బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగింపు!

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జెపి నద్దానే కొనసాగించే అవకాశాలు ప్రస్ఫుటమౌతున్నాయి. ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ, ఈ ఏడాది 9 రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని,  తిరిగి ఆయననే   అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు  , ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా జెపి నద్దాను కొనసాగనున్నట్లు దాదాపు ఖరారైందని చెబుతున్నారు.   తన సొంత హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ ఓటమి పాలయినందున, నద్దాను అధ్యక్షుడిగా తొలగిస్తారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే ఇప్పుడు అధ్యక్షుడిని మారిస్తే.. కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున, నడ్డానే కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఆ కారణంగానే పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు ఈ ఏడాది చేపట్టలేదని అంటున్నాయి. నడ్డా హయాంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ,  ఆయన సొంత రాష్ట్రంలో మాత్రం, పార్టీని విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యారు. అలాగే సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో పార్టీలో వర్గ విభేదాలను పరిష్కరించడంలో కూడా విఫలమైన నడ్డాను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు లేవని గత కొంత కాలంగా విస్తృతంగా ప్రచారం జరిగింది.   ఒక్క నడ్డానే  కాకుండా  ఏపీ, బిహార్‌, రాజస్థాన్‌, కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా  పార్టీ అధ్యక్షులను మార్చే అవకాశం ఉందని జరిగిన ప్రచారం కూడా కూడా జరిగింది.  ఏపీ, బిహార్‌, రాజస్థాన్‌కి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.  కేరళ అధ్యక్షుడిపై నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో ఆయన మార్పూ ఖాయమని కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ మార్పులేవీ జరగకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.   తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ను మార్చాలన్న డిమాండ్‌, సీనియర్ల నుంచి చాలాకాలం నుంచి వినిపిస్తోంది. ఆ క్రమంలో ఆయ స్థానంలో మాజీ మంత్రి చేరికల కమిటీ ఇన్చార్జి ఈటల రాజేందర్‌ను నియమించి, సంజయ్‌ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌.. హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా, బండి సంజయ్‌ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కానీ,   అధ్యక్షులను  కానీ మార్చే అవకాశాలు లేవని, పార్టీ వర్గాలు చెబుతున్నాయి . 

ఇదేమి స్నేహం ఇదేమి బంధం !

పెళ్ళయితే అయింది కానీ, కలిసి కాపురం చేసింది లేదు. బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కథ కుడా అలాగే సాగుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరి మూడేళ్ళు దాటింది. కానీ, ఇంతవరకు కలిసి కూర్చున్నది లేదు, మాట్లాడుకున్నది లేదు. ఉమ్మడి పోరాటాలు, ఆందోళనలు అసలే లేవు. నిజానికి, గడచిన మూడేళ్ళ పై చిలుకు కాలంలో  బీజేపీ, జనసేన నాయకులు ఏ స్థాయిలోనూ ఒక్కటంటే ఒక్క ఉమ్మడి కార్యక్రమం నిర్వహించ లేదు. చివరకు, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సమయంలోనూ, రెండు పార్టీల నాయకులు కలిసి ప్రచారం చేయలేదు. కార్యకర్తల మధ్య సయోధ్య  కనిపించలేదు.  మరోవంక ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా  సహా ఇతర బీజేపీ జాతీయ నాయకులు ఏపీకి  వచ్చి పోతున్నా, మిత్ర పక్షం జనసేన నాయకులను కలిసింది లేదు, వారితో మాట్లాడింది లేదు.కొద్ది నెలల క్రితం బీజేపీ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో జనసేన  నాయకులు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలనికోరారు. ప్ల కార్డులు పట్టుకుని ప్రదర్శనలు నిర్వహించారు. అయినా  నడ్డా పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా అభ్యర్ధిగా ప్రకటించకపోవడమే కాదు, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి గంటకు పైగా చేసిన ప్రసంగంలో కనీసం పవన్ కళ్యాణ్ పేరైనా ప్రస్తావించలేదు. పవన్ కళ్యాణ్  ఎప్పుడో సంవత్సరం  క్రితమో ఏమో రోడ్ మ్యాప్ అడిగారు. బీజేపీ స్పందించలేదు. మరోవంక జనసేన ఎక్కడా బీజేపీని మిత్ర పక్షంగా గుర్తించిన దాఖాలు లేవు. కేవలం టీవీ చర్చల్లో చెప్పుకోవడమే కానీ, క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేసింది లేదు. ఎవరి దారిన వారు పోతున్నారు.   బీజేపీ అగ్ర నేతల మనసులో ఏముందో ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా తెలియదు. మరో వంక ఏపీలో బీజేపీకి నిండా ఒక శాతం ఓటు కూడా లేదు. నాయకులు లేరు. ఉన్న గుప్పెడు మంది నాయకుల మధ్య సయోధ్య లేదు. కొందరు వైసీపీ కొమ్ముకాస్తే మరి కొందరు టీడీపీ కొమ్ము కాస్తారు. అందుకే, పవన్ కళ్యాణ్  బీజేపీతో పొత్తు ఇక చాలను కున్నారో, ఏమో కానీ, టీడీపీతో కలిసి వైసీపీ పాలనకు చరమ గీతం పాడాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పటికి రెండు సార్లు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. రెండవసారి స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్ళి మరీ రెండున్నర గంటల పాటు వన్ టూ వన్ భేటీ జరిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట పోరాటం చేస్తామని మీడియా ఎదుట ప్రకటించారు. చాలా స్పష్టంగా వైసీపీని ఓడించే లక్ష్యంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పారు. నిజానికి ఏపీలో ఓటంటూ ఉందంటే, వైసీపీ, టీడీపీలకు,జనసేన పార్టీలకే వుంది. మిగిలిన పార్టీలకు ఒకటి రెండు శాతం ఓటు కూడాలేదు. సో, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చుస్తానని చెప్పడం టీడీపీతో పొత్తుకు సిద్దమని ప్రకటించడంతో సమానమని వేరే చెప్పనక్కర లేదు.  అయితే, ఇంత జరుగుతున్నా బీజేపీ మాత్రం పవన్ మా మిత్రుడే అంటోంది. పైగా జస్ట్ అలా పవన్ వెళ్ళి చంద్రబాబుని కలిశారంతే అని చెబుతోంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి అయితే బీజేపీ జనసేన బంధం కొనసాగుతుంది అని నమ్మ బలుకుతున్నారు.ఏపీలో మా రెండు పార్టీల మధ్యనే పొత్తు ఉంది అని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఎందుకు కలిశారు అంటే కలవడంలో తప్పు లేదు కదా అంటున్నారు. పైగా అంశాల వారీగా రెండు పార్టీల మధ్య అవగాహన కావచ్చు అని కొత్త బంధాన్ని తెర మీదకు తెచ్చారు. నిజమే, బీజేపీ రాష్ట్ర నాయకులకు కేంద్ర నాయకత్వం మనసులో ఏముందో తెలియదు. అందుకే, బీజేపీ రాష్ట్ర నాయకులు ఇలా ... తలాతోకా  లేకుండా మాట్లాడుతున్నారని అంటున్నారు. మరో వంక జనసేన  బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.చివరకు సామాన్య ప్రజలు కూడా పెళ్లి చేసుకున్నతర్వాత చేస్తే పద్దతిగా సంసారం  చేయాలి, లేదంటే విడాకులు తీసుకోవాలి .. అంతే కానీ, అటూ ఇటూ కాకుండా ఉంటామంటే ఎలా? ఇదేమీ స్నేహం ? ఇఎమి బంధం ? అని నవ్వుకుంటున్నారు.

ఆర్వీఎంలకు ఓకే కానీ... తెలుగుదేశం

ఈవీఎంల గురించి ప్ర‌తిప‌క్షాలు ప‌లుమార్లు ఆరోప‌ణ‌లు, అనుమానాల‌ను వ్య‌క్తంచేశాయి. ఆ ఆరోపణలకు సరైన సమాధానం చెప్పకుండానే, ఆ అనుమానాలను నివృత్తి చేయకుండానే   ఎన్నిక‌ల సంఘం ఇప్పుడు మరో లెవెల్ కు ఓటింగ్ ప్రక్రియను తీసుకువెళ్లేందుకు ప్రతిపాదించింది. అదే   రిమోట్ ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్ల (ఆర్వీఎం) విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ముందుగా ఈవీఎంలపై తమ అనుమానాలు నివృత్తి చేయాలనీ, తాము ఈవీఎంలనే వ్యతిరేకిస్తుంటే..ఆర్వీఎం అంటూ కొత్త విధానాన్ని ప్రతిపాదించడమేమిటని నిలదీస్తున్నాయి. ఆర్వీఎంవిధానానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశాయి.   రిమోట్ ఓటింగ్ యంత్రంపై ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిపాద‌న‌ను వ్యతిరేకిస్తామ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు  దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిపాద‌న‌లో స్ప‌ష్ట‌త లేద‌న్న ఆయన కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీలు వ్య‌తిరేకించాల‌ని నిర్ణ‌యించాయ‌ని స్పష్టం చేశారు. అయితే ఆ ప్రతిపాదనను మరింత ముందుకు తీసుకు  వెళ్లిన సీఈసీఆర్వీఎంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. సోమవారంజరిగినఈ కార్యక్రమంలో ఆర్వీఎం పనితీరు గురించి వివరించింది. అలాగే రాజకీయ పార్టీల అభిప్రాయాన్నీ కోరింది.  ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన ప్రజలకు ఓటు సదుపాయం కల్పించే అంశంపై కూడా చర్చించింది. ఈ కార్యక్రమానికి 8 జాతీయ‌ పార్టీలు,  57 ప్రాంతీయ పార్టీల‌కు చెందిన‌ అధ్య‌క్షులు, జ‌న‌ర‌ల్‌ సెక్ర‌ట‌రీలు   హాజ‌రు కావాల‌ని ఈసీ కోరిన విషయం విదితమే. అలాగే  ఆర్వీఎంల ప‌నితీరుకు సంబంధించి, ఎన్నిక‌ల ప‌ద్ధ‌తిలో మార్పులు, దేశంలోని వ‌ల‌స కూలీల‌ ఓట్ల గురించి త‌మ అభిప్రాయాలను రాత పూర్వ‌కంగా ఈనెల 31లోపు తెలియ‌జేయాల‌ని కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను కోరింది. కాగా తెలుగుదేశం పార్టీ ఆర్వీఎంలను సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు చెబుతూనే..ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది. రాజకీయ పార్టీలతో విస్తృత చర్చలు జరపకుండానే ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడాన్నితప్పుపట్టింది. విస్తృత చర్చల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించిన తరువాత మాత్రమేఆర్వీఎం విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ముందుగా డెమో చేసి ఆ తరువాత ఏకాభిప్రాయం సాధించిన మీదటే దీనిని  అమలు చేయాలని పేర్కొంది. ఈ విధానంపై పార్టీలు తమ అభిప్రాయం రాతపూర్వకంగా తెలియజేయడానికి విధించిన డెడ్ లైన్ ను పొడిగించాలన్నారు.  ఏ ఒక్క ఓటరు కూడా ఓటువేసే అవకాశం కోల్పోకూడదని చెబుతున్న ఈసీ  కొత్త విధానాన్ని తీసుకురావడానికి ముందు ఆ విధానంపై ఉన్నఅనుమానాలన్నిటినీ నివృత్తి చేయాలని తెలుగుదేశం పేర్కొంది. ఓటింగ్‌కు దూరంగా ఉంటున్న రమారమి30శాతంమందిలో  వలస వెళ్లిన వారే అత్యధికులని చెబుతున్న ఈసీ దీనిపై శాస్త్రీయ అధ్యయనం చేసిందా అని ప్రవ్నించింది.   తమ పరిశీలన మేరకు  వలస కూలీలు తమ గ్రామాల్లో ఓటు వేస్తున్నారని.. కానీ యువత, పట్టణ, నగర ధనిక వర్గాలే ఓటింగుకు దూరంగా ఉంటున్నాయనీ తెలుగుదేశం వివరించింది. ఈసీ నిర్వహించిన అఖిలపక్షసమావేశానికి తెలుగుదేశం తరఫున సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. 

మెడికల్ మాఫియాగా భద్రాచలం ఆస్పత్రులు.. పద్ధతి మార్చుకోకుంటే శిక్ష తప్పదు.. మావోల హెచ్చరిక

మెడికల్ మాఫియాకు భద్రాచలం ఆస్పత్రులు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. మూడు రాష్ట్రాల సరిహద్దు అయిన భద్రాచలంలో ఆస్పత్రులు సంపాదనే ద్యేయంగా అమయాక గిరిజనులను నిలువునా దోచుకుంటున్నాయి. ఆరోగ్యం బూచిగా చూపి కాసులు దండుకుంటున్నాయి. పద్ధతి మార్చుకోకుంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. ఇదీ మావోయిస్టులు భద్రాచలంలో సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్న ఆస్పత్రుల యాజమాన్యాలకు మావోయిస్టులు రాసిన బహిరంగ లేఖ సారాంశం.   మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం ఇప్పుడు మెడికల్ మాఫీయాకు  అడ్డాగా మారి కాసుల వర్షం కురిపిస్తోంది.  ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పని చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని బూచిగా చూపి వారిని భయబ్రాంతులకు గురి చేసి రోగుల రక్తం పిండుకుంటున్నారని  భద్రాచలంకొత్తగూడెం - అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్)  కార్యదర్వి ఆజాద్ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.  ఛత్తీస్ఘడ్, ఒడిస్సా, ఆంధ్ర ప్రాంత గిరిజనులు, గిరిజనేతరులతో పాటు స్థానిక తెలంగాణ ప్రాంత ప్రజలను వైద్యంపేరుతో రోజులు తరబడి ఆసుపత్రుల్లో ఉంచి అవసరం లేకున్నా నానా రకాల టెస్టులూ  ల్యాబులు, ఆసుపత్రులు, వైద్యులు జనాన్ని సొమ్ముల కోసం హింసిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు.   ప్రజల ప్రాణాలు ఇప్పడు ఆసుపత్రులకు డబ్బులు కురిపించే వనరులుగా మారిపోయాయని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు.  ప్రజల పాలిట కొందరు వైద్యులు రాక్షసుల్లా తయారయ్యారనీ,  రోగుల రక్తం జలగల్లా పీలుస్తున్నారనీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆరోగ్య సమస్యలను అలుసుగా టెస్టుల పేర జనంలో భయాన్ని సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే వైద్యులు సైతం   సొంత క్లినిక్కులు ఏర్పాటు చేసుకుని ఎక్కవ సమయం వాటికే కేటాయిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.   ప్రధానంగా మెడికల్ మాఫియాగా మారిన వైద్య వృత్తి ఫార్మ కంపెనీలతో జతకడుతూ తక్కువ ధరకు అమ్మాల్సిన మందులను బ్రాండుల పేర్లతో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఇక్కడి వైద్యులు మనుషులను కరెన్సీ నోట్లు ముద్ర వేసే యంత్రాల్లా భావిస్తూ నోటికి వచ్చిన టెస్టుల పేర్లు చెప్తూ.. చేతికి వచ్చిన ఖరీదైన మందుల పేర్లు రాస్తూ పేద ప్రజలను రాబందుల్లా పీక్కుతింటున్నారని మావోయిస్టలు విమర్శించారు.   ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు వారి సమయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేటాయించకుండా ఇలానే ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గిరిజన ప్రాంతమైన భద్రాచలం ప్రాంతంలో సంపాదనే ధ్యేయంగా ప్రైవేటు ఆసుపత్రులను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నివసించే గిరిజనుల అమాయకత్వాన్ని అసరా చేసుకొని కోట్లకు పడగెత్తిన వైద్యులు, ల్యాబ్, మెడికల్ షాప్ ల యజమానులు తమ పద్ధతిని మర్చుకోక పోతే ప్రజకొర్టు లో శిక్ష తప్పదని మావోయిస్టులు ఆ లేఖలో హెచ్చరించారు. .

కొడాలి నాని హీరోగా వీవీవినాయక్ దర్శకత్వంలో సినిమా?

 కొడాలి నాని హీరోగా త్వరలో ఒక సినిమా రాబోతోందా? ఆ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడా? ఈ ప్రశ్నలు గుడివాడలో జరిగిన సంక్రాంతి వేడుకలలో వినాయక్ ప్రసంగం కారణంగా పుట్టుకొచ్చాయి.  హిట్ సినిమాల దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన వీవీ వినాయక్ ఇప్పుడు చేతిలో సినిమాలు లేక దాదాపు ఖాళీగా ఉన్నారు. సినిమా ప్రారంభోత్సవాలకు, లేదా తొలి షాట్ దర్శకత్వానికి పరిమితమైపోయారు. సరే పనిలో పనిగా  ఈ మధ్య ఓ సినిమాలో హీరోగా కూడా నటించేస్తున్నారు. ఇలా దర్శకత్వం వినా అన్నీ చేసేస్తున్న వీవీ వినాయక్.. తాజాగా తనే కొడాలి నానికి ఒక ప్రపోజల్ చేశారు. అదేమిటంటే తన దర్శకత్వంలో కొడాలి నాని హీరోగా ఓ సినిమా చేస్తాననీ, అందుకు నాని అంగీకరించాలని. అది కూడా ఎక్కడంటే..గుడివాడలో జరిగిన సంక్రాంతి వేడుకలలో.. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఏటా జరిగే సంక్రాంతి వేడుకలకు ఈ ఏడాది వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా కొడాలి నానిపై పొగడ్తల వర్షం కురిపించిన వీవీ వినాయక్.. కొడాలి నాని అంగీకరిస్తే ఆయన హీరోగా తన దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమని ప్రకటించేశారు. అయితే ఆయన ప్రతిపాదనకు కొడాలి నాని నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అయితే బూతులే డైలాగులుగా చెప్పే కొడాలి నానిని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు జనం సిద్ధంగా ఉంటారా అన్న అనుమానం కూడా వీవీ వినాయక్ కు రాకపోవడానికి కారణం.. ఆయన వైసీపీలో ఏదో  ఒక గుర్తింపు పొందేందుకు చేస్తున్న ప్రయత్నంగానే చూడాలని వైసీపీ శ్రేణులే జోకులేస్తున్నాయి. ఇటీవలి కాలంలో వీవీ వినాయక్ వైసీసీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారనే చెప్పాలి. ఇటీవల కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా నియమితుడైన సందర్భంలో కూడా వీవీ వినాయక్ జక్కంపూడి రామ్మోహన రావుపై పొగడ్తల వర్షం కురిపించారు. వైఎస్ హయాంలో జక్కంపూడి రామ్మోహనరావు మంత్రిగా పని చేసిన సంగతి విదితమే. అదే సమయంలో వీవీ వినాయక్ ముఖ్యమంత్రి జగన్ పై కూడా ప్రశంసల వర్షం కురిపించి తన అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ ప్రసంగాలు తనలో స్ఫూర్తి నింపాయని కూడా చెప్పుకున్నారు. వైసీపీ ఇటీవలి కాలంలో ఏ రంగంలోనైనా ఏదో పాటి గుర్తింపు ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పొత్తుల విషయంలో క్లారిటీ ఇచ్చేసినప్పటి నుంచీ కాపు సామాజిక వర్గం మద్దతు కోసం వైసీపీ పాకులాట ఎక్కువగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే తన నియోజకవర్గంలో తన ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు కొడాలి నాని వీవీ వినాయక్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని చెబుతున్నారు. అదే సమయంలో సినీ రంగంలో అవకాశాలు తగ్గిపోయిన వినాయక్ కూడా రాజకీయంగా వైసీపీ పంచన చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని అంటున్నారు. 

కమలదళం పల్లె బాట.. బీజేపీ వ్యూహం మార్చిందా?

తెలంగాణలో ఇంతవరకు కొంత దూకుడు ప్రదర్శించిన బీజేపీ, ఇప్పడు వ్యూహం మార్చింది. ఒకటి రెండు చోట్ల భారీ బహిరంగ సభలు నిరహించడం వలన అంతగా ప్రయోజనం ఉండదని పార్టీ నాయకులు గుర్తించారు. అందుకే రూట్ మార్చి  ఉరూరా సభలు , సమావేశాలు, నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, లేదా ఇతర జాతీయ నాయులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించి  భారీ బహిరంగ సభలు నిరహించడం వలన, పార్టీకి  కొత్త జోష్ వస్తుంది. అందులో సందేహం లేదు. అయితే, ఓట్ల లెక్కల దగ్గర కొచ్చేసరికి లెక్క మారుతుందని, బీజేపే నాయకత్వం గుర్తించింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే విషయం తేలిపోయింది.  అలాగే  కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలోపోయి రోడ్డెక్కిన తర్వాత, ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ బలం మరింత పెరిగిందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు.  అయితే రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నా జాతీయ నాయకుల భుజాల మీద నుంచి ఓటరుకు గురి పెట్టినా  అంతగా ప్రయోజనం ఉండదని అందుకే నేరుగా ఓటరు ఇంటి తలుపు తట్టాలని కమలం పార్టీ నిర్ణయించుకుంది. అలాగని జాతీయ నేతల పర్యటనలు పబ్లిక్ మీటింగ్స్ ఉండవా అంటే, ఉంటాయి, కానీ, ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి, స్థానిక సమస్యలకు జాతీయ పరిష్కారాలపై చర్చించడంపై దృష్టిని కేద్రేకరించాలనే నిర్ణయంతో బీజేపీ కొత్త ప్రణాళికను సిద్డం చేసినట్లు చెపుతున్నారు. ఇపుడు రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా తెలంగాణలో భారాసకు ప్రధాన ప్రత్యామ్నాయం బీజేపీ     అని అంతా  అంగీకరిస్తున్నారు. చివరకు జైరాం రమేష్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని  ఒప్పుకుంటున్నారు.   ఈ నేపధ్యంలో కమల దళం ఇక క్షేత్ర స్థాయిలో బలపడాలన్న ఆలోచనకు వచ్చింది.  అందుకే.. గ్రామ, గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు,  శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల  బలోపేతం వంటి వాటితో  ఇక క్షేత్ర స్థాయి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని నిర్ణయించింది. ముఖ్య నాయకుల పాదయాత్రలు, బస్సు యాత్రల సంగతి ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి ఏకంగా 11 వేల సభలు, సమావేశాలు నిర్వహంచాలని కమలనాథులు నిర్ణయించారు. అలాగే 119 నియోజక వర్గాలలో  9 వేల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 56 బూత్‌ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉంటుంది.  ప్రతి గ్రామంలో కాషాయ జెండాలు కనిపించేలా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ప్రతి శక్తి కేంద్రానికి ప్రముఖ్‌ను నియమించారు.బూత్‌ స్థాయిలో ఎలక్షన్‌ ఇంజనీరింగ్‌ చేసేందుకు ఈ కమిటీలు ఉపయోగపడతాయి.  ఫిబ్రవరి నుంచి ప్రతి రోజూ ప్రజల కళ్ల ముందు కనిపించేలా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.  ఫిబ్రవరిలో ప్రధాని మోడీ, హూంమంత్రి అమిత్‌ షా వంటి అగ్రనేతలు సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. మరో వంక, ఫిబ్రవరిలో సిట్టింగ్, మాజే ఎమ్మెల్యేలతో పాటు, నియోజక వర్గ స్థాయి నేతలు  పెద్ద ఎత్తున పార్టీ చేరతారని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి.  కాగా, ఈరోజు ఢిల్లీ ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో,తెలంగాణ పై ప్రత్యేక చర్చః, తీర్మానాలు ఉంటాయని అంటున్నారు. అదే విధంగా పార్టీ రాష్ట్ర నాయకత్వ మార్పు, కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి మరొకరికి స్థానం కల్పించే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటుగా, 2024 లోక్ సభ  ఎన్నికలో 12 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునే వ్యూహంతో కమల దళం కదులుతోందని అంటున్నారు.అయితే, పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ ని తొలిగించి  ఆ బాధ్యతలను ఈటల రాజేందర్  కు  అప్పగించే విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఎర్రగంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిలు సమంజసం కాదు.. సుప్రీం

ఎర్ర గంగిరెడ్డికి ఏపీ హై కోర్టు డిఫాల్ట్ బెయిలు మంజూరు చేయడం సమంజసం కాదని దేశ సర్వోన్నత న్యాయ స్థానం పేర్కొంది. నిందితుడిపై నాన్ బెయిలబుల్ కేసు ఉన్నప్పుడు చార్జిషీట్ దాఖలు కాలేదన్న కారణంతో కేసులోని మెరిట్స్ పరిగణనలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిలు మంజూరు చేయడం తగదని సుప్రీం కోర్టు విస్పష్టంగా చెప్పింది. ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిలు రద్దు కాదంటూ ఏపీ హై కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారించిన సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగా బెయిల్ అంశంపై మరో సారి విచారణ చేపట్టాలని తెలంగాణ కోర్టుకు సూచిస్తూ.. ఏపీ హై కోర్టు తీర్పుపై తెలంగాణ హై కోర్టులో మరో సారి విచారణ జరపాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పులివెందులలోని తన స్వగృహంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. ఈ కేసులో నిందితుడు ఎర్రి గంగిరెడ్డిని  సీబీఐ గతంలో అరెస్టు చేసింది. ఆ తరువాత గంగిరెడ్డికి కింది కోర్టు బెయిలు మంజూరు చేసింది. చార్జిషీట్ దాఖలు చేయనందున ఎర్ర గంగిరెడ్డికి బెయిలు మంజూరు చేస్తున్నట్లు కింది కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టు తీర్పును తప్పుపడుతూ, ఎర్రగంగిరెడ్డి బెయిలుపై తెలంగాణ  హైకోర్టు మరోసారి విచారించాలనీ, మెరిట్స్ ఆధారంగా తీర్పు ఇవ్వాలని సూచించింది. వైఎస్ వివేకా హత్య కేసును సుప్రీం కోర్టు ఏపీ హై కోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదలీ చేసిన సంగతి విదితే. 

వ్యూహాత్మక వైరమేనా?

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కనిపిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య వైరం వ్యూహాత్మకమేనా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఈ ఎనిమిదిన్నరేళ్ల కాలంలో అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత నుంచి ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి మోడీ ఇరువురి మధ్యా మైత్రి పలు సందర్భాలలో ప్రస్ఫుటంగా కనిపించిందని చెబుతున్నారు.   ఇప్పుడు కూడా ఉప్పూ నిప్పులా.. కనీసం ఒకరిని ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడనంతగా డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నా.. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన ముచ్చటగా మూడవసారి ఎన్నికల్లో గెలిచి   హ్యాట్రిక్ సాధించేందుకు అనుసరిస్తున్న వ్యూహమే తప్ప మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు. వ్యూహాత్మకంగా  నువ్వు కొట్టి నట్లు చేయి నేడు ఏడ్చినట్లు చేస్తాను అన్నట్లుగానే వీరి తీరు ఉందని చెబుతున్నారు.  ఇద్దరి మధ్య ఏదో భీకర యుద్ధం సాగుతోందనే భ్రమలు కలిపించేందుకు, అటు నుంచి ఇటు నుంచి ఉభయ పార్టీలూ   మాటల తూటాలు సంధించుకుంన్నారని విశ్లేషిస్తున్నారు.  విశ్లేషకుల మాటలు ఎలా ఉన్నా టీపీసీసీ చీఫ్ రెవంత్ కూడా ఇదే అంటున్నారు. ఇరువురూ కలిసి ప్రజలను మోసం చేసి  అటు కేంద్రంలో మోడీ, ఇటు రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారని అంటున్నారు.  విజయ దశమి పండగ పూట కేసేఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. కేంద్రంలో ప్రదాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకే కేసేఆర్ ప్రాంతీయ పార్టీ పేరు మార్చి జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. మోడీ గుజరాత్ మోడల్ కు కేసీఆర్ తెలంగాణ మోడల్  ప్రత్యామ్నాయం అంటున్నారు. అయితే కేసీఆర్ ఈ ఏడాది 9 రాష్ట్రాలకు జరగనున్న   అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పాలిత రాష్ట్రాలపై గురి పెట్టడం లేదు. ఆయన తన దృష్టి మొత్తాన్నీ ఏపీపైనే కేంద్రీకృతం చేశారు. అలాగే గత ఏడాది చివరిలో జరిగిన  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.  ఇప్పడు కూడా మహారాష్ట్ర, కర్ణాటకలలో పోటీ చేస్తామంటున్నారు కానీ..  తన జాతీయ పార్టీకి అధ్యక్షుడిని నియమించడానికి మాత్రం ముందుగా ఏపీనే ఎన్నుకున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు జరుగుతాయి. అక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకూ అవి ఊహాగానాలు మాత్రమే.   నిజానికి, కేసేఆర్ జాతీయ రాగం ఎత్తుకున్నదే, కేంద్రంలో మళ్ళీ మరో సారి, మోడీని గెలిపించెందుకే  అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చెబుతున్నది నిజమేనా అన్న అనుమానం కలగడానికి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అనుసరిస్తున్న విధానమే కారణం. అన్నిటికీ మించి ఆయన తెలంగాణలో వేసే ప్రతి అడుగూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీనం చేయడానికే అన్న విధంగా ఉంటోంది.  తమిళ నాడులో కాంగ్రెస్ మిత్ర పక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డిఎంకే అధినేత, ఆ ర్రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్  ను కలిసి కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు.   మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిలోని, శివసేన, ఎన్సీపీలను కాంగ్రెస్ నుంచివిడదీసే ప్రయత్నం చేశారు. జార్ఖండ్ లోనూ కాంగ్రెస్ తో కలిసున్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం) ను థర్డ్ ఫ్రంట్ కు ఆహ్వానం పలికారు. సరే అవేమీ కార్యరూపం దాల్చలేదనుకోండి.. కానీ ఆ ప్రయత్నం అయితే కేసీఆర్ చేశారు.  అవన్నీ విఫలమైన తరువాత కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసి కూడా బీజేపీ అధికారంలో ఉన్న  గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్టాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ ఊసే ఎత్తలేదు.  ఇప్పుడు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న కర్ణాటక, మహారాష్ట్రలలో పోటీ చేస్తామంటున్నారు. అక్కడ పోటీ చేస్తే చీలేది బీజేపీ వ్యతిరేక ఓటేననడంలో సందేహం లేదు. అంతవరకు ఎందుకు, గడచిన ఎనిమిది సంవత్సరాలలో  తెలంగాణలోనే కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, సిపిఐ, పార్టీలకు చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను ప్రలోభాలకు గురి చేసి గోడ దూకించిన కేసీఆర్, బీజేపే వైపు మాత్రం కన్నెత్తయినా చూడలేదు.  అందుకే  కేసీఆర్ తెర తీసిన భారతీయ రాష్ట్ర సమితి, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తన పార్టీ మరో సారి అధికారాన్ని పదిల పరుచుకోవడానికేనని విశ్లేషకులు అంటున్నారు. 

గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. మరో వివాదం

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్  కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాల గురించి  ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.  ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక ముఖ్యమంత్రి, గవర్నర్  సంబంధాల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ఉప్పు నిప్పు అంటే బాగుంటుందేమో , ఆ ఇదరి మధ్య మాటలు లేవు. మాట్లాడుకోవడాలు లేవు.  వివాదాలకు మాత్రమే ఉన్నాయి. అధికార పరిధి మొదలు ప్రోటోకాల్ ఉల్లంఘనల  వరకు ఒకటని కాదు రెండు కీలక రాజ్యాంగ వ్యవస్థల నడుమ వివాదాలకు కొదవ లేదు.  అనేక వివాదాల  చుట్టూ దుమారం రేగుతోంది.  ఇప్పటికే అనేక పర్యాయాలు ఇదే విషయంగా చాలా చాలా చర్చ జరిగింది. జరుగుతూనే వుంది. అనివార్యం అయితే తప్ప  ముఖ్యమంత్రి  మంత్రులు మాత్రమే కాదు, సీఎస్, డీజీపీ సహా ఇతర అధికారులు  ఎవరూ..  రాజ్ భవన్ వైపు చూడడమే మానేశారు.  అదలా ఉంటే ఇప్పుడు మరో సారి మరో వివాదం తెరపై కొచ్చింది. ఇటీవల మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో  డెలీవరీ కోసం  అడ్మిట్  అయిన  ఇద్దరు మహిళలు  మృతి చెందారు. మరి కొందరు తీవ్ర  అనారోగ్యానికి గురయ్యారు. ఈ దుర్ఘటనపై గవర్నర్ స్పందించారు.  స్పందనలోనే సందేహాలు వ్యక్త పరిచారు. మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో బాలింతల మృతి చెందడంపై  తనకు  అనేక అనుమానాలున్నాయని  గవర్నర్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. రాజ్ భవన్ లో  ఆదివారం (జనవరి 15) నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో గవర్నర్ పాల్గొన్నారు.  ఈ  సందర్భంగా మీడియాతో మాట్లడుతూ మలక్ పేట ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమన్నారు. బాలింతల మరణాలపై  ఓ గైనకాలజిస్ట్ గా తనకు ఎన్నో అనుమానాలు,  ఉన్నాయని అన్నారు. గవర్నర్  గా మాత్రమే కాకుండా ఒక డాక్టర్ గా కొన్ని అనుమానాలున్నాయని అన్నారు. నిజానికి, ఆసుపత్రికి వెళ్లాలని అనుకున్నా కానీ, పండుగ  కారణంగా  వెళ్లలేకపోయానని అన్నారు.  గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించిన విషయాన్ని గవర్నర్ గుర్తు  చేశారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మెరుగుపరచ వలసిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను  మరింతగా  మెరుగు పరచాల్సిన అవసరాన్ని  గవర్నర్ నొక్కి చెప్పారు.  ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. అలాగే  రాష్ట్ర శాసన సభ ఆమోదం తెలిపిన కీలక బిల్లులకు సంబదించి, గవర్నర్ ప్రభుత్వ బిల్లులు పెండింగ్ లో లేవని, తన పరిశీలనలో  ఉన్నాయని    తెలిపారు.   వర్సిటీ నియామకాల బిల్లులో  అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటి నియామకాల బిల్లు వివాదాలతో  ఆలస్యం కారాదన్నదే  తన అభిమతమని గవర్నర్ వివరించారు. ఈ తరహా విధానాలను గతంలో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా గవర్నర్ గుర్తు చేశారు.   యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని  గవర్నర్  కోరారు. అయితే సాధారణ పరిస్థితులలో అయితే ఇలాంటి వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యత ఉండక పోవచ్చును కానీ  ఒక్క తెలంగాణలోనే కాకుండా ఇరుగు పొరుగు రాష్త్రాలలోనూ గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు నడుమ దూరం పెరిగిన నేపధ్యంలో, గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీయవచ్చని అంటున్నారు .

బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో పొలిటికల్ క్లారిటీ?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం ఇటీవలి కాలం వరకూ అత్యంత సంక్లిష్టంగా ఉండేది. ఔను అభివృద్ధీ నినాదానికీ.. సంక్షుమం ప్రలోభాలకూ మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న భావన ఉండేది. అన్ని ఫ్రీ.. అంతా ఫ్రీ విధానానికీ.. కష్టపడదాం, పని చేద్దాం సంపద పెంచుదాం అన్న విజన్ కూ మధ్య పోటీ అన్న వాతావరణం ఉండేది. అయితే ఇప్పుడు ఒక్క సారిగా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. తెరాస బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని ఏపీ గడ్డపై అడుగుపెట్టడంతో ఇక ఫ్రీ విధానానికి చెల్లు చీటీ పడిపోయింది. నిన్న మొన్నటి వరకూ అభివృద్ధి లేమి, పరిశ్రమలు పరార్ అంటూ ఏపీని చూపి తెలంగాణలో ఓట్లు దండుకున్న తెరాస ఇప్పుడు అదే అభివృద్ధి నినాదంతో ఏపీలో అడుగు పెట్టేసింది. ఏపీలో అడుగు పెట్టడానికి తెరవెనుక రాజకీయం మరేదో ఉందన్న అనుమానాలను పక్కన పెడితే.. ఆత్మగౌరవం, అభివృద్ధి అజెండాను బీఆర్ఎస్ తెరపైకి తీసుకు వచ్చింది. అదే సమయంలో గతంలో అంటే 2014, 2019 ఎన్నికల సమయంలో అప్పట్లో తెరాసగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రాంతాన్ని, ఆంధ్రప్రజలను తూలనాడిన వ్యక్తి ఇప్పుడు ఏపీలో రాజకీయం చేస్తానంటూ ముందుకు రావడంతో.. ఆయనకు చెక్ పెట్టేందుకు ఏపీ జనం సమాయత్తమౌతున్నారు.  బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడి నియామకం తరువాత రాష్ట్రంలో గతంలో ఏపీ లక్ష్యంగా, తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులు టార్గెట్ గా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది.  అంత మాత్రాన  బీఆర్ఎస్ ప్రభావం ఏపీ రాజకీయాలపై ఏ మాత్రం ఉండదా అంటే కచ్చితంగా ఉంటుంది. నిజానికి, ఒక్కఎపీలోనే కాదు దేశంలో ఏ ఒక్క ఒక రాష్ట్రం నుంచి పేరున్న పార్టీలు ,వ్యక్తులు ఎవరు కూడా కేసేఆర్ తో చేతులు కలిపేందుకు, సిద్ధంగా లేరు.  అయినా, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. చిన్నా చితక పార్టీలు, ప్రజాసంఘాలను కూడగట్టి జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.  సో.. బీఆర్ఎస్ ప్రభావం ఏపీ పై అసలే ఉందని చెప్పలేము, కానీ ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది విషయంలో మాత్రం దాదాపు ఏకాభిప్రాయమే వ్యక్తమౌతోంది. ఆయన ఏపీలో నిలదొక్కుకోవడం అంత వీజీ కాదనేదే. అన్నిటికీ మించి బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ.. ఎవరు ఔనన్నా కాదన్నా దెబ్బకొట్టేది.. వైసీపీ ప్రయోజనాలనే అన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.  కొవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏపీ కొవిడ్ రోగులను సరిహద్దుల వద్దే అడ్డుకున్న కేసేఆర్, అదే సరిహద్దు దాటి ఏపీలో ఎంటర్ అవుతానంటే, ఎలా అనుమతిస్తామని జనం అంటున్నారు? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసేఆర్ ఆంధ్రులను అవమానించిన తీరును ఎలా మరచిపోగలమంటున్నారు? నిన్నగాక మొన్న తెలంగాణ శాసన సభలో ఏపీపై విషం చిమ్మిన కేసీఆర్ కు  రెడ్ కార్పెట్  వేసి స్వాగతం ఎందుకు పలుకుతారని ప్రశ్నిస్తున్నారు.   కేసీఆర్, నేను మరిపోయాను నమ్మడానికి సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు. కేసీఆర్ పట్ల వ్యతిరేకతే ఆయన పార్టీని రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతిస్తున్న వైపీపీపైనా పడక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   నిజానికి ప్రాంతీయ వాదం పునాదిగా, రాజకీయంగా ఎదిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆయన అవసరాల కోసం    తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని, పక్కన పెట్టి జాతీయ నినాదాన్ని అందుకున్నారు. అందు కోసం  ఆయన దసరా పండగ రోజున తెలంగాణ భవన్ వేదికగా, తెరాస పార్టీ పేరును మార్చారు. భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే, జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి అడ్డుగా ఉన్న ‘తెలంగాణ’ అనే పదాన్ని తెసీసి ‘భారతీయ’ అనే పదాన్ని చేర్చారు.   ప్రొఫెసర్ కోదండ రామ్’  చెప్పినట్లుగా తెరాస పేరు మార్పు వెనక ఉన్న మూల సూత్రం మాత్రం తెలంగాణలో అధికారాన్ని, కుటుంబ పాలనను నిలుపుకోవడం. ఇదొక్కటే ఇప్పుడు కేసీఅర్ ముందున్న లక్ష్యం. ఇదొక్కటే ఆయన ముందున్న సవాలు. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకుని 1200 యువకుల బలిదానాల బాటలో అధికార పీఠాన్ని అందుకున్న కేసేఆర్, వారి త్యాగాలన్నిటినీ విస్మరించి, ఇప్పుడు కొత్త దారిని ఎంచుకున్నారు. ఈ కొత్త దారికి అడ్డుపడేది ఏదైనా ఉంటే అది తెలంగాణ పదమే అన్న నిర్ణయానికి వచ్చి పార్టీలోని తెలంగాణ పేరును తుడిచేసి భారత్ అని చేర్చారు. ఈ మార్పు  తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను  ఎలా ప్రభావితం చేస్తుంది.  జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే,   ఆంధ్ర ప్రదేశ్  రాజకీయాలను ఏ మేరకుప్రభావితం చేస్తుంది? అంటే.. ఏపీ జనులు మాత్రం బీఆర్ఎస్ కు ఇక్కడ స్థానం లేదని అంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ పార్టీని భుజానికి ఎత్తుకుంటున్న వైకాపాను తిరస్కరించడానికి కూడా జనం సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.   

జగన్ సినీ రాజకీయ మాయ.. ఈ సారి కనిపించదా?

ఏపీ రాజకీయ సమీకరణాల్లో స్పష్టత వస్తున్న కొద్దీ 2024 ఎన్నికలలో వార్ వన్ సైడ్ అయిపోతుందన్న భావన సర్వత్రా కలుగుతోంది. స్వయంగా అధికార పార్టీయే ఆ నిర్ణయానికీ, నిర్ధారణకూ వచ్చేసిందనిపించేలా ఆ పార్టీ నేతల మాటలు ఉంటున్నాయి. ఔను నిజమే.. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి అన్నీ మంచి శకునములే.. అధికార లాభ సూచనలే అన్నట్లుగా పరిస్థితులు కలిసి వచ్చాయి.  అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సినిమా గ్లామర్ కు ఎంత ప్రాధాన్యత ఉందో తెలియనిది కాదు.  ఆ  సినిమా గ్లామర్ అండ అప్పటి ఎన్నికలలో వైసీపీకి పుష్కలంగా లభించింది. ఔను అప్పట్లో సినీ పరిశ్రమ దాదాపుగా వైసీపీ వెనుక నిలబడిందని చెప్పవచ్చు. అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న థర్టీ ఇయర్ ఇండస్ట్రీ  పృధ్వీ రాజ్, కమోడియన్ కమ్ హీరో అలీ, రైటర్, కమ్ యాక్టర్ పోసాని కృష్ణ మురళి వీళ్లు ముగ్గురూ బహిరంగంగా వైసీపీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరే కాకుండా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా వైసీపీకీ, జగన్ కు మద్దతుగా నిలిచారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశారు. వీరే కాకుండా తెరవెనుక మద్దతు ఇచ్చిన సినీ పరిశ్రమకు చెందిన వారింకెంత మందో అన్నారు. 2019 ఎన్నికలకు మందు వైసీపీలో ఓ వెలుగు వెలగడమే కాకుండా.. వైసీపీ అండతో  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్  ఇష్టారీతిన విమర్శలు గుప్పించి జగన్ దృష్టిలో పడిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్, సినీ పరిశ్రమలో పనవ్ కల్యాణ్ కు సన్నిహిత స్నేహితుడిగా గుర్తింపు పొంది, కేవలం జగన్ పంచన చేరడం కోసం ఆయనకు దూరంగా జరిగిన అలీ, మొదటి నుంచీ చిరంజీవికీ, పవన్ కల్యాణ్ కూ దగ్గరి వాడుగా గుర్తింపు పొందిన పోసాని కృష్ణ మురళి.. వీళ్లంతా.. తమ శక్తికి మించి, పరిశ్రమలో తమ స్థానం ఏమౌతుందన్న బెరుకు కూడా వదిలేసి వైసీపీ కోసం పాటుపడ్డారు. కష్టపడ్డారు.   వీళ్లందరిలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. పృధ్వీరాజ్ రెండు ఆకులు ఎక్కువ తిన్నారు.  నోరున్నదే విమర్శించడానికి అన్నట్లుగా ఆయన చెలరేగిపోయారు. ఆయన చెలరేగిపోతున్న సమయంలో.. ఇప్పుడైతే బూతుల నేతలుగా పేరొందిన కొడాలి నాని వంటి వారు కూడా ఆయన ముందు దిగదుడుపు అన్నట్లుగా అప్పట్లో పృధ్వీ విమర్శలు ఉండేవి. సరే  ఆ తరువాత వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.  అన్ని వదిలేసి తన కోసం ప్రత్యర్థులను విమర్శించడమే పనిగా పెట్టుకున్న పృధ్వికి   ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు. సినీ పరిశ్రమ నుంచి వైసీపీ కోసం కష్టపడి పని చేసిన వారెందరో ఉన్నప్పటికీ..   జగన్ కు ఇష్టమైన భాషా ప్రయోగం చేసిన పృధ్వికి మాత్రమే ఆయన పదవి కట్టబెట్టారు. మిగిలిన వారికి తరువాత చూద్దాం అంటూ బజ్జగింపుతో సరిపెట్టారు. పదవి దక్కడంతో పృద్వీ మరింతగా రెచ్చిపోయారు. ప్రతి పక్ష పార్టీల నాయకులను ఎంత ఎక్కువగా దూషిస్తే అంతగా ముఖ్యమంత్రి గుడ్ లుక్స్ లో ఉంటానని భావించారో ఏమో ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవిని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకు పడ్డారు. చివరకు, అమరావతి రైతుల ఆందోళలోనూ వేలు పెట్టారు. సినిమా కూతలు కూశారు. అమరావతి రైతుల ఉద్యమంపై  పృథ్వీ చేసిన డర్టీ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయ్యాయి. అయినా అయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయితే, పృధ్వి ఎస్వీబీసే వైభోగం మూడు నాళ్ళ ముచ్చటగా ముగిసి పోయింది.  ఒక మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ బాధ్యతల నుండి తప్పించారు. ఇక అంతే ఆ తరువాత వైసీపీలో పృధ్విని పట్టించుకున్న వారే లేరు.  ఇలాంటి అసభ్య వాయిస్ రికార్డులతో దొరికిన ఇతర వైపీపీ నాయకులపై ఎలాంటి చర్యా తీసుకోని జగన్ పృధ్వి విజయంలో మాత్రం ఉద్వాసన చెప్పడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పదవి నుంచి పీకి పారేశారు.  మరో వంక   వెనకా ముందు చూసుకోకుండా, నోరు పారేసుకున్న  ఆయన్ని ఇండస్ట్రీ కూడా వదిలేసింది. దీంతో పృద్వీ రెంటికీ చెడ్డ రేవడిలా రోడ్డున పడ్డారు.    ఇక ఆ తరువాత ప్రముఖ కమేడియన్ అలీ విషయానికి వస్తే.. మూడేళ్ల పాటు అదిగో ఇదిగో అంటూ ఊరించి.. రాజ్యసభ సభ్యత్వం నుంచి వక్ఫ్ బోర్డు చైర్మన్ వరకూ  పెద్ద పెద్ద పదవుల ఆశ చూపి.. చివరకు ఓ సలహాదారు పోస్టుతో సరిపెట్టారు.  అలాగే  అయినదానికీ కానిదానికీ కూడా జగన్ ను భుజాన వేసుకుని మోసే   పోసాని కృష్ణ మురళీకి కూడా నామినేటెడ్ పోస్టు పారేశారు. అలాగే ఎప్పుడో జగన్ ప్రచారానికి ఓ పాట పాడిన మంగ్లీకి కూడా ఓ సలహాదారు పోస్టు ఇచ్చేశారు. అయితే..  మోహన్ బాబు ఫ్యామిలీని ఇసుమంతైనా పట్టించుకోలేదు. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే..జగన్ మూడున్నరేళ్ల పాలనలో సినీ పరిశ్రమను అష్ట కష్టాల పాల్జేశారు. రాజకీయంగా తనతో విభేదిస్తున్న ఒకరిద్దరిని దృష్టిలో ఉంచుకుని మొత్తం పరిశ్రమనే ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల సమయంలో జగన్ కు మద్దతుగా నిలబడేందుకు సినీ పరిశ్రమ నుంచి ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. పదవులు ఇచ్చాం వీళ్లు మాతోనే ఉంటారు అని భావిస్తున్న అలీ, పోసానిలు కూడా ఈ సారి చురుకుగా వైసీపీ తరఫున నిలుస్తారన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే.. వారికిచ్చిన సలహాదారు పోస్టులు ఉత్సవ విగ్రహాల్లాంటివే.. తమ స్టేచర్ కు, పడిన కష్టానికి అవి తగిన పదవులని వారు భావించడం లేదు. దీంతో ఈ సారి ఎన్నికలలో గతంలో అండగా నిలిచిన సినీ గ్లామర్ ఈ సారి వైసీపీకి ఉండదని చెబుతున్నారు. 

బావిలో పడిన సూది దొరుకుతుందా?.. ఢిల్లీ లిక్కర్ స్కాం తేలుతుందా?

చిన్న పిల్లలకు తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలూ తరచుగా చెప్పే కథ  ఒకటుంది.. అనగనగా ఓ ముసలవ్వ నూతి గట్టుపై కూర్చుని బొంత కుట్టుకుంటుంటే..సూది బావిలో పడిపోయింది.. ఏం చేస్తే ఆ  సూది బయటకు వస్తుంది అని. పిల్లల్లో ఊహాశక్తిని పెంచేందుకు ఈ కథ చెబుతారు. అయితే రాజకీయ నాయకులు మాత్రం ప్రజలలో నిరాసక్తత, నిర్లిప్తతను నింపేయడానికి దాదాపు ఆ కథనే స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఔను  నిజమే.. దేశంలో జరగుతున్న కుంభ కోణాలు, వాటి దర్యాప్తుల విషయంలో జనం ఈ దర్యాప్తు కొలిక్కి వస్తుందా? రాదా? అని ప్రశ్నించే అవసరం లేకుండా కొనసాగుతుంది అన్న జవాబును వారికి ముందే చెప్పేస్తున్నారు. అసలు దర్యాప్తులకు రాజకీయాలకు, ప్రభుత్వాలకూ సంబంధం ఏమిటంటారా?  ఆ  సంబంధం ఏమిటో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టంగా చెప్పేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల రిమోట్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటుందనీ, అలాగే రాష్ట్రాల దర్యాప్తు సంస్థల రిమోట్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని. నిజమే.. ఎమ్మెల్యేల కొనుగోలు బేర సారాల కేసును సిట్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సమయంలో ఆయన ‘ మీ చేతిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటే.. మా దర్యాప్తు సంస్థలు మాకున్నాయి అని కేంద్రానికి తేల్చి చెప్పారు. ఆ సందర్భంగానే ఆయన ఈ మాటలు ఎందుకన్నారో అందరికీ తేటతెల్లమైపోయింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ఎమ్మెల్సీ, స్వయంగా తన కుమార్తె కల్వకుంట్ల కవితపై ఆరోపణలు రావడం, ఆమెను ఈడీ, సీబీఐ విచారించడం నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.   అంటే చట్టం, న్యాయం, ధర్మం కంటే కేసులు దర్యాప్తుల విషయంలో రాజకీయానిదే కీలక పాత్ర అని ఆయన స్వయంగా చెప్పేశారన్నమాట.  ఓ వంక ఢిల్లీ లిక్కర్ స్కాంలో సూత్రదారులు, పాత్ర దారులు ఎంతమంది ఉన్నా, తెలంగాణకు సంబంధించినంతవరకు, ఫోకస్ మొత్తం, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత చుట్టూనే తిరుగుతోంది. కవిత కేంద్రంగానే  సిబిఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. నిజానికి, ఈ స్కాంలో కవిత పేరు చాలా కాలంగా వినిపిస్తున్నా డిసెంబర్ మొదటి వారం వరకు ఆమె ప్రమేయం గురించి, ఈ కేసును విచారిస్తున్న సిబిఐ, ఈడీ ఎక్కడా అధికారికంగా ప్రస్తావించలేదు. అయితే ఆ తర్వాత, కదలిక మొదలైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై అమిత్ అరోరాని ఈడీ అరెస్ట్ చేసింది. అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు ఉన్నట్లు వెల్లడైంది. సౌత్ గ్రూప్ నుంచి చెల్లించిన రూ.100 కోట్లకు కంట్రోలర్ గా శరత్ చంద్ర, కె.కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా డిసెంబర్  ఫస్ట్ వీక్ లో   సిబిఐ  కవితకు 160 సీఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చింది. డిసెంబర్ 11,12 తేదీల్లో సిబిఐ అధికారులు కవితను ఆమె నివాసంలోనే విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబందించిన వివరాలను సేకరించారు.  ఆ తర్వాత మళ్ళీ స్వల్ప విరామం తరువాత మళ్ళీ  ఇంకోసారి విచారణకు హజరుకావాలని 91 సీఆర్పీసీ కింద సీబీఐ అధికారులు నోటీసులు పంపించారు. ఐతే ఈసారి కవిత నివాసంలో కాకుండా.. తాము చెప్పిన చోటుకు వచ్చి.. విచారణకు హాజరవ్వాలని స్పష్టం చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు తాము అడిగిన పత్రాలను సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎవరు నోటీసులు అందుకుంటే వాళ్లు మాత్రమే హాజరుకావాలని వెల్లడించారు. కేసుకు సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లకు సంబంధించి సమాచారం కావాలని.. కావాల్సిన పత్రాలు, సాక్షాలు ఇవ్వాలని కోరారు. విచారణ తేదీ, స్థలాన్ని త్వరలోనే మెయిల్ చేస్తామని సీబీఐ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసు వచ్చి నెల రోజులు దాటి పోయింది.  అయినా ఇంతవరకు అటు నుంచి గానీ, ఇటు నుంచి గానీ ఉలుకూ పలుకూ లేదు. ఇంతలోనే ఎమ్మెల్యేల బేరసారాల  (ఫార్మ్ హౌస్) కేసు తెరపై కొచ్చింది ఈ కేసుకు సమందించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు  విచారణార్హత లేదని హై కోర్టు తేల్చేసింది. కేసును సిబిఐకి బదిలీ చేయాలని హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిట్  విచారణపై  అనుమానాలు వ్యక్త చేసింది..ముఖ్యంగా ఈ వ్యవహారం ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారం వెలుగు చూసిన తరువాత ముఖ్యమంత్రి  కేసీఆర్ మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను వెల్లడించడాన్ని ప్రస్తావించిన హైకోర్టు..సీఎం కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని పేర్కొంది. సో ... ఎమ్మెల్యేల బేరసరాల కేసు అటుతిరిగి ఇటు తిరిగి  ప్రగతి  భవన్ కు చేరుకుందని అనుకుంటున్నారు. సరే  హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసిందనుకోండి అది వేరే విషయం.  కానీ కవిత కు లిక్కర్  కేసులో ఇచ్చిన నోటీసుల విషయం ఏమిటి? ఆమెను నోటీసులుఇచ్చి నెలరోజులైనా విచారణకు ఎందుకు పిలవలేదు?      కవిత లిక్కర్ కేసుకు సంబందించి, సిబిఐ,ఈడీ మౌనం వెనుక ఉన్న మతలబు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం మళ్లీ బావిలో పడిన సూది కథలాగా మారుతుంది.  రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న కేసుల విషయంలో ఇవన్నీ మామూలే అని చెబుతున్నారు.  అయితే అటు లిక్కర్ కేసు, ఇటు ఎమ్మెల్యేల బేరసారాల కేసులలో రాజకీయ ప్రమేయం ఉన్న నేపధ్యంలో ఈ కేసులు ముందుకు సాగడం, సాగకపోవడం అన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందంటున్నారు. 

ప్రపంచ ఆర్థిక సదస్సుకు జగన్ కు నో ఇన్విటేషన్.. అసలు ఏపీని పట్టించుకోలేదు!

ఏటా దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు ఈ ఏడాది కూడా  దావోస్ లో జరుగుతోంది. అయితే ఈ సదస్సుకు నిర్వాహకులు ఏపీ సీఎంను పట్టించుకోలేదు.  పేరుకు యాక్టివ్ భాగస్వాములు అని అంటారు కానీ.. అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలకూ ఆహ్వానం పంపుతారు. ఏటా ఇది జరిగేదే..కానీ ఈ  సారి మాత్రం ఏపీకి ఆహ్వానం దక్కలేదు.   సాటి తెలుగు రాష్ట్రం అయిన  తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం అందింది.    తెలంగాణను అగ్రగామి టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చడంలో మీ నాయకత్వం ఎంతో కీలకమైంది’ అని  కేటీఆర్ కు అందిన ఆహ్వానంలో ప్రపంచ ఆర్థిక సదస్సు అధ్యక్షుడు పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఏపీ సీఎం జగన్ కు  అందింది.  ఈ కారణంగా సీఎం జగన్ కూడా తన ప్రతినిధి బృందంతో దావోస్ వెళ్లారు. అయితే ఈ సారి దావోస్ కు ఏపీకి ఆహ్వానమూ అందలేదు.. ఏపీ నుంచి ప్రతినిధి బృందమూ వెళ్ల లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రతీ ఏడాది ఏపీ నుంచి  ప్రతినిధి బృందం వెళ్లేది. ఏపీని గొప్పగా ప్రమోట్ చేసేవారు.  కానీ ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో సెంటిమెంట్ దెబ్బతిన్నది.. దీంతో ఏపీ వైపు పెట్టుబడిదారులు చూడటం లేదు.  అయినా దావోస్ నుంచి ఆహ్వానం అందినా, జగన్ పెద్ద ప్రతినిథి బృందాన్ని వెంటపెట్టుకుని వెళ్లినా పెద్దగా ఒరిగేదేం లేదని గత ఏడాది ఆయన దావోస్ పర్యటన ద్వారా తేలిపోయింది. అందుకే ఈ సారి దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సును జగన్ సర్కార్ లైట్ గా తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆహ్వానం వచ్చినా.. ఆయన వెళ్లాలన్నా మళ్లీ కోర్టు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అలా తీసుకుని వెళ్లినా ఏపీలో పరిస్థితులు తెలిసిన పారిశ్రామిక వేత్తలెవరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం లేదు. గత ఏడాది జగన్ ఆర్భాటంగా దావోస్ వెళ్లినప్పటికీ ఆయన పర్యటన మొత్తం వివాదాస్పదంగానే మారింది. భార్యతో విహార యాత్రకు వెళ్లిన చందంగా ఆయన దావోస్ పర్యటన ఉందన్న విమర్శలు వెళ్లువెత్తాయి. ఆయన దావోస్ పర్యటనకు బయలు దేరడానికి ముందే అప్పట్లో మంత్రులు ఈ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్న భ్రమలు వద్దని చెప్పేశారు. పెట్టుబడులు వస్తాయన్న ఆశలు లేనప్పుడు దావోస్ వెళ్లడమెందుకని అప్పట్లోనే విమర్శలు వెళ్లు వెత్తాయి.  

పవన్ కల్యాణ్ క్లారిటీతో వైసీపీ నేతల్లో గాభరా

పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు.   అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు తన గౌరవానికి భంగం కలగనంతవరకూ పొత్తులతోనే ముందుకు వెళతానన్న స్పష్టత ఇచ్చేశారు. అంటే తెలుగుదేశం, జనసేనలు వచ్చే ఎన్నికలలో కలిసే వెళతారన్నది స్పష్టమైపోయింది. ఇక ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ దింపుడు కళ్లెం ఆశతోనే అని ఆయనకు ఎంత వరకూ అర్ధమైందో తెలియదు కానీ.. ఆయన పార్టీలోని నాయకులకు మాత్రం స్పష్టంగా అర్ధమైంది. అందుకే జగన్ పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని, గెలుస్తామనీ పార్టీ నేతల్లో, క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపే యత్నాలు చేస్తున్న.. మనసులో ఆందోళన ఉన్న పైకి అతి విశ్వాసం ప్రదర్శిస్తున్నా..  పార్టీ నేతల్లో, క్యాడర్ లో ఎలాంటి కదలికా రావడం లేదు. ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లి, ప్రతి ఫ్యామిలీకి చేసిన మేళ్లను చెప్పుకోవాలని, తరుము తున్నారు.  నిజంగా ప్రతి గాడకు మేలు జరిగిందే నిజం అయితే, గడపగడపలో ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే.. నిజంగా మనం మేలు చేస్తే ఇంతలా హైరాన పాడడం ఎందుకు? అంటూ పార్టీ నేతలూ, కార్యకర్తలు గొణుక్కుంటున్నారు.  ఎన్నికల మేనిఫెస్టోలో 98 శాతానికి పైగా హామీలను నెరవేర్చామని, చేసిన పనులను గడపగడపకు ప్రజల వద్దకు తీసుకెళ్లడి చాలు అంటూ కార్యకర్తలలో విశ్వాసం కలిగించేందుకు చాలా చాలా శ్రమిస్తున్నారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాన్ని భూతద్దంలో చూపించి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం  కుప్పంలోనే గెలిచి నప్పుడు, మిగిలిన  నియోజక వర్గాల్లో గెలవడం ఎంత పని, 175కు 175 నియోజక వర్గాల్లోనూ గెలుస్తాం  గెలుస్తున్నాం .. అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. అయితే, జగన్ రెడ్డి కుప్పం గెలుపును ప్రజాస్వామ్య విజయంగా చెప్పుకోవడం, అది చూసి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుకోవడం, తల్లి తండ్రులను హత్య చేసిన హంతకుడు, తల్లి తండ్రులు లేని అనాధను కరుణించి కాపాడండని న్యాయస్థానాన్ని వేడుకున్నట్లు ఉందని అంటున్నారు. నిజమే అద్దాల మేడలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి పగటి కళలు కంటే కనవచ్చును, కానీ, వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో మాత్రం  భరోసా కనిపించడం లేదు. గతంలో,  అభ్యర్ధి ఎవరైనా,  `అన్నకు ఓటేయండి.. అన్నను అధికారంలోకి తీసుకువద్దాం!  అని  అన్ని నియోజక వర్గాల్లో జగన్ రెడ్డే, వైసీపీ అభ్యర్ధి అన్నట్ల్గు  ప్రచారం చేసిన కార్యకర్తలు, ఇప్పుడు మౌనంగా ఉంది పోతున్నారు. జగన్ రెడ్డి ఏమి చేశారంటే, చెప్పేందుకు సమాధానం లేక గడపగడప కర్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు, 2019 ఎన్నికల్లో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి వైసీపే వెంట నడిచిన  కార్యకర్తఃలు చాలా వరకూ ఇప్పుడు దూరంగా ఉంటున్నారు.  98 శాతం వరకు ఇచ్చిన హమీలను నేరవేర్చామని చెప్పుకోవడం, అమ్మకు అన్నం పెట్టనోడు, పిన్నమ్మకు వడ్డానం చేయించానన్నట్లు ఉందని  సొంత పార్టీ అధినేతపైనే సెటైర్లు వేస్తున్నారు. ప్రజల సంగతి తర్వాత, కార్యకర్తలకు ఇచ్చిన హమీలకే దిక్కు లేదని, నేతలను నడిరోడ్డు మెదే నిలదీస్తున్నారు.  అలాగే, కులం, మతం ఇతర కారణాలతో ఇంకా వైసీపీని మోస్తున్న కార్యకర్తఃలు అయితే, ఇక ఇప్పడు చేయగలిగించి ఎమీ లేదని, జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోతున్నారు. ఇక ఇప్పుడు ఏం చేసినా చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడమేనని అంటున్నారు. కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంటే..  పార్టీ నాయకుల్లోనూ అసంతృప్తి జ్వలిస్తోంది. ఇంత కాలం అణచిపెట్టుకున్న అసంతృప్తి ఇప్పుడు   భగ్గుమంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తుపాకిలో తూటా దూసుకోస్తోంది. ప్రతి జిల్లా, ప్రతి నియోజక వర్గంలోనూ కనీసం ఇద్దరు ముగ్గురు నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.  ఉమ్మడి కృష్ణాను తీసుకుంటే.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, గుంటూరులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరులో కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి మానుగుంట మహీధర్రెడ్డి,  గుంటూరులో ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తాడికొండ ఉండవల్లి శ్రీదేవిచ  కర్నూలు ఎస్వీ మోహన్రెడ్డి (మాజీ ఎమ్మెల్యే) రాజంపేట మేడా మల్లికార్జున రెడ్డి రాయచోటి శ్రీకాంత్రెడ్డి గిద్దలూరు అన్నా రాంబాబు బాపట్ల కోన శశిధర్ శ్రీకాకుళం కిల్లి కృపారాణి పేరాడ తిలక్.. ఇలా.. కీలక నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీరంతా కూడా ఒకరిద్దరు మినహా అందరూ కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంట నడిచిన వారే, అయన విజయం  కోసం కష్టపడిన వారే. ఆయన కోసం.. ఆర్థిక సమస్యలు కొనితెచ్చుకున్నవారే.అప్పులు చేసి మరీ ఖర్చు చేసిన వారే. అయితే.. ఇప్పుడు వీరికిప్రాధాన్యం లేకుండా పోవడం.. జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం.. వారు ఆధిపత్య ధోరణితో ముందుకు సాగడం వంటివి ఇప్పుడు వారికి మనోవేదనను కలిగిస్తున్నాయి. దీనికి తోడు.. నియోజకవర్గాల్లో అభివృద్ధి లేక పోవడం కూడా.. వారిని తీవ్ర సంకట స్థితికి చేర్చింది. దీంతో ఎక్కడికక్కడ నిరసనలు పెరుగుతున్నాయి.నిజానికి,  జగన్ రెడ్డి మాటలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన లేదనే విషయాన్ని వైసీపీ నాయకులూ కార్యకర్తలే బహిరంగంగా అంగీకరిస్తున్నారు.  నిజానికి ఇప్పటికే చాల వరాకు జిల్లాల్లో అసంతృప్తి కర్యకలాపాలు ఊపందుకున్నాయి... ఎన్నికలు దగరయ్యే కొద్దీ పార్టీలో కింది నుంచి పైవరకు ఉన్న అసంతృప్తి భగ్గుమంటుందని, వైసీపీ ముఖ్య నేతలే   అంగీకరిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు   వెనకాడుతున్నారు. ఒక వేళ తీసుకెళ్లినా ప్రయోజనం ఏముంది అని మిన్నకుంటున్నారు. 

కేసీఆర్ ఆయుధాలు అయిపోయాయా?.. బీఆర్ఎస్ జోరు చూపేనా?

తెలంగాణ రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో షికారు చేసిన  పార్టీని ఇకపై దేశవ్యాప్తంగా షికారు చేయించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే... ఆ పార్టీ  తెలంగాణ  కనబరిచిన జోరు దేశవ్యాప్తంగా ఉంటుందా? అంటే సందేహమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   తాజాగా బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ మారడం వల్ల.. తెలంగాణ అనే పదం స్థానంలో భారత్ అనే పదం వచ్చి చేరడం వల్ల.. ఇది తెలంగాణ ప్రజలను ఇకపై అంతగా ప్రభావితం చేయలేదని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2014 నుంచి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికలు జరిగినా... ఆంధ్ర అనే పదాన్ని ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకొంటూ.. కారు పార్టీ నాయకత్వం తెలంగాణ గడ్డపై షికారు చేసింది. అందుకు ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అన్న తేడా లేకుండా ఏకపక్షంగా ఆ పార్టీ గెలిచిందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకొందని... దీంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే... మళ్లీ చంద్రబాబు తెలంగాణ గడ్డపై నుంచి రాజ్యమేలతాడంటూ.. తెలంగాణ ప్రజల్లో ప్రచారం చేసి విజయం సాధించడంలో కేసీఆర్   100కి వంద శాతం సఫలీకృతమయ్యారనీ అలా తెలంగాణ సెంటిమెంటుతో కేసీఆర్ ఇప్పటి వరకూ ఎన్నికలలో గెలుస్తూ వస్తున్నారనీ, ఇక పార్టీలో తెలంగాణ ఆత్మను తీసేసిన తరువాత ఆ సెంటిమెంట్ ను మళ్లీ వర్కౌట్ చేయడం కష్టమనీ అంటున్నారు.      గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కేసీఆర్ ఫ్యామిలీ ఇదే రీతిగా వ్యవహరించిందనడంలో ఎటువంటి సందేహం లేదని వారు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగణ గెడ్డపై తెలుగుదేశం పార్టీలో కేడర్ ఎంత బలంగా ఉన్నా.. సైకిల్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించడంలో వెనకబడిపోయిందని వారు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా  పాండవులు... జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను దించినట్లు.. తెలంగాణ అనే పదాన్ని కేసీఆర్  లీ ఓ ఆయుధంగా అవసరమైనప్పుడు వాడుకొంటూ.. ఎన్నికల రణక్షేత్రానికి వెళ్లేవారని అంటున్నారు.  కానీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత.. తెలంగాణ అనే సెంటిమెంట్.. ఎక్సపైయర్ అయిన అయిమెంట్‌లాగా అయిపోయిందని.. దీంతో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణ గడ్డపైనే కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ  స్థిరమైన నాయకత్వాన్ని కోల్పోబోతున్నదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   దీంతో తెలంగాణ గడ్డ మీదే.. కేసీఆర్‌కు ఓట్లు పడడం కష్టమని చెబుతున్నారు. మరోవైపు గతంలో తెలంగాణ గడ్డపై కేసీఆర్ పార్టీ ఉన్నంత బలంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏవీ లేవని.. కానీ ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ బలం పుంజుకొంటున్నాయని వారు చెబుతున్నారు. ఇక ముచ్చటగా మూడోసారి తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని  కేసీఆర్ ఎంతగా ప్రయత్నిస్తున్నారో.. అంతే పోటీగా.. బీజేపీ జెండాని తెలంగణ గడ్డపై రెపరెపలాడించలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోందని.. అలాగే రేవంత్ రెడ్డి సారథ్యలోని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి బలంగా దూసుకు వెళ్తోందని.. ఇక టీడీపీ సైతం వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలని కృత నిశ్చయంతో ఉందని.. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్.. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని నిలుపుకొంటారా? అంటే అనుమానమే అని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో అభిప్రాయపడుతున్నారు. ఇంకో వైపు దేశవ్యాప్తంగా రాజకీయం చేస్తుండంతో.. తెలంగాణలో గద్దెనెక్కేందుకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడిన తెలంగాణ సెంటిమెంట్  ఏమంత ఉపయోగపడదనీ చెబుతున్నారు.  

పీవోకే భారత్ లో కలిసిపోతుందా? ప్రజా ఉద్యమాలకు పాక్ తలొగ్గక తప్పదా?

పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ ప్రజలు  భారతదేశంలో కలుస్తామని నినదిస్తున్నారు. పాకిస్తాన్ సర్కార్ కు వ్యతిరేకంగా భారీగా ర్యాలీలు, నిరసనలు తెలుపుతున్నారు. తమ ప్రాంత వనరులను దోపిడీ చేస్తూ పంజాబ్, సింధ్ ప్రావిన్స్ లను అభివృద్ధి చేస్తున్నారంటూ   పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే), గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు ఆందోళనకు దిగారు.   లక్షలాది మంది జనం రోడ్లపైకి వచ్చి పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఆ ప్రజాందోళనకు సంబంధించిన వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా గోధుమల కొరతతో జనం అల్లాడిపోతున్నారు. పాకిస్తాన్ లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో కిలో గోధుమ పిండి ధర రూ. 150 వరకు ఉంటే   గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో రూ. 200 వరకు ఉంటోంది. దీంతో పాక్ ప్రభుత్వం తమపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని పీఓకే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను భారత్ తో కలపాలని, కార్గిల్ రోడ్ ఓపెన్ చేయాలని లక్షల మంది   ర్యాలీలు చేశారు. గత 12 రోజులుగా ఈ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్ ఎప్పుడైనా పీఓకే, గిల్గిత్ బాల్టిస్తాన్ పై దాడి చేస్తుందన్న అనుమానం పాకిస్థాన్ లో ఉంది. దీంతో గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో పాక్ సైనిక కార్యకలాపాలను పెంచుతోంది. దీంతో అక్కడి స్థానికులను వేరే ప్రాంతానికి తరలిస్తోంది. దీంతో అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుతున్నాయి. గిల్గిట్ – బాల్టిస్తాన్‌లకు స్వాధీనం చేసుకుంటామని గత అక్టోబర్ లో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన సంగతి విదితమే.అందుకు అనుగుణంగా భారత సైన్యాధికారులు కూడా అటువంటి వ్యాఖ్యలే చేయడంతో  పాకిస్తాన్  ఆందోళన చెందుతోంది. దాదాపుగా ఏడుదశాబ్దాల తరువాత   గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రజలు భారత్ లో కలుస్తామని నినదిస్తుండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఆందోళనల వెనుక భారత్ ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తోంది.  గతంలో భారత్ లో చేరబోమంటూ  ఉద్యమాలు  చేసిన వారే ఇప్పుడు ఇండియాకు అనుకూలంగా ఉద్యమిస్తుండటం గమనార్హం.  భారత్ నుంచి విడిపోయిన దేశాలన్నీ మళ్లీ విలీనం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. సరిహద్దుల్లో ఉన్న అనేక దేశాలు  కరువుతో కొట్టుమిట్టాడుతున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్, మయన్మార్, కాబూల్ లలో భారత్ పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది. ఆ దేశాలన్నిటిలోనూ ప్రస్తుతం రాజకీయ అస్థిరత నెలకొని ఉంది.  తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాళా అంచున ఉన్నాయి.  ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలలో అక్కడి ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. ఆయా దేశాలలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే అక్కడి జనం ఇండియాలో విలీనం కోరుకుంటున్నారు. పీవోకేలో అయితే ఏకంగా ఇండియాలో కలుస్తామంటూ ఉద్యామాలు వెల్లువెత్తుతున్నాయి. 

విరాటుడి సెంచరీల వేట.. లంకతో మూడో వన్డేలో చెలరేగిన కోహ్లీ

కోహ్లీ మళ్లీ సెంచరీల వేటలో పడ్డాడు. దాదాపు మూడున్నరేళ్ల పాటు సెంచరీ కోసం ఎదురుచూసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు పరుగుల వరద పారిస్తున్నారు. సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. లంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో శతక బాదిన రన్‌ మెషిన్‌ ఆదివారం(జవనరి 15) తిరువనంతపురం వేదికగా మూడో వన్డేలో మరో శతకం బాదాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ అజేయ సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆరంభం నుంచే దాటిగా ఆడుతూ విరాట్‌ కేవలం 85 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు.  చివరి వరకూ క్రీజ్ లో నిలిచి  మొత్తంమీద 110 బాల్స్‌లోనే ఎనిమిది సిక్స‌ర్లు, ప‌ద‌మూడు ఫోర్ల‌తో 166 ర‌న్స్ చేశాడు. ఈ స్కోరులో ఎనిమిది సిక్స‌ర్లు, ప‌ద‌మూడు ఫోర్లు ఉన్నాయి.   కాగా వన్డే కెరీర్‌లో అతనికిది 46వ సెంచరీ కాగా ఓవరాల్‌గా 74వది. కాగా ఈ సెంచరీతో మాస్టర్‌ బ్లాస్టర్‌ స‌చిన్ టెండూల్కర్‌ రికార్డు బ‌ద్దలు కొట్టాడు కోహ్లీ. స్వదేశంలో అత్యధికంగా 21 సెంచ‌రీలు బాదిన ఆట‌గాడిగా నిలిచాడు. స‌చిన్ 20 సెంచ‌రీల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.  సచిన్ స్వదేశంలో చేసిన 20 సెంచరీలను 160 మ్యాచ్ ల్లో పూర్తిచేస్తే, విరాట్ మాత్రం 101 మ్యచ్ ల్లోనే చేరుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం జ‌రిగిన మూడో వ‌న్డేలో శ్రీలంక‌పై టీమ్ ఇండియా 317 ప‌రుగుల తేడాతో ఘన విజ‌యాన్ని సాధించింది. వ‌న్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.   ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 390 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో విఫ‌ల‌మైన శ్రీలంక 73 ప‌రుగుల‌కే ఆలౌటై దారుణ ప‌రాజ‌యాన్ని మూట గ‌ట్టుకున్న‌ది.ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, శుభ్‌మ‌న్ గిల్ అద్భుత శ‌త‌కాల‌తో రాణించారు. కోహ్లి, గిల్ మెరుపుల‌తో భార‌త్ 50 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 390 ర‌న్స్ చేసింది. రికార్డ్ టార్గెట్‌తో బ‌రిలో దిగిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ భార‌త బౌల‌ర్ల‌ను ఏ మాత్రం ప్ర‌తిఘ‌టించ‌లేక‌పోయారు. వ‌రుస‌గా ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. 22 ఓవ‌ర్ల‌లో 73 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌లో ముగ్గురు మాత్ర‌మే డ‌బుల్ డిజిట్ స్కోరు చేశారు. 19 ర‌న్స్‌తో ఫెర్నాండో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఇండియా బౌల‌ర్ల‌లో సిరాజ్ నాలుగు వికెట్ల‌తో ఆక‌ట్టుకున్నాడు. ష‌మీ, కుల్దీప్ యాద‌వ్‌ల‌కు త‌లో రెండు వికెట్లు ద‌క్కాయి. శ్రీలంక‌తో మ్యాచ్ ద్వారా వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ప‌రుగులు తేడా ప‌రంగా అతి పెద్ద విజ‌యాన్ని అందుకున్న జ‌ట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. గ‌తంలో ఈ రికార్డ్ న్యూజిలాండ్ పేరు మీద‌ ఉంది. ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 290 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఆ రికార్డును శ్రీలంక‌తో మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా తిర‌గ‌రాసింది.

ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీకి అగ్నిపరీక్షే

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌ మేఘాలయల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి   అగ్నిపరీక్ష అనే చెప్పాలి. ఎన్నికల కమిషన్‌ ఇంకా ఎన్నికల తేదీ లను ప్రకటించలేదు కానీ, ఎన్నికలు ఫిబ్రవరి లేదా, మార్చిలో జరిగే అవకాశం ఉంది. త్రిపురలో బీజేపీ రాష్ట్ర శాఖలో కొద్ది రోజులుగా వర్గ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా ముఖ్యమంత్రి బిప్లవ్‌ దేబ్‌   పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న ఆదివాసీ ఐ.పీ.ఎఫ్‌.టీ అలక పాన్పు ఎక్కింది. ఈ రెండు పార్టీలు కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని, ప్రద్యోత్‌ కిషోర్‌ దేబ్‌ బర్మ నాయకత్వంలోని తిప్రా మోతా   బలం పుంజు కుంటోంది. ఈ పార్టీ అక్కడ ప్రత్యేక ఆదివాసీ రాష్ట్రం కోసం  పోరాటం సాగిస్తోంది. ఈ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే తేనె తుట్టెను కదల్చినట్టవు తుందని బీజేపీ పాలకులు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడుతు న్నారు. విచిత్రమేమింటే, ఈ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు లేకుండా ఐ.పీ.ఎఫ్‌.టీ కూడా విజయం సాధించే అవకాశం లేదు. ఇది ఇలా ఉండగా, చాలాకాలం ఇక్కడ అధికారంలో ఉన్న సీ.పీ.ఐ(ఎం) కూడా మళ్లీ అధికారంలోకి రావడానికి  వేగంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌, తిప్రా మోతీ పార్టీలతో పొత్తు కుదర్చుకో వడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు మార్క్సిస్టు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అంతే కాదు, 2021 శాసన సభ ఎన్నికల్లో ఘన విజ యం సాధించినప్పటి నుంచి త్రిపుర మీద కన్నేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ మొత్తం 60 స్థానాలలోనూ ఒంటరిగా పోటీ చేయడానికి అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తోంది. దీని వల్ల ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతినే అవకాశం ఉన్నా ఆ పార్టీ లెక్క చేయడం లేదు. ఈ రాజకీయ పరి ణామాలు రానున్న ఎన్నికల్లో బీజేపీకి పెద్ద సవాలుగా పరిణమించనున్నాయి. ఈ పార్టీలను ఎదుర్కోవడం బీజేపీకి ఆషామాషీ వ్యవహారం కాదు కానీ, ఓట్లు చీలకుండా నివారించడానికి ఆ పార్టీ ఎత్తులు వేయక తప్పకపోవచ్చు.  ఇక మేఘాలయ విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎన్‌.పీ.పీ అనే స్థానిక పార్టీతో పొత్తు ఉంది. అయితే, ఇక్కడి ఎన్‌.పీ.పీ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా తాము ఇక ఏ మిత్రపక్షంతోనూ సంబంధం లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించేశారు. ఈ  రాష్ట్రంలో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను ప్రవేశ పెట్టడానికి ఆయన పూర్తి విముఖంగా ఉన్నారు. అంతే కాక, పొరుగున ఉన్న అస్సాం రాష్ట్రంతో ఈ రాష్ట్రానికి సరిహద్దు సమస్యలున్నాయి. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. గత నవంబర్‌లో అస్సాంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య పొరపచ్చాలకు కారణమైంది. ఈ స్పర్ధల నుంచి బయటప డడానికి, మళ్లీ పొత్తును సాధించడానికి ఢిల్లీలోని బీజేపీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు.  నాగాలాండ్‌ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అస్సాంతో నాగా లాండ్‌కు కూడా సరిహద్దు సమస్యలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు వంటివి ఉన్నాయి. నాగాలాండ్‌లో బీజేపీ, నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. ఈస్టర్న్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ ఫ్రాంటియర్‌ నాగాలాండ్‌ పేర తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకు ని ఇప్పుడు ఈ సంస్థ తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తోంది. నిజానికి ప్రత్యేక రాష్ట్రం విషయం లో ఎన్‌.ఎస్‌.సీ.ఎన్‌-ఐఎం అనే పార్టీతో చాలా కాలం బీజేపీ చర్చలు జరిపింది కానీ, ప్రస్తుతం ఆ చర్చ ల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. నాగాలకు ప్రత్యేక పతాకం, ప్రత్యేక రాజ్యాంగం కావాలని ఎన్‌.ఎస్‌. సీ.ఎన్‌- ఐఎం కూడా డిమాండ్‌ చేస్తోంది. ఏతావతా, ఈ మూడు రాష్ట్రాలలో ఈసారి జరగబోయే ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి. అయితే బీజేపీతో పొత్తు లేకుండా ఈ రాష్ట్రాలలో ఏ పార్టీ కూడా అధికారానికి వచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. అయినప్పటికీ, ఆ పార్టీలు బీజేపీని ఇరకాటంలో పెట్టి పబ్బం గడుపుకునే ఆలోచనల్లో ఉన్నాయి. ఇంతవరకూ ప్రస్తావించని అంశాలను కూడా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి. ఈ పార్టీల్లో కొందరు నాయకులు ఢిల్లీ స్థాయిలో బీజేపీ సీనియర్‌ నాయకులతో సంబంధాలు పెట్టుకుని ఉన్నారు. వారితో రహస్య మంతనాలు సాగిస్తున్నట్టు కూడా స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ చిన్నా చితకా సమస్య లను పరిష్కరించుకుని, ఈ మూడు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ నాయకులు   ప్రయత్నాలు సాగిస్తున్నారు.  

ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ బీజేపీ?!

హిందుత్వ అజెండాను పూర్తిగా హైజాక్ చేసిన భజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ కు చెక్ పెట్టి  భవిష్యత్తులో మరింత దూకుడుగా వ్యవహరించేందుకు పకడ్బందీ ప్లాన్ రెడీ చేసుకుంది. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్న మోహన్ భాగవత్ పనితీరుపై భజరంగ్ దళ్ లోని కొందరు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అందుకే మోహన్ భగవత్ ఆమధ్య కొందరు ముస్లిం నేతలతో కలిసినప్పుడు, ఓ మసీదుకు వెళ్లినప్పుడు భారీగా ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగింది. ఇందులో భజరంగ్ దళ్ తోపాటు బీజేపీ వాళ్లు కూడా కీలక పాత్ర పోషించారనే విషయం ఒకింత ఆలస్యంగానైనా బయటపడింది. అందుకే బీజేపీయే స్వయంగా భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ల మధ్య ఎడాన్ని పెంచుతోందన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. అలా ఎందుకు అన్న ప్రశ్నకు.. బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న సమాధానం వస్తోంది. ఎందుకంటే.. పార్టీలో తిరుగులేని నాయకుడిగా మోడీ, ఆయనకు గట్టి మద్దతుదారుగా అమిత్ షా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నట్లు పైకి కనబడుతున్నా.. పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్ అన్న చందంగా.. సైద్ధాంతిక సారూప్యతతో సంబంధం లేకుండా ఓట్లు, సీట్లు చాలు అన్న చందంగా అన్ని పార్టీల నుంచీ బీజేపీలోకి వలసలను ప్రోత్సహిస్తోంది మోడీషా ద్వయం. దీంతో బీజేపీలో లుకలుకలూ పెరుగుతున్నాయి. అదనంగా గ్రూపుల సంస్కృతీ వచ్చి తోడైంది.   ప్రస్తుతం ఇటు బీజేపీలో   ప్రధాని నరేంద్ర మోడీకి తిరుగులేని గుర్తింపు, ప్రజాదరణ, కరిష్మా, ఇమేజ్ వంటివన్నీ ఉన్నాయి. ఆయనకు పోటీగా ఇటు సొంత పార్టీలో అటు ప్రతిపక్షాల్లో నిలబడ సత్తా ఉన్న నాయకుడు కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏడాది కాబట్టి ప్రతి అంశాన్ని సంతృప్తి పరిచేలా, అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ ను విస్తరించనున్నారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో  న హ్యాట్రిక్ విజయానికి దోహదపడే విధంగా కేబినెట్ విస్తరణకు సన్నాహాలు చేస్తున్నారు. కసరత్తు చేస్తున్నారు.   అయితే  భారతీయ జనతా పార్టీలో  ఏ నేతకు ప్రజాదరణ ఉంది,  ఎవరెవరికి ప్రమోషన్ వస్తుంది. ఎవరికి ఉద్వాసన కలుగుతుంది,  పార్టీ బాధ్యతలు దక్కేదెవరికి, కేంద్ర మంత్రి పదవులు దక్కేదెవరికి, ఏ బీజేపీ సీఎంకు మోడీ-షా అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు లాంటి ఉహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. బీజేపీలో మోడీషా ద్వయం కరుణాక్ష కటాక్ష వీక్షణాలు ఎప్పుడు ఏ విధంగా ఎవరి మీద ప్రసరిస్తాయో చెప్పే తార్కిక అంశం ఏదీ ఉండదు. ఆ ద్వయం ఎప్పుడు, ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ అంతుపట్టదు. మోడీషా కన్నుసన్నల్లో మెదులుతూ, వారికి అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరొందిన పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇప్పడు వారి గుడ్ సెల్వ్స్ లో లేరని పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది.  సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో వరుసగా రెండవసారి పార్టీని అధికారంలోకి రాకపోవడానికి నడ్డాయే కారణమన్న ముద్ర వేసి ఆయనపై వేటు వేయడానికి మోడీ షా ద్వయం సిద్ధంగా ఉందని గట్టిగా వినిపిస్తోంది. అసలు హిమాచల్ ప్రదేశ్ లో వరుసగా ఒకే పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన సందర్భం ఎప్పుడూ లేదు. అయినా ఆ రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడంలో వైఫల్యానికి నడ్డాను బాధ్యుడిని చేస్తున్నారు.  సొంత రాష్ట్రంలో రెబెల్ లీడర్స్ ను కట్టడి చేయటంలో నడ్డా పూర్తిగా విఫలమయ్యారు. చివరికి  నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి అసంతృప్తలను బుజ్జగించాల్సన పరిస్థితి వచ్చిందన్నది బీజేపీలో ఒక వర్గం వారి ఆరోపణ. మరి మోడీ బుజ్జగింపులు కూడా పని చేయలేదా అన్న  ప్రశ్నకు మాత్రం ఎవరూ బదులు చెప్పరు.  నడ్డా పదవీ కాలం ముగియడగానే ఆయన స్థానంలో కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగించడం ఖాయమని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ నెల 30తో   జేపీ నడ్డా పదవీ కాలం ముగియనుంది. ఆయన స్థానంలో పార్టీలో, ప్రభుత్వంలో గట్టిపట్టున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది.   ఇక జేపీ నడ్డాకు  కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని అంటున్నారు.  మోడీ-షా ఇప్పటికే ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుని  పార్టీలో  ఓ స్థాయి ఉన్న నేతలనందరినీ పక్కన పెట్టేశారు. పూర్తిగా తమకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకునే క్రమంలో కొత్త వారిని తెరపైకి తెచ్చి, బాధ్యతలు కట్టబెట్టి.. వారితోనే పార్టీని, ప్రభుత్వాన్ని నడుపుతూ.. కొత్త తరం నేతలను తయారు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు.      మరో సీనియర్ నేత నితిన్ గడ్కరీ పరిస్థితి కూడా చాలా గందరగోళంగా తయారైంది. కీలకమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన్ గడ్కరీని తప్పించటం ఆయనను అవమానానికి గురిచేసింది. కానీ ఆర్ఎస్ఎస్ అండదండల కారణంగా ఆయన సైలెంట్ గా ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు గడ్కరీ స్థానంలో మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎదిగినట్టు అనుకునేలా సంఘ్ పరివార్, బీజేపీ ప్రవర్తిస్తోంది. సరే పార్టీని, సంఘ్ పరివార్ నూ పూర్తిగా తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకున్న మోడీషా ద్వయానికి ఎన్నికలకు మించి చాలెంజ్ ఏమిటంటే..  మరో 3 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీకి  5 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. మరి అప్పుడు ఆయన రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తారా? అద్వానీ, మురళీ మనోహర్ జోషిల్లా ఆయన కూడా మార్గదర్శక మండలికి పరిమితమైపోతారా? లేకపోతే తమ కోసం  తామే తీసుకు వచ్చిన వయోపరిమితి నిబంధనను మోడీ షా ద్వయం మళ్లీ తమ కోసమే సవరిస్తారా? ప్రస్తుతం మోడీ హ్యాట్రిక్ సాధిస్తారా లేదా అన్న దాని కంటే మూడేళ్ల తరువాత వయోపరిమితి నిబంధనను తనకు వర్తింప చేసుకుంటారా అన్న దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. మొత్తానికి ఇప్పటికిప్పుడు అయితే పైకి అంతా  బానే కనిపిస్తున్నా.. వైసీపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న వాతావరణమే ఉందని పరిశీలకులు అంటున్నారు. గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, వసుంధరరాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, యెడ్డియూరుప్ప వంటి వారంతా ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నా మోడీషా ద్వయం వైఖరి పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారన్నదే పరిశీలకుల విశ్లేషణ.