్తన పరిశ్రమల సమగ్ర అభివృద్దిపై నిర్వహించే “అంతర్జాతీయ విత్తన సదస్సు” కు తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానం అందినట్టు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.
9. సర్దార్ వల్లబాయ్ పటేల్‌కు బీజేపీకి సంబంధం ఏంటి? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చరిత్రను వక్రీకరిస్తున్నారని తప్పుబట్టారు. వల్లబాయ్ పటేల్‌తోనే తెలంగాణ విమోచనం అయిందన్న కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వలనే నిజాం తలొగ్గాడని, గోబెల్స్ ప్రచారాన్ని ఆపి.. బీజేపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
10. విశాఖలో నార్కోటిక్ ట్రాఫికింగ్‌పై ఇంటర్ స్టేట్ కో-ఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ, ఒడిశా ఛత్తీస్‌గఢ్, కర్ణాటకకు చెందిన పలు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. డీఆర్ఐ, ఎక్సైజ్, నార్కోటిక్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణ, గంజాయి సాగు, నివారణ, ఇతర అంశాలపై చర్చించారు.