తమిళనాడు గవర్నర్ కావాలనే రెచ్చగొడుతున్నారా?
posted on Jan 12, 2023 @ 10:20AM
రాష్ట్రప్రభుత్వాలూ, గవర్నర్ ల మధ్య వివాదం తలెత్తడమన్నది కొత్త విషయమేమీ కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికీ మధ్య సత్సంబంధాలు లేని ప్రతి సందర్భంలోనూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు గవర్నర్లతో పేచీ తలెత్తడం సాధారణమే. ఈ పరిస్థితి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఉన్నదే. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న కాలంలోనూ ఇలా గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్ ను పదవీ చ్యుతుడిని చేసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన సందర్భంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్ లాల్ వ్యవహరించిన తీరు, పోషించిన పాత్ర తెలిసిందే.
సరే ఇప్పుడు బీజేపీ హయాంలోనూ అటువంటి పరిస్థితే కొనసాగుతోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళ సైల మధ్య విభేదాలు తెలియనివి కావు. అలాగే తాజాగా తమిళనాడులో నూ ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే తమిళ నాడులో జరిగింది మాత్రం మామూలు వివాదం కాదు. ఇది దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటన. ప్రజాస్వామ్యంలో మాయని మచ్చగా మిగిలిపోయే వివాదం. తమిళనాడు శాసనసభ కొత్త సంవత్సరంలో మొదటిసారిగా సమావేశమైనప్పుడు చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు గవర్నర్, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఉన్న వివాదాలను మరింత రాజేశాయి. శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ఆర్.ఎన్. రవి తాను చేయాల్సిన ప్రసంగంలో చివరి నిమిషంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయడం, దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దీని మీద గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేయడం వంటి ఘటనలు స్వతంత్ర భారత దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదు.
శాసనసభ ఆమోదించిన సుమారు పన్నెండు బిల్లుల మీద సంతకం చేయకుండా గవర్నర్ తొక్కి పెట్టి ఉంచడం గతంలో పలు సందర్భాలలో పలు రాష్ట్రాలలో జరిగింది. అయితే తమిళనాడు గవర్నర్ మాత్రం ఇది చాలదన్నట్టు ఒక అడుగు ముందుకు వేసి శాసనసభలో చేసిన వ్యాఖ్యలు గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అగాధాన్ని మరో ఎత్తుకు తీసుకు వెళ్లింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ తరచూ సన్నాయి నొక్కులు నొక్కే తమిళనాడు గవర్నర్ శాసనసభలో తాను ప్రసంగించడానికి ప్రభుత్వం తయారు చేసి ఇచ్చిన ప్రసంగంలో కొన్ని వాక్యాలను చదవ లేదు. తన ‘విచక్షణాధికారం’ నెపంతో వదిలేశారు.
ఈ వ్యవహారమంతా చినికి చినికి గాలివానగా మారి, గవర్నర్ల పాత్రపై వాడి వేడి చర్చకు తెరలేపింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ప్రసంగంలో మార్పులు, చేర్పులు చేయడానికి, తనకు తోచిన విధంగా కొన్ని భాగాలను తొలగించడానికి గవర్నర్‌కు హక్కుందా అన్నది పక్కన పెడితే.. నా ప్రభుత్వం అంటూ గవర్నర్ ఆరంభించే ప్రసంగంలో అలా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగించడం లేదా కొన్ని వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. గతంలో అంటే 2018లో కేరళలో కూడా ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్ పి. సదాశి వం తన బడ్జెట్ ప్రసంగంలో కొన్ని భాగాలను తొలగించి చదివారు.
కేంద్ర ప్రభుత్వాన్ని, పాలక పక్షాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆ భాగాలను గవర్నర్ చదవకుండా దాటేసినా వాటిని కూడా చదివినట్టుగానే పరిగణిస్తామని అప్పట్లో కేరళ స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. గవర్నర్ తీరుపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. చివరికి దానంతటదే చల్లారింది. ఇక 2020లో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కూడా ఇదే విధంగా వ్యవహరించారు. సదాశివం, ఆరిఫ్ మొహ మ్మద్ ఖాన్లు గవర్నర్లుగా ఉన్నంత వరకూ రాష్ట్ర ప్రభుత్వంతో విభేదిస్తూనే వచ్చారు. ఆ కొందరు సంప్రదాయాలను, పద్ధతులను పాటించడానికి ఇష్టపడడం లేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక కేసులో గవర్నర్ల రాజ్యాంగపరమైన అధికారాలను వివరించింది. తాము గవర్నర్లుగా ఉన్న రాష్ట్రానికి తాము కార్య నిర్వాహక అధిపతులే కానీ, వాస్తవంలో మంత్రివర్గమే రాష్ట్రానికి కార్య నిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తుంది.
ఇంత స్పష్టంగా సుప్రీం తీర్పు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో గవర్నర్లు పరిధి మీరడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోవడమేననే చెప్పాలి. ఇక తమిళనాడు గవర్నర్ విషయానికి వస్తే ఆయన కావాలనే తమిళనాడు ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో విపక్ష ఏఐడీఎంకే కూడా తన నిరసనను వ్యక్తం చేసిందంటే గవర్నర్ రవి ప్రసంగం ఎవరికీ నచ్చని విధంగానే ఉందన్నది తేటతెల్లమౌతోంది.