పెట్రో ధరలపై కేంద్రం సంచలనం!.. ఎమర్జెన్సీ కోసం దాచింది వెలికితీత!
posted on Nov 23, 2021 @ 4:30PM
పాకిస్తాన్‌తో యుద్ధం రావొచ్చు. చైనాతో జగడం ముదరొచ్చు. గల్ఫ్ వార్ జరగొచ్చు. ఆయిల్ కంట్రీస్ నుంచి దిగుమతులు ఒక్కసారిగా ఆగిపోవచ్చు. అలాంటి అత్యవసర పరిస్థితులు వస్తే.. దేశంలో చమురు నిల్వల సమస్య రాకుండా.. ముందు జాగ్రత్తగా ఇండియా.. ముడి చమురును పెద్ద ఎత్తున నిల్వ చేసింది. ఇలా అనేక దేశాలు చేస్తుంటాయి. ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే.. ఆ ఆయిల్‌ను వాడుకోవచ్చనేది వ్యూహం.
తూర్పు, పశ్చిమ తీరాల్లో.. మూడు ప్రాంతాల్లో భారత్‌కు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 3.8 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంధన ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. ఆ బఫర్ స్టాక్ నుంచి కొంత ఆయిల్‌ను బయటకు తీయాలని యోచిస్తోంది. దేశంలో ఇంధన సరఫరా పెంచి.. ధరలు కాస్త నియంత్రణలో ఉంచాలని భావిస్తోంది.
ఇటీవలే పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం తనవంతు ట్యాక్స్‌ను కాస్త తగ్గించుకుంది. అయినా, పెట్రో ధరలు సెంచరీ దిగిరాకపోవడంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ సమయంలో మళ్లీ పెట్రో ప్రైజెస్ పెరిగితే.. బీజేపీకి బిగ్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని భయపడుతోంది. అందుకే, చమురు నిల్వల నుంచి చమురు బయటకు తీసే దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
అత్యవసర నిల్వల నుంచి దాదాపు 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును బయటకు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే వారం-పది రోజుల్లో చమురును బయటకు తీయనున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే మరింత ఆయిల్ కూడా వాడుకోవాలని ఆలోచిస్తోంది. ఈ ముడి చమురును ‘మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్)’, హెచ్‌పీసీఎల్‌కు విక్రయించనున్నారు. ఈ రెండు రిఫైనరీలు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలకు అనుసంధానమై ఉన్నాయి. ఆ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.