ఏపీలో మ‌హిళోద్య‌మం.. ఆడపడుచుల ఆత్మగౌరవ సభలతో పోరాటం..

జ‌గ‌న‌న్న పాల‌న‌తో మ‌హిళ‌ల‌కు అస‌లేమాత్రం విలువ లేకుండా పోయింది. భ‌ద్ర‌త కూడా క‌రువైంది. ఓవైపు యువ‌తుల‌పై అఘాయిత్యాలు, హ‌త్య‌లు. మ‌రోవైపు వైసీపీ నేత‌ల బూతు మాట‌లు..చేష్ట‌లు..లీక్ అవుతున్న కాల్ రికార్డింగ్‌లు. ఇవి చాల‌వ‌న్న‌ట్టు.. నిండు అసెంబ్లీలో చంద్ర‌బాబు స‌తీమ‌ణిని ఉద్దేశించి వైసీపీ స‌భ్యులు చేసిన సంస్కారహీన వ్యాఖ్య‌లపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. చంద్ర‌బాబు అంత‌టి నేత‌ను వెక్కి వెక్కి ఏడ్చేలా చేయ‌డంపై అంతా మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికే వైసీపీకి నంద‌మూరి ఫ్యామిలీ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. రాష్ట్రంలోని మ‌హిళ‌లంతా అధికార‌పార్టీ నేత‌ల తీరును క‌డిగిపారేస్తున్నారు. మ‌రోవైపు, ప్ర‌తిప‌క్ష టీడీపీ సైతం రాష్ట్ర వ్యాప్త‌ ఆందోళ‌న‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం డిసెంబరు ఒకటి నుంచి ఏపీ వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభను కౌరవ సభగా మార్చి మహిళల వ్యక్తిత్వంపై ఏ విధంగా దాడి చేశారో ప్రజాచైతన్యం కల్పించాలని భావిస్తోంది. ఈ విష‌యాన్ని ఇక్క‌డితో వ‌దిలిపెడ్డ‌కూడ‌ద‌ని.. జ‌గ‌న్ అండ్ బ్యాచ్ ఆగ‌డాల‌ను ప్ర‌జాక్షేత్రంలో తీవ్రంగా ఎండ‌గ‌ట్టాల‌ని టీడీపీ డిసైడ్ అయింది. ఆడ‌ప‌డుచుల ఆత్మ‌గౌర‌వం పేరుతో పెద్ద ఎత్తున ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో చ‌ర్చించిన అంశాలు, తీసుకున్న‌ నిర్ణ‌యాలు.... --వరద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలి. పంట న‌ష్టం వెంట‌నే అంద‌జేయాలి. ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం కింద రూ.లక్షల అందించి, శాశ్వత గృహాన్ని ఉచితంగా నిర్మించి ఇవ్వాలి.    --మోటారు వాహనాల చట్టం ద్వారా పన్నులు పెంచడం వల్ల లక్షలాది మందిపై భారం పడుతుంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి.    --పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో ప్రజలపై విపరీతమైన భారం పడుతోంది. నిత్యావసరాల ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని పొలిట్‌ బ్యూరో డిమాండ్‌ చేసింది. వరి వేయరాదన్న మంత్రుల ప్రకటనను ఖండించింది.    --శాసనమండలి రద్దు, పునరుద్దరణపై వైసీపీ విధానం.. వ్యవస్థ పట్ల ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందో స్పష్టం చేస్తోంది.    --వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు నిందితులను రక్షించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు ఉన్నాయి.    --పంచాయతీల నిధులు దారి మళ్లింపు 73వ రాజ్యాంగ సవరణను ధిక్కరించడమేనని, వెంటనే పంచాయతీలకు నిధులు జమ చేయాలని డిమాండ్‌ చేసింది.    --రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై కాగ్‌ సీరియస్‌ వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.    కొందరే టార్గెట్? ఇదీ జగనన్న సినిమా లెక్క..

కొందరే టార్గెట్? ఇదీ జగనన్న సినిమా లెక్క..

సినిమాలకు సంబంధించి కొత్త పాలసీ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. బెనిఫిట్ షోలను రద్దు చేసింది. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒకటే టికెట్ రేటు ఉంటుందని స్పష్టం చేసింది. అది కూడా గతంలో కంటే టికెట్ రేట్లను భారీగా తగ్గించింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టింది జగన్ రెడ్డి సర్కార్. ప్రభుత్వ సినీ పాలసీపై సినీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. పెద్ద నిర్మాతలు, హీరోలు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఓపెన్ గానే స్పందించారు. టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం పుననాలోచించుకోవాలని విన్నవించారు.  అయితే సినీమాలకు సంబంధించి జగన్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త పాలసీపై మరో చర్చ సాగుతోంది. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని దెబ్బకొట్టాలనుకోవడం లేదని,  తమకు అండగా ఉన్న వారికి అండగా నిలిచేందుకు అధికార దుర్వినియోగం చేయడానికి సిద్ధమని సంకేతాలు పంపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత మంత్రి పేర్నినాని చేసిన కామెంట్లు కూడా అలానే ఉన్నాయి. టికెట్ రేట్లు పెంచాలన్న చిరంజీవి ట్వీట్ పై స్పందించిన పేర్ని నాని.. టిక్కెట్ రేట్ల పెంపు జీవోలో మార్పులు చేస్తామని ప్రకటించారు. మంత్రి నాని స్పందన, ఇప్పటి వరకూ ఏపీలో జరిగిన పరిణామాలు.. తీసుకున్న నిర్ణయాలు చూస్తే సెలక్టివ్‌గా కొన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించడం ఖాయంగా కనిపిస్తుందని అంటున్నారు.  ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాగానే అన్ని కాలేజీల ఫీజుల్ని రెగ్యూలేట్ చేస్తూ ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ అతి తక్కువ ఫీజులు సిఫారసు చేసింది. అ ఫీజులు గిట్టుబాటు కావనుకుంటే తమకు ధరఖాస్తు చేసుకోవాలని సదరు కమిషన్.. కమిటీ ఆదేశించింది. దరఖాస్తు చేసుకుంటే.. తమ.. మన అనుకునేవారికి ఫీజుల పెంపుకు చాన్సిస్తారు. మనోడు కాదనుకున్నవారికి అతి తక్కువ ఫీజులకే నడుపుకోవాలి. ఒక్క విద్యా సంస్థల విషయంలోనే కాకుండా ఆస్పత్రులు సహా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. మనోడు అనేవాడు వ్యాపారం చేసుకోవాలి… ఇతరులు చేసుకోకూడదన్నట్లుగా ప్రభుత్వ విధానాలున్నాయి.  ఇదే తరహాలో ఇప్పుడు తమది భారీ బడ్జెట్ సినిమా అని టికెట్ రేట్లు పెంచుకుంటామని ఎవరైనా ధరఖాస్తు చేసుకుంటే పర్మిషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. అంటే.. సెలక్టివ్‌గా తమకు దగ్గర అనుకున్న వాళ్లో.. లేకపోతే… దగ్గరగా ఫీలయ్యేలా చేసేవాళ్లకు మాత్రమే టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. లేకపోతే తక్కువగానే ఉంటాయి. ప్రభుత్వం అన్ని సినిమాలకు ఒకలాగ కాకుండా కొన్ని సినిమాలకు ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వడం లాంటివి చేస్తే ఖచ్చితంగా దురుద్దేశం ఉన్నట్లేనని ప్రజలు అనుమానిస్తారు. ఇండస్ట్రీ కూడా చీలిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరీ జగనన్న పాలసీ ఏంటో, సినిమాలకు సంబంధించి ముందుముందు  ఏం జరుగుతుందో చూడాలి మరీ...

హైదరాబాద్ యూనివర్శిటీలో కరోనా పంజా.. థర్డ్ వేవ్ వచ్చినట్టేనా? 

కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజ్‌లో 182 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారినపడటం కలకలం రేపుతుండగానే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థులు మహమ్మారి బారినపడ్డారు. బహదూర్‌పల్లిలోని టెక్‌ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ 25 మంది విద్యార్థులకు, ఐదుగురు అధ్యాపకులకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ విద్యా సంస్థకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. బాధితులను హోమ్ క్వారైంటన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. యూనివర్శిటీలో  వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 3 వందల మందికి పరీక్షలు చేయగా 25 మందికి వైరస్ పాజిటివ్ గా వచ్చింది. క్యాంపస్ లోని మిగితా విద్యార్థులు, సిబ్బంది టెస్టులు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నిర్దారణ అయిన 25 మంది కూడా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయినవారే. దీంతో వ్యాక్సినేషన్ పూర్తయినా కొవిడ్ సోకుతుండటం ఆందోళన కల్గిస్తోంది.  కోవిడ్ భయంతో వర్సిటీలోని హాస్టల్స్‌ను విద్యార్థులు ఖాళీ చేశారు. వీరంతా యూనివర్సిటీ బయట పెద్ద సంఖ్యలో గూమిగూడటంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఈ మేరకు మేడ్చల్‌ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో, దుండిగల్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి నిర్మల నిర్ధారించారు. ఎంతమంది విద్యార్థులకు కరోనా సోకిందనేది స్పష్టత లేదు. అయితే క్యాంపస్ మొత్తం శానిటైజేషన్ చేసిన తర్వాతే మళ్లీ క్లాసులు మొదలవుతాయని యాజమాన్యం పేర్కొంది.కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ విద్యార్థులంతా పాల్గొన్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట క్యాంపస్‌లో ఫ్రెషర్స్ డే నిర్వహించారని, ఆ సమయంలో వీరికి వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  కర్ణాటక యూనివర్సిటీలోనూ ఫ్రెషర్స్ పార్టీ కరోనాకు సూపర్‌స్ప్రెడర్‌గా మారింది. ధార్వాడ్ మెడికల్ కాలేజీలో 1,000 మందికి పరీక్షలు నిర్వహించగా.. 182 మందికి పాజిటివ్‌గా తేలింది. మరికొందరి నివేదికలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మూడో దశ ముప్పు హెచ్చరికల నేపథ్యంలో విద్యా సంస్థల్లో భారీగా కోవిడ్ కేసులు నమోదుకావడం కలవరానికి గురిచేస్తోంది. 

ఆ అన్నకు చెల్లే.. అందుకే మౌనం..

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, నారా భువనేశ్వరికి ఏపీ అసెంబ్లీలో జరిగిన అవమానం పై ఒక్క ఆంధ్రప్రదేశ్’లోనే కాదు, ఇటు తెలంగాణాలో ఇతర రాష్ట్రాలలోనూ, అనేక మంది ప్రముఖులు స్పందించారు. ముఖ్యంగా రేణుకా చౌదరి, కొండా సురేఖ, విజయశాంతి, డీకే అరుణ వంటి ఎదరో మహిళా నాయకులు, ఏపీ అసెంబ్లీలో జరిగిన దుర్నీతిని తప్పు పట్టారు. అసెంబ్లీలో భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండించారు. కానీ, రాష్ట్రంలో ఒక మహిళ సారధ్యంలో నడుస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం పెదవి విప్పలేదు. నిజానికి, భువనేశ్వరి బాధను అందరికంటే కొంచెం ఎక్కువగా అర్థంచేసుకునే అనుభవం షర్మిలకు వుంది. క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హరణం, ముఖ్యంగా ఒక వివాహిత మహిళను ఏ విధంగా బాధిస్తుందో షర్మిలకు తెలుసు. గతంలో ఒక ప్రముఖ సినిమా నటుడితో ఆమెకు సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆమెకు వైసీపీ పార్టీ అండగా నిలిచింది. ఆమె, భర్త బ్రదర్ అనీల్, బాబాయి సుబ్బారెడ్డి ఇతర వైసీపే నాయకులను వెంట పెట్టుకుని హైదరబాద్ పోలీసు కమీషనర్ కార్యాలయానికి  వెళ్లి మరీ ఆమె ఫిర్యాదు చేశారు. అ సందర్భంగా ఆమె వ్యక్త పరిచిన ఆవేదన అందరికీ గుర్తుండే ఉంటుంది. అందరి సంగతి ఎలా ఉన్నా ఆమెకు అయితే ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. అలాగే, ఆమె ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపి ..అరెస్టులు అవీ చేయడం కూడా  చాల మందికి గుర్తుండే ఉంటుంది.అప్పట్లో సభ్యత, సంస్కారం ఉన్న ప్రతి ఒక్కరు, ఆమెకు  సానుభూతి తెలిపారు.ఆమె ధైర్యంగా బయటకు వచ్చి చేసిన ఆందోళనకు మద్దతు ఇచ్చారు. కానీ, ఇప్పుడు భువనేశ్వరికి విషయంలో ఆపాటి సంస్కారం చూపలేక పోయారు. ఆ అన్నకు చెల్లినే అని నిరుపించుకున్నారు.  అందుకే షర్మిల,, తాను పాదయాత్ర  చేసి బతికించిన అన్న పార్టీ, సభ్యులు, ఏపీ అసెంబ్లీలో ఒక సాటి మహిళను అవమాన పరిస్తే స్పందించాలనే చిన్నపాటి విజ్ఞతను కూడా చూపలేదని, ఆమె పార్టీ మహిళా కార్యకర్తలే విస్మయం వ్యక్త పరుస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సతీమణి అయినా రాజకీయాలకు దూరంగా తమ పని తాము  చేసుకుపోతున్న, ఇంచు మించుగా తమ తల్లి వయసున్న మహిళకు నిండు సభలో అవమానం జరిగితే, ఖండించక పోవడం. రాజకీయ పార్టీ నాయకురాలుగా కాకపోయినా కనీసం, ఒక మహిళా, ఒక బాధితురాలిగా అయినా స్పందించక  పోవడం దేనికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా రాజన్న రాజ్యం. ఈ సంస్కృతిని తెలంగాణలోనూ విస్తరించేందుకేనా ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది, అని కూడా అడుగుతున్నారు.   మరో వంక అన్నా చెల్లీ, మధ్య ఏవో విబేధాలు ఉన్నాయన్నది కూడా నిజం కాదా, అందుకేనా, సభలో జరిగిన అవమానానికి పది రెట్లు ఎక్కువగా, స్వయంగా జగన్మోహన్ రెడ్డి సభలోపలా సభ వెలుపలా అవమానం చేసినా,షర్మిల పెదవి విప్పక పోవడం అందుకేనా? అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. నిజానికి  అన్నా చెల్లి ఇద్దరిలో ఒకే రక్తం ప్రవహిస్తోంది. ఇద్దరూ, ఎన్ని రాజకీయ డ్రామాలు నడిపినా ఇద్దరిదీ ఒకే బ్లడ్, ఒకటే రాజకీయం .. ఒకటే సంస్కారం అంటున్నారు.

జ‌గ‌న్‌ గాలిమాట‌లు.. ఏపీలో కాగ్ క‌ల్లోలం.. ఈట‌ల రిట‌ర్న్‌గిఫ్ట్‌.. టాప్‌న్యూస్ @ 7pm

1. జగన్‌రెడ్డి అన్నీ గాలిమాటలు మాట్లాడుతున్నారని చంద్ర‌బాబు మండిపడ్డారు. ఇలాంటి వారు ఉంటారనే ఆనాడు అంబేడ్కర్‌ రాజ్యాంగం రాశారన్నారు. సీఎం గాల్లో వచ్చారు.. గాల్లోనే వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టి అప్పు తెచ్చుకుంటారని విమర్శించారు. సీఎంకు అనుభవం లేదు, అహంభావం మాత్రం ఉందని చంద్ర‌బాబు విమర్శించారు.  2. క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగుకు చెందిన‌ మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలు చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వెంటనే భూపేష్ రెడ్డికి జమ్మలమడుగు పార్టీ భాద్యతలను అప్పగించారు. జమ్మలమడుగు టీడీపీకి కంచుకోట అని.. వలస పక్షులకు ఇక పార్టీలో అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈసారి పని చేసే వారికి మాత్రమే పార్టీలో పదవులని స్పష్టం చేశారు. 3. ఏపీలో ఆర్థిక నిర్వహణకు అసలు బడ్జెట్‌కు పోలిక లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్ రిపోర్ట్ తేల్చిచెప్పింది. శాసనసభను లెక్కలోకి తీసుకోకుండా పద్దులు నిర్వహిస్తున్నారని త‌ప్పుబ‌ట్టింది. "2019-20 ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించిన అనుబంధ ప‌ద్దుల‌ను వ్యయం చేసి, ఆ తర్వాత జూన్ 2020లో శాస‌నస‌భ‌లో ప్రవేశ పెట్టారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవ‌హారాలు చోటు చేసుకున్నాయి".. అంటూ కాగ్ నివేదిక స్ప‌ష్టం చేసింది.  4. జగన్ పాలనలో అభివృద్ధి కంటే వ్యాపార ఛాయలు ఎక్కువయ్యాయని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. కొత్త విధానాలతో దండుకోవడంలో జగన్ స్పెషలిస్ట్ అని వ్యాఖ్యానించారు. పేదలకు నవరత్నాలు అంటూ నెత్తిన నవశఠగోపాలు పెడుతున్న దందాల ప్రభుత్వం అయ్యిందంటూ లంకా దినకర్ విమర్శించారు.   5. ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వ‌తంత్ర అభ్య‌ర్థిని తానే పోటీలో పెట్టించానని బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఉండాలని.. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ఉండాల్సిందన్నారు. కరీంనగర్‌లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ కోల్పోతుందని ఈట‌ల జోస్యం చెప్పారు. 6. న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కోరారు. ఉద్దేశపూర్వక దాడుల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులదే అని తెలిపారు. నిజం వైపు నిర్భయంగా నిలబడటం సహా తప్పును అంతే స్థాయిలో ఖండించాలన్నారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో సీజే ర‌మ‌ణ‌ పాల్గొన్నారు.  7. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందు వరసలో కూర్చున్న ఎంపీ రఘురామను ముందుగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలకించారు. ఆ తరువాత అటుగా వచ్చిన ప్రధాని మోదీ.. రఘురామకృష్ణరాజును పేరు పెట్టి పిలిచి కొంచెం సేపు నిలబడి భుజం తట్టి వెళ్లారు.  8. ఆడబిడ్డలను రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారని టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత మండిపడ్డారు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తున్న మహిళలను పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని దాడులు చేయించడం, కేసులు పెట్టడం చూస్తుంటే.. ఇది సైకో ప్రభుత్వమని చాలా సందర్భల్లో రుజువైందన్నారు. క్యారెక్టర్ లేని వెధవలు భువనేశ్వరిని దూషిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో టీడీపీ మహిళ నేతలపై పోలీసులతో దాడులు చేయించారని, వాళ్లను భయభ్రాంతులకు గురిచేసి, వ్యాపారాలపై దెబ్బకొట్టడానికి సిగ్గు అనిపించడంలేదా? అని అనిత ప్రశ్నించారు. 9. వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడు శివశంకర్ రెడ్డిని సీబీఐ బృందం విచారిస్తోంది. పులివెందుల కోర్టు అనుమతితో రిమ్స్ ఆసుపత్రి నుంచి సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. వివేకా హత్యకేసులో.. శివశంకర్ రెడ్డి పాత్రపై డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంలో ప్రస్తావించిన విషయాలపై సీబీఐ బృందం ఆయనను క్షుణ్ణంగా ప్రశ్నిస్తోంది.  10. అనంతపురం జిల్లా కలెక్టర్‌‌ నాగలక్ష్మికి పుట్టపర్తిలో చేదు అనుభవం ఎదురైంది. పుట్టపర్తిలో ముంపు బాధితులను పరామర్శించేందుకు కలెక్టర్ వచ్చారు. కలెక్టర్‌ను  సాయినగర్‌ కాలనీ వాసులు అడ్డుకున్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన తమను ఆదుకోవడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీవాసులు నిలదీయడంతో కలెక్టర్‌ నాగలక్ష్మి ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన.. ప్ర‌భుత్వంపై కాగ్ మండిపాటు..

ఏపీలో ఆర్థిక నిర్వహణకు అసలు బడ్జెట్‌కు పోలిక లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్ రిపోర్ట్ తేల్చిచెప్పింది. శాసనసభను లెక్కలోకి తీసుకోకుండా పద్దులు నిర్వహిస్తున్నారని త‌ప్పుబ‌ట్టింది. 2019-20 ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించి కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది వైసీపీ ప్ర‌భుత్వం.  "2019-20 ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించిన అనుబంధ ప‌ద్దుల‌ను వ్యయం చేసి, ఆ తర్వాత జూన్ 2020లో శాస‌నస‌భ‌లో ప్రవేశ పెట్టారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవ‌హారాలు చోటు చేసుకున్నాయి".. అంటూ కాగ్ నివేదిక స్ప‌ష్టం చేసింది.  "చ‌ట్టస‌భ‌ల ఆమోద ప్రక్రియ‌ను, బ‌డ్జెట్ మీద అదుపును బ‌ల‌హీన‌ప‌రిచారు. ప్రజా వ‌న‌రుల వినియోగ నిర్వహ‌ణ‌లో ఆర్థిక క్రమ‌శిక్షణా రాహిత్యాన్ని ప్రోత్సహించారు. శాస‌నస‌భ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖ‌ర్చు చేసిన సంద‌ర్భాలు పున‌రావృతం అవుతున్నాయి. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వివ‌రాల‌ను బ‌డ్జెట్ ప‌త్రాల్లో స‌రిగా చూప‌లేదు" అని కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  "2018-19 ఆర్థిక సంవ‌త్సరంతో పోల్చితే 2019-20లో 3.17 శాతం రెవెన్యూ రాబ‌డులు తగ్గాయి. కొత్త సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల రెవెన్యూ ఖ‌ర్చులు 6.93 శాతం పెరిగాయి. 2018-19 నాటి రెవెన్యూ లోటును మించి 2019-20లో 90.24 శాతం రెవెన్యూ లోటు పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పొల్చితే 2019-20లో రూ.32,373 కోట్ల మేర బ‌కాయిల చెల్లింపులు పెరిగాయి. చెల్లించాల్సిన బ‌కాయిల వివ‌రాల‌ను బ‌డ్జెట్ ప‌త్రాల్లో స‌రిగా చూప‌లేదు. శాన‌స వ్యవ‌స్థను నీరు గార్చేలా నిధుల నిర్వహ‌ణ ఉంది" అని కాగ్‌ తన నివేదికలో ప్ర‌భుత్వ తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. 

న్యాయవ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడులు.. రక్షించుకోవాల‌న్న జ‌స్టిస్ ర‌మ‌ణ‌..

న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కోరారు. ఉద్దేశపూర్వక దాడుల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులదే అని తెలిపారు. నిజం వైపు నిర్భయంగా నిలబడటం సహా తప్పును అంతే స్థాయిలో ఖండించాలన్నారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.  న్యాయవ్యవస్థ అనే కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు సభ్యులని సీజే ర‌మ‌ణ‌ అన్నారు.  ప్రజా సంక్షేమమే రాజ్యాంగ మూలసూత్రమని.. న్యాయవాద వృత్తి చాలా పవిత్రమైనదని గుర్తు చేశారు. రాజ్యాంగ మూల సూత్రాలు అర్థం చేసుకొని ముందుకు వెళ్లేలా ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు.   

జ‌మ్మ‌ల‌మ‌డుగులో జ‌గ‌న్‌కు దేత్త‌డి.. టీడీపీలో చేరిన దేవగుడి..

క‌డ‌ప జిల్లాలో బ‌ల‌మైన వ‌ర్గం టీడీపీలో చేరింది. సీఎం జ‌గ‌న్‌రెడ్డికి సొంత ఇలాఖాలో ఇది మింగుడుప‌డ‌ని ప‌రిణామ‌మే. మాజీ ఎమ్మెల్సీ దేవ‌గుడి నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలు చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వెంటనే భూపేష్ రెడ్డికి జమ్మలమడుగు పార్టీ భాద్యతలను అప్పగించారు చంద్రబాబు. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి నారాయణరెడ్డి స్వయానా సోదరుడు. బ‌ల‌మైన దేవ‌గుడి వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. జమ్మలమడుగు నియోజకవర్గంలో దేవగుడి వర్గం, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య చాలాకాలంగా ఫ్యాక్షన్‌ నెలకొంది. రామసుబ్బారెడ్డి వర్గం టీడీపీలో ఉండగా దేవగుడి వర్గం మొదట కాంగ్రెస్‌లో.. తర్వాత వైసీపీలో కొన‌సాగింది. దేవగుడి వర్గం తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలో చేరి మంత్రి అయ్యారు. రామసుబ్బారెడ్డిని టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీని చేసి విప్‌ పదవి ఇచ్చింది. గత ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా, ఆదినారాయణరెడ్డి ఎంపీగా పోటీ చేసి.. ఇద్ద‌రూ ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోగా.. రామసుబ్బారెడ్డి వైసీపీ పంచ‌న చేరారు. తాజాగా, ఆదినారాయ‌ణ‌రెడ్డి సోద‌రుడు నారాయ‌ణ‌రెడ్డితో పాటు ఆయ‌న కుమారుడు భూపేష్‌రెడ్డి టీడీపీలో చేర‌డంతో పార్టీలో రెట్టించిన ఉత్సాహం. జమ్మలమడుగు టీడీపీకి కంచుకోట అని అన్నారు చంద్ర‌బాబు. కొందరు నాయకులు పార్టీని వీడి వెళ్లారని, జమ్మలమడుగులో పార్టీ కోసం పనిచేస్తున్న అందరికీ గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. వలస పక్షులకు ఇక పార్టీలో అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు.. ఎవరు పనిచేయడం లేదనేది రాసిపెడుతున్నానని, ఈసారి పని చేసే వారికి మాత్రమే పార్టీలో పదవులని స్పష్టం చేశారు. పార్టీ మారి వచ్చే వాళ్లకు ఇక‌పై అవకాశం ఉండదని చంద్ర‌బాబు తెలిపారు.   జగన్‌రెడ్డి అన్నీ గాలిమాటలు మాట్లాడుతున్నారని బాబు మండిపడ్డారు. ఇలాంటి వారు ఉంటారనే ఆనాడు అంబేడ్కర్‌ రాజ్యాంగం రాశారన్నారు. సీఎం గాల్లో వచ్చారు.. గాల్లోనే వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టి అప్పు తెచ్చుకుంటారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు, లేకపోతే తాకట్టు పెడుతున్నారు. సీఎంకు అనుభవం లేదు, అహంభావం మాత్రం ఉందని చంద్ర‌బాబు విమర్శించారు.  కొందరే టార్గెట్? ఇదీ జగనన్న సినిమా లెక్క..

ర‌వీంద‌ర్‌సింగ్‌తో ఈట‌ల స్కెచ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్‌..

ఏ ఎన్నికైనా ఈజీగా గెలుస్తామ‌నుకున్నారు. అధికార బ‌లంతో విర్ర‌వీగారు. డ‌బ్బులు వెద‌జ‌ల్లితే ఏ ప‌నైనా అవుతుంద‌నుకున్నారు. కానీ, కేసీఆర్ దూకుడుకు హుజురాబాద్‌లో చెక్ పెట్టారు ఈట‌ల రాజేంద‌ర్‌. గులాబీ బాస్‌ను ఢీకొట్టి గెలిచాక.. కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు ఈట‌ల‌. క‌రీంన‌గ‌ర్‌లో మాజీ మేయ‌ర్ ర‌వీంద‌ర్‌సింగ్ టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసి.. ఇండిపెండెంట్ కేండిడేట్‌గా స్థానిక సంస్థ‌ల‌ ఎమ్మెల్సీ బ‌రిలో దిగారు. సింగ్ వెనుక‌.. హుజురాబాద్ కింగ్ ఉన్నార‌ని అంటున్నారు. ఈట‌ల రాజేంద‌రే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టి.. ర‌వీంద‌ర్ సింగ్‌ను టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు లాగి.. ఎమ్మెల్సీ బ‌రిలో నిలిపార‌ని అంటున్నారు. జ‌స్ట్ పోటీ చేయించ‌డ‌మే కాదు.. ఎమ్మెల్సీగా ర‌వీంద‌ర్ సింగే గెలుస్తార‌ని ఈట‌ల ధీమాగా చెబుతున్నారు.  ర‌వీంద‌ర్‌సింగ్‌తోనే ఆగిపోద‌ని.. క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి అనేక మంది టీఆర్ఎస్ నాయ‌కులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ఈట‌ల రాజేంద‌ర్ అంటున్నారు. ఒక్క క‌రీంన‌గ‌ర్ అనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్‌కు షాకుల మీద షాకులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఆదిలాబాద్‌లో కూడా ZPTC  రాజేశ్వరరెడ్డిని.. ఎమ్మెల్సీ పోటీలో పెట్టించింది తానేన‌ని ఈట‌ల చెప్పారు.   కేసీఆర్ ప‌ని అయిపోయిందని.. ఆయ‌న ఆరిపోయే దీపమ‌ని ఈట‌ల అన్నారు. త‌న‌ను అవ‌మానించి.. అవినీతి ఆరోప‌ణ‌లు చేసి.. మంత్రిమండ‌లి నుంచి వెళ్ల‌గొట్టి.. పార్టీని వీడేలా చేసి.. హుజురాబాద్‌లో ఓడించే ప్ర‌య‌త్నం చేసిన కేసీఆర్‌కు తాను చుక్క‌లు చూపిస్తానంటూ శ‌ప‌థం చేశారు ఈట‌ల రాజేంద‌ర్‌. అన్న‌ట్టుగానే.. క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ ర‌వీంద‌ర్‌సింగ్‌తో తొలిపావు క‌దిపారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తాన‌ని కూడా చెప్పారు. అదే జ‌రిగితే.. ర‌వీంద‌ర్‌సింగ్ ఎమ్మెల్సీగా గెలిస్తే.. ఇక ఈట‌ల చెప్పిన‌ట్టుగానే.. కేసీఆర్ ప‌ని అయిపోయిన‌ట్టే..అంటున్నారు. 

కేంద్రం దిగి వచ్చినా ఆగని రైతు ఆందోళన.. కొత్త డిమాండ్లతో రెండో సంవత్సరంలోకి..

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజదాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు ఆందోళన సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ రోజును దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ముందుగానే మూడు వివదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంది.స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురు నానక్ జయంతి రోజున వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే చటాలు మంచివే, సదుద్దేశంతో చేసినవే, అయితే ఈ చట్టాలను వ్యతిరేక్సితున్న కొందరిని ఒప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అందుకే చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సందర్భంగా ప్రధాని కొందరిని ఒప్పించలేని ప్రభుత్వ అశక్తతను అంగీకరించారు.రైతులను క్షమాపణలు కోరారు.  అయినా, ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నాయకులు, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించలేదు. సంతోషం వ్యక్తం చేయలేదు. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో చట్టాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రాధాని హామీ ఇచ్చినప్పటికీ... కొత్త డిమాండ్లను తెరమీదకు తెచ్చి ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. మూడు చట్టాలను రద్దు చేస్తే చాలు, ఆందోళన విరమింఛి వెనక్కి వెళ్లి పోతామని చెప్పిన రితు నాయకులే, ఇప్పుడు, ఎంఎస్’పీ (కనీస మద్దతు ధర), ఆందోళన సందర్భంగా చనిపోయిన వారికి  నష్ట పరిహారం. కేసుల ఎత్తివేత వంటి కొత్త డిమాండ్ల సాధన కోసం పాత ఉద్యమాన్ని కొత్త పంథాలో నడిపించాలని, నిర్ణయించారు. ఈ నేపధ్యంలోనే ఈరోజు (నవంబరు 26) న పాత ఆందోళన ప్రధమ వార్షి కొత్సవం జరుపుకుంటున్నారు.   ఈ సందర్భంగా ఢిల్లీ సరిహద్దులు రైతుల ఈరోజు భారీ సభ నిర్వహించారు. రైతు సంఘాల ఉమంది వేదిఅక పిలుపు మేరకు నిర్వహించిన ఢిల్లీ చలో కార్యక్రమంలో వేలాదిసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.వ్యవసాయ పంటలకు కనీస మద్ధతు ధర ఇచ్చేలా చట్టపరమైన హామీతో సహా తమ డిమాండ్లు నెరవేరే వరకు  రైతుల ఆందోళన కొనసాగుతుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ టికాయత్ చెప్పారు. వెన్నుచూపని రైతుల పోరాటానికి యావత్తు ప్రపంచం సెల్యూట్ చేసింది. ఏడాదిపాటు శాంతియుతంగా చేసిన పోరాటంలో 700 మందికిపైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. సాగు చట్టాలను కేంద్రం రద్దును స్వాగతించిన అన్నదాతలు.. మిగతా డిమాండ్లు నెరవేర్చే వరకూ తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. తమ ఉద్యమానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టారు. పంజాబ్, హరియాణాల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోకి భారీగా రైతులు చేరుకున్నారు. ఢిల్లీలో ధర్నాకు సంఘీభావం తెలుపుతూ కర్ణాటక, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో రైతులు, ట్రేడ్ యూనియన్లు జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ప్రదర్శనలు నిర్వహించారు. మరో వంక  రైతుల ఆందోళనకు ప్రతిపక్షాలు సైతం మద్దతు ప్రకటించాయి. అయితే, రైతుల కొత్త డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తుందా లేక ఆందోళన ఈళాఆఏ కొనసాగనిస్తుందా చూడవలసి వుంది.

రోజా పొగడ్తలు మంత్రి పదవి కోసమేనా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి వర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారో, అసలు విస్తరిస్తారో లేదో కూడా ఎవరికీ, తెలియదు. అయితే, మంత్రి పదవులు ఆశిస్తున్న వారు మాత్రం ... ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఏదో విధంగా ఈ సారి మంత్రి పదవి దక్కించుకోవాలని, లేదంటే ఇక  ఈ జన్మకు మంత్రి పదవి దక్కే అవకాశమే ఉండదని, వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఆశల పందిళ్ళు అల్లుకుంటున్నారు. అయితే అలాంటివారు ఎందరున్నా అందరిలోకి, ప్రత్యేకంగా చెప్పుకోవలసిన ఒకే ఒక్కరు మాత్రం మరెవరో కాదు, ది జబర్దస్త్ ఫేమ్ ...  నగరి ఎమ్మెల్యే రోజా.  ఆమె మంత్రి పదవికోసం, తొక్కని గడప లేదు మొక్కని దేవుడు లేదు అన్న విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి మొదలు అందరు దేవుళ్ళను మొక్కుకుంటూనే ఉన్నారు. దేవుళ్ళనే కాదు,  జ్యోతిషులను నమ్ముకున్నారు. గ్రహదోషాలను దూరం చేసుకునేందుకు ఆశ్రమాలలోప్రత్యేక పూజలు, యజ్ఞయాగాదులు చేయిస్తున్నట్లు, ఆ మధ్య సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అయింది.  అయితే, కేవలం దేవుళ్ళను,జ్యోతిషులను నమ్ముకుంటే సరిపోదని గ్రహించి  వెంకన్న దేవుని కంటే ఆల్ పవర్ఫుల్ గాడ్’ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని  స్తోత్ర గీతాలతో, పొగడ్తలతో ముంచెత్తు తున్నారని అంటున్నారు. అసెంబ్లీ లోపల బయటా  కూడా రోజా ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.  ఈ రోజు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రోజా మరోసారి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొత్త దేవుడంత గొప్ప మనసున్న మనిషని, మనషుల్లో దేవుడని అర్థం వచ్చేలా పొగడ్తలను కుంభ వృష్టిగా కురిపించారు. రోజా పొగడ్తల ప్రవాహధాటికి తట్టుకోలేక కావచ్చు, స్పీకర్ తమ్మినేని సీతారాం బ్రేక్ వేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు మాత్రేమే అడగాలని, సూచించారు. అయితే,రోజా మాత్రం, జగన్ రెడ్డిలో ఎవరికి కనిపించని సుగుణాలను ఏర్చి కూర్చి ప్రసంగాన్ని కొనసాగించరు. జగన్ రెడ్డి ప్రతి స్త్రీని ఒక తల్లిలా, ప్రతి ఆడపడుచును ఒక సోదరిలా చూస్తారని, కులం మతం ప్రాంతం అన్న తేడా లేకుండా పేద లందరినీ ‘ప్రభువు’ లా ఆడుకుంటున్నారని, జగనన్న పాలనలో రాష్ట్రంలోని  ప్రతి మహిళ సంతోషం  ఉన్నారని .. తమదైన శైలిలో ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. చివరకు అదే నోటితో, అంతటి మహా పురుషుని, మచ్చలేని మనిషిని కొందరు అవమానిస్తున్నారని అవాకులు చవాకులు పలుకు తున్నారని, ఓ రెండు గ్లిజరిన్ చుక్కలు కూడా రాల్చారు.  అయితే, ఇంత చేసినా చివరకు రోజాకు మంత్రి  పదవి దక్కుతుందా అంటే, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి  ఉన్నంతవరకు ఆమెకు మంత్రి పదవి రాదు గాక రాదని అంటున్నారు.  ఏమో .. ఆ ఇద్దరి మధ్య ఏముందో ... ఎవరికి తెలుసు.

పంజాబ్ లో కాంగ్రెస్-ఆప్ మధ్యే పోటీ? కెప్టెన్ పైనే కమలం ఆశలు.. 

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతులెత్తేసినట్టేనా? కాంగ్రెస్, ఆప్ మధ్యే పోటీ జరగనుందా? శిరోమణి అకాలీదళ్ అడ్రసే కనిపించడం లేదా? అంటే పంజాబ్ లో జరుగుతున్న పరిణామాలతో రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. పంజాబ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆప్ రోజురోజుకు బలపడుతున్నట్లు కనిపిస్తోంది.  2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీని సాధించింది. 10 సంవత్సరాల తర్వాత SAD-BJP ప్రభుత్వాన్ని గద్దె దించింది. 117 మంది సభ్యుల పంజాబ్ శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాలను గెలుచుకుని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్‌  15 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది, బీజేపీ 3 సీట్లకే పరిమితమైంది. పంజాబ్ లో ఈసారి కాంగ్రెస్, ఆప్ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ మరోసారి పవర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. ఆ పార్టీ వర్గపోరుపైనా విజయాలు ఆధారపడి ఉన్నాయంటున్నారు. ఇక బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా సింగిల్ డిజిట్ దాటకపోవచ్చని వివిధ సర్వే సంస్థల అంచనాల్లో తేలుతోంది. శిరోమణి అకాలీదళ్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.  మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ ఎవరి ఓట్ బ్యాంకు ను చీలుస్తారనేది మరో ఆసక్తి కర ఈక్వేషన్ గా మారుతోంది.  మిషన్ పంజాబ్  కింద  కేజ్రీవాల్ వచ్చే తమ సీట్లను పెంచుకోవటంతో పాటుగా అధికారం దక్కించుకొనే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ సారి ఆప్ ఇక్కడ మహిళా ఓటర్ల మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. పంజాబ్ లో ఎలాగైనా పాగా వేయాలనే సంకల్పంతో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అక్కడ మహిళా ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం మొదలు పెట్టారు. పంజాబ్‌లో ఆప్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్రంలోని ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలలో రూ.1,000 జమ చేస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. కేజ్రీవాల్ ఈ నినాదం పంజాబ్ ఓటర్లలో ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. రోజు రోజుకు ఆప్ బలపడుతుందని చెబుతున్నారు.  పంజాబ్ లో మరోసారి విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే వర్గ పోరు ఆ పార్టీకి నష్టం కల్గించవచ్చని అంటున్నారు. పీసీసీ చీఫ్ గా నవజ్యోత్ సింగ్ సిద్ధూను నియమిచడంతో కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా తప్పుకున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరుతారని భావించినా.. కొత్త పార్టీ పెట్టారు. అమరీందర్ సింగ్ వెంట ఎక్కువగా కాంగ్రెస్ నేతలే వెళ్లారు. దాంతో ప్రస్తుత ముఖ్యమంత్రి, సిద్దూ మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది. సీఎంతో పడకపోవడం వల్లే పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ గతంలో రాజీనామా ప్రకటించారు. హైకమాండ్ బుజ్జగించడంతో మళ్లీ వెనక్కి తగ్గారు. అయినా పార్టీలో కోల్డ్ వార్ కొనసాగుతోందని తెలుస్తోంది. పంజాబ్ లో కాంగ్రెస్ కు మంచి అవకాశాలు ఉన్నా.. ఆ పార్టీలో నెలకొన్న వర్గపోరు కొంప ముంచే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ నేతలంతా కలిసి పనిచేస్తే మాత్రం గెలవవచ్చని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. పంజాబ్ లో బీజేపీ పరిస్థితే దారుణంగా కనిపిస్తోంది. పంజాబ్ లో పాగా వేసేందుకు కమలనాధులు ఎన్ని ఎత్తులు వేసిన ఫలించడం లేదంటున్నారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో బీజేపీపై రైతులు తీవ్ర కోపంగా ఉన్నారు. బిల్లులను రీకాల్ చేసుకున్నా కమలంపై కర్షకుల్లో ఆగ్రహం మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. అందుకో పంజాబ్ పై బీజేపీ పెద్దలు ఆశలు వదులుకున్నారని, కొత్త పార్టీ పెట్టిన అమరీందర్ సింగ్ పైనే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. పంజాబ్ లో ఈసారి కెప్టెన్ అమరీందర్ సింగ్  కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారని సన్నిహితులు చెబుతున్నారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతే కొత్త పార్టీని ఏర్పాటు చేసుకున్న అమరీందర్ సింగ్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నారు. అలాగే శిరోమణి అకాలీదళ్ చీలికవర్గంతో వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఉండే అవకాశముందని ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. పొత్తు సాధ్యంకాని పక్షంలో అన్ని స్థానాల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలో నిలుస్తుందని ప్రకటించారు.  మొత్తంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతానికి కాంగ్రెస్- ఆప్ మధ్య పోటీ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమకు ఆశలు లేవని గ్రహించిన బీజేపీ... కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీతో పొత్తు ద్వారా కొన్ని సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పంజాబ్ రాజకీయాలను శాసించిన అకాలీదళ్ మాత్రం ఈసారి రేసులో లేకుండా పోయిందని తెలుస్తోంది. 

మోదీ మెచ్చిన ర‌ఘురామ‌.. భుజం త‌ట్టిన ప్ర‌ధాని.. బీజేపీలో చేరిన‌ట్టేనా?

న‌ర్సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. ఢిల్లీలోనే ఉంటున్నారు. నిత్యం మీడియాతో మాట్లాడుతుంటారు. సీఎం జ‌గ‌న్‌రెడ్డిని, వైసీపీ స‌ర్కారును ఏకిపారేస్తుంటారు. ప్ర‌భుత్వ‌ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నిల‌దీస్తుంటారు. ప్ర‌తీ విష‌యంలోనూ త‌న సుస్ప‌ష్ట అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తుంటారు. త‌న‌పై కేసులు పెట్టినా.. సీఐడీ అరెస్ట్ చేసినా.. క‌స్ట‌డీలో థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించినా.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌ బెదిరింపుల‌కు అస‌లేమాత్రం అద‌ర‌లేదు..బెద‌ర‌లేదు..దూకుడు త‌గ్గించ‌లేదు.  ఆ.. ఏదో మాట్లాడుతుంటారు.. ఎవ‌రు ప‌ట్టించుకుంటారులే అనుకోడానికి లేరు. ఏపీలో ర‌ఘురామ‌కు ఫుల్ ఫాలోయింగ్‌. టీవీల్లో ర‌ఘురామ లైవ్ ఎప్పుడు వ‌స్తుందోనని ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు చాలామంది. ఫ‌లానా టాపిక్‌పై ర‌ఘురామ కామెంట్ ఏంట‌ని గూగుల్‌లో సెర్చ్ చేసే వారూ ఉన్నారు. ఇలా ర‌ఘురామ క్రేజ్ ఏపీలోనే కాదు.. ఢిల్లీలోనూ ఫుల్ పాపులారిటీ ఉంది. ఏకంగా ప్ర‌ధానమంత్రి మోదీనే.. ర‌ఘురామ‌ను పేరు పెట్టి ప‌ల‌క‌రించి.. కొన్ని క్ష‌ణాలు ఆయ‌న‌తో మాట్లాడి.. భుజం త‌ట్టి ఎంక‌రేజ్ చేశారంటే మామూలు విష‌య‌మా? ర‌ఘురామ‌నా మ‌జాకా! పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎంపీ రఘురామకృష్ణరాజును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘురామకృష్ణ రాజు  హాజరయ్యారు. ముందు వరసలో కూర్చున్న ఎంపీ రఘురామను ముందుగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలకించారు. ఆ తరువాత అటుగా వచ్చిన ప్రధాని మోదీ.. రఘురామకృష్ణరాజును పేరు పెట్టి పిలిచి కొంచెం సేపు నిలబడి భుజం తట్టి వెళ్లారు.  ర‌ఘురామ బీజేపీలో చేరుతారంటూ చాలా రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా మోదీ అంత‌టివారే.. ర‌ఘురామ‌కు అంత‌టి ప్రాధాన్యం ఇవ్వ‌డంతో.. ర‌ఘురామ కాషాయ కండువా క‌ప్పుకోవ‌డం ప‌క్కా అంటున్నారు. రఘురామ ఈ సంవత్సరం చివర్లో వైసీపీకి, పార్లమెంట్ సభ్యత్వాని రాజీనామా చేసి, డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి రోజున బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ తర్వాత నెక్ట్స్‌ ఇయర్ ఫిబ్రవరి మార్చి నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు  జరిగే  ఉపఎన్నికల్లో నర్సాపూర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని పార్టీ వర్గాల ద్వారాతెలుస్తోంది. నిజానికి, అమిత్ షా ఏపీ పర్యటనకు ముందే, ఆయన అభిమానులు  ‘ట్రిపుల్  ఆర్’గా పిలుచుకుంటున్న రఘురామ కృష్ణంరాజు, పార్టీ ఎంట్రీకి సంబందించిన స్కెచ్ సిద్దమైందని తెలుస్తోంది. గతంలో చాలా కాలం క్రితమే ఆయన బీజేపీలో చేరేందుకు అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా వద్ద సంసిద్ధతను వ్యక్త పరిచారు. అయితే, అప్పట్లో ఒకరిద్దరు రాష్ట్ర నాయకులు అడ్డుపుల్లలు వేయడంతో ఆ ప్రయత్నం అప్పట్లో ఆగిపోయిందని పార్టీ వర్గాల సమాచారం.     నిజానికి, రఘురామ కృష్ణం రాజు వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిననాటి నుంచి కమల దళంతో, కాషాయ కూటమి, సంఘ్ పరివార్’తో రాసుకు పూసుకు తిరుగుతున్నారు. బీజేపీ నాయకులనే కాకుండా ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలతో అనేక సందర్భాలలతో సమావేశ‌మయ్యారు. అనేక సందర్భాలలో బీజేపీ హిందుత్వ ఎజెండాను తన‌నోటితో వినిపించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం మత వివక్షకు పాల్పడుతోందని విమర్శించారు. తిరుపతి వెంకన్న స్వామి ఆస్తుల విక్రయానికి టీటీడీ చేసిన తీర్మానాన్ని బహిరంగంగా వ్యతిరేకించడంతోనే రెబెల్ ఎంపీ రాజు తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో నిబంధనలకు వ్యతిరేకంగా జరుగతున్న మత ప్రచారం, మత మార్పిడులకు సంబంధించి, ప్రధానికి, రాష్ట్రపతికి ఫిర్యాదులు, విజ్ఞాపనలు అందజేశారు.    అదలా ఉంటే ఇంచుమించుగా ఒక సంవత్సరానికి పైగానే, ఆయన ప్రతి రోజు రచ్చబండలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. చురకలు అంటిస్తున్నారు. వాతలు పెడుతున్నారు. చివరకు దమ్ముంటే, తన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించాలని, జగన్ రెడ్డికి సవాల్ విసిరారు. వైసీపీ కూడా, ఆయన్ని అనర్హునిగా ప్రకటించాలని కోరుతూ లోక్ సభ స్పీకర్’కు విజ్ఞప్తి చేసింది. మరో వంక జగన్ రెడ్డి ప్రభుత్వం రఘురామ పై కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. జైలుకు పంపింది. బైలు రాకుండా అడ్డుకుంది. అంతే కాదు, జైలులో  చిత్ర హింసలకు గురిచేసిందని ఆయన కోర్టులో కేసు వేశారు.ఇలా జగన్ రెడ్డిపై ఓ వంక రాజకీయ పోరాటం, మరో వంక న్యాయపోరాటం చేస్తున్నారు.మొత్తానికి వార్తల్లో ఎంపీ గా అందరి నోళ్ళలో నలుగుతున్నారు. జగన్ రెడ్డికి పంతికిండి రాయిలా, కంట్లో నలుసులా ఇబ్బంది పెడుతున్నారు.  ఇక ఇప్పుడు, స్వయంగా అమిత్ షా ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్ళను పార్టీలోకి తెచ్చుకుని వారికి సముచిత స్థానం కలిపించాలని, ఆ విధంగా రాష్ట్రంలో బీజేపీని, 2024 ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా బలోపేతంచేయాలని రాష్ట్ర నాయకులకు క్లాసు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో.. అందుకు తొలి అడుగుగా ‘ట్రిపుల్ ఆర్’తో అమిత్ షానే శ్రీకారం చుట్టారని అంటున్నారు. లేటెస్ట్‌గా ప్ర‌ధాని మోదీ సైతం ర‌ఘురామ‌ను గోఅహెడ్ అన్న‌ట్టు భుజం త‌ట్ట‌డం ఆస‌క్తిక‌రం. జ‌గ‌న్‌రెడ్డిపై ర‌ఘురామతో కాషాయ దండ‌యాత్ర త‌ప్ప‌దంటున్నారు. 

ఏపీకి అప్పు ఇవ్వకండి.. మొన్న ఏఐఎంఈడీ, నేడు టీహెచ్‌ఎస్ఏ ‘రెడ్‌ నోటీస్‌’

‘వైద్య రంగంలో విప్లవమే తెచ్చాం’ ... ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సగర్వంగా చేసిన ప్రకటన ఇది. గురువారం రాష్ట్ర శాసన సభలో వైద్య శాఖపై జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి,  చాలా విషయాలు చెప్పారు, అనేక  విజయాలను ఉటంకించారు. అన్నిటినీ మించి ప్రజల ప్రాణాలకు విలువనిచ్చే మనసున్న ప్రభుత్వం తమదని మరో కితాబు తొడిగేసుకున్నారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, వైసీపే ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య  సేవలు,సదుపాయాలను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకు పోయిందో, ముందుముందు ఇంకెంత ముదుకు తీసుకు పోతుందో కూడా వివరించారు. “ఆరోగ్యశ్రీలో గతంలో 1059 వ్యాధులే కవర్‌ అయ్యేవి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని 2466కు పెంచాం. మధ్యతరగతి వారిని కూడా ఈ పథకంలోకి తెచ్చేందుకు ఏడాదికి రూ.5లక్షల ఆదాయం ఉన్నవారికీ ఆరోగ్యశ్రీ కార్డులిచ్చాం. రూ.12లక్షల వరకూ ఖర్చయ్యే వ్యాధులనూ పథకంలోకి తెచ్చాం. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ రాష్ట్రంలో 11 బోఽధనాసుపత్రులు ఉంటే, మేం కొత్తగా 18 బోధనాసుపత్రులు నిర్మిస్తున్నాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలోను ఇద్దరు డాక్టర్లుండేలా విధానం తెస్తున్నాం. ఒక డాక్టరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంటే ఇంకో డాక్టరు మొబైల్‌ క్లినిక్‌లో ఉంటారు. ఆ డాక్టరు తన పరిధిలోని నాలుగైదు గ్రామాలకు నెలకు నాలుగైదు సార్లు వెళ్లాడు. అంటే అతను బాధితులకు ఒక ఫ్యామిలీ డాక్టర్‌లా ఉంటాడు. దీనికోసం కొత్తగా 462 వాహనాలు కొనుగోలు చేస్తున్నాం. ఇవన్నీ ఆరు నెలల్లో అమల్లోకి వస్తాయి’ అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చాల గంబీర్ ఉపన్యాసమే చేశారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు, ఇందులో ఏది నిజమో ఏది కాదో కానీ, ఇదే వైద్య రంగానికి సంబంధించి ఒక నిండు నిజాన్ని మాత్రం ఆయన చెప్ప లేదు దాచేశారు.  ఓ పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖకు, ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు ఏ కంపెనీ కూడా వైద్య పరికరాలు సరఫరా చేయవద్దు అంటూ వైద్య పరికరాల ఉత్పత్తి దారుల జాతీయ యూనియన్‌ (ఏఐఎంఈడీ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ‘రెడ్‌ నోటీస్‌’ జారీ చేసింది. వైద్య పరికరాలు సరఫరా చేసే కంపెనీలు.. ఆంధ్రాతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆ నోటీసులో గట్టి సూచనలు చేసింది.అంతేకాదు, ఏపీకి అప్పిస్తే అ అప్పు ఇక వసూలు కాదని, మోడ్ని బకాయిలలో చేరిపోతుందని ఒక సున్నిత సూచన చేసింది.  ఇప్పటికే దివాలా అంచులలో ఉన్న రాష్ట్రం చేతులెత్తేస్తే అందుకు ఏఐఎంఈడీ బాధ్యత వహించదని, స్పష్టం చేసింది. ఏఐఎంఈడీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో, అసలు రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడిన అప్పు ఎంతో , రాష్ట్రం పరువును ఇలా దేశం వీద్దుల్లోకి తెచ్చిన ఏఐఎంఈడీ‘రెడ్‌ నోటీస్‌’ఫై తీసుకున్న చర్యలు ఏమిటో  మాత్రం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సభకు తెలియచేయలేదు. ప్రజలతో పంచుకోలేదు.  అంతే కాదు, ముఖ్యమంత్రి వైద్య రంగంలో విప్లవమే తెచ్చాం’అని గంభీర ఉపన్యాసం దంచుతున్న సమయలోనే, లేదా కొంచెం తతో ఇటుగా, ఏఐఎంఈడీ తరహాలోనే ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ (టీహెచ్‌ఎ్‌సఏ) కూడా, ఏపీకి ఒక్క పైసా అప్పుకూడా ఇవ్వద్దని, అప్పు  మీద మెడికల్ పరికరాలు, మందులు ఏవీ కూడా సరఫరా చేయవద్దని అసోసియేషన్ సభ్యులను హెచ్చరిస్తూ లేఖ రాసింది.  ఈఎ్‌సఐకి సంబంధించి రూ.200 కోట్లు బకాయిలున్నాయని... ఇంకెవరూ సరఫరాలు చేయవద్దని సభ్యులకు సూచించింది. నిజానికి... ఈఎ్‌సఐకి కేంద్రం అవసరమైనన్ని నిధులు ప్రతి ఆరు నెలలకు ఒక సారి విడుదల  చేస్తోందని, గడచిన ఆరు మాసాల కాలానికి కూడా రూ.92 కోట్లు విడుదల చేసిందని టీహెచ్‌ఎ్‌సఏ పేర్కొంది. కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించడం వల్లనే ఈఎస్ఐ బకాయిలు, ఏకంగా రూ.200 కోట్ల రూపాయలకు చేరాయని టీహెచ్‌ఎ్‌సఏ లేఖలో పేర్కొంది, నిజానికి, ఇది ఒక్క వైద్య ఆరోగ్య శాఖలో మాత్రమే సాగుతున్న దారి దోపిడి కాదు, జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద వచ్చే నిధులు ఏవీ కూడా సక్రమంగా వినియోగం కావడం లేదనే అభియోగం ప్రజా కోర్టులో వినిపిస్తూనే ఉంది. అలాగే, ఈఎ్‌సఐ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే కంపెనీలకు సక్రమంగా బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవు. టీహెచ్‌ఎ్‌సఏ లేఖతో రాష్ట్రంలోని ఈఎ్‌సఐ బకాయిల బాగోతం మొత్తం బయటపడింది.  టీహెచ్‌ఎ్‌సఏలేఖలో ప్రస్తావించిన అంశాలు అన్నీ నిజమే అయితే, ప్రభుత్వానికే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా చాల అవమానకరం అంటున్నారు, అసోసియేషన్ అధ్యక్షుడు సభ్యులను ఉద్దేశించి రాసిన  లేఖలో.. ‘‘విజయవాడలోని డైరెక్టర్‌ అఫ్‌ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసె్‌సలో బిల్లులు చెల్లింపు ఇబ్బందిగా ఉంది.మొత్తంగా రూ.200 కోట్లు బకాయిలున్నాయి. ఇలాంటి రిస్క్‌ సమయాల్లో మనం వ్యాపారం చేసుకోలేం. టీహెచ్‌ఎ్‌సఏ సభ్యులందరూ వెంటనే సప్లయ్స్‌ మొత్తం నిలిపివేయండి’’ అని పేర్కొన్నారు.  ఈ అసోసియేషన్‌ సభ్యులు పలుమార్లు ఈఎ్‌సఐ డైరెక్టర్‌ను కలిశారు. డైరెక్టర్‌ కొన్నిసార్లు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో విసుగు చెందిన సరఫరాదారులు కార్మిక శాఖ మంత్రికి, ముఖ్య కార్యదర్శికి, డైరెక్టర్‌కు అనేకసార్లు లేఖలు రాశారు. అయినా ఫలితం లేకపోడంతో.. మందులు, వైద్య పరికరాల సరఫరా నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు... ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం (పీఎంవో) దృష్టికి కూడా తీసుకెళ్లాలని తీర్మానించారు. అయితే, ఈఎస్ఐ బిల్లులు మొత్తం ప్రాసె్‌సలో పెట్టాం. టీహెచ్‌ఎ్‌సఏ లేఖపై విచారణ చేస్తాం. టీహెచ్‌ఎ్‌సఏలో ఈఎస్ఐ రేటు కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్న కంపెనీలు లేవు. ఇలాంటి అసోసియేషన్‌ ఉందన్న విషయం కూడా తెలియదు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని అధికారులు చెపుతున్నారు. ఏది ఏమైనా .. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు ఇంట ఘనంగా ఉన్నాయో కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. కొవిడ్ సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లో రోగులను ఆపేసిన ఉదంతాలను గుర్తు చేసుకున్నా, తాజాగా గవర్నర్ దంపతులు కొవిడ్ చికిత్సకు హైదరాబాద్ వెళ్ళక తప్పని పరిస్థితి గుర్తు చేసుకున్నా, ఏపీలో వైద్య సదుపాయాలు ఎంత చక్కగా ఉన్నాయో, వేరే చెప్పనక్కర్లేదు అంటున్నారు,

సింగం పోలీస్ ఛేజింగ్‌.. దొంగ‌ల‌ను వెంబ‌డించి పట్టుకున్న ఎస్పీ..

పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు రోల్ మోడ‌ల్‌ సింగం మూవీ. ఛేజింగ్‌లు, ఫైటింగ్‌లతో ఖాకీ డ్రెస్ ప‌వ‌ర్ చూపించిన సినిమా అది. అచ్చం.. ఆ సినిమా త‌ర‌హాలోనే న‌డిరోడ్డుపై ఛేజ్ చేశారు జిల్లా ఎస్పీ. దొంగ‌ల‌ను ప‌ట్టుకునేందుకు.. ధైర్య‌సాహసాలు ప్ర‌ద‌ర్శించారు. ఎస్పీ అంటే చెమ‌ట ప‌ట్ట‌ని ప‌ని.. న‌ల‌గ‌ని డ్రెస్సు.. ఏసీ గ‌దుల‌కే ప‌రిమితం కాద‌ని.. నిరూపిస్తే.. సింగం హీరో త‌ర‌హాలో రోడ్ల‌పై చిరుత‌లా ప‌రుగెత్తారు. పారిపోతున్న దొంగ‌ను ప‌ట్టుకున్నారు. ఇంత‌కీ ఈ సీన్‌.. ఎక్క‌డ‌, ఎలా జ‌రిగిందంటే....   తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలో జ‌రిగిందీ ఛేజింగ్‌. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాటూ షాప్ నిర్వ‌హిస్తున్న స‌తీశ్‌ను.. ముగ్గురు దొంగ‌లు కత్తులతో బెదిరించి షాపులో ఉన్న సొమ్ము దోచుకున్నారు. ఆ డ‌బ్బుతో బైక్‌పై పరారయ్యారు. అదే టైమ్‌లో.. అటువైపు వాహనంలో వెళ్తున్న జిల్లా ఎస్పీ సెల్వకుమార్ ఆ దొంగ‌ల‌ను చూశారు. పోలీస్ వెహికిల్‌తో వెంట‌ప‌డ్డారు.  పోలీసు వాహనాన్ని చూసిన దొంగ‌లు స్పీడ్ పెంచి ప‌రాపోయే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఓవ‌ర్‌స్పీడ్‌తో బండి కంట్రోల్ చేయ‌లేక అదుపు తప్పి పడిపోయారు. ఒకడు అదే బైక్‌ మీద ఉడాయించగా.. మ‌రో ఇద్దరు దొంగ‌లు పరుగు అందుకున్నారు. అలా పారిపోతున్న దొంగ‌ల‌ను చూసి.. ఎస్పీ సైతం వాహ‌నం దిగి.. వారి వెంట ప‌రుగెత్తాడు. మంచి ఫిట్‌గా ఉన్న ఎస్పీ.. వేగంగా ప‌రుగెత్తి.. ఓ దొంగ‌ను ప‌ట్టుకున్నాడు. తప్పించుకున్న మరో దొంగ‌ను గంటలోపే పోలీసులు అరెస్ట్‌ చేశారు.  నిందితుల నుంచి 1,200 నగదు, సెల్‌ఫోన్, కత్తి, కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. వెల్లూరు నార్త్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగ‌లను అరెస్ట్‌ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్పీతో సహా పోలీసు సిబ్బందిని అంతా అభినందించారు. నిందితులంతా మైనర్లే. 

భార‌తీయుల‌కు బూస్ట‌ర్ డోస్‌?.. కేంద్రాన్ని ప్ర‌శ్నించిన ఢిల్లీ హైకోర్ట్‌..

ప్ర‌స్తుతం ఇండియా ప్ర‌శాంతంగా ఉంది. క‌రోనా కేసులు అతి త‌క్కువ‌గా ఉంటున్నాయి. కొవిడ్ టెన్ష‌న్ దాదాపు లేదు. అయినా, బిందాస్‌గా ఉండే ప‌రిస్థితి లేదు. వైర‌స్ వేరియంట్ మార్చుకొని.. ఏ రోజైనా విరుచుకుప‌డే అవ‌కాశం ఉంద‌నే అనుమానం ఉంది. విదేశాల్లో కొవిడ్ విజృంభ‌ణ చూసి.. మ‌నోళ్లు బెదిరిపోతున్నారు. రెండు డోసుల టీకా వేసుకున్నా.. చాలా మంది వైర‌స్ బారిన ప‌డుతుండ‌టం ఆందోళ‌న‌క‌ర ప‌రిణామం. అయితే, పాజిటివ్ వ‌చ్చినా ల‌క్ష‌ణాలు మామూలుగా ఉండ‌టం.. ప్రాణాప్రాయం ఉండ‌క‌పోవ‌డం ఊర‌ట‌నిచ్చే అంశం. అయితే, రెండు డోసుల వ్యాక్సిన్ ప్ర‌భావం 8 నెల‌లు మాత్ర‌మే ఉంటుంది. ఆ త‌ర్వాత టీకా ఎఫెక్ట్ తుస్సు మంటుంది. అందుకే, ఫారిన్ కంట్రీస్‌లో ఇప్ప‌టికే బూస్ట‌ర్ డోసు కూడా ఇచ్చేశారు. మ‌రి, భార‌తీయుల‌కు ఎప్పుడు బూస్ట‌ర్ డోస్‌?   తాజాగా, కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్‌ డోసు అందించే విషయమై తన వైఖరిని తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ దేశాలు తమ ప్రజలకు బూస్టర్‌ డోసు అందించాలని యోచిస్తుండగా, భారత నిపుణులు మాత్రం బూస్టర్‌ డోసు అవసరమన్న వైద్య నిరూపణ ఏమీ లేదని చెబుతున్నారు.  ఈ క్రమంలో వ్యాక్సిన్లకు సంబంధించిన కేసులో జస్టిస్‌ విపిన్‌ సంఘీ, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. రెండో ఉద్ధృతి వంటి పరిస్థితి మళ్లీ రాకూడదని కోరుకుంటున్నామని, బూస్టర్‌ డోసు అందించే విషయమై కేంద్రం తన వైఖరిని తెలియజేయాలని కోరింది. ఇదే అంశం భారత ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానం ముందు పెండింగులో ఉందని కేంద్రం తెలిపింది.   

182మందికి క‌రోనా.. ఫ్రెష‌ర్స్ డే పార్టీలో కొవిడ్ పంజా.. మెడిక‌ల్ కాలేజీలో ఆందోళ‌న‌..

మెడిక‌ల్ కాలేజీలో 66 మంది వైద్య విద్యార్థుల‌కు క‌రోనా సోకిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. వెంట‌నే అల‌ర్ట్ అయిన జిల్లా వైద్య అధికారులు.. మ‌రింత మంది విద్యార్థుల‌కు కొవిడ్ ప‌రీక్ష‌లు చేశారు. ఏకంగా 182 మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తేలింది. ఆందోళ‌న చెందిన సిబ్బంది.. మ‌రింత అప్ర‌మ‌త్తం అయ్యారు. 400 మంది స్టూడెంట్స్‌కి టెస్ట్ చేస్తే.. 182 మందికి క‌రోనా వ‌చ్చిందంటే.. ఆ కాలేజీలో మొత్తం 3000 వేల మంది ఉన్నారు. దీంతో.. ఇంకెంత మందికి వైర‌స్ సోకిందోన‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.  తాజాగా, కాలేజీలోని మొత్తం సిబ్బంది, వైద్య విద్యార్థుల‌కు కొవిడ్ టెస్టు చేయాల‌ని నిర్ణ‌యించారు. మెడిక‌ల్ స్టూడెంట్స్ అంతా ఇప్ప‌టికే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లే కావ‌డంతో.. వారిలో కొవిడ్ ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా క‌నిపిస్తున్నాయి. వారి ర‌క్త న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌కు పంపించారు. ఇలా, కర్ణాటక, ధార్వాడ్‌లోని ఎస్‌డీఎం కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. క‌రోనా సూప‌ర్ స్ప్రెడ‌ర్‌గా మారడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. వాళ్లంతా వైద్య విద్యార్థులు. కొవిడ్ గురించి, జాగ్ర‌త్త‌ల గురించి వాళ్ల‌కు బాగా తెలుసు. ఇప్ప‌టికే రెండు డోసుల టీకా కూడా వేసుకున్నారు. కాక‌పోతే క‌రోనాను కాస్త లైట్ తీసుకున్నారు. ఇటీవ‌ల కాలేజ్‌లో ఫ్రెష‌ర్స్ డే ఈవెంట్ జ‌రిగింది. అంతా హాజ‌ర‌య్యారు. మ‌స్త్ మ‌స్త్ ఎంజాయ్ చేశారు. క‌ట్ చేస్తే.. 300మంది మెడికల్ స్టూడెంట్స్‌లో 66 మందికి కొవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. అంద‌రినీ హాస్ట‌ల్‌లో ఉంచి.. గేట్ల‌కు తాళాలు వేసి.. క్వారంటైన్ చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. ఒకేసారి ఇంత‌మందికి క‌రోనా సోక‌డం.. థ‌ర్డ్ వేవ్ ఆరంభమైందా అనే అనుమానం రేకెత్తిస్తోంది. వెంట‌నే వైద్య అధికారులు అల‌ర్ట్ అయ్యారు. కర్ణాటకలోని ఎస్‌డీఎం కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఫ్రెష‌ర్స్ డే పార్టీకి హాజ‌రైన 400 మంది విద్యార్థుల్లో 300 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 66 మంది పాజిటీవ్‌గా తేలింది. తాజాగా మరిన్ని టెస్టులు చేస్తే.. ఆ సంఖ్య 182కి పెరిగింది. సమాచారం తెలుసుకొన్న అధికారులు వెంటనే ముందు జాగ్రత్త చర్యగా కాలేజీలోని రెండు హాస్టళ్లను మూసివేశారు. ఎవరినీ బయటకు వెళ్లనీయడంలేదు. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో ఉన్నారు జిల్లా వైద్యాధికారులు.   క‌ర్నాట‌క‌లోనే కాదు.. ఒడిశాలోని విమ్సార్‌లోని మెడిక‌ల్ కాలేజీలోనూ ఇలానే క‌రోనా క‌ల‌క‌లం రేగింది. 54మందికి కొవిడ్ సోకింది. వైరస్ బారినపడిన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పది రోజుల పాటు క్లాసులు సస్పెండ్ చేశారు. ఈ రెండు ఘటనలు ఇటీవల ఆయా కాలేజీల్లో నిర్వ‌హించిన‌ ఈవెంట్ వ‌ల్లే జ‌ర‌గ‌డం ఆస‌క్తిక‌రం. అందుకే, క‌రోనా లేద‌ని బిందాస్‌గా ఉండ‌కుండా.. కొవిడ్ ప్ర‌మాదం ఇంకా పూర్తిగా తొల‌గిపోలేద‌ని జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. గ్రూప్ యాక్టివిటీస్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 

భువనేశ్వరి మాట.. జగన్ కు షాక్.. పైకి లేచిన బావి.. పాతబస్తిలో కమలం.. టాప్ న్యూస్@1PM

శాసనసభలో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి  తొలిసారి స్పందించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల స్పందించి నిరసన తెలియజేసిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనకు జరిగిన అవమానం మరెవ్వరికీ జరగకూడదని అన్నారు. చిన్నతనం నుంచి తమ అమ్మానాన్న విలువలతో పెంచారని చెప్పారు. నేటికీ మేం వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం అందరూ కృషి చేయాలి అన్నారు. తనకు జరిగిన ఈ అవమానం ఎవరికీ జరగకూడదని  భువనేశ్వరి పేర్కొన్నారు. ------ గుంటూ జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటన మూడవ రోజు కొనసాగుతోంది. ముందుగా లోకేష్ మంగళగిరిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పర్యటనను ప్రారంభించారు. ఇటివల మృతి చెందివ పలువురు కార్యకర్తలు కుటుంబాలను టీడీపీ నేత పరామర్శించారు. లోకేష్ పర్యటనలో టీడీపీ నేతలు భారీగా పాల్గొంటున్నారు.  ----- వరదల్లో 60 మంది చనిపోయారని... తిరుపతిలో చెరువుల ఆక్రమణ వల్లే ఆస్తి నష్టం కలిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం గాడిదలు కాస్తుందా అని ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వంలో డ్యామ్‌ల గేట్లు పనిచేయవని విమర్శించారు. మానవ తప్పిదం వల్లే వరదల్లో ప్రాణ నష్టం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని... పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేలు ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.  --------- ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు కాపు సంక్షేమ సేన అధ్య‌క్షుడు మాజీ మంత్రి హ‌రిరామ జోగ‌య్య లేఖ‌ రాశారు. రైతుల‌ కోసం రైతు న‌వ‌ర‌త్నాలు పేరుతో 9 డిమాండ్ల‌ను లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో నిత్య‌వ‌సరాల రేట్లు విప‌రీతంగా పెరిగిపోయాయని.. జీవించ‌డ‌మే క‌ష్టంగా మారిందన్నారు. తెల్ల‌రేష‌న్ కార్డు దారుల‌కు నెల‌కు 3వేలు ఆర్థిక సాయం చేయాలన్నారు. కాపు రిజ‌ర్వేషన్ల‌పై ముఖ్య‌మంత్రికి లక్ష ఉత్త‌రాలు రాశామని... అయినా ముఖ్య‌మంత్రి జగన్‌కి స్పందించ‌లేదన్నారు హ‌రిరామ జోగ‌య్య.  --- ఉద్యోగుల సమస్యలపై మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం చర్చించారు. వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా ఐఆర్ పెంచి ఇవ్వడం సంతోషమన్నారు. అయితే పీఆర్సీ ఎప్పుడు ఇస్తారనేది స్పష్టం చేయడం లేదన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చిందని... ‌కానీ ఇప్పటిదాకా ఆ ఊసే లేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను చీడ పురుగుల్లా చూస్తోందని బాల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు ఉద్యోగుల సమస్యలపై కాగితాలు ఇచ్చి ఇక అలసిపోయామన్నారు ------- తిరుపతి శ్రీకృష్ణ నగర్‌లో వింత చోటు చేసుకుంది. భూమిలోనుంచి 25 అడుగుల బావి పైకి చొచ్చుకొచ్చింది. నిట్టనిలువుగా 11 ఒరలు పైకి వచ్చాయి. అనుకోని పరిణామంతో స్థానికులు అవాక్కవుతున్నారు. ఈ వింతను చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గత వారం రోజులుగా శ్రీకృష్ణనగర్‌ భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో ఈ వింత జరిగింది. --- తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన పాతబస్తీలోని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాష్ట్ర పదాధికారులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. శాసనసభా పక్షనేత రాజాసింగ్, డీకే అరుణ, లక్ష్మణ్,  పొంగులేటి, విజయశాంతి, వివేక్, ప్రధాన కార్యదర్శులు, ఇంద్రసేనారెడ్డి, ఎంపీ సోయం బాపూరావు తదితరులు హాజరయ్యారు. కాగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి బండి సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు.  ---- వరి కొనుగోలు కేంద్రం వద్ద ఓ రైతు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన కుమ్మరి రాజయ్య గుండె పోటుతో వరి కొనుగోలు కేంద్రం వద్ద మృతి చెందాడు. కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన వడ్ల కుప్పను ఒక దగ్గరకు చేసి రాజయ్య అక్కడే కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ---- కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనకు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఢిల్లీ సరిహద్దులు రైతుల ఆందోళనలతో మార్మోగాయి.మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని గత వారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రైతు సంఘాలు ఈ చర్యను స్వాగతిస్తున్నాయని, అయితే చట్టాలను అధికారికంగా రద్దు చేసి ఇతర డిమాండ్లను నెరవేర్చే వరకు తమ నిరసనను విరమించేది లేదని రైతులు ముక్తకంఠంతో చెప్పారు. -----  జమ్మూ కశ్మీర్‌ పూంచ్‌లోని భింబర్ గలి ప్రాంతంలో గురువారం అర్థరాత్రి పాక్ ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది.భీంబర్ గలి ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేసేందుకు భారత ఆర్మీ అధికారులు గురువారం అర్థరాత్రి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పాక్ ఉగ్రవాది హతమయ్యాడు.సరిహద్దుల్లో మరణించిన ఉగ్రవాది నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భారతసైనికులు స్వాధీనం చేసుకున్నారు.

భూమిలో నుంచి పైకి వచ్చిన బావి.. తిరుపతిలో వింత ఘటన!

టెంపుల్సిటీ తిరుపతిలోని శ్రీకృష్ణనగర్లో వింతఘటన జరిగింది. భూమిలో నిర్మించిన వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా భూమిపైకి వచ్చేసింది. శ్రీకృష్ణనగర్లోని ఓ ఇంటి ఆవరణలో 25 అడుగుల లోతులో 18 సిమెంట్ వరలతో ట్యాంకు నిర్మించుకున్నారు. ఆ ట్యాంక్లోని సిమెంట్ వరలు 11 అడుగుల మేర నిట్ట నిటారుగా బూమిపైకి వచ్చేశాయి. ఈ వింత సంఘటనను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఏమి జరుగుతుందో అని ఒక్కసారిగా వారంతా భయాందోళనకు గురయ్యారు. ముందుగా వాటర్ ట్యాంక్ సమీపంలో పెద్ద శబ్దం వచ్చిందని, ఆ వెంటనే ట్యాంకులోని వరలు ఉన్నవి ఉన్నట్లు పైకి వచ్చేశాయని ఇంటి యజమానురాలు చెప్పారు. దీంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తాను ట్యాంకు లోపలికి దిగి శుభ్రం చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు. వరలు ఒక్కసారిగా పైకి వస్తుండడంతో తాను బయటకు వచ్చే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఆ క్రమంలో తనకు స్వల్ప గాయాలు తగిలాయని చెప్పారు. ఒక్కసారిగా ట్యాంకు పైకి లేస్తుండడంతో ఎంతో భయపడ్డానని, సాయం కోసం పెద్దగా కేకలు వేశానని ఆమె చెప్పారు. భూమిలోపలి నుంచి బయటకు వచ్చిన ట్యాంక్ చెక్కు చెదరకుండా నిటారుగా నిలిచి ఉంది. ఇది సహజ పరిణామమే అని అధికారులు చెబుతున్నారు. వారం రోజులుగా కురిసిన వర్షాల వల్ల భూమి లోపలి పొరలు బాగా నానిపోయి,  వాటర్ ట్యాంక్ ఉబికి వచ్చిందని వారు అంటున్నారు. భారీ వర్షాల కారణంగానే ఈ వింత సంఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.