ఇండియా స్కోర్ వర్సెస్ పెట్రోల్ రేట్.. కుమ్మేస్తున్న నెటిజన్స్..
posted on Nov 1, 2021 @ 10:54AM
వస్తున్నారు.. వెళ్తున్నారు.. ఒకరి తర్వాత ఇంకొకరు.. క్రీజ్‌లో ఉండటమే పాపమనుకున్నట్టున్నారు. సైకిల్ స్టాండ్‌లో సైకిల్స్ పడ్డట్టు.. వరుసగా ఒక్కో వికెట్ టపీ టపీమని పడ్డాయి. పిచ్ బాలేదు అనటానికి లేదు.. బాల్ స్వింగ్ అవుతోందంటూ కుంటి సాకులతో ఎస్కేప్ అవలేరు.. టాస్ ఓడిపోయాం.. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు ఎవరో తుమ్మారు.. ఇలా సొల్లు రీజన్స్ చెబితే తన్నేలా ఉన్నారు ఫ్యాన్స్. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా చెత్త..వరెస్ట్..బక్‌వాస్ పర్ఫార్మెన్స్‌పై భారతీయులంతా రగిలిపోతున్నారు. ముంబైకి రండి మీ సంగతి చెబుతామంటూ పోస్టులతో చితక్కొడుతున్నారు. ఇక టీమిండియాపై జరుగుతున్న ట్రోలింగ్ అట్టా ఇట్టా లేదు. నెటిజన్లు తమ క్రియేటివిటీ అంతా క్రికెటర్ల మీదే చూపిస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. వామ్మో.. మామూలుగా లేవు పోస్టులు. ఆ మీమ్స్ అన్నిటిలోకి హైలైట్.. టీమిండియా స్కోర్ కంటే పెట్రోల్ రేటే ఎక్కువ అనే పోస్ట్.
ఇండియాలో పెట్రోల్ రేట్ ఎంత? 120 రూపాయలు. సిటీని బట్టి రెండు-మూడు రూపాయలు తక్కువ ఉండొచ్చు. మరి, వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ స్కోర్ ఎంత? జస్ట్.. 111. అంటే.. పెట్రోల్ రేట్ కంటే ఇంకో పది రన్స్ తక్కువే. ఇది చాలదా.. నెటిజన్లకి. పెట్రోల్ రేట్స్‌తో కంపేర్ చేస్తూ టీమిండియాను కుమ్మేస్తున్నారు..ఏకేస్తున్నారు..చెడుగుడు ఆడుకుంటున్నారు. ఇటు పెట్రోల్ రేట్స్ పెరిగిపోతున్నాయనే మంట ఓవైపు.. అటు వరల్డ్ కప్‌లో వరుసగా, చిత్తు చిత్తుగా ఓడిపొతున్నారనే కోపం ఇంకోవైపు. ఆ రెండు కలగలిసి.. ఇదే ఛాన్స్ అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.
కాసులు కుమ్మరించే ఐపీఎల్ టోర్నీల్లో రాణిస్తూ.. ఐసీసీ కప్‌లో మాత్రం హ్యాండ్సప్ అంటున్నారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మనోళ్లు పైసలు లేనిదే ఆడేలా లేరంటూ.. ఐపీఎల్ బ్యాన్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు.