చంద్రబాబుతో రజనీకాంత్ భేటీ.. మోహన్ బాబు కోసమేనా?
posted on Jan 12, 2023 6:29AM
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబునివాసానికి వెళ్లిన రజనీకాంత్ ఆయనతో దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. ఈ విషయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా ట్వీట్ చేశారు. మిత్రుడు రజనీకాంత్ ను కలవడం సంతోషంగా ఉందంటూ వారిరువురూ కలిసిన ఫోటును కూడా ఆ ట్వీట్ కు జత చేశారు. సరే ఇంతకీ ఇరువురి మధ్యా ఏం చర్చ జరిగిందన్న విషయంపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ జరిగిన అనంతరం రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందన్న ఊహాగానాలూ వ్యక్తమౌతున్నాయి.
మర్యాదపూర్వకంగానే చంద్రబాబుతో భేటీ అయినట్లు రజనీకాంత్ చెబుతున్నా.. అదొక్కటే కాదు ఇంకేదో కారణం ఉండి ఉంటుందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో ఎన్టీఆర్ హయాం నుంచీ సినీ ప్రముఖులు సన్నిహితంగానే ఉంటూ వచ్చారు. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే మాజీ ఎంపీ, ప్రస్తతుం వైసీపీలో ఉన్న మోహన్ బాబు సన్నిహిత మిత్రుడు. ఇటీవలి కాలంలో మోహన్ బాబు వైసీపీలో ఉక్కపోతకు గురౌతున్నారు. ఆ పార్టీలో ఎటువంటి గుర్తింపూ లేక, కనీసం పట్టించుకునే వారు కూడా కరవై ఇబ్బందులు పడుతున్నారు. తన స్థాయికీ, స్టేచర్ కు తగిన పదవి ఇస్తారని భావించినా జగన్ అసలు మోహన్ బాబును ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది.
అలాగే గతంలో ఒక సారి తిరుపతిలోని తన విద్యా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాయిబాబా విగ్రహావిష్కరణకు ఆహ్వానించేందుకు మోహన్ బాబు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. అప్పుడే మోహన్ బాబు తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం జరిగింది. కారణాలేమైనా అప్పట్లో అది జరగలేదు. ఆ ప్రచారమూ సద్దుమణిగింది. తాజాగా ఇప్పుడు రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ కావడంతో ఆ ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఇక పోతే మోహన్ బాబు, పవన్ కల్యాణ్ మధ్య అంతగా సయోధ్య లేదని చిత్ర పరిశ్రమలో ఒక టాక్ ఉంది. పలు సందర్భాలలో ఆ విషయం నిజమేననిపించే సంఘటనలూ జరిగాయి. అయితే రజనీకాంత్ కు పవన్ కల్యాణ్ తోనూ, చంద్రబాబుతోనూ కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అలాగే మోహన్ బాబు ఆయనా కూడా మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో రజనీకాంత్ మోహన్ బాబు తెలుగుదేశం ప్రవేశం గురించి చర్చించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు, రజనీకాంత్ ల భేటీ రాజకీయ చర్చకు తావిచ్చిందనడంలో సందేహం లేదు.