ఏపీలో బీఆర్ఎస్ భవిష్యత్ పై పీకే సర్వే ఏమి చేబుతోందంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ జాతకాలు నమ్ముతారు. వాస్తును విశ్వశిస్తారు. ఇక,యజ్ఞయాగాదుల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇవెక్కడి మూఢ నమ్మకాలని ఎవరైనా తూల నాడినా ఆయన పట్టించుకోరు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఇమాంలు మంత్రించి ఇచ్చిన ఆకుపచ్చ చేతి పట్టి మరిచి పోరు. ఇలాంటి నమ్మకాలు ఆయనకు ఇంకా చాలానే ఉన్నాయని అంటారు. అయితే అదే సమయంలో ప్రశాంత్ కిశోర్ వంటి ఎన్నికల వ్యూహకర్తల సైంటిఫిక్ సర్వేలను, కంప్యూటర్ వ్యూహాలను కూడా కేసీఆర్ అంతగా విశ్వశిస్తారు. రిలీజియస్ గా భక్తిగా ఫాలో అవుతారు. అందుకే కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినా, పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాదుల నిర్వహించడంతో పాటుగా సర్వేలు చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
కాగా, ఇప్పడు కేసీఆర్ ... భారత రాష్ట్ర్ర సమితి విస్తరణలో భాగంగా, ఏపీలో మొదటి అడుగు వేశారు. తెలంగాణ వెలుపల, తెలంగాణ కంటే ముందుగా ఏపీలో పార్టీ నియామకాలు మొదలుపెట్టారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షునిగా జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ ను నిమించారు. ఆయనతో పాటుగా మరో ఇద్దరు ముఖ్యనాయకులు, మరి కొందరు వారి అనుచరులు మందీ మార్బలంతో పనిగట్టుకుని మరీ హైదరాబాద్ వచ్చి పార్టీలో చేరారు. అయితే, తెలగాణ వెలుపల వేసిన తొలి అడుగు ఏమిటి ఎలా పనిచేస్తుంది పొరుగు రాష్ట్రంలో తెలంగాణ నాయకుడి పార్టీకి ఎంతవరకు ప్రజాదరణ లభిస్తుంది అనే కోణంలో సర్వే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం గతంలో కొంత కాలం భారాస (అప్పట్లో తెరాస) ఎన్నికల వ్యూహ కర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్తో ఫ్రెష్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఏపీలో బీఆర్ఎస్ భవిష్యత్ మీద సర్వేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో బీఆర్ఎస్ పోటీచేయడంవల్ల ఇతర రాజకీయ పార్టీల పరిస్థితి ఏమిటి? అసెంబ్లీ సీట్లు కానీ, లోక్ సభ సీట్లు కానీ గెలవడానికి అవకాశాలున్నాయా? ప్రజలు ఏమనుకుంటున్నారు? కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై కేసీఆర్ చేస్తున్న పోరాటం గురించి ఆంధ్రులు ఏమనుకుంటున్నారు? ఏపీలో వైసీపీ పాలనకు, తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు మధ్య తేడాను గమనించారా? ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు, తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు? బీఆర్ఎస్ విస్తరణను స్వాగతిస్తారా? తదితర విషయాలపై సర్వే నిర్వహిస్తున్నట్లు విస్వసనీయంగా తెలుస్తోంది.
అంతే కాకుండా ఏపీలో పోటీకి అనుకూల నియోజక వర్గాలను గుర్తించే బాధ్యతను కూడా కేసేఆర్ ఐ ప్యాక్ బృందానికే అప్పగించినట్లు చెపుతున్నారు. అలాగే నేరుగా పొరుగు రాష్ట్త్రాల నట్టింటి నుంచి కాకుండా, తెలంగాణ-ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ గురి పెట్టారని అంటున్నారు. అందు కోసమే, ఢిల్లీ లేదా యూపీలో అనకున్న బీఆర్ఎస్ అవిర్భావ సభను, ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు జిల్లా ఖమ్మంలో ఏర్పాటు చేశారు. అలాగే ఎపీలోని మొత్తం 175 నియోజకవర్గాలకు పోటీ చేయడంకన్నా తనకు అనువుగా ఉన్న సీట్లలో పోటీచేసి విజయావకాశాలను పెంచుకోవాలని కేసేఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 20 నుంచి 25 నియోజకవర్గాల్లో పోటీచేయాలనే ఆలోచనతో అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.అలాగే, ఎపీతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలోనూ పరిమిత సీట్లలో పోటీచేసే అలోచన చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాదిలో అడుగు పెట్టే ముందు. బీఆర్ఎస్ సీట్లు గెలుచుకోవడంకన్నా గణనీయ సంఖ్యలో ఓట్లను సాధించగలిగితే రాజకీయంగా ప్రయోజనం సిద్ధిస్తుందని బీఆర్ఎస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు అవసరమైన అర్హతలు సాధించి, ఆపైన ఉత్తరాదిఫై దృష్టి కేద్రీకరించాలని కేసీఆర్ తాజా వ్యూహంగా చెపుతున్నారు.
కాగా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన - 1968 ప్రకారం చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. దీనితో పాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. ఇందులో మొదటి నిబందన కష్టం కాదు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ సహా మరి కొన్ని రాష్ట్రలో బీఆర్ఎస్ అభ్యర్ధులను పోటీకి నిలుపుతుంది. అందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది. ఇక ఆరు శాతం ఓట్లు, నలుగురు ఎంపీ నిబంధనపైనే కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారని, అందులో భాగంగానే పార్టీ విస్తరణ కార్యక్రమానికి ఏపీలో సర్వేతో శ్రీకారం చుట్టారని అంటున్నారు.