లోకేష్ విజయోస్తు .. ధర్మ యుద్ధానికి శ్రీకారం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ‘యువగళం’ పేరిట చేపట్టే పాదయాత్ర శుక్రవారం (జనవరి 27) కుప్పం నుంచి ప్రారంభమవుతోంది. అది కూడా ఒకటి రెండు రోజులు కాదు, వందో ..రెండొందల కిలోమీటర్లో కాదు. ఏకంగా 4 వేల కిలోమీటర్లు,400 రోజులు..అంటే 15 నెలలకు పైగా సాగే సుదీర్ఘ పాద యాత్రకు, టీడీపీ యువనేత శ్రీకారం చుడుతున్నారు.
సరే, ఆయన ఇంత కఠిన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అధికారం కోసమా? అంటే, కాదనలేము. కానీ, అది పాక్షిక సత్యం మాత్రమే. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు పట్టభిషిక్తుదయ్యాడు, కానీ, రావణ సంహారం జరిగింది మాత్రం రామచంద్రుని పట్టాభిషేకం కోసం కాదు, రాక్షస పాలన అంతమొందించేందుకే వానర సేన సాయంతో శ్రీరాముడు రావణ సంహారం కావించారు.
ఇక ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకు ప్రత్యేకించి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. రావణాసురుడు మాయలేడి వేషంలో సీతమ్మోరిని అపహరిస్తే, ఈనాటి రావణుడు ‘ఒక్క ఛాన్స్’తో ‘చీట్’చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు. అందుకే రావణ పాలనని అంతమొందించేందుకే లోకేష్, ‘యువగళం’ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారని అనుకోవచ్చు.
ఇక లోకేష్ పాదయాత్ర ఏ విధంగా జరుగుతుంది, ఆయన యాత్ర పొడుగునా ఎన్నెని అవరోధాలను ఎదుర్కోవలసి వస్తుంది, అనేది ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం లోకేష్ పాదయాత్ర అడ్డుకునేందుకు జీవో నంబర్1 తెచ్చింది. పాదయాత్రకు అనుమతి నిరాకరించింది. అయినా, కోర్టు అనుమతితో లోకేష్ ముందడుగు వేస్తునారు. లోకేష్ పాదయాత్ర తొలి అడుగు పడక ముందే జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంతలా ఉలిక్కిపడుతోంది.. అవరోధాలు సృష్టిస్తోంది, అంటే ముందు ముందు..అడుగడుగునా ఇంకెన్ని అవరోధాలు సృష్టిస్త్గుందో వేరే చెప్ప నక్కరలేదు. అయినా... పులి కడుపున పుట్టిన పులి బిడ్డ లోకేష్ ..మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. అవును, లోకేష్’కు తన ముందుంది సీదాసాదా మార్గం కాదని తెలుసు.నిజానికి, ఒక్క లోకేష్ కు మాత్రమే కాదు, గత మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన చూసి,అనుభవిస్తున్న అందరికీ, లోకేష్ ముందున్నది, ‘కంటకాకీర్ణ’ మార్గమనే విషయం అర్థమవుతూనే వుంది.
అయినా, ఆనాడు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తాత నందమూరి తారక రామా రావు, తెలుగునాట ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తండ్రి నారా చంద్రబాబు నాయుడు సాగించిన చైతన్య యాత్రల స్పూర్తితో .. ‘యువగళం’ పాదయాత్రకు లోకేష్ శ్రీకారం చుడుతున్నారు. విజయ శంఖారావం పూరిస్తున్నారు. తెలుగు ప్రజల దీవెనలతో విజయుడై తిరిగొస్తారు.
లోకేష్ విజయయాత్ర పై ఎవరికీ ఎలాంటి అనుమనాలు లేవు. ధర్మో రక్షిత రక్షితః .. ధర్మకోసం చేసే ధర్మ పోరాటం ఆదిలో అవరోధాలు ఎదుర్కున్నా అంతిమ విజయం సాధించి తీరుతుంది.
అయినా, అడుగడునా కష్టాలు తప్పవని తెలిసీ కన్నకొడుకును యుద్ద భూమికి పంపడం ఏ తల్లికైనా ఎంత కష్టమో, ఏ తండ్రికైనా ఇంకెంత బాధాకరమో వేరే చెప్పనకరలేదు. అందునా పాదయాత్ర కష్ట సుఖాలు స్వయంగా అనుభవించిన చంద్రబాబు నాయుడికి, ఆయన కష్టాలు చూసి మానసిక వ్యధను అనుభవించిన లోకేష్ మాతృ మూర్తి భువనేశ్వరికి కన్న కొడుకును పాదయాత్రకు ఆశ్వీదరించి సాగనంపడం ఎంతగా బాధించి ఉంటుందో వేరే చెప్పనక్కర లేదు. అయినా, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆ దుఃఖాన్ని దిగమింగుకుని, లోకేష్ ను ఆశ్వీదరించి అక్షింతలు వేసి సాగనంపారు, చంద్రబాబు దంపతులు. అలాగే, లోకేష్ శ్రీమతి బ్రాహ్మణి, నిండా పట్టుమని పదేళ్ళు అయినా లేని కుమారుడు దేవాన్ష్‌ను, కుటుంబాన్ని వదిలి 400 రోజులు దూరంగా ఉండడం ఎంత కష్టమో. బ్రాహ్మణి, దేవాన్ష్’ కు అంతకు మించిన బాధ.అయినా కుటుంబ సభ్యులు అందరూ ... లోకేష్ కు వీడ్కోలు పలికిన సందర్భంలో హైదరాబాద్’లోని ఆయన ఇంటిలో ఉద్విగ్న.. ఉద్వేగభరిత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడి వాతావరణం ఒక విధంగా గుండె గొంతుకలోన కొట్లాడుతోంది .. గీతాన్ని గుర్తుకు తెచ్చింది.
తొలుత లోకేశ్ తమ ఇంట్లోని పూజ గదిలో తమ ఇలవేల్పు వెంకటేశ్వరస్వామికి కుటుంబంతో కలిసి పూజ చేశారు. అనంతరం తల్లిదండ్రులు భువనేశ్వరి, చంద్రబాబుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. భువనేశ్వరి ఆయన్ను గట్టిగా హత్తుకున్నారు. అత్తామామల పాదాలకూ లోకేశ్ మొక్కారు. భార్య బ్రాహ్మణి హారతి ఇచ్చి నుదుట తిలకం దిద్దారు. కారు బయల్దేరే ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టారు. లోకేశ్ తన కొడుకు దేవాన్ష్‌ను గాఢంగా హత్తుకుని ముద్దు పెట్టారు. నిజానికి, ఈ దృశ్యాలు అయిన వారినే కాదు అందరిని కదిల్చి వేశాయి. ఒకే రీతిన ఉద్వేగానికి గురిచేశాయి. తెలుగు దేశం కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. జేజేలు పలికారు. పేదలు దీవెనలు అందించారు ... ధర్మ రక్షణ కోసం కష్టాలను లెక్క చేయకుండా కదిలిన ‘యువ గళానికి ... ప్రజా దీవేనలే శ్రీరామ రక్ష.. లోకేష్ విజయోస్తు ..అంటున్నారు.