ప్రజలు కాదు డబ్బులు, కాంట్రాక్టులే ముఖ్యం! ఏపీ ఎంపీలపై పవన్ కల్యాణ్ ఉగ్రరూపం..
posted on Oct 31, 2021 @ 6:45PM
ఆంధ్రప్రదేశ్ ఎంపీలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. తమను గెలిపించిన ప్రజలను గాలికొదిలేసి వ్యాపారులు చేసుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ వెళ్లిన పవన్ కల్యాణ్.. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంఘీభావం తెలిపి బహిరంగ సభలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘాలకు సభాముఖంగా మద్దతు ప్రకటించారు. సభలో స్టీల్ ప్లాంట్ అంశాలపై ఆగ్రహావేశాలతో ప్రసంగించారు. పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై ఎంపీలు ఎందుకు స్పందించరని పవన్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఏమాత్రం స్పందించలేదని చెప్పారు. ఓట్ల సమయంలో మాత్రమే కనిపిస్తారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌కి భూములు ఇచ్చినవారికి ఇంతవరకు నష్టపరిహారం అందించలేదన్నారు జనసేనాని.
25 మంది ఎంపీలు విశాఖకు గనులు కావాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. కరోనా సమయంలో దేశాన్ని ఆదుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి చెప్పేముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలన్నారు. తమ ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ లాక్కెళ్లిపోయిందని.. తన వెంట ప్రజలున్నారనే కేంద్ర మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇస్తున్నారని చెప్పారు. నష్టాలు లేని వ్యాపారం అంటూ ఏదీలేదన్నారు. 18 వేల మంది రైతులు భూములు వదులకుంటేనే విశాఖ ఉక్కు వచ్చిందన్నారు పవన్ కల్యాణ్. విశాఖ ఉక్కు కోసం 32 మంది యువకులు బలిదానం చేశారన్నారు. కులాలు, వర్గాలకి అతీతమైన నినాదం విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అన్నారు.
రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమకు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని యూపీఏ ప్రభుత్వాన్ని ఒక్క ఎంపీ కూడా ఎందుకు అడగలేదని పవన్ నిలదీశారు. ఆంధ్రాలోని పాతికమంది ఎంపీలు దీనిపై మాట్లాడలేదేం? ఎందుకంటే వారికి పదవులు ముఖ్యం, డబ్బులు ముఖ్యం. వారికి ప్రజల కష్టాలు, కన్నీళ్లు ముఖ్యం కాదు... అందుకే వారి మనసులోంచి మాటలు రావు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చినవారిలో చాలామంది దేవాలయాల్లో ప్రసాదం తిని కడుపు నింపుకునేవాళ్లన్న సంగతి ఆ ఎంపీలకు తెలుసా? అని పవన్ ధ్వజమెత్తారు.
తాను ప్రజలను మోసం చేయనని, తాను ఓడిపోయినా ప్రజాక్షేత్రం నుంచి పారిపోలేదని పవన్ అన్నారు. ఇక్కడి ప్రజాసమస్యపై పోరాడడం కర్తవ్వంగా భావిస్తానన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అందరం ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కలిసి రావాలని.. ఇది అన్ని పార్టీలు కలిసివస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు.కార్మికుల కష్టాలు కేంద్రానికి ఎలా తెలుస్తాయి? ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి తెలియజేయాలని అన్నారు.
మీ రాష్ట్రం ఎంపీలు ఏంకావాలో చెప్పకపోతే మేం చేయడానికి ఏముంటుందని జాతీయనేతలు అంటున్నారని పవన్ చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా మీ ఎంపీలు ఏమీ మాట్లాడరు... రాష్ట్రానికి ఏం కావాలో కూడా వారికి తెలియదు... మాకు నష్టం వస్తోందని కూడా వారు చెప్పరయ్యా... అంటూ ఆ జాతీయస్థాయి నేతలు చెబుతున్నారని తెలిపారు. వీళ్లకు డబ్బు, కాంట్రాక్టులే ముఖ్యమా? వీళ్లు ప్రజల్లో తిరిగే వాళ్లు కాదు. ఎన్నికలప్పుడు వచ్చి, రెండు వేలో, మూడు వేలో ఇచ్చి వెళ్లిపోతారు. మళ్లీ ఓట్ల సమయంలోనే వస్తారు. సమస్యలు వచ్చినప్పుడు ఎవరూ రారు, ఎవరూ నిలబడరు. ఓడిపోయిన మనమే రావాలి, మనమే నిలబడాలి. జనసైనికులు నిలడతారు, వీర మహిళలు నిలబడతారు... ప్రజల కోసం మేం నిలబడతాం!" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
"దేశంలో ప్రతి పరిశ్రమకు గనులు ఉన్నాయి. ఉదాహరణకు టాటా ఉక్కు పరిశ్రమ ఉంది. టాటా స్టీల్ కు జార్ఖండ్ లోనూ, ఒడిశాలోనూ సొంత గనులు ఉన్నాయి. ఇక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటకల్లో సొంత గనులు ఉన్నాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఎంత ఎక్కువగా గనులు ఉన్నాయంటే... 70 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం అధికంగా ఉంటుంది. దాన్నేం చేయాలో తెలియక ఉన్నదంతా అమ్మేయండని చెబుతుంటుంది. ఇక్కడ ఏపీలో 22 మంది వైసీపీ ఎంపీలు ఉన్నారు. మనకు ఆ గనులను ఇవ్వాలని, మా స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని కేంద్రాన్ని ఒక్క ఎంపీ అయినా నోరెత్తి ఎందుకు అడగరు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.