సోమేష్ కుమార్ రిలీవ్ డ్.. నెక్ట్స్ సీఎస్ ఎవరంటే..?
posted on Jan 11, 2023 @ 10:04AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం తీర్పు దృష్ట్యా సీఎస్ సోమేశ్‌కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, ఇవి తక్షణమే అమల్లోకి వస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే సోమేష్ కుమార్ ఈ నెల 12 లోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని కూడా డీవోపీటీ స్పష్టం చేసింది.
అంటే తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలన్న సోమేష్ కుమార్ ముందు ఏపీ సర్కార్ కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయించింది.దీనిపై ఆయన క్యాట్ ను ఆశ్రయించడంతో గతంలో ఆయన తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచీ ఆ ఉత్తర్వులతో తెలంగాణలో సోమేశ్‌కుమార్ కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017 లోనే కేంద్రం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తెలంగాణ సీఎస్ గా సోమేష్ కుమార్ కొనసాగించటాన్ని హైకోర్టు రద్దు చేసింది. దీంతో సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదం కొలిక్కి వచ్చింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా హైకోర్టు కొట్టేయటం విశేషం. అయితే ..3 వారాలు సమయం కావాలని సోమేశ్ కుమార్ అభ్యర్థనను కూడా తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సోమేష్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయింనున్నట్లు చెబుతున్నారు.
అయితే ఆయన సుప్రీంను ఆశ్రయించినా ఆశ్రయించకున్నా కోర్టు తీర్పు మేరకు ఆయనను తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి ఈ నెల 12 లోగా.. అంటే మంగళవారం (జనవరి 10) కోర్టు తీర్పు ఇస్తే.. గురువారం (జనవరి 12)లోగా ఏపీ సర్కార్ కు రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశించింది. దీంతో సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లడమా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడమా అన్న సందిగ్ధంలో పడ్డారు. ఏపీకి వెళ్లకుండా స్వచ్ఛంద విరమణ తీసుకుంటే ఆయనకు రాష్ట్రంలో రెండు ఆప్షన్స్ ఉంటాయని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రితో సత్సంబంధాల కారణంగా ఆయనకు ఏదో ఒక సలహాదారు వంటి పదవి దక్కే అవకాశం ఉంది. లేదంటే గతంలో కేవీ రమణాచారి చేసిన విధంగా రాజకీయాలలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉందంటున్నారు. బీఆర్ఎస్ లో చేరి క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉందనిపరిశీలకులు అంటున్నారు.
ఇక సోమేష్ కుమార్ విషయం అలా ఉంచితే ఆయన రిలీవ్ అయిపోవడంతో.. తెలంగాణ సీఎస్ ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగువన్ ఇంతకు ముందే చెప్పినట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో తెలంగాణలో పలువురు ఉన్నప్పటికీ పోటీ మాత్రం ప్రధానంగా ముగ్గురి మధ్యే ఉంటుంది. వారిలో మరీ ముఖ్యంగా ప్రణాళికా సంఘం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖల స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అరవింద్ కుమార్ లు రేసులో ముందున్నారన సచివాలయ వర్గాలలో వినిపిస్తోంది.
సోమేష్ కుమార్ ను రిలీవ్ చేసిన నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరన్నది కేసీఆర్ సర్కార్ ఇహనో ఇప్పుడో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఎస్ఎస్ అధికారులు రామకృష్ణ, అరవింద్ కుమార్ లలో ఎవరు తెలంగాణ కాబోయే సీఎస్ అన్న చర్చ అధికార వర్గాలలో జోరుగా సాగుతోంది. అయితే వీరిలో మంత్రి కేటీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉన్న అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేసీఆర్ కూడా బీహార్ క్యాడర్ కు చెందిన అరవింద్ కుమార్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. సీనియారిటీ ప్రకారం రామకృష్ణారావు ముందు వరుసలో ఉన్నప్పటికీ.. కేసీఆర్ మొగ్గు మాత్రం అరవింద్ కుమార్ వైపే ఉందని చెబుతున్నారు.
కాగా రాష్ట్రంలోని వివిధ కీలక పోస్టింగ్స్‌లో బీహార్‌కు చెందిన అధికారులే ఉన్న నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన అరవింద్ కుమార్ కే కేసీఆర్ అవకాశం ఇస్తారని అంటున్నారు. అయితే విపక్షాలు బయటి వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారంటూ కేసీఆర్ పై విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో రామకృష్ణకు సీఎస్ పదవి కట్టబెట్టే విషయం ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే మునిసిపల్ వ్యవహారాల శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న అరవింద్ కుమార్ కేసీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉండటం, అలాగే స్థానికుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారికే కీలక పదవులు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి మెగ్గు చూపుతుండటంతో అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ కూడా బీహార్ కు చెందిన వారే కావడం గమనార్హం.