అంతరాత్మ సాక్షిగా అబద్దాలు.. వికేంద్రీకరణపై సోము వీర్రాజు
posted on Nov 23, 2021 @ 12:04PM
జగన్‌రెడ్డి వ్యాఖ్యలను ఎవరూ నమ్మడం లేదు. ప్రజలు, ప్రతిపక్షమే కాకుండా.. తనకు మిత్రపక్షంలాంటి బీజేపీ సైతం ముఖ్యమంత్రి తీరుపై విరుచుకుపడుతోంది. ఇన్నాళ్లూ జగన్‌పై తమలపాకులతో దాడి చేసినట్టు నటిస్తూ వచ్చిన సోము వీర్రాజు సైతం.. అమిత్‌షా షంటింగ్స్‌తో దూకుడు పెంచారు. కోర్టు పరిధి నుంచి తప్పించుకునేందుకే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. సీఎం చిత్తశుద్ధిని శంకించారు.
అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అసలు అందుకోసం నిధులున్నాయా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే డబ్బుల్లేవని.. అలాంటప్పుడు ఎలా అభివృద్ధి చేయగలుగుతారని నిలదీశారు. ఈ విషయంలో ప్రజల్ని మళ్లీ తప్పుదారి పట్టిస్తున్నారన్నారు సోము వీర్రాజు.
కోర్టు పెడితే రాజధాని అవుతుందా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. సీమ అభివృద్ధిపై జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదని నిలదీశారు.
రాజధాని ఇక్కడే ఉంటుందని ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారని.. ఆ మాట అన్నారో లేదో సీఎం, మంత్రులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సోము వీర్రాజు అన్నారు. ఆత్మను టేబుల్‌పై పెట్టి సభలో మాట్లాడారంటూ తప్పుబట్టారు. అంతరాత్మ సాక్షిగా సభలో అబద్ధాలు చెప్పారని.. శాసనసభను అబద్ధాలు, బండబూతులు, వ్యక్తిగత జీవితాలు మాట్లాడేందుకు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.