అమరావతి రైతుల పాదయాత్రకు చెక్?.. అందుకేనా స్థానిక ఎన్నికల షెడ్యూల్?
posted on Nov 1, 2021 @ 3:22PM
అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు, ప్రజాసంఘాలు మహా పాదయాత్ర చేస్తున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా కదులుతున్నారు. వైసీపీ మినహా అన్ని పార్టీలు, సంఘాలు రైతుల పాదయాత్రకు మద్దతు పలికాయి. 45 రోజుల పాటు పలు జిల్లాల మీదుగా సాగే పాదయాత్రతో అమరావతి నినాదం మారుమోగనుంది. ఆ సౌండ్‌కు జగన్ సర్కారు షేక్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే, మొదట్లో పాదయాత్రకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని అన్నారు. హైకోర్టు జోక్యం చేసుకుంటే కానీ అనుమతి రాలేదు. అందులోనూ కొర్రీలు పెట్టారంటూ విమర్శలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 15న జరిగే ఎన్నికలకు 3వతేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 17న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏపీలో ఎన్నికలు జరగాల్సి ఉన్న పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్ల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.
అయితే, అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభమైన గంటల వ్యవధిలోనే ఈ నోటిఫికేషన్ విడుదల కావడం అనుమానాలకు కారణమవుతోందని అంటున్నారు. పాదయాత్రకు డీజీపీ ఇచ్చిన పర్మిషన్‌లో.. ఎన్నికల కమిషన్ విధించే ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని షరతు విధించారు. ఈ నేపథ్యంలో మహా పాదయాత్ర మొదలవగానే.. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడం చర్చనీయాంశంగా మారింది.