తెలుగు వీరుడికి మహా వీర చక్ర.. సంతోష్‌బాబు అమర్ రహే..
posted on Nov 23, 2021 @ 1:37PM
మహా వీరుడిని మరణానంతరం మహా వీర చక్రతో గౌరవించింది కేంద్రం. గల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి వీరమరణం పొందిన నల్గొండ జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్‌బాబుకు కేంద్రం మహావీర చక్ర పురష్కారం ప్రదానం చేసింది. కల్నల్ సంతోష్‌బాబు తల్లి, భార్య.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
గతేడాది జూన్‌లో తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ వ్యాలీలో చైనా ఆర్మీ ధీటుగా ఎదురుకొని.. ఆ హోరాహోరీ దాడిలో అమరుడయ్యారు కల్నల్ సంతోష్ బాబు. ఆనాడు సంతోశ్‌బాబు బృందం చైనాను అడ్డుకోకపోయి ఉంటే.. ఇప్పుడు గల్వాన్ లోయ ఇండియా ఆధీనంలో ఉండి ఉండకపోయేదని అంటారు. సరిహద్దుల్లోకి చొచ్చుకొస్తున్న చైనీస్ ఆర్మీతో.. సంతోష్‌బాబు ఎలాంటి ఆయుధాలు లేకుండా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేశారు. కానీ, పెద్ద సంఖ్యలో ఉన్న చైనా సోల్జర్స్ ఇనుప కంచె చుట్టి ఉన్న ఐరన్ రాడ్లతో మన సైనికులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఆ ఆకస్మిక దాడిలో సంతోష్‌బాబు అమరుడయ్యారు. గల్వాన్‌ను చైనా చేతికి చిక్కకుండా చేయడంలో సఫలుడయ్యారు.
కల్నల్ సంతోష్‌బాబు తన సర్వీసు ఎక్కువ కాలం సరిహద్దులోనే పని చేశారు. 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించారు. కొంతకాలం కాంగో దేశంలో కూడా విధులు నిర్వహించారు.
కల్నల్ సంతోష్‌బాబు ప్రాణత్యాగానికి గుర్తింపుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మహా వీర చక్ర పురస్కారం ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో పరమ వీర చక్ర తర్వాత.. ‘మహా వీర చక్ర’రెండో అత్యున్నత పురస్కారం.
సంతోష్ బాబు వీర మరణంతో తెలంగాణ ప్రభుత్వం ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది. ఆమె ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.