బాబులు పసికట్టారు.. బాబుదే అధికారం
రాజకీయ నాయకుల లెక్కలు తప్పవచ్చును. రాజకీయ విశ్లేషకుల అంచనాలు తారుమారు కావచ్చును. పీకేల సర్వేలు, జ్యోతిష్య పండితుల లెక్కలూ తపవచ్చును కానీ రేపటి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ రోజే పక్కగా చెప్పే పండితులు ఎవరైనా ఉన్నారంటే, వారు ప్రభుత్వ అధికారులు మాత్రమే. అవును, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు చాలా గుంభనంగా అసలేమీ తెలియనట్లు ఉంటారు కానీ రాజకీయ క్షేతంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదో ఇట్టే పట్టేస్తారు.
రాజకీయలతో అసలు ఏ సంబంధం లేనట్లుండే అధికారులు రాజకీయ పరదాల చాటున ఏమి జరుగుతుందో కళ్ళు మూసుకుని చూసేస్తారు అందుకు తగ్గట్టుగా తమను తాము ట్యూన్ చేసుకుంటారు. స్ట్రాటజీలు మార్చుకుంటారు, ఇప్పడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు వరసగా హైదరాబాద్ కు క్యూ కడుతున్నారు. అక్కడ రహస్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తున్నారు. అంటే మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే నిజాన్ని, అధికారులు పసి గట్టారు. అందుకే, అలా ఒకరివెంట ఒకరుగా ఐఏఎస్, ఐపీఎస్‌లు హైదరాబాద్ లో చంద్రబాబుని కలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
నిజానికి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్పార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే, జగన్మోహన్ రెడ్డి అధికారులను అడ్డగోలుగా వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లోనూ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు బుక్కయ్యారు. జైలు పాలయ్యారు. అలాగే, జగన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సీఎస్, డీజీపీలతో సహా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టు బోనెక్కారు. అవమానాలు ఫేస్ చేశారు. చివాట్లు తిన్నారు. అయినా కొందరు అధికారులు తాము చేస్తున్నది తప్పని తెలిసీ, ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారుల ఒత్తిళ్ళకు తలొగ్గి తప్పులు చేయక తప్పడం లేదని వాపోతున్నారు.
ముఖ్యంగా పోలీసు అధికారులు టీడీపీ నాయకులు, కార్యకర్తలను అనేక విధాల వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు అలాంటి వారంతా, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తాము అడ్డగోలు నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని వాపోతున్నారు. అలాంటి వారు ఇప్పడు గతంలో చంద్రబాబు నాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ... తమ తప్పుల్ని మన్నించేయాలని ముందుగానే వేడుకుంటున్నారు.
నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తప్పు చేసిన అధికారులు చేసిన తప్పు ఒప్పుకుని పశ్చాతాపం ప్రకటిస్తే, పెద్దమనసు చేసుకుని అలాంటి వారిని క్షమించి వదిలేసిన సందర్భాలు లేక పోలేదని అంటారు. అలాగే, అప్పట్లో బెట్టింగ్ మాఫియా కేసుల్లో అడ్డంగా దొరికిపోయిన అధికారిని చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన విచక్షణాధికారాలను వినియోగించి రక్షించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే,, అదే ఐపీఎస్ అధికారి వైసీపీ సర్కారు రాగానే టిడిపిపై జులుం చెలాయిస్తూ చెలరేగిపోయారు. ఇప్పడు మళ్ళీ ఆయనే అన్యధా శరణం నాస్తి, అంటూ చంద్రబాబు నాయుడుని వేడుకునేందుకు, అయన అప్పాయింట్ మెంట్ కోసం, బూట్లు అరిగేలా తిరుగుతున్నారని సమాచారం.
మరోవైపు సీఐడీలో పని చేస్తున్న వారంతా చంద్రబాబుని ఎలాగైనా కలిసి తమ తప్పేమీ లేదని పై అధికారులు, రాజకీయ పెద్దలు ఆడుతున్న జగన్ నాటకంలో తాము పావులమయ్యామంటూ అంటూ చెప్పుకుంటామని రిఫరెన్సులు వెతుక్కుంటున్నారట. మరో వంక రాష్ట్ర రాజకీయాలలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు, ముఖ్యంగా ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు చంద్రబాబు నాయుడు అప్పాయింట్ మెంట్ కోసం పడుతున్న తీరును గమనిస్తున్న రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఇంతకాలం కొంత స్తబ్దుగా ఉన్న టీడీపీ నాయకులు, మంచి రోజులు మళ్ళీ వస్తున్నాయనే విషయాని పసిగట్టి యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల చంద్రబాబు నాయుడు పర్యటనలు సక్సెస్ కావడం తో రాష్ట్రంలో రాజకీయ వాతావరణంపై అన్ని వర్గాలకు స్పష్టత వస్తోంది. మరోవైపు బాబు-పవన్ భేటీతో జగన్ అధికారం అంతం అవ్వడం ఖాయమన్న విషయంలో అందరికీ క్లారిటీ వచ్చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమని నిర్ధారించుకున్న నేతలు చంద్రబాబుతో కాదంటే చినబాబు లోకేష్ తో కుదిరితే కప్పు కాఫీ, కాదంటే నాలుగు మాటల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, పదవుల కోసమో, కేసుల భయంతోనో, తాత్కాలిక ప్రయోజనాల కోసమో పార్టీ మారిన వారు సైతం తెలుగుదేశంలోకి మళ్లీ వస్తామంటూ సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. అలా ఫీలర్స్ పంపుతున్న వారిలో ప్రస్తుతం వైసీపీలో ఉన్న కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలు అంటేనే అంత... ఎప్పుడు ఏ గాలి ఎటు వీస్తుందో .. ఎవరికీ తెలియదు.