ఢిల్లీలో ఏమి జరిగింది.. కేసీఆర్ మౌనం దేనికి సంకేతం?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు . వచ్చారు. వెళ్ళే టప్పుడు ఏమి పట్టుకు వెళ్ళారో ఏమో కానీ, వచ్చేటప్పుడు మాత్రం వట్టి చేతులతో వచ్చారు. కేంద్రం పై ‘వరి వార్’ (యుద్ధం) ప్రకటించి మంది మార్బలంతో ప్రత్యేక ఫ్లైట్ ఎక్కి, హస్తినకు వెళ్లి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఎదుకనో ఢిల్లీలో ఉన్న మూడు రోజులు మౌనంగానే ఉన్నారు. హైదరబాద్ వచ్చిన తర్వాత కూడా సైలెంట్’ గానే ఉన్నారు. ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రేమే కాదు ఆయన వెంట ఢిల్లీ వెళ్లి వచ్చిన, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర యుద్ద వీరులు ఎవరూ కూడా మీడియాకు ఢిల్లీ కబుర్లు చెప్పలేదు. ఢిల్లీ వెళ్ళని మంత్రి యర్రబెల్లి దయాకర రావు ఒక్కరే ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్రపై స్పందించారు. మహా నేత ముఖ్యమంత్రి మూడు రోజులు ఢిల్లీలో ఉన్నా, ప్రధానమంత్రి ఆయనకు, ‘అపార్ట్ మెంట్’ ఇవ్వలేదని కాసింత దుఖించారు. భాషా పాండిత్యంతో కాసింత నవ్వించారు.
ముఖ్యమంత్రి అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు.. వరి విషయంలో తాడో పేడో తెల్చుకోవదానికేనా? అదే నిజం అయితే, సంబందిత శాఖ మంత్రి పీయూష్ గోయల్, ముదస్తు అప్పాయింట్మెంట్ లేక పోయినా, సమయం చూసుకుని, కొంచెం ఆలస్యంగానే అయినా ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? మంత్రులను పంపి తాను ఎందుకు వెళ్ళలేదు. ప్రధాని తప్ప ఇతర మంత్రులు ఎవ్వరూ తమ స్థాయికి సరిపోరని భావించి మంత్రితో భేటికి డుమ్మా కొట్టారా? లేక, వారసుడొచ్చాడు, ఇకపై తాను నిమిత్తమాత్రుడినని, అంతా ఆ తారక రాముడే చూసుకుంటారని, నలుగురికి చెప్పేందుకు, తెరచాటున ఉండి పోయారా? మంత్రి ముందు అవమానం ఎదురవుతుందని ముఖం చాటు చేశారా ? ఏమో, ఎలా చూసినా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఎందుకో కొత్త వాసనలు కొడుతోందని అంటున్నారు విశ్లేషకులు.అలాగే, నేక అనుమానాలకు కూడా ఆస్కారం కల్పిస్తోందని పార్టీ నాయకులు కూడా గుసగుసలు పోతున్నారు.
అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీర్’కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పాయింట్మెంట్ ఇవ్వలేదా, లేక ముఖ్యమంత్రి ప్రధాని అప్పాయింట్మెంట్ కోరనే లేదా? అనేదికూడా స్పష్టంగా ఎవరూ చెప్పలేక పోతున్నారు. అదెలా గున్నా, ప్రధానమంత్రి ఇవ్వలేదనే అనుకున్నా, ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న,వస్తుందని తాజా రాజకీయ పరిణామాలను దగ్గరగా చూస్తున్నరాజకీయ పరిశీలకులు బావిస్తున్నారు. అంతేకాదు, రాజకీయ విబేధాల కారణంగానే ప్రధానమంత్రి అప్పాయింట్మెంట్ ఇవ్వకపోవడం నిజం అయితే, కేసీఆర్ ప్రకటించిన యుద్దానికి కేంద్రం, బీజేపీ కూడా సిద్ధంగా ఉన్నాయని సై ‘అన్నట్లే అనుకోవచ్చని, అందుకే, ముఖ్యమంత్రి మౌనం ఆశ్రయింఛి ఉండవచ్చని అంటున్నారు.
రాష్ట్ర బీజేపే నాయకుల మాటల్లో కూడా ఇక ముందు కేసీఆర్’కు ప్రదానితో అప్పాయింట్మెంట్ విషయంలో మాత్రమే కాదు, ఇతరత్రా కూడా అవమానాలు ఎదురు కావచ్చని అంటున్నారు.ఇందుకు ప్రధానంగా, అనవసరంగా వివాదాన్ని సృష్టించడంతో పాటుగా, స్థాయిని మరిచి చేసిన వ్యాఖ్యల కారణంగానే ప్రధాని అప్పాయింట్మెంట్’లో ప్రియారిటీ తప్పి ఉంటుందని అంటున్నారు. అందుకే, మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అప్పాయింట్మెంట్ ఇచ్చి, కేసీఆర్’ ను తిరుగు టపాలో వెనక్కి పంపారని అంటున్నారు.
నిజానికి, వరి వివాదం, అంత జటిలం అయిందీ కాదు, ఒక్క తెలంగాణకు మాత్రేమే ఉన్న సమస్య కాదు. రాజకీయం చేయకుండా అధికారులు, మంత్రుల స్థాయిలో చర్చల ద్వారా పరిష్కరించుకునే దృక్పధంతో ముందుకు వెళితే వరి సమస్య పరిష్కారం కాని భయంకర సమస్య కాదు. కానీ, హుజూరాబాద్ ఓటమి , దళిత బంధు చిక్కులు, వానా కాలం వరి కొనుగోలుకు చేతులు ఆడకపోవడం వంటి స్వయంకృత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వరి వివాదాన్ని, రాజకీయ యుద్దనాదం చేయడంతోనే సమస్య జటిలం అయిందని, అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి మౌనం, యుద్ధం ముందు ప్రశాంతత అయి నా కావచ్చిని కూడ అంటున్నారు. హుజూర్బాద్ ఓటమి తర్వాత కూడా ముఖ్యమంత్రి నాలుగైదు రోజులు మౌనంగానే, ఆ తర్వాతనే తెరపైకి వచ్చారు అని గుర్తుచేస్తున్నారు.