ఆటోడ్రైవర్ ఇంట్లో సీఎం భోజనం.. మన ముఖ్యమంత్రులూ ఉన్నారే..
posted on Nov 23, 2021 @ 2:04PM
విందు భోజనం లేనిదే ముద్ద దిగదు. హంగూ ఆర్బాటం లేనిదే పూట గడవదు. ఒకరేమో తాడేపల్లి ప్యాలెస్‌లో రాజభోగాలు అనుభవిస్తుంటారు. ఇంకొకరేమో ప్రగతిభవన్‌కే పరిమితమవుతూ విందు రాజకీయాలు చేస్తుంటారు. ప్రజలంటే చిన్నచూపో లేక, ఏహ్యభావమో తెలీదు కానీ.. ప్రజలను పట్టించుకోవడం కానీ, వారి కష్టాలు తీర్చడం కానీ, కనీసం వారికి నేరుగా కనిపించడం, మాట్లాడటం కానీ చేయనే చేయరు. ప్రజలను పలికరిస్తే అదేదో పాపమన్నట్టు దూరంగా ఉంటున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓదార్పు యాత్ర, పాదయాత్ర పేర్లతో జనాలపై ముద్దులు కురిపించిన జగన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ప్యాలెస్‌కే పరిమితం అవుతున్నారు. కొవిడ్ సమయంలో బయటకు వచ్చిందే లేదు. తాజాగా వరదలతో సీమ ప్రజలు విలవిల్లాడిపోతుంటే.. విమానంలో చక్కర్లు కొట్టి వెళ్లిపోయారే కానీ, క్షేత్ర స్థాయిలో బాధితులను ఓదార్చిన పాపాన పోవడం లేదు. ఇక సీఎం కేసీఆర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దత్త గ్రామాలు మినహా.. ఏడేళ్లుగా ఆయన ప్రజలను నేరుగా కలిసి సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండకపోవచ్చు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్‌లు ఇలా ప్రజలకు దూరంగా ఉంటే.. పక్కనే ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం.. ప్రజల కోసం.. ప్రజల చెంత.. అన్నట్టు ఉంటున్నారు. సైకిల్ తొక్కుతున్నారు. పార్కులో కనిపిస్తున్నారు. బస్సు ఎక్కుతున్నారు. ప్రజలతో కలిసి.. ప్రజలతో మెలిసి.. ఉంటున్నారు. ఇక ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అయితే మరింతగా ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజా పాలన, సుపరిపాలన.. అందిస్తున్నారు.
తాజాగా, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా లూధియానాలో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం చేశారు. దిలీప్ తివారీ ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి విందు ఆరగించారు. ఢిల్లీ సీఎం సింప్లిసిటీని అంతా మెచ్చకుంటున్నారు. మన ముఖ్యమంత్రులూ ఉన్నారే.. అంటూ తెలుగువారు బాధపడుతున్నారు.