భారత్ జోడో యాత్ర సక్సెస్ కు కారణమిదేనా?
posted on Jan 11, 2023 @ 10:51AM
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈ యాత్ర ఆద్యంతం రాహుల్ గాంధీలో మారిన మనిషి కనిపిస్తున్నారు. మౌనాన్ని మించిన భాష లేదు.. వినడాన్ని మించిన జ్ణానం లేదు అన్నట్లుగా ఆయన యాత్ర కొనసాగుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఒక రాజకీయ యాత్రగా కాకుండా దేశంలో సమస్యలు, పరిష్కారాలు కనుగొనేందుకు చేపట్టిన యాత్రగా కనిపిస్తోంది. తెలుగువన్ ముందే చెప్పినట్లుగా.. పార్టీ ఎన్నికల వైఫల్యాలతో సంబంధం లేకుండా రాహుల్ తన యాత్రను ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు.
గుజరాత్ ఎన్నికలలో ఘోర పరాజయం, ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో తేరుకోలేని ఎదురుదెబ్బ వీటిని వేటినీ రాహుల్ పట్టించు కోలేదు.. స్థిత ప్రజ్ణత సాధించిన మౌనిలా ఆయన నడక కొనసాగిస్తున్నారు. జనంలో మమేకం అవుతున్నారు. ఇక ఇప్పుడు రాహుల్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ సుదీర్ఘ యాత్ర పొడవునా ఆయన ప్రసంగాలు చేయలేదు.. వాగ్దానాలు గుప్పించలేదు. అరచేతిలో స్వర్గం చూపించ లేదు. రాహుల్ యాత్ర కారణంగా ఆ యాత్ర సాగిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందన్న సూచన లేదు.
అయినా అశేష జనవాహిని ఆయన యాత్రను స్వాగతించింది. అన్ని వర్గాలకు చెందిన వారూ ఆయన యాత్రలో అడుగు కలిపారు. యాత్ర సందర్భంగా జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయాల పరంపర కొనసాగినా.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసం సన్నగిల్లలేదు సరికదా ఇనుమడించింది. అసలిది ఎలా జరిగింది? సుదీర్ఘ ప్రసంగాలు లేకపోయినా, అరచేతిలో వైకుంఠం చూపిన చందంగా వాగ్దానాలు లేకపోయినా, అన్ని వర్గాల ప్రజలూ, ముఖ్యంగా యువత రాహుల్ జోడో యాత్రలో పెద్ద సంఖ్యలో ఎందుకు మమేకమయ్యారు? ఈ ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పారు.
తన యాత్రలో భాగంగా బుధవారం పంజాబ్ లో ని ఫతేహగ్ సాహిబ్ లో ఆధ్యాత్మిక ప్రదేశాలను రాహుల్ గాంధీ సందర్శించిన అనంతరం మాట్లాడారు. తన యాత్ర సుదీర్ఘ ప్రసంగాలు చేయడానికి కాదనీ, ప్రజలు చెప్పేది వినేందుకేననీ స్పష్టం చేశారు. ఈ యాత్ర లక్ష్యం ప్రజలు చెప్పేది వినడమే. దేశంలో పెరిగిన ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను లేవనెత్తి, ఆ సమస్యలకు వ్యతిరేకంగా ఆ యాత్ర ద్వారా పోరాటం చేయాలన్నదే లక్ష్యం అని రాహుల్ వివరించారు. ఆయన యాత్ర ఆద్యంతం ఈ లక్ష్యానికి అనుగుణంగానే సాగుతోందని చెప్పాలి. జోడో యాత్ర సందర్భంగా ఆయన ఎక్కడా పరుష వ్యాఖ్యలు చేయలేదు. రాజకీయ విమర్శలను గుప్పించలేదు. అందుకే రాహుల్ భారత్ జోడో యాత్రకు రాజకీయాలతో సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల నుంచీ మద్దతు సంఘీభావం వ్యక్తం అవుతోందని అంటున్నారు.