ఆ రెండూ లేని రాష్ట్రం అంధకారమయం.. మహా పాదయాత్రకు చంద్రబాబు సంఘీభావం
posted on Nov 1, 2021 @ 3:41PM
అమరావతి ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మహా పాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రతీకారాలు, కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్రాభివృద్ధిపై లేదని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రివర్స్ పాలనకు తెరలేపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఇది పాదయాత్ర కాదని.. రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లిలాంటి భూములను త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమమని తెలిపారు. అవమానాలు ఎదురైనా ఆశయ సాధన కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. ఐదుకోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ‘అమరావతి’ ప్రతీక అన్నారు.
అమరావతి ఉద్యమంపై పాలకపక్షం ఎన్ని అసత్య ప్రచారాలు, అవహేళనలు, అవమానాలకు గురిచేసినా అనుకున్న ఆశయ సాధన కోసం చేస్తున్న ఈ ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. విభజన జరిగినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందన్నారు. అమరావతి నిర్మాణంతో స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతున్న తరుణంలో మూడు రాజధానుల పేరుతో రివర్స్ పాలనకు వైసీపీ పాలకులు తెరలేపారని తెలిపారు. అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేమని.. అమరావతిని కాపాడుకోకపోతే రాష్ట్రం అంధకారమవుతుందని చంద్రబాబు చెప్పారు. పాదయాత్రకు ప్రజలు, వివిధ సంఘాలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.