తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరంటే?
posted on Jan 10, 2023 @ 9:20PM
తెలంగాణ సీఎస్ గా సోమేష్ కుమార్ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరన్న చర్చ తెరపైకి వచ్చింది. ఆయన తక్షణం ఏపీకి వెళ్లాల్సిందేనని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన వెంటనే తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ కావాల్సి ఉంటుంది. అయితే సోమేష్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించే ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు. అయినప్పటికీ కోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ 2019 డిసెంబరు 31న బాధ్యతలు చేపట్టిన సోమేష్ కుమార్ మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. రెవెన్యూ, ఆబ్కారీ, వాణిజ్యపన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, భూపరిపాలన కమిషనర్ వంటి కీలక పోస్టులన్నీ ఆయనే నిర్వహిస్తున్నారు. భూ రికార్డుల కంప్యూటరీకరణకు ఉద్దేశించిన ధరణి వెబ్‌సైట్ రూపకల్పనలో సోమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది.
అయితే తాజాగా హైకోర్టు తీర్పుతో తదుపరి సీఎస్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతుండగా ప్రధానంగా ముగ్గురి పేర్లు ప్రముఖంగా తెరమీదకు వస్తున్నాయి. ప్రణాళికా సంఘం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖల స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అరవింద్ కుమార్, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న డాక్టర్ రజిత్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ కే. రామకృష్ణారావులు రాష్ట్ర తదుపరి సీఎస్ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే వీరిలో మంత్రి కేటీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉన్న అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేసీఆర్ కూడా బీహార్ క్యాడర్ కు చెందిన అరవింద్ కుమార్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. సీనియారిటీ ప్రకారం రామకృష్ణారావు ముందు వరుసలో ఉన్నప్పటికీ.. కేసీఆర్ మొడగ్గు మాత్రం అరవింద్ కుమార్ వైపే ఉందని చెబుతున్నారు. కాగా రాష్ట్రంలోని వివిధ కీలక పోస్టింగ్స్‌లో బీహార్‌కు చెందిన అధికారులే ఉన్న నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన అరవింద్ కుమార్ కే కేసీఆర్ అవకాశం ఇస్తారని అంటున్నారు.