టీమిండియా ఓటమికి మెయిన్ రీజన్స్.. ఎందుకు ఫసక్ అయ్యారంటే...
posted on Nov 1, 2021 @ 4:25PM
ఐపీఎల్‌లో దుమ్ము రేపారు. పోటాపోటీగా దూకుడు ప్రదర్శించారు. అటు బ్యాట్స్‌మెన్, ఇటు బౌలర్స్.. అంతా చెలరేగిపోయారు. కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు. కట్ చేస్తే.. ఐసీసీ టీ20 వరల్డ్ కప్. అంతా ఐపీఎల్‌లో రాణించిన వారే. అంతా మెరికల్లాంటి ఆటగాళ్లే. 11మంది ఆణిముత్యాలను ఏర్చి-కూర్చి ప్రపంచ కప్‌కు పంపిస్తే.. వరుస మ్యాచుల్లో ఫసక్ అనిపించారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చిత్తు చిత్తుగా ఓడిపోయిన దారుణ అనుభవం మర్చిపోకముందే.. న్యూజిలాండ్ చేతిలోనూ ఓటమి చవి చూశారు. సెమీస్ ఛాన్సెస్ దాదాపు గల్లంతు చేసుకున్నారు. అసలేం జరిగింది? ఎందుకింత చెత్తగా ఓడిపోయారు? ఐపీఎల్ స్టార్స్.. ఐసీసీ కొచ్చే సరికి ఎందుకిలా హ్యాండ్సప్ అనేశారు. టీమిండియా ఓటమికి మెయిన్ రీజన్స్ ఏంటి? క్రికెట్ ఫ్యాన్స్‌లో ఇప్పుడిదే చర్చ..రచ్చ.
అలసట. అలుపెరగని ఆట. ఇదే ఇండియా ఓటమికి ప్రధాన కారణం అంటున్నారంతా. ఎంతైనా మనోళ్లు అంత వేస్ట్ ప్లేయర్స్ కాదనే విషయం మనకే కాదు యావత్ ప్రపంచానికి తెలుసు. అయినా.. అంతమంది పోటుగాళ్లున్న టీమ్.. ఇలా ఫసక్ ఫసక్ అనడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఐపీఎల్ వల్లే ఐసీసీ మ్యాచ్‌లపై ఎఫెక్ట్ పడిందని అంటున్నారు. బీసీసీఐ కాసుల కక్కుర్తితో ఆటగాళ్లను విశ్రాంతి లేకుండా ఆడిస్తోందనే విమర్శలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇలానే జరుగుతోంది. ఇక, బయోబబుల్ సిస్టమ్‌తోనూ ప్లేయర్స్‌పై ఒకరకమైన మానసిక ప్రభావం పడిందని అనేవారూ ఉన్నారు. మరి, ఆ ఎఫెక్ట్ ఐపీఎల్‌లోనూ ఉంటుందిగా అంటూ మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా.. కంటిన్యూయస్‌గా, రెస్ట్ లేకుండా క్రికెట్ ఆడటమే.. ప్రస్తుత ఓటమిలకు కారణమనేది మెజార్టీ అభిప్రాయం.
బ్యాటింగ్..బౌలింగ్.. రెండింటిలోనూ టీమిండియా ఘోరంగా విఫలమైంది. మ్యాచ్ తర్వాత కెప్టెన్ కోహ్లీ మాటలే అందుకు నిదర్శనం. ‘‘ఆశ్చర్యంగా ఉంది. బ్యాట్‌తో కానీ.. బంతితో కానీ తెగించి ఆడలేకపోయాం. నిజానికి రక్షించుకునేంత స్కోరు చేయలేదు కానీ.. కనీసం పోరాడలేకపోయాం. భారత జట్టుకు ఆడుతుంటే భారీ అంచనాలుంటాయి. అంతేకాదు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. జట్టుగా ఆడి దీన్ని అధిగమించాలి. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో ఆ పని చేయలేకపోయాం. ఈ టోర్నీలో ఇంకా మ్యాచ్‌లు మిగిలున్నాయి. వాటిలోనైనా మెరుగ్గా ఆడాలని కోరుకుంటున్నాం’’ అని కోహ్లీ విశ్లేషించారు. కెప్టెన్ మాటల ప్రకారం.. టీమిండియాలో టీమ్ స్పిరిట్ కరువైందని స్పష్టమవుతోంది. ఓటమికి ఇది మరో మెయిన్ రీజన్.
టీ20 ప్రపంచకప్ ముందు భారత జట్టులోని ఆటగాళ్లంతా దుబాయ్‌లోనే ఐపీఎల్ ఆడారు. బ్యాట్స్‌మెన్ టన్నులకు టన్నుల పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ (405), రోహిత్ శర్మ (381), కేఎల్ రాహుల్ (626), సూర్య కుమార్ యాదవ్ (317), రిషబ్ పంత్ (419), ఇషాన్ కిషన్ (241), రవీంద్ర జడేజా (227) పరుగుల వరద పారించారు. మరి, వీళ్లంతా ఇప్పుడు ఒకే జట్టు తరఫున ఆడుతుంటే.. ఎందుకిలా విఫలమవుతున్నారనేది ప్రశ్న. ఓపెనింగ్ జోడీ కుదురుకోకపోవడంతో మిడిలార్డర్ మీద ఒత్తిడి పడుతోంది. వరుసగా వికెట్లు పడతుండటంతో సైకిల్ స్టాండ్‌గా మారింది.
బ్యాంటిగే కాదు బౌలింగ్‌లోనూ తేలిపోయారు. ఒక్క వికెట్ అయినా తీయలేక బౌలర్లు ఎలా హ్యాండ్సప్ అన్నారో చూశాం. షమీ, భువనేశ్వర్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.. ఇలా పేరు గొప్ప ప్రదర్శన సున్నా.. బౌలర్లుగా మారారు మనోళ్లు.
ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటు బ్యాటింగ్‌లోనూ అటు కెప్టెన్సీలోనూ విఫలమవడం ఓటమికి మరో ప్రధాన కారణం అంటున్నారు. కోహ్లీలో మునుపటి ఆట అటకెక్కేసిందని చెబుతున్నారు. ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ వదులుకుంటానని కోహ్లీ ఇప్పటికే ప్రకటించగా.. ఆ ప్రభావం అతని ఆట మీద పడిందా? అనే అనుమానమూ వ్యక్తమవుతోంది. లాస్ట్ సిరీస్‌ను ఛాలెంజింగ్‌గా కాకుండా.. లైట్ తీసుకున్నారా? అని నిలదీస్తున్నారు ఫ్యాన్స్. ఇలా పలు కారణాలతో ఐసీసీ వాల్డ్ కప్‌లో టీమిండియా చెత్త ప్రదర్శణతో ఫ్యాన్స్‌ను ఫుల్ డిసప్పాయింట్ చేసింది. సెమీస్‌కి ఛాన్సెస్ కరువవడంతో మనకు ప్రపంచ కప్ ఫసక్.