అమరావతి రైతుల ‘మహా పాదయాత్ర’.. సీఎం జగన్‌కు రాజధాని సెగ..
posted on Nov 1, 2021 @ 11:49AM
అమరావతి కోసం అవిశ్రాంత పోరాటం. కలల రాజధాని కోసం అలుపెరగని ఉద్యమం. ఒకటి, రెండు కాదు.. దాదాపు రెండేళ్లుగా తగ్గేదే లే అంటూ జగన్ ప్రభుత్వంపై యుద్ధం. కేసులకు వెరవలేదు.. లాఠీ దెబ్బలకు బెదరలేదు.. పెయిడ్ ఆర్టిస్టులు అన్నా.. ఓ పార్టీ మనుషులన్నా.. ఆ కులం వారన్నా.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా సంకల్పం సడలలేదు. అదే ఉద్యమ స్పూర్తితో ఇప్పుడు మరో ఐక్య కార్యచరణ మొదలుపెట్టారు అమరావతి రైతులు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో లక్ష్యం దిశగా మహా పాదయాత్రతో కదం తొక్కుతున్నారు.
ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆ ప్రాంత రైతులు తలపెట్టిన ‘మహా పాదయాత్ర’ ప్రారంభమైంది. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో ప్రారంభించిన ఈ యాత్రకు తుళ్లూరులో శ్రీకారం చుట్టారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు వేంకటేశ్వరస్వామి, న్యాయదేవత ప్రతిమలకు పూజలు చేశారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
45 రోజుల పాటు అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయపక్షాల నేతలు పాల్గొన్నారు. అమరావతి రైతుల మహా పాదయాత్రకు అధికార వైసీపీ మినహా.. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ, బహుజన ఐకాస, దళిత బహుజన ఫ్రంట్ తదితర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు కమిటీలు సంఘీభావం ప్రకటించాయి.
‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ వరకు నిర్వహించే మహా పాదయాత్ర సజావుగా సాగేందుకు అమరావతి రైతులు 20 కమిటీలు ఏర్పాటు చేశారు. పాదయాత్రలో శ్రీవారి విగ్రహం ఉంచిన వాహనం ముందుండగా.. ఆ తర్వాత కళాకారుల బృందాలు, మహిళలు, రైతులు, పాదయాత్రకు మద్దతు తెలిపే వారు ఇలా వరుస క్రమంలో సాగుతున్నారు.
మహా పాదయాత్ర ప్రతీరోజూ రెండు విడతలుగా సాగనుంది. ఉదయం 6 నుంచి 11గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4నుంచి 6గంటల వరకూ.. రోజూ దాదాపు 12 నుంచి 14 కిలోమీటర్లు ముందుకు సాగనుంది. డిసెంబర్ 15న తిరుమలకు చేరుకోనుంది అమరావతి రైతుల మహా పాదయాత్ర. ఈ పాదయాత్రతోనైనా జగన్ మనసు మారాలని.. అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలని.. ఆ కలియుగదేవుడిని కోరుకోనున్నారు అమరావతి రైతులు, మహిళలు.