బాలినేని జంప్ ఖయామేనా?
posted on Jan 11, 2023 @ 12:56PM
ఎన్నికలు దూసుకొస్తున్న వేళ... వైసీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయా? ఇంతకాలం పంటి బిగువుల అసంతృప్తిని అణచుకున్న ఒక్కొక్కరూ ఇప్పుడు బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తుంది. తాజాగా ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలో ఆసంతృప్తి రోజురోజుకు తీవ్రమవుతోందా? ఆ క్రమంలో ఆయన కుదురుగా ఉండలేకపోతున్నారా? అందుకే ఆయన అడుగులు మరోపార్టీ వైపునకు పడుతున్నాయా? అంటే నియోజకవర్గ ప్రజలు ఔననే అంటున్నారు. అంతే కాదు ఇటీవల జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపుతున్నారు.
ఒంగోలులో బాలకృష్ణ కొత్త సినిమా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ సజావుగా సాగడానికి స్థానిక ఎమ్మెల్యే బాలినేని పూర్తిగా సహాయ సహకారాలు అందించారంటూ.. అదే వేదికపై నుంచి ఆ చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని ప్రకటించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే ఒకానొక దశలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించిందంటూ.. ఓ వార్త తెగ ప్రచారంలోకి వచ్చింది. దీంతో ఈ కార్యక్రమానికి అనుమతి లభిస్తోందా? లేదా? అంటూ బాలయ్య అభిమానుల్లో కొంత సందిగ్థత నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ఈ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడానికి కర్త.. కర్మ.. క్రియ అంతా బాలినేని వారేనని వారు పేర్కొంటున్నారు. బాలినేని అలా వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటని నియోజకవర్గ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ పైన.. ఆ పార్టీ నాయకులపైన.. నిత్యం నిప్పులు చెరుగుతూ ఉంటారని.. అయితే జగన్ పార్టీలో పురుషులందు పుణ్య పురుషులు వేరయా లా .. జగన్ పార్టీలోని నాయకుల్లో.. బాలినేని వంటి మనస్సున్న వారు వేరుగా ఉంటారంటూ జనసేనాని పవన్ ఇప్పటికే పలు వేదికలపై నుంచి ప్రకటించారని.. అలాగే పవన్ కల్యాణ్ స్వయంగా ఫోన్ చేసి అడిగారని.. ఓ జనసేన వీర మహిళ మీద పెట్టిన కేసును సైతం బాలినేని తీయించివేశారని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. జనసేన పార్టీ పట్ల.. బాలినేనికి ఉన్న సాఫ్ట్ కార్నర్‌పై తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దలు ఒకింత గుర్రుగా ఉండాడానికి ఇది కూడా ఓ కారణం అయి ఉంటుందని వారు అంటున్నారు.
మరోవైపు జగన్ తొలి కేబినెట్‌లో మంత్రి పదవి కాస్తా హుళక్కి అయిన తర్వాత.. ఆసంతృప్తితో ఉన్న బాలినేనిని బుజ్జగించడానికి నెల్లూరు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త పదవిని సీఎం జగన్ ఆయనకు కట్టబెట్టారు. అయితే ఆయన హాయాంలో ఆ నెల్లూరు జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలంతా ఆసంతృప్తి గళం వినిపించారు. దీంతో జిల్లా పంచాయతీ కాస్తా.. తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది. జిల్లాలోని ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలాంటి వారు.. చెలరేగిపోతుంటే.. పార్టీ సమన్వయకర్తగా ఏం చేస్తున్నావంటూ బాలినేనికి వైసీపీ అధినేత, సీఎం జగన్ గట్టిగానే తలంటినట్లు ఓ టాక్ అయితే నియోజకవర్గంలో హల్‌చల్ చేసిందని ప్రజలే చెబుతున్నారు.
అదీకాక.. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా కొనసాగిన ఆయనను.. మలి కేబినెట్‌లో తొలగించి.. అదే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంతో బాలినేని తీవ్ర ఆసంతృప్తికి లోనయ్యారు. అంతేకాదు.. జగన్ మలి కేబినెట్‌లో 100కి వంద శాతం అంతా కొత్త వారే ఉంటారంటూ బాలినేని స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. కానీ తన పాత కేబినెట్‌లోని 11 మందికి మళ్లీ జగన్.. తన మంత్రి వర్గంలో చోటు ఇవ్వడం.. బాలినేనికి ఏ మాత్రం మింగుడు పడని వ్యవహారంగా మారింది. అదీకాక జగన్‌కు బాలినేని సమీప బంధువు. అయినా.. ఎక్కడైనా బంధువే కానీ.. కేబినెట్ దగ్గర కాదన్నట్లుగా జగన్ వ్యవహారం ఉండడంతో బాలినేనిలో నాడు చేలరేగిన అసంతృప్తి... నేడు మరింత పెరిగిందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కొంచెం అటు ఇటుగా అయినా.. తన రాజకీయ భవిష్యత్తుకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బాలినేని చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు.. ఆయన చర్యలు చూస్తే అర్థమవుతోందని ఒంగోలు నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. అలాగే తన నియోజకవర్గంలో సామాజిక వర్గాల ఓట్లు.. వారి సమీకరాణాలను పరిశీలించుకొంటూ.. వాటి ద్వారా ఓ అంచనా వేసుకొంటూ.. ప్రస్తుతం బాలినేని ప్రయాణం సాగుతోందని.. ఆ క్రమంలోనే ఆయన చర్యలు ఉన్నాయని నియోజకవర్గ ప్రజలు స్పష్టం చేస్తున్నారు.