ఠాక్రే... తేల్చేస్తారా?
posted on Jan 12, 2023 @ 11:05AM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభం పరిష్కారానికి పార్టీ అధిష్టానం కొంచెం ఆలస్యంగానే అయినా నడుం బిగించింది. నిజానికి రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షునిగా నియమించిన క్షణానే, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి బీజం పడింది. రేవంత్ నియామకం అయిన వెంటనే, కోమటి రెడ్డి వెంకటరెడ్డి నిరసన గీతానికి సిగ్నేచర్ ట్యూన్ సెట్ చేశారు. .రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నంత కాలం గాంధీ భవన్ గడప తొక్కనని తొలి నిరసన గళం వినిపించారు. ప్రతిజ్ఞ చేశారు. కోమటి రెడ్డి వెనక జగ్గా రెడ్డి ఆయన వెంట వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డి మరి కొందరు ఇలా ఒకరి వెంట ఒకరుగా పార్టీ సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతూ వచ్చారు.
మరో వంక మాజీ పీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి, ఎమ్మెల్యే డి. శ్రీధర్ బాబు వంటి మరికొందరు సీనియర్లు, తటస్థంగా ఉన్నట్లు ఉంటూనే., రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక విధమైన మౌన పోరాటం చేశారు. చాపకింద నీరులా రేవంత్ రెడ్డి కుర్చికి ఎసరు తెచ్చే ప్రయత్నాలు సాగించారు. అయితే, మునుగోడు ఉప ఎన్నిక ముందు నుంచి సీనియర్ నేతలు రూట్ మార్చి రేవంత్ రెడ్డికి ‘బయటి’ వ్యక్తి అనే ముద్ర వేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి ఆయన ముఖ్య అనుచరులు, కాంగ్రెస్ కల్చర్ తెలిసీ, తెలియక చేసిన వ్యాఖ్యలు సీనియర్లకు అస్త్రాలయ్యాయి.
ఆ అస్త్రాలను ఉపయోగించుకునే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధికి డిపాజిట్ అయినా దక్కకుండా చేయడంలో సీనియర్లు కృతకృత్యులయ్యారు. అలాగే మునుగోడు ఓటమిని పూర్తిగా రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఖాతాలో వేసి, ఆయన పోటుగాడు కాదు, పనికిరానోడే అని అధిష్టానానికి పెద్దక్షరాల్లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అందరూ చేతులు కలిపారు. ఒకే స్వరంతో ‘కోరస్’గా నిరసన గీతాన్ని ఢిల్లీకి వినిపించారు. ఢిల్లీ కదిలింది.
అయితే, అధిష్టానం సమస్యను గుర్తించడంలో జరిగిన జాప్యం వల్లనైతేనేమీ, సమస్య పరిష్కారానికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడం వల్లనైతేనేమీ, అధిష్టానం నడుం బిగించే సమయానికే, సమస్య జటిలమై కూర్చుంది. రాష్ట్ర వ్యవహరాల బాధ్యుడు మాణిక్యం ఠాగూర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో జట్టు కట్టి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని సీనియర్ నాయకులు తీవ్ర స్వరంతో ఆరోపించిన తర్వాత కానీ కాంగ్రెస్ అధిష్టానంలో కదలిక రాలేదు. అంతే కాదు దిగ్విజయ్ దౌత్యం కూడా విఫలమైన తర్వాత కానీ, మాణిక్యం ఠాగూర్ ను తొలిగించ లేదు. అందుకే కావచ్చును,చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున చందాన ఠాగూర్ ను సాగనంపినా పెద్దగా ఫలితం లేక పోయింది.
సీనియర్లు శాంతించడం లేదు. మరోవంక రేవంత్ రెడ్డి కూడా కాడి వదిలేసే ఆలోచకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే రంగంలోకి దిగారు. రెండు రోజుల పర్యటనకు హైదరాబాద్ వచ్చారు. మహారాష్ట్రకు చెందిన ఠాక్రే సీనియర్ నాయకుడు. సందేహం లేదు. నాలుగైదు మార్లు ఎమ్మెల్యేగా, ఒకటి రెండు మార్లు మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటుగా పార్టీలోనూ పీసీసీ సహా కీలక పదవులు నిర్వహించిన అనుభవం వుంది. అయితే. మాణిక్యం ఠాగూర్ తో కానీ పని మాణిక్‌రావు ఠాక్రేతో అవుతుందా? దిగ్విజయ్ అంతటివాడితో కానీ పని ఠాక్రేతో అవుతుందా? అనే అనుమానాలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి.
మరోవంక ఠాక్రే రాకతో గాంధీ భవన్‌లో కొత్త జోష్ కనిపించింది. చాలాకాలం నుంచి దూరం దూరంగా ఉంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా గాంధీ భవన్‌లో దర్శనమిచ్చారు. కానీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నంత వరకు తాను గాంధీభవన్ గడప తొక్కనని ప్రతిజ్ఞ చేసి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత అసమ్మతికి తొలి బీజం నాటిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాత్రం ఆ మాట మీదనే నిలబడ్డారు. ఆహ్వానం పంపినా ఆయన రాలేదు. అఫ్కోర్స్ మధ్యలో ఆయన ఒకటి రెండు సందర్భాలో గాంధీభవన్ కు వచ్చారు అనుకోండి అది వేరే విషయం. అలాగే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తిరుమల వెళ్లడంతో.. ముఖాముఖి సమావేశాల్లో పాల్గొనలేకపోయారు. అదలా ఉంటే రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు సీతక్క పోదెం వీరయ్య తదితర నేతలూ ‘వ్యక్తిగత’ కారణాలతో సమావేశాలకు రాలేదు.
అలాగే ఠాక్రేతో ఎవరికి వారుగా సమావేశమైన నాయకులు దిగ్విజయ్ సింగ్ ముందు వినిపించిన విధంగా ఎవరి వాదన వారు వినిపించినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కాంగ్రెస్ కు సానుకూల పరిస్థితే ఉందని, రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించకుండా అందర్నీ కలుపుకొపోతేనే సానుకూల ఫలితం వస్తుందన్న అభిప్రాయాన్ని సీనియర్లు వ్యక్తం చేస్తే సానుకూలతను ఓట్ల రూపంలో మార్చుకునే ప్రక్రియలో రేవంత్‌కు సీనియర్ నాయకుల సహకారం అందడం లేదని రేవంత్ రెడ్డి అనుకూల వర్గం నేతలు తమ వాదన వినిపించినట్లు తెలిసింది. పీఏసీ సభ్యులందరికీ సమయం ఇచ్చి అభిప్రాయాలు విన్న ఠాక్రే.. పార్టీలో ఎవరి గౌరవం వారికి దక్కేలా తాను చూస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే .. ఇరు వర్గాలు ఎవరికి వారు, ‘తగ్గేదే లే’ అంటున్న నేపధ్యంలో అది అయ్యే పనేనా ? కాదంటే, పరిస్థితి ఏంటి ? ఇవే ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్, అభిమానుల ముందున్న ప్రశ్నలు.