ఈ మార్పు .. దేనికి సంకేతం ?
posted on Jan 12, 2023 @ 12:40PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శాంతి కుమారి ఎంపిక అనూహ్యమే, అసలు రేసులోనే లేని ఆమెను ముఖ్యమంత్రి ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి, ఆమెకు కూడా ఇది సర్ప్రైజ్ కావచ్చును. కానీ ముఖ్యమంత్రి కేసేఆర్ తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు ఆయన తప్ప మరొకరు అలోచించనైనా ఆలోచించ లేరు. అవి ఆయనకు తప్ప ఇంకెవరికీ అర్థం కావు. గతంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె వాణి దేవిని ఆఖరి క్షణంలో తెరాస అభ్యర్థిగా ఖరారు చేశారు. అప్పుడు ఇలాగే అందరూ అవాక్కయ్యారు. అలాగే ఇప్పడు సీఎస్ గా శాంతి కుమారి ఎంపిక కూడా చాలా మందిని చాలా రకాలుగా ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే అంతకంటే విచిత్ర్రం మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నిష్క్రమణ. నిజానికి, సోమేశ్ కుమార్ కోర్టు ఆదేశాలను ఇలా హుందాగా స్వీకరిస్తారని కానీ.. మౌనంగా ఉంటారని కానీ.. కోర్టు పొమ్మనగానే, జేబులో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లి పోతారని కానీ ఎవరూ ఉహించలేదు. హై డ్రామా జరుగుతుందనే అందరూ ఉహించారు. మీడియా అదే ఆశించింది. అయితే సోమేశ్ కుమార్ అందరినీ డిసప్పాయింట్ చేస్తూ ఎలాంటి చడీ చప్పుడు లేకుండా కోర్టు గీసిన గీత దాటకుండా నడుచుకుంటూ వెళ్లి పోయారు.
అయితే ఇప్పడు అదే ఆయన అలా జేబులో చేతులు పెట్టుకుని మౌనగా ఏపీకి వెళ్లి పోవడమే, అందరినీ అంతు చిక్కని ప్రశ్నగా వెంటాడుతోంది. అవును.. ఆయన ఎందుకు అలా వెళ్ళిపోయారు ? ముఖ్యమంత్రి కేసేఆర్ తమకు అన్ని విధాల అనుకకూలమైన ఆయన్ని ఎందుకు అలా.. వెళ్ళనిచ్చారు. ఎందుకు ఒంటరిగా వదిలేశారు? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడు తున్నాయి.
హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక్క క్షణం వృధా చేయకుండా అత్యంత వేగంగా పావులు కదిపింది. తెలంగాణ ప్రభుత్వ విధుల నుంచి సోమేశ్ కుమార్‌కు వెంటనే రిలీవ్ కావాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జరీ చేసింది. కోర్టు తీర్పు వచ్చిన రోజునే మంగళవారం (జనవరి 10) ఈమేరకు కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(డీఓపీటీ) ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నెల 12 లోపు అంటే గురువారం లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సోమేశ్‌ను ఆదేశించింది.
ఒక విధంగా ఇది ఊహించిందే ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సోమేశ్ కుమార్ 2014లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. సీఎస్ సోమేశ్ కుమార్ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ 2016లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ(డీవోపీటీ) 2017లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు ఆ పిటిషన్ పైనే కోర్టు తీర్పు నిచ్చింది.
మరోవంక రాజకీయ కోణంలో చూసినా సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు, ఇష్టుడు కావడం వలన ఆయన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద పరుగులు తీయడాన్ని అర్థం చేసుకోవచ్చును.కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే వేగంగా చక చకా నిర్ణయాలు తీసుకున్నారు. సోమేశ్ కుమార్ అటో ఇటో ఎటో తేల్చుకోక ముందే కొత్త సీఎస్ బాధ్యతలు స్వీకరించారు. ఇది చాలా మందిని చాలా చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంచు మించుగా మూడున్నరేళ్ళుగా ముఖ్యమంత్రి నోట్లో నాలుకలా అన్ని కార్యాలు చక్కపెట్టిన సోమేశ్ కుమార్ కు కనీసం ఒక సాంప్రదాయ వీడ్కోలు అయినా లేకుండానే ఎందుకు అలా వదిలేశారు అనేది పొలిటికల్ ఆఫీషియల్ సర్కిల్స్ లో మిలియన్ డాలర్ల ‘చర్చ;’ గా మారింది.
నిజానికి కోర్టు తీర్పును ముందుగానే ఊహించిన సోమేశ్ కుమార్ కు, అదే జరిగితే ఏమి చేయాలనే విషయంలో ఒక స్పష్టత ఉందనే ప్రచారం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేయడంతో ఆయన తన పోస్టుకు రాజీనామా చేస్తారనే ప్రచారం మరింత జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ఉద్దేశం, ఆసక్తి ఆయనకు ఏమాత్రం లేవని వార్తలొచ్చాయి. అంతే కాకుండా ఆయన సర్వీస్ ఇంకా నిండా సంవత్సరం కుడా లేదు. ఈ ఏడాది అంటే 2023 డిసెంబరు 30తో ఆయన సర్వీసు కాలం ముగుస్తుంది. కనుక ఇంత తక్కువకాలం కోసం ఏపీకి వెళ్లి చిన్న పోస్టులో కొనసాగడం అవసరమా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వార్తలొచ్చాయి. అందుకే తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తారని చర్చ కూడా జరిగింది. అనంతరం తెలంగాణ సర్కారు ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. నిజానికి సోమేశ్‌కుమార్ కు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మొదటి నుంచీ సత్సంభాదాలే ఉన్నాయి కనుక ఆయన ఐఏఎస్ గా రాజీనామా చేసినా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ ఆయన సేవలను సలహాదారు గానో, మరో విధంగానో ఎక్కడో అక్కడ తప్పకుండా ఉపయోగించు కుంటారనే ప్రచారం జరిగింది.
కానీ అవేవీ లేకుండా సోమేష్ కుమార్ హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే సీన్ మారిపోయింది. కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల లోగానే, కొత్త సీఎస్ నియామకం జరిగిపోయింది. కొత్త సీఎస్‌గా శాంతికుమారి పేరు మీడియాకు తెలియడం, ఆమె కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలవడం, ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. అయితే ఎందుకిలా జరిగింది? మాజీ సీస్ ఇంతలోనే ఎందుకు మనసు మార్చుకున్నారు? ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అంతలా ఉదాసీనంగా ఉన్నారు ...? కేంద్రంతో మరో వివాదం కొని తెచ్చుకోవడం ఇష్టం లేక కేసీఆర్ మౌనంగా ఉండిపోయారా... ఈ గుణాత్మక మార్పుకు సిబిఐ , ఈడీ కేసులు, విచారణలకు ఏమైనా సంబంధం వుందా? ఇవ్వన్నీ ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నలు