రామగోపాల్ వర్మ.. వివాదమా.. ఉన్మాదమా?..
posted on Jan 11, 2023 @ 2:25PM
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ ఇటు రాజకీయ పార్టీలూ, అటు కాపు సామాజిక వర్గం కూడా తీవ్రంగా ఖండించి ఆయన తీరును తప్పుపట్టిన నేపథ్యంలో తగ్గేదే లే అన్నట్లుగా మళ్లీ అదే విధంగా రెండు సామాజిక వర్గాల మధ్యా చిచ్చు రేపేలా మరో ట్వీట్ చేశారు. రామగోపాల వర్మ చేసిన ట్వీట్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేవిగా, అదే సమయంలో రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు రగిల్చేవిగా ఉన్నాయి.
ఇంతకీ రామ్ గోపాల్ వర్మ వైసీపీకి ప్రయోజనం కలిగించడం కోసం ఎందుకు పాకులాడుతున్నారూ అంటే.. తను దర్శకత్వం వహించనున్న రెండు రాజకీయ చిత్రాల వెనుక ఉన్నది వైసీపీ కనుక. వాటికి ప్రచారం కల్పించుకోవడంతో పాటు ఎవరూ తన ముఖం చూడకపోయినా.. తనకు రెండు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన వైసీపీకి ఏదో విధంగా మేలు చేసే ఉద్దేశంతోనే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల రచ్చకు దిగినట్ల పరిశీలకులు అంటున్నారు. ఆయన రామ్ గోపాల్ వర్మ కాదు.. రాంగ్ గోపాల్ వర్మ అంటూ అభివర్ణిస్తున్నారు. ఆయన సినిమాలలాగే ఆయన సామాజిక మాధ్యమంలో పెట్టే పోస్టులు, వీడియోలూ కూడా నైతికతకు తిలోదకాలిచ్చేసి, విశృంఖలతకు, జవాబుదారీతనం లేని తనానికి నిలువెత్తు సాక్ష్యాలుగా ఉంటాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఒక వైసీపీ నాయకుడు నిర్మిస్తున్న వైసీపీకి అనుకూలంగా ఉండేలా.. రానున్న ఎన్నికలలో వైపీపీకి ప్రచారంగా దోహదపడేందుకు వ్యూహం, శపథం అన్న రెండు సినిమాలకు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు.
ఆ సినిమాలు ఎప్పుడు తెరకెక్కుతాయొ తెలియదు కానీ, వాటి కోసం రామ్ గోపాల్ వర్మ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. అసలు తొలి నుంచీ కూడా రామ్ గోపాల్ వర్మ.. సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా ఉన్మాది తరహాగా వ్యవహరిస్తున్నారు. అది పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే.. వైసీపీ నాయకుడొకరు నిర్మిస్తున్నరెండు సినిమాలపై చర్చించేందుకే ఆయన ఇటీవల తాడేపల్లి వెళ్లి మరీ జగన్ ను కలిసి వచ్చారు. ఆ తరువాత నుంచీ ఆయన వైఖరిలో తీవ్రమైన మార్పు వచ్చింది. విపక్షాలను టార్గెట్ చేస్తూ బాధ్యతా రహితంగా పోస్టులు పెట్టడం ప్రారంభమైంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన పవన్ కల్యాణ్, చంద్రబాబుల భేటీపై సభ్య సమాజం అసహ్యించుకునేలా ఆయన చేసిన ట్వీట్లు దుమారం లేపాయి.
అన్ని వర్గాలలోనూ తీవ్ర అసహనం వ్యక్తం అయ్యింది. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్న ఆ ట్వీట్లపై కోర్టు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నడిమాండ్ లూ వెల్లువెత్తాయి. కొందరు న్యాయవాదులైతే ఆయన చేసిన ట్వీట్లు ఆధారంగా ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవచ్చో కూడా చెపపారు. సరే అదలా ఉంటే.. రామ్ గోపాల్ వర్మ ‘రిప్’ కా ట్వీట్ పై కాపుసామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అలాగే జనసేన శ్రేణులు కూడా అగ్గిమీద గుగ్గిలంలా మండి పడుతున్నాయి. పవన్ కల్యాణ్ అభిమాన సంఘాలైతే ఒక అడుగు ముందుకు వేసి రామ్ గోపాల్ వర్మకు ఆయన శైలిలోనే బదులిచ్చాయి. రామ్ గోపాల్ వర్మకు కన్నీటి వీడ్కోలు అన్న బ్యానర్లు పెట్టి, ఆ బ్యానర్లలో ఆయన ఫొటోకు దండ వేసి కర్మకాండలు నిర్వహించాయి.
మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ సినీదర్శకుడిగా కాకుండా సమాజానికి చీడ పురుగులా తయారయ్యారని తటస్థులు, మేధావులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఎటువంటి విలువలకూ విలువ ఇవ్వని ఒక ఉన్మాద మనస్థత్వంతో వ్యవహరిస్తున్న రామ్ గోపాల్ వర్మ సామాజిక మాధ్యమంలో పెడుతున్న పోస్టుల ఆధారంగా ఆయన సోషల్ మీడియా అక్కౌంట్లను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు.