పంచాయతీ నిధులు ఎత్తుకుపోయిన జగనన్న ప్రభుత్వం..
posted on Nov 23, 2021 @ 4:01PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. డబ్బుల్లేక నిలువెత్తు గోతిలోకి దిగిపోయిన సర్కార్ పలు శాఖల్లోని నిధులు భయపెట్టి, బెదిరించి తరలించుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా గ్రామ పంచాయతీ నిధులను కూడా ఖాళీ చేసేసింది. ఒక్క రోజులో వందల కోట్ల రూపాయలను ఏపీ సర్కార్ స్వాహా చేసిందనే లెక్కలు బయటికి వస్తున్నాయి.
అనేక పంచాయతీల ఖాతాల్లోని కేంద్ర ఆర్థిక సంఘం నిధులను తీసేసుకుంది. కొన్ని గ్రామ పంచాయతీల్లోని ఎక్కువభాగం నిధులు పట్టుకుపోగా.. మరి కొన్ని పంచాయతీల్లోని నిధుల్ని జీరో చేసేసింది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం రెండు విడతలుగా 965 కోట్ల రూపాయలు జమచేసింది.
ఇలా ఆర్థిక సంఘం వేసిన నిధుల్ని గ్రామంలోని సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేద్దామని సర్పంచ్లు సమాయత్తమవుతున్న సమయంలోనే ఏపీ సర్కార్ గుట్టుచప్పుడు కాకుండా తరలించేంది. పంచాయతీ సర్పంచ్ల ముందస్తు అనుమతి లేకుండానే, వారికి చెప్పకుండానే నిధులు తీసుకుపోవడం గమనార్హం. ఏ పంచాయతీ నుంచి ఏ మేరకు నిధులను రాష్ట్ర సర్కార్ తీసుకుపోయిందనే సమాచారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారుల వద్ద కూడా జవాబు లేకపోవడం ఆశ్చర్యపరిచే అంశం. గుట్టు చప్పుడు కాకుండా తరలించుకుపోయిన ఆ నిధులను ప్రభుత్వం ఏ అవసరాలకు వినియోగిస్తోందనే విషయం కూడా వారికి ఏమాత్రం ఎరిక లేదట.
14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గతంలో 345 కోట్ల రూపాయలు తీసేసి విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం చెల్లించింది. అయితే.. తాజాగా తరలించుకుపోయిన నిధులను అలాంటి కారణంతోనే తీసిందా? లేక ప్రభుత్వం మరింకెందుకైనా మళ్లించిందా? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో ఆయా పంచాయతీల సర్పంచ్లు అవాక్కయ్యారు. గ్రామాల రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేక అల్లాడిపోతున్నారు. కొన్ని పంచాయతీల సర్పంచ్లు అర్ధనగ్న ప్రదర్శలకు దిగుతున్నారు. మరికొందరు సర్పంచ్లు నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితమే విడుదల అయిన 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీ ఖాతాల్లోంచి అకస్మాత్తుగా మినహాయించిన ప్రభుత్వం విద్యుత్ చార్జీలు చెల్లించడంతో సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్లో సర్పంచ్లు 60 డబ్బులను పారిశుధ్య పనులు, తాగునీటి పథకాల మరమ్మతులు, కార్మికుల జీతాలు, పంచాయతీల అభివృద్ధికి ఖర్చుచేశారు. ఇక శనివారం ఆయా పంచాయతీల ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ చూపించడంతో సర్పంచ్లు తలలు పట్టుకుని కూర్చున్నారు.
గ్రామపంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులతో పాటు సాధారణ నిధులను కూడా రాష్ట్ర సర్కార్ వాపస్ తీసుకుందని నిరసిస్తూ విశాఖ జిల్లా అరకు లోయలో పలువురు సర్పంచ్లు, వార్డు సభ్యులు భిక్షాటన చేయడం అందర్నీ ఆలోచింపజేసింది. పెదలబుడు పంచాయతీ ఖాతాలో నుంచి రాష్ట్ర ప్రభుత్వం 56 లక్షలు డ్రా చేసుకుందని సర్పంచ్ దాసుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం తమ గ్రామానికి ఇటీవలే విడుదల చేసిన మొత్తం 76 లక్షల రూపాయలు కూడా జగన్ సర్కార్ లాగేసుకుందని వాపోయారు ఆయన.
పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం బిల్లులు అప్లోడ్ చేస్తున్న తరుణంలోనే తమ తమ పంచాయతీ ఖాతాల్లోని డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి లాగేసిందని సర్పంచ్లు అయోమయానికి గురవుతున్నారు.పంచాయతీల నిధులు ప్రభుత్వం చెప్పా పెట్టకుండా వెనక్కి తీసుకోవడాన్ని సర్పంచ్లతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.