బుగ్గన మాటలకు అర్థాలు వేరులే..
posted on Nov 23, 2021 @ 1:01PM
“విశాఖపట్నం రాష్ట్రంలోనే పెద్ద నగరం. అక్కడ అన్ని సదుపాయాలున్నాయి. అనుసంధానత ఉంది. ఉక్కు కర్మాగారం, తూర్పు నౌకాదళ్ కమాండ్, షిప్’యార్డ్ ... ఇంకా .. అనేక పరిశ్రమలున్నాయి.దేశంలోని అన్ని ప్రాంతాల, అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ జీవిస్తున్నారు. కొద్దిపాటి తోడ్పాటు అందిస్తే తూర్పు కోస్తాలోనే అది అతి పెద్ద నగరం అవుతుంది. ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది. అందుకే, అక్కడి నుంచి పరిపాలన చేపట్టాలని నిర్ణయించాము” ఇవి ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలిలో రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలికిన పలుకులు.
అయితే, అదే సమయంలో ఆయన మరో ముచ్చట కూడ చెప్పు కొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్లనే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు అభివృద్ధిలో వెనక బడ్డాయని జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ, వికేంద్రీకరణ అవసరమని శివరామ కృష్ణన్ కమిటీ చెప్పాయని .. చెప్పుకొచ్చారు. నిజమే, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు.
అయితే ఇలా ముందు చెప్పిన దానికి ... అందుకు కొనసాగింపుగా చెప్పుకొచ్చిన ముక్తాయింపుకు మద్య ఎక్కడా పొంతన కుదరడం లేదని, అంటున్నారు. నిజానికి, ఇది ఒక్క బుగ్గన మాటల్లోనే కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైసేపీ మంత్రులు, ఇతర నాయకులు అందరి మాటల్లోనూ ఈ వైరుధ్యం ఉంటుందననేది, అందరూ అనే మాట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయాన్నే తీసుకుంటే, నిన్న (సోమవారం౦) శాసన సభలో ఇదే విషయంపై మాట్లాడుతూ, హైదరబాద్’కు ధీటుగా ఎదిగే అవకాశం ఒక్క విశాఖపట్నం నగరానికి మాత్రమే ఉందని అన్నారు. మరో వంక అదే ముఖ్యమంత్రి,అదే మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్’లోనే అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్లనే, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగిందని అన్నారు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకే ఇప్పటికే అభివృద్ధి విశాఖపట్నం నగరాన్ని ఇంకా అభివృద్ధి చేద్దామని అంటున్నారు.
ఇలా ముఖ్యమంత్రి, మంత్రులు వికేంద్రీకరణ జపం చేస్తూ అందుకు విరుద్ధంగా విశాఖ నగరాన్ని భివృద్ధి చేయాలని, విశాఖ నగరాన్ని మరో హైదరాబద్ నగరం అంతభివ్రుద్ధి చేయాలని అనడం పట్ల రాజకీయ వ్యాఖ్యాతలు,ఆర్థిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్న తీరుగమనిస్తే, వారికి వికేంద్రీకరణ అంటే ఏమిటో తెలియక పోవడం అయినా కావాలి ... కాదంటే వికేద్రీకరణ విషయంలో చిత్తశుద్ది లేకపోవడం అయినా కారణం కావచ్చని అంటున్నారు.
అలాగే రాజకీయ పరిపాలన వికేంద్రీకరణ ఎలా ఉండాలి అన్నది రాజ్యాంగమే నిర్దేశించింది. కేంద్ర ప్రభుత్వం మొదలు గ్రామపంచాయతీ వరకు వికేంద్రీకృత పరిపాలన విధానంలో చిన్న చిన్న లోపాలున్నా, పట్ల మీదనే నడుస్తోంది. అదలా ఉంటే. పరిపాలన వికేద్రీకరణ, ఆర్థిక వికేద్రీకరణ మధ్య ఉన్న సన్నని గీతను జగన్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేసపూర్వకంగా మరిచి పోవడం వల్లనే ఈ గందరగోళం ఏర్పడుతోందని నిపుణులు అంటున్నారు.
ఒకే రాజదాని ఉన్నా, అది ఆర్థిక వికేద్రీకరణకు అడ్డం కాదు. అమరావతి ఒకటే రాజధానిగా ఉన్నా ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతానికి అనువైన పరిశ్రమలను స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కలిపించవచ్చని, నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం మనసులో రియల్ ఎస్టేట్ కాలు కంటూ పైకి వికేద్రీకరణ జపం చేస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ ధోరణి వలన అభివృద్ధి కుంటుపడడమే కాకుండా ప్రాంతీయ అసమానట్లు తలెత్తి, ప్రత్యేకవాదం, వేర్పాటు వాదం సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు