తెలంగాణ కొత్త సీఎస్.. ఏపీ కోసం కేసీఆర్ ఎత్తుగడేనా?

తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతి కుమారి నియామకం వెనుక కేసీఆర్ పెద్ద వ్యూహమే ఉంది.  అయితే ఆ వ్యూహం తెలంగాణ లక్ష్యంగా కాదు.. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతం లక్ష్యంగా రచించారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతం కోసం ఇప్పటికే ఒక సామాజిక వర్గం లక్ష్యంగా చేరికలను ఆహ్వానించిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతికుమారిని నియమించడం ద్వారా ఏపీలో ‘ఒక’ సామాజిక వర్గం మొత్తంగా బీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యేలా వ్యూహం పన్నారని అంటున్నారు.

అందుకే ఆంధ్రప్రదేశ్ మూలాలుఉన్న శాంతి కుమారిని సీఎస్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కేసీఆర్ ఏపీలో ఏ సామాజికవర్గాన్నైతే లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారో.. ఏ సామిజక వర్గం బీఆర్ఎస్ కు చేరువ అవుతో ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని భావిస్తున్నారో.. ఆ సామాజిక వర్గానికే చెందిన శాంతి కుమారిని తెలంగాణ సీఎస్ గా నియమించారు. ఆయన వ్యూహం లక్ష్యం సవ్యదిశగానే సాగుతోందనడానికి ఆమె నియామకం జరిగి.. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏపీ కాపు ప్రముఖులు కొత్త సీఎస్ తో కలిసి సీఎం కేసీఆర్ ను కలవడమే  నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు.  

శాంతి కుమారి వాస్తవానికి తెలంగాణలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి అయినా, ఇంత కాలం ఆమె అంతగా ప్రాధాన్యత లేని అటవీ శాఖకు పరిమితం చేశారు. ఆమె గతంలో  సీఎంవోగా పని చేసినా ఆమెకు అక్కడ కూడా దక్కాల్సిన ప్రాముఖ్యత దక్కినట్లు కనిపించదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలంగాణ సీఎస్ రేసులో సీఎంకు సన్నిహితులైన అధికారులు నలుగురైదుగురు ఉన్నా కూడా ఆ రేసులో కనీసం పేరు కూడా వినిపించని శాంతి కుమారిని కేసీఆర్ అనూహ్యంగా సీఎస్ గా నియమించడం వెనుక ఏపీ లక్ష్యంగా ఉన్న వ్యూహమే కారణమని చెబుతున్నారు.  ఇటీవలే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించిన కేసీఆర్.. రోజుల వ్యవధిలోనే అదే సామాజిక వర్గానికి చెందిన శాంతి కుమారిని తెలంగాణ సీఎస్ గా నియమించి.. ఆ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ ఎనలేని ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇస్తోందన్న సంకేతాలు ఇచ్చారు.  అదే సమయంలో తెలంగాణలో తెలుగు అధికారులకు కీలక పదవులు ఇవ్వడం లేదంటూ తనపై తెలంగాణలో వెల్లువెత్తుతున్న విమర్శలకు కూడా ఆయన శాంతికుమారిని సీఎస్ గా నియమించడం ద్వారా చెక్ పెట్టి ఒకే సారి రెండు ప్రయోజనాలు సిద్ధించేలా పావులు కదిపారు.

ఏపీ లక్ష్యంగా కేసీఆర్ వేసిన ఈ ఎత్తుగడ ఏ మేరకు బీఆర్ఎస్ ఆ రాష్ట్రంలో బలపడేందుకు తోడ్పడుతుందో తెలియదు కానీ, ఆమెతో కలిసి  ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితరులు సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి కృతజ్ణతలు చెప్పడంతోనే ఆయన ఏ ఉద్దేశంతో శాంతి కుమారిని తెలంగాణ సీఎస్ గా నియమించారన్నది స్పష్టమౌతోంది.  

Teluguone gnews banner