రూ.2000 దాటిన గ్యాస్ సిలిండర్ ధర.. బాదుడే బాదుడు..
posted on Nov 1, 2021 @ 5:26PM
తెల్లారితే చాలు. రోజూ సేమ్ న్యూస్. ఈ రోజు మళ్లీ పెరిగిన గ్యాస్ ధర. మరోసారి పెట్రోల్ మంట. కొన్ని వారాలుగా ఇదే తంతు. ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్‌గా పెంచేస్తున్నారు ధరలు. ఓవైపు సైలెంట్‌గా గ్యాస్ సిలిండర్ సబ్సిడీని ఎత్తేస్తూ.. మరోవైపు రోజుకింత చొప్పున రేట్లు పెంచేస్తూ.. సామాన్యుల నుంచి కాసులు పిండుకుంటోంది కేంద్ర సర్కారు. ఇటు, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి వైపు పరుగులు పెడుతుంటే.. అటు కమర్షియల్ సిలిండర్ రేట్ ఏకంగా రూ.2వేలు దాటేసింది. వాణిజ్య సిలిండర్‌పై రూ. 266 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి దేశీయ చమురు సంస్థలు. దీంతో దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2000 దాటేసింది.
తాజా పెంపుతో వాణిజ్య సిలిండర్ ధర.. ఢిల్లీలో రూ.2000.5, ముంబయిలో రూ.1950, కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో రూ.2133గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలకు అనుగుణంగా ప్రతి నెలా ఒకటి, 15వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు సవరిస్తుంటాయి. గత కొంతకాలంగా డొమెస్టిక్ సిలిండర్లపై వాయింపు జరగ్గా.. లేటెస్ట్‌గా కమర్షియల్ సిలిండర్ల ధరల మోత మోగించాయి చమురు కంపెనీలు.
ఈ విషయం తెలిసి.. హమ్మయ్యా వంటగ్యాస్ ధరలు పెరగలేదని సంబరపడటానికి లేదంటున్నారు. త్వరలోనే వంటగ్యాస్ మరింత మంట పుట్టించడం ఖాయమని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగిన దృష్ట్యా.. వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.100 మేర నష్టం వస్తోందని, దాన్ని భర్తీ చేసుకోవడానికి రేటు పెంచక తప్పదని చమురు కంపెనీలు అంటున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ వంట గ్యాస్ ధర రూ.205 పెరిగి సిలిండర్ ధర రూ.1000కి చేరువైంది. గత నెల ఒకటో తేదీన కూడా వాణిజ్య సిలిండర్ ధరను పెంచి, ఆరో తేదీన డొమెస్టిక్ సిలిండర్ రేటు పెంచేశారు. అలానే ఈసారి కూడా మరో వారంలో మళ్లీ వంటగ్యాస్‌పై వడ్డింపు తప్పదని చెబుతున్నారు. వరుసగా పెరుగుతున్న గ్యాస్ ధరలపై సామాన్యులు మండిపడుతున్నారు. అచ్చే దిన్ అంటే ఇవేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు.. అటు గ్యాస్ రేట్లు.. అన్నీ కలిసి పేదలు, మిడిల్‌క్లాస్ నడ్డి విరిచేస్తున్నాయని మోదీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.