వైసీపీ గుర్తింపు రద్దు!.. యాక్షన్‌లోకి ఈసీ!..
posted on Nov 1, 2021 @ 5:43PM
మాట్లాడితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని ప్రతిపక్షం విమర్శలు. పట్టాభి వ్యాఖ్యలతో బీపీ తెచ్చుకొని.. వైసీపీ రౌడీ మూకలు టీడీపీ కార్యాలయాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దేవాలయంలాంటి ఎన్టీఆర్ భవన్‌పై మూక దాడులు జరగడాన్ని టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆ విధ్వంస ఆనవాళ్ల సాక్షిగా.. 36 గంటల దీక్ష చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని కోరారు. అటు, టీడీపీ ఎంపీల బృందం సైతం తమ వంతుగా ఢిల్లీలో పలు రాజ్యాంగబద్ధ సంస్థల దృష్టికి విషయాన్ని తీసుకెళుతున్నాయి. ఇప్పటికే ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. మరోవైపు, అరాచకాలకు కేరాఫ్‌గా మారిన వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది టీడీపీ.
తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతలు కలిశారు. ఢిల్లీకి వెళ్లిన పలువురు ఎంపీలు ఈసీ అధికారుల్ని కలిసి.. వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై చేస్తున్న దాడులు, మంత్రులు చేస్తున్న దుర్భాషలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
గంజాయి సహా రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తే తమపై దాడులు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీల బృందం ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఘటనపై విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఈసీ తమకు హామీ ఇచ్చినట్టు టీడీపీ నేతలు తెలిపారు.