జగన్‌కి ఎందుకింత కక్ష?.. రఘురామ నిలదీత..
posted on Nov 23, 2021 @ 5:21PM
అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు చాలా తేడా ఉంది. ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రికి ఎందుకింత కక్ష? రాజధాని అంటే ఏం చెప్పాలి? ఎక్కడని చెప్పాలి? రాయలసీమ రాజకీయాలు మానేసి అభివృద్దిపై ఫోకస్ పెట్టండని ఎంపీ రఘురామ విమర్శించారు. పది రోజుల్లో కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని గ్రహించిన సీఎం జగన్.. 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. రాజధాని ఆపే శక్తి ఒక్క కోర్టుకు మాత్రమే ఉందని.. న్యాయస్థానం న్యాయం చేయాలని అన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3లక్షల కోట్లు ఖర్చు చేశామని అంటున్నారు. ఎక్కడ దేనికి ఎంత ఖర్చు చేశారు? ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేశామా? అంటే ఏదీ లేదు. సవ్యంగా నడిచే ఇసుక పాలసీని నాశనం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు రాజధానికి సంబంధం లేదు. అమెరికా రాజధాని వాషింగ్టన్ ఎక్కడ ఉంది. హైదరాబాద్ నిజాం హయాంలోనే మహానగరం. చెన్నై, ముంబై బ్రిటీష్ కాలంలోనే మహానగరాలు. ఏ ముఖ్యమంత్రి ఉంటే విశాఖపట్నానికి పోర్టు వచ్చింది అని గతాన్ని గుర్తు చేశారు.
ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు అవుతుందని శాసన మండలి రద్దు చేస్తామన్నారు. నెల క్రితం కిరణ్ రిజుజును కలిసి మండలి రద్దు విషయం వారి దృష్టికి తీసుకెళ్లారని రఘురామ చెప్పారు. అంతలోనే మండలి రద్దుపై వెనక్కి ఎందుకు తగ్గారని నిలదీశారు. ఇక, రాష్ట్రంలో 95శాతం మున్సిపాలిటీలు గెలిచాం.. ఒక్క కొండపల్లి మున్సిపాలిటీ పోతే ఏమవుతుంది? అని ప్రశ్నించారు రఘురామకృష్ణరాజు.