హుజూరాబాద్ పై ఆంధ్రా బుకీల బెట్టింగ్స్! గంటగంటకు మారుతున్న ఈక్వేషన్స్..
హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలను క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. యావద్దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న, అత్యంత ఖరీదైన ఎన్నికగా చెబుతున్న హుజూరాబాద్ ఫలితాలపై దేశవ్యాప్తంగా బెట్టింగ్ దందా నిర్వహించే ముఠాలు ముంబై, బెంగళూరు నుంచే కాక ముఖ్యంగా ఆంధ్రా నుంచి పెద్దఎత్తున రంగంలోకి దిగినట్టు విశ్వసనీయ సమాచారం. హుజూరాబాద్ కు సమీపంలోనే ఉన్న కరీంనగర్, హన్మకొండ జిల్లా కేంద్రాల్లోని పలు లాడ్జీల్లో తిష్ట వేసి బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. కొందరు సుదూరంగా ఉన్న ముఠాలైతే హుజూరాబాద్ లోని తమకు తెలిసినవారి ద్వారా సమాచారం తెలుసుకొని పందేలు కాస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి చూపే ఆంధ్రా బుకీలు... సంక్రాంతి సీజన్లో నిర్వహించే కోడిపందేల్లాగే పెద్దఎత్తున బెట్టింగ్ నిర్వహించి పెద్దఎత్తున సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ వేశారు.
స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ బెట్టింగ్ రూ. వందల కోట్ల రేంజ్ దాటి వేల కోట్లకు చేరిందంటున్నారు. కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోని లాడ్జీలు, గెస్ట్హౌజ్ లతో పాటు ప్రత్యేకంగా తీసుకున్న గదుల్లో ఉంటూ ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్లు సమాచారం. తమపై ఎలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు బుకీలంతా కలిసి ఇద్దరు, ముగ్గురు వ్యక్తులను ఓ బృందంగా ఏర్పాటు చేసుకుని బెట్టింగులు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బృందం సభ్యులు పోలీసులు, మీడియా, ఇతరులను మేనేజ్చేస్తూ వారికి ఎంతో కొంత ముట్టజెపుతూ తమ వ్యవహారం సాఫీగా నడిచేందుకు ప్రణాళికలకు రూపొందించుకుంటున్నారు.
హుజూరాబాద్ ఫలితాలపై తొలినుంచీ ఓ జాతీయ పార్టీకి ఎడ్జ్ ఉంటుందని అన్ని సర్వేలూ తేల్చి చెప్పిన క్రమంలో ఆ పార్టీ అభ్యర్థిపై పెట్టిన సొమ్ముకు ఆరింతలు ముట్టజెప్పే విధంగా బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ దాదాపు ఆరు నెలలుగా ఉత్కంఠ భరిత ప్రచారం కొనసాగగా, ఇప్పుడు అందరి దృష్టీ ఓట్లు, ఫలితాలపైనే ఉంది. ఎన్నికల్లో ఈటల రాజేందరే గెలుస్తాడని కొందరు, లేదు.. గెల్లు శ్రీనివాసే గెలుస్తాడని ఇంకొందరు జోరుగా బెట్టింగ్ కడుతున్నారు. అంతేకాదు... ఆయా పార్టీలకు ఇంత మెజారిటీ వస్తుంది.. అంత మెజారిటీ వస్తుందని, ఓ పార్టీ అభ్యర్థికైతే అసలు డిపాజిటే రాదని.... ఇలా సర్వేల ద్వారా తాము నమ్ముతున్న మేరకు బెట్టింగ్లు జోరందుకున్నాయి.
కొందరైతే ప్రత్యేకంగా ప్రైవేటు సంస్థల ద్వారా ప్రాంతాలు, కులాల వారీగా సర్వే చేసుకుని ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయోనని తెలుసుకుని మరీ పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు నెల రోజుల ముందు నుంచే బెట్టింగులు షురూ అయ్యాయి. వందల కోట్ల రూపాయల నుంచి ప్రారంభమైన బెట్టింగ్ పోలింగ్కు గడువు సమీపిస్తుండడంతో అది దాదాపు వేయి కోట్లకు చేరినట్లు సమాచారం. బెట్టింగ్ నిర్వహించే బుకీలు ఆన్లైన్తోనే ఎక్కువగా దందా సాగిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, పశ్చిమగోదావరి జిల్లా, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కడప, ఇక మహారాష్ట్రకు చెందిన నాందేడ్, ముంబై, షోలాపూర్, గుజరాత్ తదితర రాష్ట్రాల వారు కూడా ఇందులో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.
ఈ బెట్టింగ్ వ్యవహారం ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో సాగుతోంది. ఒక్కో వ్యక్తి సుమారు రూ.5వేల నుంచి రూ.10 లక్షల వరకూ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బెట్టింగ్ వేసే వ్యక్తి చెప్పినట్టుగా ఫలానా అభ్యర్థి గెలిస్తే అతను పెట్టిన డబ్బులకు ఐదు, పది రెట్లు ఇస్తామని బుకీలు చెబుతుండడంతో బెట్టింగ్ రాయుళ్లు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో గెలుపు అవకాశాలున్నాయని భావిస్తున్న పార్టీ వైపే పెద్దఎత్తున డబ్బు గుమ్మరిస్తున్నారు.