వరుణ్ వస్తానన్నా రాహుల్ వద్దంటారా!

తమ్ముడు తమ్ముడే పేకాట,పేకాటే..ఇది అందరికీ తెలిసిన నానుడి. అంటే, అన్నదమ్ముల అనుబంధాలు, రక్త సంబంధాలు వ్యాపార వ్యవహారాలో పని చేయవని చెప్పే సందర్భంలో ఈ నానుడిని వాడుతుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ నానుడిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు పార్టీలలో ఉండి ఒకరిపై ఒకరు పోటీ చేయవలసి వచ్చినప్పడు లేదా అన్నదమ్ములు, మంచి మిత్రులు ఒకరిపై ఒకరు పోటీ చేసినప్పుడు, కూడా ఇలాంటి వాఖ్యలే వినిపిస్తుంటాయి. ఇప్పడు అది యాధృచ్ఛికమే కావచ్చును కానీ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరుడు ( కజిన్) బీజేపీ ఎంపీ  వరుణ్ గాంధీ (సంజయ్ గాంధీ, మేనకా గాంధీ కుమారుడు) గురించి ఇంచు మించుగా అలాంటి అర్థం వచ్చే వ్యాఖ్యలే చేశారు. నిజానికి, వరుణ్ గాంధీ తండ్రి సంజయ్ గాంధీ ఆకస్మిక అనుమానస్పద మృతి తర్వాత, మేనకా గాంధీ, అత్తింటిని వదిలి వచ్చారు. ఆ తర్వాత, ఆ రెండు  కుటుంబాల మధ్య పెద్దగా సంబంధాలులేవు. గాంధీ నెహ్రూల కుటుంబం నుంచి బయటకు వచ్చిన మేనకా గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చారు.  బీజేపీలో చేరారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తల్లి బాటలో వరుణ్ గాంధీ కూడా బీజేపీలో చేరారు.  ఉత్తర ప్రదేశ్ లోని పిలిభిత్ నుంచి వరసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. అయితే చాల కాలంగా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి.  అయితే, అదెలా ఉన్నా, ఇప్పడు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రవచించే హిందూ జాతీయ వాదానికి వ్యతిరేకంగా  భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ తమ సోదరుడు వరుణ్ గాంధీతో తమ సంబంధాలు అంతవరకే పరిమితమని, రాజకీయంగా ఎవరి దారి వారిదే’ అని స్పష్తం చేశారు.  పంజాబ్ గుండా సాగుతున్నా భారత్ జోడో యాత్రలో భాగంగా  మంగళవారం (జనవరి 17) నిర్వహించిన ప్రెస్ మీట్లో సోదరుడు వరుణ్ గాంధీతో సంబంధాలపై స్పందించారు. తమకు రెండు భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయని, తమ్ముడు స్వీకరించిన సిద్ధాంతాన్ని తాను అంగీకరించలేనని అన్నారు.  నేను  కావాలంటే వరుణ్ ను కలవగలను, కౌగలించుకోగలను,  కానీ నేను ఆ భావజాలాన్ని అంగీకరించలేను  అని రాహుల్ తేల్చి చెప్పేశారు. వరుణ్ గాంధీ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని, ఆయన భారత్ జోడో యాత్రలో నడిస్తే అది అతనికి సమస్య కావచ్చని రాహుల్ గాంధీ పరోక్షంగానే అయినా వరుణ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీలో చోటు లేదని చెప్పకనే చెప్పారు. అయితే, అందుకు ఆయన భావజాల సంఘర్షణను కారణంగా చూపినా అసలు కారణం వేరే ఉందని అంటారు. సోనియా, మేనక గాంధీల మధ్య మొదటి నుంచి కూడా సత్సంబంధాలు లేవని, అంటారు. అయితే ఆ విషయాన్ని కప్పి పెట్టి రాహుల్ గాంధీ,  తాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్ ) కార్యాలయానికి ఎప్పటికీ వెళ్ళలేనని రాహల్ తెలిపారు. అలా వెళ్లవలసి వస్తే తన తల నరుక్కోవాల్సి వస్తుందన్నారు. తన కుటుంబానికి ఓ సిద్దాంతం ఉందని  ఏదో ఒక సమయంలో, ఇప్పుడు కూడా వరుణ్ దానికి భిన్నమైన దానికి స్వీకరించాడని, తాను ఆ భావజాలాన్ని అంగీకరించలేనని, తమ్ముడు తమ్ముడే పేకాటే  అని చెప్పు కొచ్చారు.

బండి పదవి పదిలం.. ఎన్నిల సారధి ఆయనే

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, మరో రెండేళ్ళ పాటు అదే పదవిలో కొనసాగుతారు. బీజేపీ ఆయన సారధ్యంలోనే తెలంగాణ 2023 అసెంబ్లీ, 2024 లోక్ సభ ఎన్నికలను ఎదుర్కుంటుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.   మంగళవారం(జనవరి 17)తో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో  పార్టీ సంస్థాగత మార్పులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, ఈ సంవత్సరం (2023)లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులను మార్చరాదని బీజేపీ జాతీయ కార్యవర్గం  నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ సహా ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తొమ్మిది రాష్ట్రాలలో ప్రస్తుత అధ్యక్షులనే 2024 లోక్ సభ ఎన్నికల వరకు కొనసాగించాలని సూత్రప్రాయంగా బీజేపే జాతీయ కార్యవర్గం నిర్ణయించింది.  దీంతో,ఇంతవరకు సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని, ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలకు తెర పడింది. అలాగే, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని మారుస్తారనే ఊహాగానలకూ జాతీయ కార్యవర్గం తెర దించింది.  మరో నలుగు రోజుల్లో రెండేళ్ళ పదవీ కాలం ముగుస్తున్న పార్టీ అధ్యక్షుడు జీపీ నడ్డా  పదవీ కాలన్ని మరో రెండేళ్ళు పొడిగించాలని  కార్యవర్గం నిర్ణయించింది. అదలా ఉంటే బండి అధ్యక్ష పదవిలో కొనసాగడం ఖాయమైన నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో జరగనున్న కేంద్ర  మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుంచి ఎవరికి స్థానం లభిస్తుందనే విషయంలో కొత్త చర్చ తెరపై కొచ్చింది. రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు ఎంపీలలో పాత కాపులు ఇద్దరికీ పదవులు దక్కాయి. కిషన్ రెడ్డికి కేంద్ర కాబినెట్ లో స్థానం దక్కితే బండి సంజయ్’ పార్టీ అధ్యక్షినిగా కొనసాగుతున్నారు.  కాగా, 2019 ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆదిలాబాద్  ఎంపీ సోయం బాబు రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లో ఒకరికి మంత్రి పదవి దక్క వచ్చని అంటున్నారు. అరవింద్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంలో ఉన్న నేపథ్యంలో గిరిజన ఎంపీ సోయం బాబూ రావును మంత్రి పదవి వరించే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి గత విస్తరణలోనే ఆయన పేరు ప్రముఖంగా వినిపించినా చివరి క్షణంలో వచ్చిన అవకాశం చేజారి పోయింది. సో ..  ఈ సారి బాబూ రావుకు బెర్త్ ఖాయమని అంటున్నారు. అయితే  యూపీ నుంచి రాజ్య సభకు ఎన్నికైన మరో పాతకాపు, డాక్టర్ కే. లక్ష్మణ్ పేరు కూడా తెలంగాణ కోటాలో పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పదవులన్నీ పాత  వారికే ఇస్తే  కొత్తగా వచ్చే వారిలో ఆసక్తి లేకుండా పోతుందని, రావాలనుకునే వారికీ తప్పుడు సంకేతం  వెళుతుందని  అదుకే  గిరిజన ఎంపీ సోయం బాబూ రావుకు మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. అలాగే,ఈటల రాజేందర్ కు కీలక పదవి దక్కుతుందని అంటున్నారు. అలాగే, మంత్రివర్గ  విస్తరణ తర్వాత పార్టీలోనూ మరికొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు.

అన్నా .. అందుకో వందనం!

నందమూరి తారక రామా రావు... ఎన్టీఆర్... ఈ పేరుకు ఇక వేరే పరిచయ వాక్యాలు అక్కరలేదు. నందమూరి అనగానే, అన్న ఎన్టీఆర్  అపురూప రూపం కళ్ళ ముందు కదులుతుంది. ఒక సినిమా హీరోగా ఆయన జీవించిన పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహా నటుడు ఎన్టీఆర్. రాముడు. కృష్ణుడు, వెంకన్న దేవుడు ఇలా ప్రతి పౌరాణిక పాత్రకు  సజీవ రూపంగా నిలిచిన మహానటుడు ఎన్టీఆర్.  దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్. రాముడు ఎలా ఉంటాడంటే, ఆ నాటి  నుంచి ఈ నాటి వరకు ఏ తరం వారిని  అడిగినా  ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్ లా ఉంటారు, అంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా...  అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయంగా జీవించారు. మచ్చలేని మహారాజులా నిష్క్రమించారు. అందుకే ఆయన కన్నుమూసి 27 ఏళ్ళు అయినా ఈ నాటికీ ఆయన్ని తెలుగు గుండె గుర్తుచేసుకుంటోంది.  అవును ఈరోజు ... జనవరి 18, ఎన్టీఆర్ 27 వ వర్ధంతి. ఎన్టీఆర్ సినిమా రంగానికే కాదు, సమాజానికీ సేవలందించారు. ఆరు పదులకు పైగా వెండి తెరను ఏలిన ఎన్టీఆర్, తనను అంతవాడిని చేసిన తెలుగు ప్రజలకు సేవచేసే  పవిత్ర సంకల్పంతో   రాజీకీయ అరంగేట్రం చేశారు.  చరిత్రను సృష్టించారు.  అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదుగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ చిక్కని, సాధ్యం కాని విధంగా చరిత్రను సృష్టించారు.  ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీన తెలుగు దేశం జెండాను ఎగరేశారు. “నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ,  నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం” అని ప్రకటించారు. ఆంధ్రుల  అన్నగా అవతారం ఎత్తారు. తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంత వరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా 1993 జనవరి 9, అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి ఎన్టీఆర్ రాజకీయ జీవితం చాలా చిన్నది. నిండా పుష్కర కాలం కూడా లేదు. ఆ స్వల్ప కాలంలోనూ ఆయన అనేక ఆటు పోట్లను ఎదుర్కున్నారు. అయినా రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలనూ ప్రభావితం చేశారు. జాతీయ స్థాయిలో తెలుగు వారి ఆత్మ గౌరవ బావుటాను ఎగరేసిన ఎన్టీఆర్, కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు చెక్  పెట్టి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్  వ్యతిరేక శక్తులను ఏకం చేసి కాంగ్రెస్ తిరోగమానానికి ఆనాడే ఆయన శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు.  అందుకే ఎన్టీఆర్ సారథ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చిర స్థాయిగా ఒక మెయిలు రాయిలా నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.  అందుకే ఈనాటికీ  జాతీయ స్థాయి నేతలంతా ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు. గౌరవంగా స్మరించుకుంటున్నారు.    మంగళవారం(జనవరి 17) ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ  తన ప్రసంగంలో ఎన్టీఆర్‌ పేరును ప్రస్తావించారు. ప్రజా క్షేత్రంలో ఎన్టీఆర్ కింది స్థాయిలో పోరాడి అధికారంలోకి వచ్చారని కొనియాడారు. నిత్యం ప్రజలతో మమేకమై ఎన్టీఆర్‌ ముందడుగు వేశారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీని స్థాపించి ఎన్టీఆర్‌ పోరాడిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. నిజానికి ఒక మోడీ అని కాదు, రాజకీయాలకు అతీతంగా జాతీయ నేతలందరూ ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పిస్తున్నారు. అలాగే ఎన్టీర్ శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు అడుగుజాడల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. పథకాల పేర్లు మారవచ్చును కానీ, స్పూర్తి మాత్రం  అదే.  ఎన్టీఅర్ ప్రవేశ పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్లు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు ఇలా ఎన్నో ఎన్నెన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన మహా నేత ఎన్టీఆర్. అలాగే, పారదర్శక పాలన, ప్రజల వద్ధకే  పాలన వంటి పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. అంతే కాదు, తెలుగుంటి ఆడపడుచులకు పెద్దన్నగా మహిళలకు సమాన ఆస్తి హక్కు వంటి చట్టాలు తెచ్చారు.  నిజానికి  ఆధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్థానంలో ఎన్టీఆర్  ఒక మేలి మలుపుగా నిలుస్తారు. ఎన్టీఅర్ కు ముందు ఒకటి  రెండు కులాలకే పరిమితం అయిన రాజకీయ అధికారాన్ని,అందరికీ చేరువ చేసిన సామాజిక చైతన్య స్పూర్తి ఎన్టీఆర్. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అస్థిత్వాన్ని కల్పించిన, బడుగుల అత్మబందువు ఎన్టీఆర్.  అందుకే నిబద్ధత, నిజాయితీ, నిస్వార్ధం, నిర్భీతి ప్రధాన ఆయుధాలుగా సాగిన  ఎన్టీఆర్ అనే మూడక్షరాల రాజకీయ ప్రస్థానం తెలుగుజాతి ఉన్నంతవరకు చిరస్థాయిగా నిలిచి పోతుంది. ఒక మహా నటుడిగా, ఒక మహోన్నత వ్యక్తిగా, ప్రస్వామ్య స్పూర్తి ప్రదాతగా, ఒక పరిపాలన దక్షునిగా, సంస్కరణలకు శ్రీకారం చుట్టిన చరిత్ర పురుషునిగా, పేద ప్రజల ఆరాధ్య దైవంగా...ఇలవేల్పుగా తెలుగు వారి గుండెల్లో కొలువైన విధాతగా ఎన్టీఆర్ శాశ్వతంగా ఉండి పోతారు ఎన్టీఆర్..  అన్నా ..అందుకో వందనం..

మరో ఏడేళ్లలో కేసీఆర్ ప్రరాస?!

తేదీ..17 జనవరి 2029.. ఈ  రోజున ప్రపంచం అంతా గొప్ప హడావుడిగా ఉంది. ఈ రోజు ఉదయమే భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక గొప్ప తీర్మానం చేసింది. భారత ప్రధాని,  భారాస అధినేత,  సిధ్ధాంత కర్త,   కల్వకుంట్ల చంద్రశేఖర‌ రావు మనోభీష్టం మేరకు భారాస పార్టీని అంతర్జాతీయ రాజకీయ పార్టీగా మారుస్తూ భారాస సర్వ సభ్య సమావేశం తీర్మానించింది. హైదరాబాద్ నగరంలోని ప్రధానమంత్రి నివాసం ప్రగతి భవన్లో  జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో సభాధ్యక్షుడు కేసీఆర్ ప్రపంచంలో పరిస్థితులను వివరిస్తూ ప్రసంగించారు.    దేశాలు మధ్య తరచూ గిల్లి కజ్జాలతో ప్రపంచశాంతికి భంగం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే సమీప భవిష్యత్ లో ప్రపంచం నాశనం అవుతుందనీ,  ఆ విషయాన్ని పట్టించుకోకుండా అమెరికా, చైనా, రష్యా లాంటి   దేశాలు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శిచారు.    యుధ్ధాలను నివారించవలసిన ఐక్యరాజ్య సమితి ఆచరణలో  విఫలం అయ్యిందని పేర్కొన్న కేసీఆర్.. ఇక ఐరాస కాలం చెల్లిన సంస్థ అని ప్రకటించారు. ఇప్పుడు వినాశనానికి చేరువలో ఉన్న ప్రపంచాన్ని రక్షించాల్సిన బాధ్యత తాను తీసుకుంటున్నారనీ, అందుకే భారత్ రాష్ట్ర సమితి( భారాస)ను ప్రపంచ రాష్ట్ర సమితి (ప్రరాస)గా మారుస్తున్నాననీ కేసీఆర్ ప్రకటించారు. భారత దేశాన్ని కాపాడేందుకు నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను భారత రాష్ట్ర సమితి (భారస)గా మార్చినప్పుడు కూడా తనను ఎందరో ఎన్నో రకాలుగా విమర్శించారనీ, ఎద్దేవా చేశారనీ.. కానీ భారాస వల్లనే ఏపీ, తెలంగాణ సహా దేశంలోని రాష్ట్రాల మధ్య వివాదాలు సమసిపోయింది నిజం కాదా? అని ప్రశ్నించారు.  ఇప్పుడు కూడా   ప్రరాస   దేశాల మధ్య వివాదాలు కూడా బ్రహ్మాండంగా పరిష్కారం చేస్తుందన్నారు. ఆ హామీ, పూచీ తనదని వక్కాణించారు.  క్రమంగా అన్ని ముఖ్య దేశాలలోనూ ప్రారాసాను అధికారంలోకి తీసుకురావడం ద్వారా  యుధ్ధాలను నివారించి ప్రపంచ శాంతిని తీసుకువస్తామన్నారు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే భారాస పార్టీని ప్రపంచ రాజ్య సమితిగా మార్చుతూ సభ తీర్మానించాలని ఆర్డర్ లాంటి విజ్ణప్తి చేశారు. సరే ఆ తీర్మానాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత బలపరిచారు. మహారాష్ట్ర గవర్నర్ సంతోష్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హరీష్ రావు కూడా  బలపరచారు. ఆ వెంటనే సభ తీర్మానం ఆమోదించింది. అంతే ఆఘమేఘాల మీద తీర్మానం ఆమోదం పొందిందని ఇక నుంచీ భారాస ప్రరాసా అయిపోయిందని కేసీఆర్ ప్రకటించారు.  త్వరలోనే జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నిలబడబోతున్నాడని ప్రకటించారు. అమెరికా దేశంలో భారతీయులు ఎంతో సంఖ్యా బలం కలిగి ఉన్నారనీ, వారిలో తెలుగు వారు అందునా మన తెలంగాణా వారు అత్యధికులు అనీ అన్నారు. వారంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తే మన పార్టీ వాడు అమెరికా అద్యక్షుడు కావటం తథ్యం. దానిని ఆపే మొనగాడు పుట్టలేదు - పుట్టబోడు అనీ కరతాళధ్వానాల మధ్య  ప్రకటించారు. ఈవార్త వెలువడిన వెంటనే అమెరికాలో భారతీయులలో సంబురాలు అంబరాన్నంటాయి. ఆస్ట్రేలియా నుండీ మరికొన్ని దేశాల నుండీ కూడా తమ దేశాల్లోనూ ప్రరాస తప్పకుండా అధికారం చేపట్టాలని కోరుతూ తీర్మానాలు వెల్లువెత్తాయి. ప్రరాస అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీని అమెరికా అధ్యక్షుడు స్వాగతించారు. మాది ఫ్రీ కంట్రీ అనీ ఎవరైనా పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చన్నారు.  రష్యా ఈవిషయంలో స్పందించటానికి ఆసక్తి చూపలేదు. చైనా స్పందన తెలియరాలేదు. ఐరాస సెక్రటరీ జనరల్ మాత్రం ఐరాస కాలం చేసిందని భారత ప్రధాని కేసీఆర్ అనడాన్ని తప్పుపట్టారు.  ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించే సమయం ఆసన్నం అయినదనీ చంద్రశేఖర రావు తప్ప నేడు ప్రపంచశాంతి సుస్థిరతలను నెలకొల్పగల మహానాయకుడు ఎవరూ ముల్లోకాల్లోనూ లేరని ఐరాసలో భారత ప్రతినిధి ఉద్ఘాటించారు.  ప్రపంచాన్ని ఏలబోయేది మనమే అంటూ హైదరాబాద్ నగరంలో వేలాది పెద్ద పెద్ద కటౌట్లు వెలిసాయి. ప్రధాన రహదారులూ గల్లీలు అన్న తేడా లేకుండా   ర్యాలీలతో హోరెత్తుతున్నాయి.  దునియాకీ నేతా కేసీఆర్ అన్న నినాదంతో   దేశం అంతా మార్మోగింది.  (కేవలం సరదాగా..)

జీవో నంబర్ 1 సస్పెన్షన్ సవాల్ చేస్తూ సుప్రీం కు జగన్ సర్కార్

రాష్ట్రంలో సభలూ సమావేశాలను నిషేధిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 1 ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ సర్కార్ జీవో నంబర్ 1 ను  ఈ నెల 23 వరకూ సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి విదితమే. రాష్ట్రంలో అనుమతి లేకుండా సభలూ, రోడ్ షోలు  నిర్వహించడాన్ని నిషేధిస్తూ జగన్ సర్కార్ జీవో నంబర్ 1 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ జీవోను చూపే కుప్పంలో చంద్రబాబు నాయుడి సభను అడుగడుగునా జగన్ ప్రభుత్వం అడ్డుకుంది. భారీగా పోలీసులను మోహరించి చంద్రబాబు కార్యక్రమానికి జనం రాకుండా అడ్డుకుంది. 

అలీ నోట పోటీ మాట!

పేకాట పేకాటే..తమ్ముడు తమ్మడే అన్నది సామెత... ఇప్పుడు కమేడియన్ కం పొలిటీషియన్ అలీ ఆ సామెతనే కొద్దిగా మార్చి.. స్నేహం స్నేహమే.. రాజకీయం రాజకీయమే అంటున్నారు.  తెలుగు సినీ పరిశ్రమలో మంచి ఫ్రెండ్ అన్న పదానికి పవన్ కల్యాణ్, అలీ పర్యాయపదంగా ఉంటారు. అయితే అది ఇప్పుడు కాదు.. అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోక ముందు. ఆ తరువాత ఇరువురి మధ్యా  అంత సఖ్యత లేదని సినీ రాజకీయ వర్గాలలో జోరుగా వినిపిస్తోంది. ఒక సందర్భంగా అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడంపై పవన్  కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను అలీ గట్టిగానే కాదు ఘాటుగా కూడా తిప్పి కొట్టారు. ఆ తరువాత ఇరువురూ కూడా ఎవరిదారి వారిదే అన్నట్లుగా ఉండి పోయారు. ఇటీవల అలీ కుమార్తె వివాహం సందర్భంగా అలీ ఆహ్వానం పంపినా పవన్ కల్యాణ్ వెళ్లలేదు.. ఇరువురి మధ్యా స్నేహం కాదు.. కనీసం పలకరింపులు కూడా లేవనడానికి  ఇదే నిదర్శనం అంటూ వచ్చిన వ్యాఖ్యలకు అలీ.. తన అలీతో సరదాగా ముగింపు సందర్భంగా యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూలో బదులిచ్చారు. విమానం మిస్ కావడం వల్లనే పవన్ కల్యాణ్ హాజరు కాలేదని అలీ వివరణ ఇచ్చారు. రాజకీయంగా వేరు అయినా ఇద్దరం మిత్రులమే అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా అదే అలీ..వచ్చే ఎన్నికలలో పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచే తాను ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే అందకు కండీషన్స్ అప్లై అని కూడా  అన్నాడు. పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికలలో పవన్ తో ఢీ కొట్టేందుకు రెడీ అని చెప్పాడు. అప్పడు కూడా రాజకీయంగా వేరైనా మేం ఇద్దరమూ స్నేహితులమే అంటూ ముక్తాయించారు.  అయినా రాజకీయాలలో స్థాయితో సంబంధం లేకుండా సవాళ్లు చేయడం సహజమే.. ఇటీవల కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబుపై పోటీ చేయడానికి తాను రెడీ, మరి చంద్రబాబు పుంగనూరులో పోటీకి సిద్ధమా అంటూ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు.  ఇలాంటి సవాళ్లు రాజకీయాలలో మామూలే. ఆ సవాళ్ల వెనుక పార్టీ అధినేతను మొప్పించే వ్యూహం ఉంటుందే తప్ప నిజంగా ఎవరూ కొండను ఢీ కొనాలని చూడరు. పెద్ది రెడ్డి సవాల్ అయినా, అలీ సవాల్ అయినా ఈ కోవలోకే వస్తుంది.   అయితే ఇప్పటి వరకూ వైసీపీలో ఉన్నా పెద్దగా రాజకీయ ప్రసంగాల జోలికి పోని అలీ ఈ సారి పోటీ చేసేందుకు జగన్ టికెట్టిస్తారన్న ఆశతోనో మరెందుకో.. పొలిటికల్ ప్రసంగాలకు దిగారు. రాష్ట్రంలో వైసీపీ 175 అవుటాఫ్ 175 స్థానాలను గెలచుకుకోవడం ఖాయమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అంతే కాకుండా జనసేన, టీడీపీ మధ్య పొత్తు వార్తలను లైట్ తీసుకున్నారు. అవి రెండూ కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా పెద్ద ఫరక్ పడదని అలీ చెప్పారు.   ఏదో సినిమాలో అలీ హీరోయిన్ ను ఇంప్రెస్ చేయడానికి కండలు తిరిగిన వీరుడిలా కనిపించడానికి బెలూన్లను ధరిస్తాడు.. ఇప్పుడు రాజకీయాలలో కూడా సరిగ్గా అలాగే పవన్ కు దీటుగా కనిపించడానికి నేల విడిచి సాము చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇన్నేళ్లుగా ఆయన వైసీపీలో ఉన్న ఇంత వరకూ  రాజకీయంగా విమర్శల జోలికి పోలేదు. కానీ ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు.. ఒక సలహాదారు పదవి అలీని మార్చేసింది. వచ్చే ఎన్నికలలో మరింత కీలక పాత్ర దొరుకుతుందన్న ఆశతో విమర్శల బాట పట్టారు.

భారాస కోసం భూ కుంభకోణం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  పై బీజేపీ చేయని ఆరోపణ లేదు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలు, బీజేపీ రాష్ట్ర నాయకుల వరకు ప్రతి ఒక్కరూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబం అవినీతిలో కురుకు పోయిందని ఎన్నో ఏళ్లుగా ఆరోపిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కుమార్తె కవిత సహా  అధికార బీఆర్ఎస్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మంత్రులు అనేక మందిపై వచ్చిన ఆరోపణలపై   సిబిఐ, ఈడీ దాడులు, విచారణలు జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని పలు సందర్భాలలో ప్రకటించారు. చంచలగూడ జైల్లో ఆయన కోసం గది సిద్డంవుతోందని కూడా బండి సంజయ్ అనేక సందర్భాలలో పేర్కొన్నారు. మరో వంక ముఖ్యమంత్రి కేసీఆర్, దమ్ముందా? టచ్ చేసి చూస్తావా? అంటూ సవాళ్ళు విసిరారు. అయితే  పరస్పర  ఆరోపణలు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు హోరెత్తడమే కానీ, చివరకు ఏమి జరిగింది అంటే, ఏమీ లేదు, సున్నకు సున్నా- హళ్లికి హళ్లి. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి ఆరోపణలు చేస్తోంది, ఒక్క బీజేపీ మాత్రమే కాదు, కేసీఆర్ తో విభేదించిన కల్వకుట్ల కుటుంబ సభ్యులు సహా  కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకుఅలు అందరూ, కేసీఆర్ ప్రభుత్వం పైన, కేసీఆర్ కుటుబం అవినీతి పైనా పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. గడచిన ఎనిమిదేళ్ళలో వందలు కాదు, వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది, వందల వేల ఎకరాల భూమి అధికార పార్టీ నేతల కబ్జాకు గురైందని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. చివరకు, నిన్నగాక మొన్నపుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ప్రజాపార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ సహా అనేక మంది నాయకులు సామాజిక కార్యకర్తలు నేరుగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలిసి కేసీఆర్ కుటుంబ అవినీతికి సంబధించి విచారణ జరిపించాలని కోరుతూ, వినతి పత్రాలు అందజేశారు. ఆరోపణలకు  ఆధారాలను కూడా కేంద్రానికి అందజేశామని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు పలు సందర్భాలలో పేర్కొనారు. అయినా కేంద్ర ప్రభుత్వం కదిలింది లేదు చర్యలు తీసుకున్నదీ లేదు. అయినా కొత్త కొత్త ఆరోపణలు  పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మియాపూర్ లో  సర్వే నంబర్ 78 లో40 ఎరాలు కొన్నారని ఆరోపించారు. దాదాపు 4 వేల కోట్ల విలువైన తెలంగాణ భూముల్ని కేసీఆర్  తోట చంద్రశేఖర్ కు అప్పగించారని ఆరోపించారు.  మియాపూర్ లో వ్యాపార వేత్త సుఖేష్ గుప్తా కొన్న 8 ఎకరాలపై   సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేసిన  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్..  తోట చంద్రశేఖర్ భూములపై  ఎందుకు సుప్రీంకు వెళ్లలేదని ప్రశ్నించారు.   తోట చంద్రశేఖర్ 40 ఎకరాలు అమ్మి 4 వేల కోట్లు సంపాదించారని రఘునందన్ ఆరోపించారు. భూ దందా కోసమే తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుని ఏపీకి అధ్యక్షుడిని చేశారని  విమర్శించారు. మియాపూర్  భూములతో లాభ పడిన తోట చంద్రశేఖర్ రేపు జరగబోయే ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు. ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగమేనని విమర్శించారు.అయితే గతంలో చేసిన ఆరోపణలకే దిక్కు లేదు, ఇప్పడు వచ్చిన ఆరోపణలకు విలువ ఉంటుందా? అనుమానమే ..

రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ లో జోష్.. పాతిక పార్టీలతో ముగింపు సభకు భారీ సన్నాహాలు

రాహుల్ పాదయాత్రకు ముందు వరకూ.. కాదు కాదు రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమైన తరువాత కూడా ఇటీవలి వరకూ దేశంలో కాంగ్రెస్ పునర్వైభవం తరించుకుంటుందన్న ఆశ ఎవరిలోనూ లేశ మాత్రంగానైనా లేదు. ఆఖరికి కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఆయన యాత్ర ఏదో అద్భుతం చేస్తుందనీ, పార్టీని అధికారంలోకి తీసుకువస్తుందనీ చిన్ప పాటి ఆశ కూడా కనిపించలేదు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ.. దేశంలో అత్యధిక కాలం అధికారంలో కొనసాగిన పార్టీగా మాత్రమే కాంగ్రెస్ ఉనికిని కాపాడుకుంటోందన్న భావనే సర్వత్రా కనిపించింది. అయితే ఎప్పుడైతే రాహుల్ గాంధీ రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా.. దేశంలో ద్వేష భావాన్ని రూపుమాపడానికే ఈ నడక అని ప్రకటించి యాత్ర ప్రారంభించారో అప్పటి నుంచి నెమ్మది నెమ్మదిగా ఆయన యాత్రకు సానుకూలత వ్యక్తం అవ్వడమే కాదు.. కాంగ్రెస్ లోనూ జోష్ పెరుగుతూ వస్తోంది. ఇక రాహుల్ యాత్ర ముగింపు దశకు వచ్చే సరికి బీజేపీయేతర పార్టీలన్నిటికీ.. ఒకటి రెండు మినమా.. అలా మినహా పార్టీలలో సమాజ్ వాదీ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయను కోండి అది వేరే సంగతి. సమాజంలోని అన్ని వర్గాలలో కూడా రాహుల్ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభించింది. తమిళనాడులోని కన్యా కుమారిలో సెప్టెంబరు 7న తొలి అడుగు పడింది మొదలు, మధ్యలో ఒకటి రెండు చిన్న చిన్న బ్రేకులు తీసుకున్నా,ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుడా, సాఫీగా సాగిపోతోంది. చివరకు, రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్రంలో పాదయాత్ర చేయలన్నా,అవరోధాలు, అరెస్టులు తప్పని, తెలంగాణ రాష్ట్రంలోనూ, ఏపీలోనూ  రాహుల్ గాంధీ యాత్ర మాత్రం ఎప్పుడు జరిగిందో కూడా తెలియకుండానే, రాష్ట్రం దాటేసింది. అలాగని రాహుల్ యాత్ర ఎవరికీ పట్టకుండా, ఎవరినీ పట్టించుకోకుండా సాగుతోందని చెప్పడానికి ఎంత మాత్రం వీల్లేదు. యువత, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పేదలు, నిరుద్యోగులు, మహిళలు, మాజీ బ్యూరోక్రాట్లు ఇలా ఈ వర్గం.. ఆ వర్గం అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు రాహుల్ గాంధీతో అడుగు కదుపుతున్నారు. జోడో యాత్రలో పాల్గొంటున్నారు. ఆయన యాత్ర కొనసాగుతుండగా జరిగిన ఎన్నికలలో పార్టీ పరాజయాన్నే ఎదుర్కొని ఉండొచ్చు. అయితే వాటిని వేటినీ ఇసుమంతైనా పట్టించుకోకుండా రాహుల్ ప్రదర్శించిన స్థితప్రజ్ణత జనతను ఆకట్టుకుంటోంది.  నిజానికి, రాజకీయ నాయకుల పాదయాత్ర అంటే, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండకచో కొద్దిమంది ఇతర రంగాల సెలబ్రిటీలు మాత్రమే పాల్గొంటారు. కానీ, రాహుల్ యాత్రలో రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తల కంటే, సెలబ్రిటీలే ఎక్కువగా పాల్గొంటున్నారా అన్నట్లుగా, యాత్ర చాలా కలర్ ఫుల్’గా సాగుతోంది. సినిమా స్టార్లే కాదు, కాలేజీ అమ్మాయిలు, విద్యార్ధులు, యువకులు, చివరకు చిన్న పిల్లలు కూడా రాహుల్ వెంట నడుస్తున్నారు.   సహజంగా రాజకీయ నాయకుల పాదయాత్రలలో గంభీర ఉపన్యాసాలు, సీరియస్ చర్చలు ఉంటాయి. జెండాలు, స్లొగన్స్ ఉంటాయి. కానీ రాహుల్ గాంధీ యాత్రలో రాజకీయ వాసనలు అంతగా కనిపించడం లేదు. రాహుల్  యాత్ర ఒక పిక్నిక్ లాగా సాగిపోతోందని, పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఆట పాటలు, సెల్ఫీలు, కరచాలనాలు, హగ్గులు, ఆలింగానాలు ఒకటని కాదు, ఒక ప్రత్యేక పంధాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది.  ఈ యాత్ర ఇప్పటికే  ముగింపు దశకు వచ్చేసింది. ఈ నెల 30న ముగియనుంది. పార్టీలో ఉత్సాహాన్ని నింపిన ఈ యాత్ర ముగింపును భారీగా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది, ముగింపు సభ కోసం  దేశంలో భావసారూప్యత కలిగిన 24 పార్టీల అధినేతలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. మాయావతి (బహుజన్ సమాజ్ పార్టీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్ పార్టీ), నితీశ్ కుమార్ (జనతాదళ్ యూనియన్), చంద్రబాబు నాయుడు (తెలుగుదేశం పార్టీ), లాలూ ప్రసాద్ యాదవ్ (రాష్ట్రీయ్ జనతా దళ్), అఖిలేష్ యాదవ్ (సమాజ్‭వాదీ పార్టీ), కమ్యూనిస్ట్ పార్టీలు సహా మరికొన్ని పార్టీలకు స్వాగతం పలికారు. వీరిలో ఎవరు హాజరౌతారు, ఎవరు గైర్హాజరు అవుతారన్నది పక్కన పెడితే.. (ఇప్పటికే మాయావతి కాంగ్రెస్ వైపు చూసేది లేదని ఖరాఖండిగా ప్రకటించేశారు.)   ఈ నెల 30న జరిగే రాహుల్ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి  ఎంత మంది హాజరవుతారన్న విషయంలో ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే.. ఎవరు హాజరౌతారు, ఎవరు గైర్హాజరౌతారు అన్నది పక్కన పెడితే.. రాహుల్ పాదయాత్ర.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఇటీవల పదేళ్లలో కాగడాపెట్టి వెతికినా కనిపించని మద్దతును తీసుకు వచ్చింది. ఈ సానుకూలత 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎంత మేరకు ప్రభావం చూపుతుందన్నది తెలియాలంటే వేచి చూడక తప్పదు.  

సిట్టింగులకు టిక్కెట్లు.. బీఆర్ఎస్ లోప్రకంపనలు

ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్  పక్క పార్టీల నుంచి గోడ దూకిన ఏమ్మేల్యీలు సహా, సిట్టింగు ఎమ్మెల్యేలు అందరికీ మళ్ళీ టిక్కెట్లు ఇస్తామని ఎప్పుడో  చెప్పేశారు. అది కూడా పార్టీ వేదిక నుంచి సభా ముఖంగా  ప్రకటించారు. ముఖ్యమంత్రి అంత ముందుగా ఆ ప్రకటన ఎందుకు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది, అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన చేసిన ప్రకటన పార్టీలో పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్రకటన నేపధ్యంగానే ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ  ఎంపీ పొంలేటి సుధాకర రెడ్డి అలర్టయ్యారు. ఆత్మీయ సమ్మేళనాలు అంటూ సందడి చేశారు. భారాస ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు దౌత్యంతో తుమ్మల వెనక్కి తగ్గారు కానీ, పొంగులేటి అయితే తగ్గేదేలే’అంటూ ముందుకు దూసుకు పోతున్నారు.  ఖమ్మంలో భారాస ఆవిర్భావ సభ జరిగే రోజు (జనవరి 18)నే ఢిల్లీలో ఆయన బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ముహూర్తం విషయంలో ఇంకా కొంత సందిగ్దత కొనసాగుతున్నా, పొంగులేటి కారు దిగడం మాత్రం ఖాయమని తేలిపోయింది. ఖమ్మం కథ అలా ఉంటే, వరంగల్’ జిల్లాకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి, కడియం శ్రీహారి ఏకంగా ఆత్మగౌరవ నినాదాన్నే ఎత్తుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన  వచ్చే ఎన్నికలలో స్టేషన్ ఘనపూర్’ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్, సిట్టిగులకే టికెట్ ప్రకటన చేసినప్పటి నుంచి,  సిట్టింగ్ ఎమ్మెల్ల్యే కడియం  చిరకాల ప్రత్యర్ధి తాటికొండ రాజయ్యల మధ్య ఎప్పటినుంచో సాగుతున్న ప్రత్యన్న యుద్ధం పీక్ కు చేరింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కడియమ నేరుగా కేసీఆర్ నే టార్గెట్ చేశారు. అందుకే ఆయన ఎవరికీ తలవంచను, ఎవరికీ పాదాభివందనాలు చేయనని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి మహబూబాబాద్ పర్యటన సందర్భంగా, రాజయ్య సహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీలు పడిమరీ ముఖ్యమంత్రికి పాదాభి వందనాలు చేశారు. ఆ సమావేశంలో ఉన్న కడియం మాత్రం తలవంచలేదు. కేసీఆర్ పాదాలకు మొక్కలేదు. ఈ నేపధ్యంలో  కడియం చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.  ఇదలా ఉంటే, కడియం సంచలన వ్యాఖ్యల నేపధ్యంలో  వరంగల్  జిల్లా మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో, ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్ కు 100 సీట్లు గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా  దంతాలపల్లిలో ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో మాట్లాడిన మంత్రి దయాకర్ రావు తాను సొంతంగా చేయించిన సర్వే ప్రకారం  వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 90 సీట్లు వస్తాయని.. అయితే 20 మంది సిట్టింగ్ లను మారిస్తే 100 సీట్లు ఖాయమని జోస్యం చెప్పారు. అయితే సిట్టింగ్ లందరికీ సీట్లు ఇస్తామని ఇప్పటికే  సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయినా, కొంతమంది ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని దయాకర్ రావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. నిజంగా ఎర్రబెల్లి సర్వే చేయించారా? గతంలో ఎప్పుడు లేనిది ఇప్పడు ఆయన స్వయంగా సర్వే ఎందుకు చేయించారు.  కడియం ‘ఆత్మ  గౌరవం’ నినాదం  హాట్ టాపిక్ గా మారిన నేపధ్యంలో అందుకు కౌంటర్’గా ఎర్రబెల్లి సంచలన సర్వే బయట పెట్టారా?, ముఖ్యమంత్రి కేసీఆర్  కడియం ఇష్యూని డైవెర్ట్ చేసేందుకు, నమ్మిన బంటు ఎర్రబెల్లి సర్వేని తెరమీదకు తెచ్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసేఆర్ స్వయంగా, కదిల్చిన తేనెతుట్టె భారసలో ప్రకంపనలు సృష్టిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ తో టీమ్ ఇండియా క్రికెటర్లు

జూనియర్ ఎన్టీఆర్, క్రికెటర్లు కలిసి సందడి చేశారు.  న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే మ్యాచ్ కోసం టీమ్ ఇండియా క్రికెటర్లు  హైదరాబాద్  చేరుకున్నారు. హైదరాబాద్ లో  ఖరీదైన కార్ల కలెక్షన్ తో   మీడియా ద‌ృష్టిని ఆకర్షించిన నజీర్ ఖాన్ నివాసంలో జరిగిన ఒక కార్యక్రమానికి టీమ్ ఇండియా క్రికెటర్లు కొందరు హాజరయ్యారు. నజీర్ ఖాన్ వారికి స్నేహితుడు కావడంతో ఆయన ఆహ్వానం మేరకు క్రికెటర్లు వచ్చారు. అదే కార్యక్రమానికి హీరో ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ సినామాలోని నటనతో ఆబాలగోపాలాన్నీ తన అభిమానులుగా మార్చుకున్న ఎన్టీఆర్ కు టీమ్ ఇండియా క్రికెటర్లు కూడా అభిమానులే కావడంతో వారంతా ఎన్టీఆర్ తో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి.  వరల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఫొటోలను ట్వీట్ చేశారుఎన్టీఆర్ ను కలిసిన వారిలో యుజ్వేంద్ర చహల్, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ తదితరులు ఉన్నారు.  

అలనాటి అందాల తార జినా కన్నుమూత

ప్రపంచంలోనే అత్యంత అందగత్తెగా గుర్తింపు పొందిన అలనాటి అందాల తార జీనా తన 91 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది. 50వ, 60వ దశకాలలో ఆమె హాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది.  సోలొమన్, షెబా వంటి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా లవ్ అండ్ డ్రీమ్స్ చిత్రంలోని నటనకు గాను అవార్డు పొందింది.  ఇటలీలో జన్మించి సినిమాల ద్వారా విశ్వ విఖ్యాతి పొందిన జీనా లోల్లోబ్రిగిడా రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడా రాణించారు.  1927లో లుజినియాలో జన్మించిన జినా అప్పటిలో అత్యంత ప్రతిభామంతురాలైన యూరోపియన్ నటిగా గుర్తింపు పొందింది. 18వ ఏటనే నటనలో ప్రవేశించిన జినా హాలీవుడ్ లో నాడు  సూపర్ స్టార్ లుగా వెలుగొందుతున్న వారి సరసన కూడా నటించి మెప్పించింది. 

కాళ్లు కడిగి మరీ క్షమాపణ చెప్పిన మధ్య ప్రదేశ్ మంత్రి

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చూపడంలో విఫలమైతే క్షమాపణలు చెప్పుకునే సంస్కృతి ఇప్పుడు కాగడా వేసినా కనిపించదు. ఇచ్చిన వాగ్దానాలను విస్మరించడం, అదేమని అడిగితే ఆగ్రహించడం.. ఆందోళనకు దిగితే కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం ప్రస్తుతం ప్రభుత్వాలకు సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. ప్రజా వాణి వినిపించకుండా అణచివేయడమే పోలీసుల విధి అన్నట్లుగా రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తుండటం కద్దు. ఏపీ విషయాన్నే తీసుకోండి.. ఏపీ సర్కార్ మద్య నిషేధం నుంచి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల వరకూ అన్నీ కల్పిస్తామనీ, ప్రతి జిల్లాకూ ఓ హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మిస్తామనీ గత ఎన్నికల ముందు వాగ్దానాలు గుప్పించింది. తీరా అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటుతున్నా.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో మాట్లాడటం లేదు. పైపెచ్చు ఇదేమిటని ప్రశ్నిస్తున్న విపక్షాల నాయకులపై కేసులు నమోదు చేస్తోంది. సభలూ సమావేశాలూ నిర్వహించకోవడానికి వీల్లేదంటూ నిషేధాస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇక ముఖ్యమంత్రి అయితే తన పర్యటన వేల జనం ఎవరూ ఎదురుపడి ప్రశ్నించడానికి వీల్లేకుండా పరదాలు కట్టుకుని మరీ పర్యటనలు కొనసాగిస్తున్నారు. అయితే మధ్య ప్రదేశ్ లో ఒక మంత్రి  రోడ్ల దుస్థితికి తన నిర్లక్ష్యమే కారణమని అంగీకరించారు. ప్రజలకు క్షమాపణ చెప్పారు. అంతే కాదు ఆ అధ్వాన్నంగా ఉన్న రోడ్డుపై బురదలో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని ఆపి ఆ వ్యక్తి కాళ్లను స్వయంగా కడిగారు.   ఈ ఘటన గ్వాలియర్ లో జరిగింది. పైపులైన్ల కోసం రోడ్డును తవ్వి అలాగే వదిలేశారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా అయిన మంత్రి  ప్రధుమన్ సింగ్ తోమర్ ప్రజలకు చేతులు జోడించి క్షమాపణ చెప్పారు. ఆ రోడ్డుపై బురదలో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి కాళ్లు కడిగి మరీ తక్షణమే మంచినీటి పైపుల కోసం తవ్వి వదిలేసిన రోడ్లను మరమ్మతు చేస్తానని హామీ ఇచ్చారు. రోడ్లు బాగుపడే వరకూ తాను చెప్పులు ధరించనని శపథం చేశారు. వెంటనే రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభం కావడంతో  ఆయన చెప్పులు ధరించడానికి అంగీకరించారు.మధ్య ప్రదేశ్ కే చెందిన కేంద్ర  పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ప్రద్యుమన్ సింగ్ తోమర్ కు కొత్త చెప్పులు అందించారు.  

ఫొటోల పిచ్చితో వందే భారత్ రైల్లో రాజమండ్రి టు విజయవాడ ఫ్రీ ట్రావెల్

ఫొటోల పిచ్చి ఓ వ్యక్తికి చుక్కలు చూపించింది. వందేభారత్ రైలులో తలుపులు మన ఇష్టం వచ్చినప్పుడు తీయడానికి, మూయడానికి అవకాశం ఉండని సంగతి తెలిసిందే కదా? అయితే ఆ విషయాన్ని మరచిపోయిన ఓ వ్యక్తి రాజమండ్రిలో వందే భారత్ రైలు ఎక్కి ఫొటోలు తీసుకుందామనుకున్నాడు. జనం అది ఆగే స్టేషన్లకు తండోపతండాలుగా వస్తున్నారు. అలాగే రాజమండ్రీలో రైలు చూసేందుకు వచ్చిన వ్యక్తి ఆగి ఉన్న రైలే కదా అని లోపలికి ఎక్కి ఫొటోలు తీసుకుందామనుకున్నాడు. అనుకున్నదే తడవు రైలెక్కేశాడు. ఫొటోల హడావుడిలో ఉండగానే రైలు డోర్లు మూసుకున్నాయి. ఆ డోర్ల ఆపరేటింగ్ అంతా  రైలు డ్రైవర్ చేతిలో ఉంటుంది. రైలు ప్లాట్ ఫాం మీద ఆగినప్పుడు వాటిని తెరవడం, రైలు బయలుదేరే ముందు వాటిని మూసి వేయడం అంతా డ్రైవర్ చేతిలో ఉంటుంది. అంటే అందుకు సంబంధించి బటన్ లోకో పైలట్ వద్ద ఉంటుంది. ఆ విషయం తెలియని మనోడు పాపం రైలు కదులుతుండగా దిగేద్దామనుకున్నాడు. తీరా రైలు బయలుదేరడం గమనించి బయటకు వచ్చేద్దామనుకునే సరికి రైలు డోర్లు మూసుకుపోయాయి. అవి మళ్లీ తెరుకుకునేది విజయవాడ స్టేషన్ లోనే. దీంతో ఆ ఫోటోల పిచ్చి యువకుడు విజయవాడ వరకూ రైలులోనే ఉండిపోవలసి వచ్చింది. కాబట్టి ఫొటోల పిచ్చి ఉన్న వారు వందేభారత్ రైలెక్కి   ఫొటోలు తీసుకునే విషయంలో కొంచం ముందు వెనుకలు ఆలోచించాలి మరి

ఏపీలో సంక్రాంతి.. మందు బాబులు ఎంత తాగేశారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో దశల వారీ మద్య నిషేధం ఒక మిధ్య. గత ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తరువాత దశల వారీ మద్య నిషేధం అంటూ ఏపీలో సరి కొత్త మద్యం విధానాన్ని ప్రవేశ పెట్టారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసేలా ఆ కొత్త విధానాన్ని రూపకల్పన చేసిన జగన్ సర్కార్.. ఇక అక్కడ నుంచీ దశల వారీగా మద్యం అమ్మకాల పెంపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఎక్కడా కనబడిన బ్రాండ్ లను ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  విక్రయిస్తోంది. ధరలను విపరీతంగా పెంచేసింది. దశలవారీ మద్య నిషేధం అన్న వాగ్దానాన్ని ఆరు నిలువుల గోతిలో పాతేసి రోజు రోజుకూ మద్యం విక్రమాయలను పెంచేస్తోంది. అలు మద్యం అలవాటు మాన్పించడానికి ధరలు పెంచామని చెప్పుకున్న సర్కార్.. మందు బాబుల బలహీనతను సొమ్ము చేసుకోవడమే కాకుండా నాసిరకం బ్రాండ్లతో వారి ఆరోగ్యాలనూ గుల్ల చేస్తోంది. తాజాగా సంక్రాంతి వేళ ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి.   ఈ సంక్రాంతి వేళ రాష్ట్ర సర్కార్ కు మద్యం అమ్మకాల ద్వారా భారీగా లాభాలు వచ్చాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా రోజుల్లో రోజుల్లో ఏకంగా రూ.214 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2 .33 లక్షలకుపైగా లిక్కర్, 83 వేలకుపైగా బీర్ కేసులు అమ్ముడుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రూ.27.81 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అసలు ఏపీలో  జగన్ ఎన్నికల సమయంలో మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చి మ‌హిళా ఓట్లు దండుకుని ఇప్పుడు ఆ వాగ్దానాన్ని విస్మరించి మద్యపానాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ విధానం అన్నట్లుగా ఏపీ సర్కార్ ముందుకు సాగుతోంది.  మ‌ద్య నిషేధం అమ‌లు చేయ‌క‌పోవటంపై ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌వ్వ‌డంతో వైసీపీ ప్ర‌భుత్వం.. మ‌ద్యం రేట్లు పెంచింది. మ‌ద్యం ధ‌ర‌లు పెంచ‌డం ద్వారా మ‌ద్యం తాగేవారి సంఖ్య త‌గ్గుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతూ వస్తోంది.  మ‌ద్యం తాగేవారి సంఖ్య త‌గ్గ‌డం అటుంచితే.. మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద వ‌ర్గాల‌కు చెందిన మందుబాబుల జేబులు గుల్ల‌వుతున్నాయి. అదే సమయంలో కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో ఏపీలో సరఫరా చేస్తున్న మద్యంతో ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో పడింది.   మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పుకొనే జగన్ ఆదాయం కోసం మద్య నిషేధం సంగతి అటుంచి మద్యపాన ప్రోత్సాహం అనే విధానం అమలు చేస్తున్నారనిపించక మానదు.  ఇప్పటికే వచ్చే పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసిన జగన్ మద్యం ధరలు పెంచి మద్యపానం అలవాటును తగ్గిస్తానని చెప్పడం తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. 

అయోధ్య రామమందిరం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు ఉగ్ర కుట్ర

దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడం, కల్లోలం సృష్టించడమే లక్ష్యంగా ఉగ్ర కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు ఉగ్ర సంస్థ రామమందిర విధ్వంసాన్ని లక్ష్యంగా చేసుకుందని చెబుతున్నాయి.  అయోధ్య రామజన్మభూమి వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు భారతదేశ చరిత్రలో  ఓ కొత్త అధ్యాయాన్ని ఆవిష్కృతం చేసింది. దేశ రాజకీయ, సామాజిక అంశాలపై తీవ్ర ప్రభావం చూపిన శతాబ్ద కాలం నాటి అయోధ్య వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం తార్కిక ముగింపు పలికింది హిందువుల మత విశ్వాసాలకు అనుగుణంగా వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి బాటలు వేస్తూ..  ఇటు ముస్లింల కోసం అయోధ్యలోనే ఐదెకరాల భూమిని కేటాయించాలని ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును అన్ని వర్గాల వారూ ఔదాల్చారు. అయోధ్యలోనూ మందిరం, మసీదులకు అవకాశం కల్పిస్తూ సుప్రీం తీర్పు దేశ భిన్నత్వంలో ఎకత్వానికి నిజమైన అర్ధం చెప్పినట్లైంది. మత సామరస్యం వెల్లివిరిసేలా చేసింది.   సుప్రీంకోర్టు చరిత్రలోనే సుదీర్ఘకాలం విచారణ సాగిన రెండో కేసుగా ఆయోధ్య కేసు గుర్తింపు పొందింది.  అలాగే ఈ తీర్పు సమయంలో న్యాయస్థానం సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఏదైనా కేసు తీర్పు వెలువరించేటప్పుడు ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఒక్కొక్కరూ అభిప్రాయాలను వెల్లడిస్తారు. కానీ, దీనికి భిన్నంగా అయోధ్య తీర్పు విషయంలో సుప్రీం వ్యవహరించింది. తీర్పును చదువుతున్నప్పుడు ధర్మాసనంలోని సభ్యులు పేర్లను ప్రస్తావించలేదు. ఎవరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారో చెప్పకుండా చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరిస్తున్నట్టు తెలిపారు. ఇక అయోధ్య వివాదం సమసిపోయిందనుకుంటున్న తరుణంలో రామమందిరం లక్ష్యంగా ఉగ్ర కుట్ర ను నిఘావర్గాలు పసికట్టాయి. అయోధ్య రామమందిరంపై దాడికి పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కుట్ర పన్నిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశంలో మత సామరస్యానికి భంగం కలిగించడమే లక్ష్యంగా ఈ దాడికి కుట్ర పన్నినట్లు పేర్కొన్నాయి. రామమందిరం లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రచించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. రామమందిరాన్ని ధ్వసం చేయడమే లక్ష్యంగా జైషే ఉగ్ర మూకలు నేపాల్ మీదుగా భారత్ లో ప్రవేశించే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో, నేపాల్ భారత్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని దేశంలోని కీలక నగరాలు, ప్రదేశాల్లో ఉగ్రదాడులకు అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అలాగే జీ20 సదస్సు లక్ష్యంగా కూడా ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.  

ఖమ్మం సభతో కేసీఆర్ కు జాతీయ నాయకుడిగా గుర్తింపు వచ్చేసినట్లేనా?

తెరాసను బీఆర్ఎస్ గా మార్చేసి జాతీయ పార్టీ అని ప్రకటించేసి.. తనకు తానుగా జాతీయ నాయకుడినని భావిస్తున్న కేసీఆర్ కు నిజంగా ఆ గుర్తింపు వచ్చిందా? ఓ ముగ్గురు, నలుగురు ఇతర పార్టీల కు చెందిన నాయకులు ఆయనను కలిసినంత మాత్రాన బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోతుందా? ఆయనకు జాతీయ నేతగా గుర్తింపు వచ్చేసిందా? ఆయనను కలిసిన వారంతా తమ నాయకుడిగా కేసీఆర్ ను అంగీకరించేసినట్లేనా? ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జోరుగా జరుగుతున్న చర్చ ఇది. ఎందుకంటే.. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముందు తనను తాను జాతీయ నాయకుడిగా ఆవిష్కరించుకోవడానికీ, గుర్తింపు కోసమూ చేయని ప్రయత్నం లేదు.  ఎక్కని గడప లేదు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక వేరు దారి లేక సొంతంగానే పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలలోకి దూకేశారు. అంతకు ముందు దాదాపు నాలుగుళ్లు ఆయన జాతీయ రాజకీయాలలో ప్రవేశం కోసం అన్ని రకాలుగా ప్రయత్నించారు. సఫలీకృతులు కాలేకపోయారు. చివరాఖరకు   ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను ఎంగేజ్’ చేసుకున్నా  లాభం లేక పోయింది. ప్రాతీయ పార్టీల జాతీయ కూటమి అంటూ దేశం పట్టుకు తిరిగారు. శరద్ పవార్ మొదలు అరవింద్ కేజ్రీవాల్ వరకు, నితీష్ మొదలు అఖిలేష్ వరకు, మమత మొదలు స్టాలిన్ వరకు ఎక్కని  గడప లేదన్నట్లుగా బీజేపీ వ్యతిరేక నేతలందరినీ కలిశారు. అయినా జేడీయు నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి మినహా మరెవ్వరు, కేసీఆర్ తో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అప్పడు ఇక  చేసేదేం లేక తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)  పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస)గా మార్చి, జాతీయ రాజకీయాల్లోకి దూకేశారు.   అయితే, భారాస జాతీయ పార్టీ అని  కేసీఆర్ ఆయన పరివారం ప్రచారం చసుకున్నంత మాత్రన  భారాస జాతీయ పార్టీ కాదు. ఔను నిజమే భారాస ప్రాంతీయ పార్టీ కాదు. కేంద్ర ఎన్నికల సంఘం, తెరాస పేరు మార్పును అంగీకరించిందే కానీ,   జాతీయ పార్టీగా గుర్తించలేదు. నిజానికి  అది కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో పని కూడా కాదు.  దేశంలో తెరాస/ భారాస వంటి ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. అలాగే, రిజిస్టర్ అయిన పార్టీలు.. కాని పార్టీలు చాలానే ఉన్నాయి. అయితే జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీల సంఖ్య రెండంకెలు కూడా దాటలేదు. గుజరాత్, అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం వరకు ఓట్లు సాధించి,  ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో కలిపి, మొత్తం తొమ్మిది పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. గతంలో కాంగ్రెస్‌, భాజపా, సీపీఐ, సీపీఎం, బీఎస్సీ, ఎన్సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలకు మాత్రమే జాతీయ పార్టీ హోదా ఉండగా.. 2019లో అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసి అవసరమైన ఓట్లు, సీట్లు సాధించడం ద్వారా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) జాతీయ పార్టీ హోదాను పొందింది. ఈ పార్టీకి అంతకముందు మణిపూర్‌, మేఘాలయా, నాగాలాండ్‌లలో గుర్తింపు ఉండగా.. 2019లో అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ రాష్ట్ర పార్టీగా గుర్తింపు సాధించడం ద్వారా 2019 జూన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్‌పీపీకి జాతీయ హోదాను కల్పించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు జాతీయ పార్టీల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇక తాజగా ఈ జాబితాలో తొమ్మిదో పార్టీగా ఆప్‌ అర్హత సాధించింది. అందుకే ఇప్పటికీ కేసీఆర్ అంటే ఆయన నాయకత్వం వహిస్తున్న పార్టీ పేరులో భారత్ ఉన్నా జాతీయ మీడియా, జాతీయ నాయకులు ఇప్పటికీ ప్రాంతీయ పార్టీ నాయకుడిగానే గుర్తిస్తున్నారు. అందుకే ఆయన తన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను ఘనంగా నిర్వహించి.. జాతీయ రాజకీయాలో ప్రవేశాన్ని చాటుకోవాలని భావిస్తున్నారు. ఇందు కోసం ఆయన తొలుత ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. అదే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ కావాలని.. తద్వారా దేశ రాజధానిలో తన తొలి అడుగు ఘనంగా పడేలా ఉండాలని భావించారు. అయితే తానొకటి తలిస్తే.. అన్నట్లుగా అన్ని ఆప్షన్లనూ కాదనుకుని బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు ఖమ్మం వేదిక చేశారు. ఈ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, యూపీ మాజీ సీఎంను ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించి వారంతా ఖమ్మం సభకు తరలి వస్తున్నారు. అలా వచ్చిన వారికి ఆయన తాను పునర్నిర్మించిన యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చూపించనున్నారు.  ఖమ్మం సభకు వామపక్షాల జాతీయ నేతలు సైతం వస్తున్నారు. ఎంత లేదనకుండా దాదాపు వంద మంది ప్రముఖులు వస్తున్నట్లు సమాచారం. వీరందరికీ కేసీఆరే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారనీ చెబుతున్నారు. దీంతో అనివార్యంగా బీఆర్ఎస్ ఖమ్మం సభకు జాతీయ మీడియా కూడా ప్రాధాన్యత ఇస్తుందని అంటున్నారు. అయితే కొన్ని పార్టీల అధినేతలు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైనంత మాత్రాన కేసీఆర్ కు జాతీయ నాయకుడిగా గుర్తింపు వచ్చేస్తుందా? బీజేపీ వ్యతిరేక పోరాటంతో తమ నేతగా ఆయా నాయకులు కేసీఆర్ కు  పట్టం కట్టేసినట్లేనా అంటే పరిశీలకులు కాదనే చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఖమ్మం సభను కేజ్రీవాల్ అందుక ఒక అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంది. హస్తినలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరు కాకపోవడమే కాకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించిన ఆప్ సర్కార్.. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో నాయకుడిగా అంగీకరించి వెనుక ర్యాలీ అవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగింపు!

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జెపి నద్దానే కొనసాగించే అవకాశాలు ప్రస్ఫుటమౌతున్నాయి. ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ, ఈ ఏడాది 9 రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని,  తిరిగి ఆయననే   అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు  , ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా జెపి నద్దాను కొనసాగనున్నట్లు దాదాపు ఖరారైందని చెబుతున్నారు.   తన సొంత హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ ఓటమి పాలయినందున, నద్దాను అధ్యక్షుడిగా తొలగిస్తారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే ఇప్పుడు అధ్యక్షుడిని మారిస్తే.. కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున, నడ్డానే కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఆ కారణంగానే పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు ఈ ఏడాది చేపట్టలేదని అంటున్నాయి. నడ్డా హయాంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ,  ఆయన సొంత రాష్ట్రంలో మాత్రం, పార్టీని విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యారు. అలాగే సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో పార్టీలో వర్గ విభేదాలను పరిష్కరించడంలో కూడా విఫలమైన నడ్డాను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు లేవని గత కొంత కాలంగా విస్తృతంగా ప్రచారం జరిగింది.   ఒక్క నడ్డానే  కాకుండా  ఏపీ, బిహార్‌, రాజస్థాన్‌, కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా  పార్టీ అధ్యక్షులను మార్చే అవకాశం ఉందని జరిగిన ప్రచారం కూడా కూడా జరిగింది.  ఏపీ, బిహార్‌, రాజస్థాన్‌కి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.  కేరళ అధ్యక్షుడిపై నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో ఆయన మార్పూ ఖాయమని కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ మార్పులేవీ జరగకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.   తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ను మార్చాలన్న డిమాండ్‌, సీనియర్ల నుంచి చాలాకాలం నుంచి వినిపిస్తోంది. ఆ క్రమంలో ఆయ స్థానంలో మాజీ మంత్రి చేరికల కమిటీ ఇన్చార్జి ఈటల రాజేందర్‌ను నియమించి, సంజయ్‌ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌.. హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా, బండి సంజయ్‌ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కానీ,   అధ్యక్షులను  కానీ మార్చే అవకాశాలు లేవని, పార్టీ వర్గాలు చెబుతున్నాయి . 

ఇదేమి స్నేహం ఇదేమి బంధం !

పెళ్ళయితే అయింది కానీ, కలిసి కాపురం చేసింది లేదు. బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కథ కుడా అలాగే సాగుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరి మూడేళ్ళు దాటింది. కానీ, ఇంతవరకు కలిసి కూర్చున్నది లేదు, మాట్లాడుకున్నది లేదు. ఉమ్మడి పోరాటాలు, ఆందోళనలు అసలే లేవు. నిజానికి, గడచిన మూడేళ్ళ పై చిలుకు కాలంలో  బీజేపీ, జనసేన నాయకులు ఏ స్థాయిలోనూ ఒక్కటంటే ఒక్క ఉమ్మడి కార్యక్రమం నిర్వహించ లేదు. చివరకు, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సమయంలోనూ, రెండు పార్టీల నాయకులు కలిసి ప్రచారం చేయలేదు. కార్యకర్తల మధ్య సయోధ్య  కనిపించలేదు.  మరోవంక ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా  సహా ఇతర బీజేపీ జాతీయ నాయకులు ఏపీకి  వచ్చి పోతున్నా, మిత్ర పక్షం జనసేన నాయకులను కలిసింది లేదు, వారితో మాట్లాడింది లేదు.కొద్ది నెలల క్రితం బీజేపీ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో జనసేన  నాయకులు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలనికోరారు. ప్ల కార్డులు పట్టుకుని ప్రదర్శనలు నిర్వహించారు. అయినా  నడ్డా పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా అభ్యర్ధిగా ప్రకటించకపోవడమే కాదు, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి గంటకు పైగా చేసిన ప్రసంగంలో కనీసం పవన్ కళ్యాణ్ పేరైనా ప్రస్తావించలేదు. పవన్ కళ్యాణ్  ఎప్పుడో సంవత్సరం  క్రితమో ఏమో రోడ్ మ్యాప్ అడిగారు. బీజేపీ స్పందించలేదు. మరోవంక జనసేన ఎక్కడా బీజేపీని మిత్ర పక్షంగా గుర్తించిన దాఖాలు లేవు. కేవలం టీవీ చర్చల్లో చెప్పుకోవడమే కానీ, క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేసింది లేదు. ఎవరి దారిన వారు పోతున్నారు.   బీజేపీ అగ్ర నేతల మనసులో ఏముందో ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా తెలియదు. మరో వంక ఏపీలో బీజేపీకి నిండా ఒక శాతం ఓటు కూడా లేదు. నాయకులు లేరు. ఉన్న గుప్పెడు మంది నాయకుల మధ్య సయోధ్య లేదు. కొందరు వైసీపీ కొమ్ముకాస్తే మరి కొందరు టీడీపీ కొమ్ము కాస్తారు. అందుకే, పవన్ కళ్యాణ్  బీజేపీతో పొత్తు ఇక చాలను కున్నారో, ఏమో కానీ, టీడీపీతో కలిసి వైసీపీ పాలనకు చరమ గీతం పాడాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పటికి రెండు సార్లు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. రెండవసారి స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్ళి మరీ రెండున్నర గంటల పాటు వన్ టూ వన్ భేటీ జరిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట పోరాటం చేస్తామని మీడియా ఎదుట ప్రకటించారు. చాలా స్పష్టంగా వైసీపీని ఓడించే లక్ష్యంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పారు. నిజానికి ఏపీలో ఓటంటూ ఉందంటే, వైసీపీ, టీడీపీలకు,జనసేన పార్టీలకే వుంది. మిగిలిన పార్టీలకు ఒకటి రెండు శాతం ఓటు కూడాలేదు. సో, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చుస్తానని చెప్పడం టీడీపీతో పొత్తుకు సిద్దమని ప్రకటించడంతో సమానమని వేరే చెప్పనక్కర లేదు.  అయితే, ఇంత జరుగుతున్నా బీజేపీ మాత్రం పవన్ మా మిత్రుడే అంటోంది. పైగా జస్ట్ అలా పవన్ వెళ్ళి చంద్రబాబుని కలిశారంతే అని చెబుతోంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి అయితే బీజేపీ జనసేన బంధం కొనసాగుతుంది అని నమ్మ బలుకుతున్నారు.ఏపీలో మా రెండు పార్టీల మధ్యనే పొత్తు ఉంది అని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఎందుకు కలిశారు అంటే కలవడంలో తప్పు లేదు కదా అంటున్నారు. పైగా అంశాల వారీగా రెండు పార్టీల మధ్య అవగాహన కావచ్చు అని కొత్త బంధాన్ని తెర మీదకు తెచ్చారు. నిజమే, బీజేపీ రాష్ట్ర నాయకులకు కేంద్ర నాయకత్వం మనసులో ఏముందో తెలియదు. అందుకే, బీజేపీ రాష్ట్ర నాయకులు ఇలా ... తలాతోకా  లేకుండా మాట్లాడుతున్నారని అంటున్నారు. మరో వంక జనసేన  బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.చివరకు సామాన్య ప్రజలు కూడా పెళ్లి చేసుకున్నతర్వాత చేస్తే పద్దతిగా సంసారం  చేయాలి, లేదంటే విడాకులు తీసుకోవాలి .. అంతే కానీ, అటూ ఇటూ కాకుండా ఉంటామంటే ఎలా? ఇదేమీ స్నేహం ? ఇఎమి బంధం ? అని నవ్వుకుంటున్నారు.

ఆర్వీఎంలకు ఓకే కానీ... తెలుగుదేశం

ఈవీఎంల గురించి ప్ర‌తిప‌క్షాలు ప‌లుమార్లు ఆరోప‌ణ‌లు, అనుమానాల‌ను వ్య‌క్తంచేశాయి. ఆ ఆరోపణలకు సరైన సమాధానం చెప్పకుండానే, ఆ అనుమానాలను నివృత్తి చేయకుండానే   ఎన్నిక‌ల సంఘం ఇప్పుడు మరో లెవెల్ కు ఓటింగ్ ప్రక్రియను తీసుకువెళ్లేందుకు ప్రతిపాదించింది. అదే   రిమోట్ ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్ల (ఆర్వీఎం) విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ముందుగా ఈవీఎంలపై తమ అనుమానాలు నివృత్తి చేయాలనీ, తాము ఈవీఎంలనే వ్యతిరేకిస్తుంటే..ఆర్వీఎం అంటూ కొత్త విధానాన్ని ప్రతిపాదించడమేమిటని నిలదీస్తున్నాయి. ఆర్వీఎంవిధానానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశాయి.   రిమోట్ ఓటింగ్ యంత్రంపై ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిపాద‌న‌ను వ్యతిరేకిస్తామ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు  దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిపాద‌న‌లో స్ప‌ష్ట‌త లేద‌న్న ఆయన కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీలు వ్య‌తిరేకించాల‌ని నిర్ణ‌యించాయ‌ని స్పష్టం చేశారు. అయితే ఆ ప్రతిపాదనను మరింత ముందుకు తీసుకు  వెళ్లిన సీఈసీఆర్వీఎంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. సోమవారంజరిగినఈ కార్యక్రమంలో ఆర్వీఎం పనితీరు గురించి వివరించింది. అలాగే రాజకీయ పార్టీల అభిప్రాయాన్నీ కోరింది.  ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన ప్రజలకు ఓటు సదుపాయం కల్పించే అంశంపై కూడా చర్చించింది. ఈ కార్యక్రమానికి 8 జాతీయ‌ పార్టీలు,  57 ప్రాంతీయ పార్టీల‌కు చెందిన‌ అధ్య‌క్షులు, జ‌న‌ర‌ల్‌ సెక్ర‌ట‌రీలు   హాజ‌రు కావాల‌ని ఈసీ కోరిన విషయం విదితమే. అలాగే  ఆర్వీఎంల ప‌నితీరుకు సంబంధించి, ఎన్నిక‌ల ప‌ద్ధ‌తిలో మార్పులు, దేశంలోని వ‌ల‌స కూలీల‌ ఓట్ల గురించి త‌మ అభిప్రాయాలను రాత పూర్వ‌కంగా ఈనెల 31లోపు తెలియ‌జేయాల‌ని కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను కోరింది. కాగా తెలుగుదేశం పార్టీ ఆర్వీఎంలను సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు చెబుతూనే..ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది. రాజకీయ పార్టీలతో విస్తృత చర్చలు జరపకుండానే ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడాన్నితప్పుపట్టింది. విస్తృత చర్చల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించిన తరువాత మాత్రమేఆర్వీఎం విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ముందుగా డెమో చేసి ఆ తరువాత ఏకాభిప్రాయం సాధించిన మీదటే దీనిని  అమలు చేయాలని పేర్కొంది. ఈ విధానంపై పార్టీలు తమ అభిప్రాయం రాతపూర్వకంగా తెలియజేయడానికి విధించిన డెడ్ లైన్ ను పొడిగించాలన్నారు.  ఏ ఒక్క ఓటరు కూడా ఓటువేసే అవకాశం కోల్పోకూడదని చెబుతున్న ఈసీ  కొత్త విధానాన్ని తీసుకురావడానికి ముందు ఆ విధానంపై ఉన్నఅనుమానాలన్నిటినీ నివృత్తి చేయాలని తెలుగుదేశం పేర్కొంది. ఓటింగ్‌కు దూరంగా ఉంటున్న రమారమి30శాతంమందిలో  వలస వెళ్లిన వారే అత్యధికులని చెబుతున్న ఈసీ దీనిపై శాస్త్రీయ అధ్యయనం చేసిందా అని ప్రవ్నించింది.   తమ పరిశీలన మేరకు  వలస కూలీలు తమ గ్రామాల్లో ఓటు వేస్తున్నారని.. కానీ యువత, పట్టణ, నగర ధనిక వర్గాలే ఓటింగుకు దూరంగా ఉంటున్నాయనీ తెలుగుదేశం వివరించింది. ఈసీ నిర్వహించిన అఖిలపక్షసమావేశానికి తెలుగుదేశం తరఫున సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ హాజరయ్యారు.